దేశం మొత్తాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఉదంతం తర్వాత నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ వైవాహిక బంధంలో జరిగే అత్యాచారం (మారిటల్ రేప్) గురించి ప్రస్తావించి దాన్ని నేరంగా గుర్తించాలని సిఫార్సు చేసినప్పుడు ‘మర్యాదస్తులు’ నొచ్చుకున్నారు. ఆ చర్య వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయదా... వారి పిల్లల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చదా అని చాలామంది ప్రశ్నించారు. ఈ అంశంపై అంతకు చాన్నాళ్ల ముందే వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతూనే ఉంది.
తాజాగా ఆ విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ మళ్లీ దాన్ని ఎజెండాలో తెచ్చింది. దాంపత్య జీవితంలో ఉండే లైంగిక సంబంధం పరస్పర అన్యోన్యత ఆధారంగా ఏర్పడుతుందనీ, దాన్ని కేవలం ‘సమ్మతి’ అనే పదంలో కుదించటం అసాధ్యమనీ అఫిడవిట్ అంటున్నది. గతంలోని భారత శిక్షాస్మృతి (ఐపీసీ) అయినా, దాని స్థానంలో అమల్లోకొచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) అయినా దాంపత్య జీవితంలో జరిగే అత్యాచారానికి మినహాయింపునిచ్చాయి.
అత్యాచారానికి ఎలాంటి శిక్ష విధించాలో ఐపీసీ సెక్షన్ 375 నిర్దేశిస్తూ ఈ నేరానికి పాల్పడే భర్తకు మినహాయింపునిచ్చింది. బీఎన్‌ఎస్‌ఎస్‌లో ఈ సెక్షన్ 63గా మారింది. మినహాయింపు కూడా యధాతథంగా కొనసాగింది. భార్య వయస్సు 18 యేళ్లు దాటిన పక్షంలో భర్త జరిపే అత్యాచారానికి మినహాయింపు ఉంటుందని చట్టం చెబుతోంది. ఈ మినహాయింపును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తే మొత్తం వివాహ వ్యవస్థపైనే అది తీవ్ర ప్రభావం చూపగలదని కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ హెచ్చరిస్తోంది.
చట్టంలో ఉన్న మినహాయింపు అత్యాచారం చేయటానికి భర్తకిచ్చే లైసెన్సు కాదంటూనే ఆ అంశాన్ని చట్టంవైపుగా కాక సామాజిక కోణం నుంచి చూడాలని అభిప్రాయపడింది. సంబంధిత పక్షాలన్నిటితో, రాష్ట్రాలతో చర్చించాక చట్టసభ తీసుకోవాల్సిన నిర్ణయం గనుక న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని తెలిపింది.
భార్య సమ్మతికి రక్షణ కల్పించేందుకు ఇప్పుడున్న చట్టాల్లో ఏర్పాట్లున్నాయనీ, గృహ హింస చట్టంవంటివి రక్షణగా నిలుస్తాయనీ చెప్పింది. నేరం ఒకటే అయినప్పుడు దాన్ని వేర్వేరు చోట్ల వేర్వేరు రకాలుగా ఎలా పరిగణిస్తారు? హత్య జరిగితే అది చోటుచేసుకున్న ప్రాంతాన్ని బట్టి దాన్ని హత్యాయత్నంగా అనుకోగలమా? పరిచితుడో, అపరిచితుడో మహిళపై అత్యాచారం చేస్తే దానికి శిక్ష ఉన్నప్పుడు... భర్త అదే పనిచేసినప్పుడు మినహాయింపు ఇవ్వటం ఏ రకంగా న్యాయం?
2022లో ఢిల్లీ హైకోర్టులో మారిటల్ రేప్‌పై పిటిషన్ దాఖలైనప్పుడు ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో ఒకరు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని అభిప్రాయపడితే, అది సరికాదని మరో న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అనంతరం కర్ణాటక, గుజరాత్ హైకోర్టులు రెండూ మారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించాల్సిందేనని తీర్పులు వెలువరించాయి.
మన పౌరులైనా, విదేశీ పౌరులైనా చట్టం ముందు అందరూ సమానులనీ, అందరికీ సమానమైన రక్షణ లభిస్తుందనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతోంది. భర్త చేసే అత్యాచారం నేరంగా పరిగణించకూడదని మినహాయింపునివ్వటం వివాహ బంధంలోని మహిళకు ఈ అధికరణ వర్తించబోదని చెప్పటం కాదా? కానీ కేంద్రం అలా అనుకోవటం లేదు. ఇది పెళ్లయితే స్త్రీ తన హక్కును కోల్పోతుందని పరోక్షంగా చెప్పటం కాదా? మన దేశంలో వివాహ వ్యవస్థను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారన్న అఫిడవిట్ అభిప్రాయంతో విభేదించనవసరం లేదు.
అలాగే వివాహ వ్యవస్థకుండే బహుముఖ పార్శా్వల్లో భార్యాభర్తల లైంగిక సంబంధం ఒకటి మాత్రమేనని చేసిన వాదననూ తప్పుబట్టనవసరం లేదు. కానీ సామాజిక విశ్వాసాలకూ, రాజ్యాంగ విలువలకూ మధ్య వైరుద్ధ్యం ఏర్పడినప్పుడు ఒక గణతంత్ర రాజ్యం రాజ్యాంగ విలువలకు మాత్రమే ప్రాధా న్యమివ్వాలి. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. దాదాపు అన్ని సమాజాల్లోనూ భిన్న ఆధిపత్య ధోరణులు అల్లుకుపోయి వుంటాయి. పితృస్వామిక సమాజాల్లో స్త్రీలపై ఆధిపత్యం సాధించటానికి పురుషుడి చేతిలో అత్యాచారం ఒక ఆయుధం.
దీన్ని చాలా ముందుగా గుర్తించబట్టే సోవియెట్ యూనియన్ 1926లో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత 1950లో జెకోస్లోవేకియా, 1969లో పోలెండ్ ఈ మాదిరి చట్టాలు చేశాయి. ఇవన్నీ అప్పటికి సోషలిస్టు రాజ్యాలు. ప్రస్తుతం దాదాపు 150 దేశాలు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నాయి.
భార్య లైంగిక స్వయంప్రతిపత్తిని భర్త అయినా సరే దెబ్బతీయరాదనీ, అది నేరపూరిత చర్య అవుతుందనీ ఈ చట్టాలు భావిస్తున్నాయి. సకల ప్రజాస్వామ్య దేశాలకూ భారత్ తల్లిలాంటిదని చెప్పుకుంటున్న మనం మాత్రం మారిటల్ రేప్ విషయంలో ఇంకా తడబాటు ప్రదర్శించటం సబబేనా?
దాంపత్య జీవనంలో భర్తలు సాగించే హింసను మన దగ్గర మహిళలు మౌనంగా భరిస్తున్నారు. భరించ శక్యం కాని స్థితి ఏర్పడినప్పుడు మాత్రమే బయటికొస్తున్నారు. భర్త లైంగిక నేరానికి పాల్పడుతున్నాడని వారిలో అతి కొద్దిమంది మాత్రమే వెల్లడిస్తున్నారు. స్నేహ అనే స్వచ్ఛంద సంస్థ డేటా ప్రకారం ముంబైలోని ధారవిలో ఈ సంస్థ ముందు 3,878 ఫిర్యాదులు దాఖలుకాగా అందులో 52.11 శాతం లైంగిక హింసకు సంబంధించినవే.
19.33 శాతంమంది తమ భర్త తమపై పదే పదే అత్యాచారానికి పాల్పడుతున్నాడని తెలిపారని ఆ సంస్థ అంటున్నది. భార్య అభీష్టాన్ని బేఖాతరు చేయటం నేరమన్న స్పృహ పురుషుడిలో కలగాలంటే మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించటం ఒక్కటే మార్గం. ఇందుకు భిన్నంగా ఆలోచించటం జనాభాలో సగానికి అన్యాయం చేయటమే.
ఆకాశంలో సగానికి అన్యాయమా!
Published Tue, Oct 8 2024 4:32 AM | Last Updated on Tue, Oct 8 2024 4:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment