ఏ వాస్తవాలు దాచడానికి? | Sakshi Editorial On Kolkata Jr Doctor Molestation Issue | Sakshi
Sakshi News home page

ఏ వాస్తవాలు దాచడానికి?

Published Sun, Aug 18 2024 12:01 AM | Last Updated on Sun, Aug 18 2024 6:16 AM

Sakshi Editorial On Kolkata Jr Doctor Molestation Issue

సందర్భం

లక్షలాది మంది భారతీయ మహిళల లాగే, నేను ఆగ్రహంతో రగిలిపోయాను, విచారంతో కుంగిపోయాను. ఒక యువతిని తన పని ప్రదేశంలో బహుశా ఆమెకు తెలిసిన పురుషులే క్రూరంగా హింసించి చంపారనే ఆలోచన నన్ను వెంటాడుతోంది. కోల్‌కతా యువ వైద్యు రాలిపై లైంగిక దాడి ఘటనలో, ఆమె శవం గురించి ఇప్పుడు మనకు తెలిసిన భయానక వివరాలను నేను చెప్పలేను. అర్ధనగ్నంగా కనిపించింది. ఆమె కాళ్లు విరిగిపోయాయి. 

ఆమె జననాంగాలు, రెండు కళ్ల నుంచి విపరీతంగా రక్తస్రావం అయ్యింది. తల నుంచి పాదాల వరకు రక్త సిక్త గాయాలయ్యాయి. ఈ సాక్ష్యం సామూహిక అత్యాచారం అని వైద్యులు నమ్ముతున్నారు. తన కుమార్తె మృతదేహాన్ని చూడటానికి మూడు గంటలు వేచిచూడాల్సి వచ్చిన తండ్రి ఈ వివరాలను పంచుకున్నారు. ఆ తండ్రిగా మిమ్మల్ని ఊహించుకోండి. అది మీ బిడ్డ గురించి మీకు ఉన్న చివరి జ్ఞాపకం అని ఆలోచించండి.

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ఘటన, సంస్థా గతంగా స్త్రీల పట్ల ఉన్న ద్వేషానికీ, దుర్మార్గానికీ భయంకరమైన ఉదాహరణ. అత్యాచారం తర్వాత ఏమి జరిగిందనేది మరింత అసహ్యకరమైనది. జరిగిన ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నాలు నేరాన్ని మరింతగా పెంచాయి.

ఈ కేసును అర్థం చేసుకోవాలంటే, మనం వైద్య కళాశాల ప్రిన్సిపల్, ఇప్పుడు తొలగించబడిన సందీప్‌ ఘోష్‌ అనే వ్యక్తి గురించి మాట్లాడాలి. మొదట, మెడికల్‌ కాలేజీ అధిపతిగా, దాడి జరగడానికి ఆయనే జవాబుదారీగా ఉంటాడు. ప్రత్యేకించి ఇది బయటి వ్యక్తి చేసిన పని కాదనీ, కాలేజీ లోపలి వారు చేసిన పనేననీ వైద్యులు చెబుతున్నారు. 

36 గంటల షిఫ్ట్‌ ముగించు కున్న తర్వాత బాధితురాలు విశ్రాంతి తీసుకుంటున్న సెమినార్‌ హాల్‌ ఎక్కడ ఉందో బయటి వ్యక్తికి తెలిసే అవకాశం లేదని వైద్యులు సూచిస్తున్నారు. లైంగిక దాడికి, హత్యకు గురైన రాత్రి బాధితురాలి కారును కూడా ధ్వంసం చేశారని నిరసన తెలిపిన వైద్యులు చెబుతున్నారు.

ఆమెకు ఏదో తెలిసివుండటం వల్ల ఆమె నోటిని శాశ్వతంగా మూసివేశారా? సందీప్‌ ఘోష్‌ మొదట తన వ్యాఖ్యలలో ఆమెను నిందించాడు. ఆ రాత్రి సమయంలో సెమినార్‌ హాల్‌లో ఆమె ఉండటాన్ని తప్పు పట్టాడు. ఆ నిర్లిప్తత సరిపోనట్లు, ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ అధికారులు ఆమె కుటుంబానికి తమ కుమార్తె ఆత్మహత్యతో చనిపోయిందని చెప్పారు. 

ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని నయవంచన. అసలు ఆమె కుటుంబంతో ఘోష్‌ వ్యక్తిగతంగా ఎందుకు సమాచారం పంచుకోలేదు? పైగా మౌనంగా ఉండేందుకు పోలీసులు తమకు డబ్బు ఇవ్వజూపారని కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు.

దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, యువ వైద్యురాలు తన కుమార్తె లాంటిదని ఆయన ఆ తర్వాత పేర్కొన్నప్పటికీ,
ఈ అంశంపై ఘోష్‌ కనీసం ఫిర్యాదు కూడా చేయలేదు. వెంటనే ఆయన పోలీసులను ఎందుకు పిలిపించలేదు? కోల్‌కతా హైకోర్టు కూడా ఇప్పుడు ఆయన ప్రవర్తనపై ఈ ప్రశ్ననే లేవ నెత్తింది.

ఈ విచిత్రమైన ప్రతిస్పందనలు సాక్ష్యాలను తారుమారు చేశాయనే అనుమానాలను మరింతగా పెంచాయి. నేరం జరిగిన స్థలానికి చాలా సమీపంలో సాధారణ నిర్మాణపని, మరమ్మత్తు పనులు జరుగుతున్నట్లు చూపించే వీడియో కనిపించింది. ఫోరె న్సిక్స్‌ కోసం ఆ ప్రాంతాన్ని రింగ్‌ ఫెన్స్‌ చేయాలని ఘోష్‌ అను కోలేదా? తన మొత్తం ఆలోచన అంతా సాక్ష్యం ఎట్టి పరిస్థితు ల్లోనూ దొరకకూడదనే కోణంలో ఉండిందా?

ఇంత దారుణ ఘటన నేపథ్యంలో ఘోష్‌ను కనీసం పదవి నుండి తొలగిస్తారని మీరు అనుకుంటారు. బదులుగా ఏమి జరిగిందో ఊహించండి. ఆయన మరొక మెడికల్‌ కాలేజీకి అధిపతిగా బదిలీ చేయబడ్డారు. అయితే ఈ కలకత్తా నేషనల్‌ మెడికల్‌ కాలేజ్‌ విద్యార్థులు ఆయన కార్యాలయానికి తాళం వేసి ఉంచడమే కాకుండా, అతగాడి కొత్త మాయవేషాలను ప్రారంభించడానికి అనుమతించబోమని తేల్చి చెప్పారు. 

రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఆయనకు మరో ఉద్యోగం ఎందు కిచ్చారు? అంతే కాదు, ఇద్దరు తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజకీయ నాయకులు... ఒక శాసనసభ్యుడు, ఒక మంత్రి... విద్యార్థులతో మాట్లాడటానికి కలకత్తా నేషనల్‌ మెడికల్‌ కాలేజీకి వచ్చి ఘోష్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిలిపివేయమని కోరినట్లు పశ్చిమ బెంగాల్‌ మీడియా నివేదించింది.

ఘోష్‌ను అంత శక్తిమంతంగా మార్చింది ఏమిటి? ఆయన గతంలో వివాదాల మధ్యనే మూడుసార్లు బదిలీ చేయబడ్డాడు. విద్యార్థులు, వైద్యులు ఆయన్ని ఒక విధమైన స్థానిక మాఫియాగా పేర్కొంటారు. ఎట్టకేలకు అతడిని హైకోర్టు తొలగించింది. 

అతని పక్షాన వాదించడానికి ప్రభుత్వ న్యాయవాదిని ఎందుకు పంపారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఇతర ప్రశ్నలు కూడా పెరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ వద్ద నిరసన తెలుపుతున్న వైద్యులపై దాడికి దుండగులను ఎవరు పంపారు?

బాధితురాలి పట్ల వ్యవహరించిన విధంగానే తమపై కూడా అత్యాచారం చేస్తామని ఆకతాయిలు బెదిరించారని నర్సింగ్‌ సిబ్బంది నాతో అన్నారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయా రనీ, దీంతో తమను తామే రక్షించుకోవలసి వచ్చిందనీ నేను మాట్లాడిన యువ మహిళా వైద్యులు చెప్పారు. 

ఆకతాయిలు ఎమర్జెన్సీ గదిని ధ్వంసం చేయడంతో సహా కనుచూపు మేరలో ఉన్నవన్నీ ధ్వంసం చేయడాన్ని వాళ్లు చూశారు. బోల్తా పడిన ఆంబులెన్స్‌ని చూశారు. హాస్టల్‌లోకి ప్రవేశించడానికి పురుషులు పైపులు, గోడల మీదుగా పైకి ఎగబాకటం చూశారు.

ఈ ఆకతాయిలు ఎవరనేది బయటపడినప్పటికీ, ఈ దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వృత్తిపర మైన కలల కోసం స్త్రీలు వెయ్యిమంది రాక్షసులతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. వారి పని ప్రదేశం కూడా సురక్షితంగా లేక పోతే, ఉద్యోగాల్లో చేరేలా అది మహిళలకు ప్రేరణనివ్వలేదు.

బర్ఖా దత్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement