సుప్రీమ్‌ ‘అభయ’మ్‌! | Sakshi Editorial On Supreme Court Of India West Bengal Kolkata Issue | Sakshi
Sakshi News home page

సుప్రీమ్‌ ‘అభయ’మ్‌!

Published Thu, Aug 22 2024 12:02 AM | Last Updated on Thu, Aug 22 2024 12:02 AM

Sakshi Editorial On Supreme Court Of India West Bengal Kolkata Issue

హేయమైన కోల్‌కతా హత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం స్వచ్ఛందంగా జోక్యం చేసుకోవడం వ్యవస్థలపై సడలుతున్న నమ్మకాన్ని కాస్త నిలబెట్టింది. విధినిర్వహణలోని వైద్యశిక్షణార్థి జీవితాన్ని చిదిమేసిన ఆగస్ట్‌ 9 నాటి ఉదంతంతో వైద్యసేవకుల భద్రత, ఇతర అంశాలకు సంబంధించి సిఫార్సులు చేసేందుకు నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎన్‌టీఎఫ్‌)ను సుప్రీమ్‌ కోర్టు మంగళవారం ఏర్పాటు చేసింది. 

సంతృప్తి చెందక జాతీయస్థాయిలో జూనియర్‌ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నా అసలంటూ రోగాన్ని గుర్తించి, మందు కనుగొనే ప్రయత్నమైనా జరుగుతున్నందుకు సంతోషించాలి. ప్రముఖ డాక్టర్ల సారథ్యంలోని ఈ టాస్క్‌ఫోర్స్‌ మహిళలు సురక్షితంగా పని చేసేందుకు చేపట్టాల్సిన సమూల సంస్కరణలపై సిఫార్సులు చేయనుంది. కోర్ట్‌ ఆదేశించినట్టు మూడు వారాల్లో మధ్యంతర నివేదిక, రెండు నెలల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంది. 

దేశంలో నూటికి 80 ప్రజారోగ్య వసతుల్లో నిర్ణీత ప్రమాణాలైనా లేవని జాతీయ హెల్త్‌ మిషనే చెబుతోంది. ఈ పరిస్థితుల్లో పనిప్రదేశంలో సురక్షిత వాతావరణ కల్పనకు ఒక విధాన ఏర్పాటుకు జాతీయ వైద్యసంఘం గత వారమే వైద్యకళాశాలలకూ, ఆస్పత్రులకూ నోటీసిచ్చింది. వైద్యులకు విశ్రాంతి గదులు, నిఘాకు సీసీ టీవీలు కరవైన మన ఆరోగ్య వ్యవస్థకు ఇప్పుడు టాస్క్‌ఫోర్స్‌ సిఫా ర్సుల చికిత్స చేయాల్సి ఉంది. 

ఇదిలా ఉండగానే ఆడవాళ్ళు నైట్‌డ్యూటీలలో లేకుండా చూడాలని బెంగాల్‌ సర్కార్, ఒకవేళ డ్యూటీలో ఆడవాళ్ళుంటే వారికి తోడుండేలా చూడాలని కేంద్ర సర్కార్‌ సూచనలివ్వడం విడ్డూరం. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం తక్కువున్న దేశంలో దాన్ని మరింత తగ్గించే ఇలాంటి ఆదేశాలు తిరోగమన «ఆలోచనా ధోరణికి అద్దం పడుతున్నాయి.

కోల్‌కతా ‘అభయ’ ఘటన, చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం చేతగానితనంపై దేశమంతటా ప్రజాగ్రహం పెల్లుబుకుతుంటే... పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ యంత్రాంగం దృష్టి అంతా విమర్శకుల నోళ్ళు మూయించడంపై ఉండడం విషాదం. నిరసనకారులపై ‘రాజ్యాధికారం’ ప్రయోగించే కన్నా దేశవ్యాప్తంగా లోలోపలి భావోద్వేగాలు బయటపడుతున్న వేళ వారితో మరింత సున్నితంగా వ్యవహరించాలని సాక్షాత్తూ సుప్రీమ్‌ కోర్ట్‌ హితవు చెప్పాల్సి వచ్చింది. 

అదే సమయంలో – ఘటన జరిగిన ఆర్జీ కార్‌ ఆస్పత్రికి అప్పట్లో ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన వ్యక్తిపై తీవ్రమైన ఆరోపణలున్నా ప్రభుత్వ పెద్దలు ఆయనను కాపాడాలని చూడడం నీచం. సదరు వ్యక్తి మానవ అక్రమ రవాణాకూ, బలవంతపు వసూళ్ళకూ పాల్పడినట్టు ఆయన మాజీ సహచరులే ఆరోపిస్తున్నారు. 

ఇక, ఆస్పత్రిలో సాగిన అవినీతి, అక్రమాలపై కథనాలైతే కొల్లలు. అటు సీబీఐ దర్యాప్తు, ఇటు సుప్రీమ్‌ సొంత చొరవతో కేసులో ఇంకెన్ని లోతైన అంశాలు బయటపెడతాయో తెలీదు. ఇక, తాజాగా ఆసుపత్రికి భద్రతగా సీఐఎస్‌ఎఫ్‌ దళాల పహారా పెట్టాల్సి రావడం పోగొట్టుకున్న నమ్మకానికి పరాకాష్ఠ.

అసలు మన దేశంలో ప్రతి వంద మంది డాక్టర్లలో 75 మంది సాధారణంగా రోగులు, వారి బంధువుల నుంచి ఏదో ఒక విధమైన హింస, దాడులను ఎదుర్కొన్నవారే. అమెరికాలో ఆ సంఖ్య 47 శాతమే. ఇలాంటి అనేక కారణాల రీత్యానే రెండేళ్ళ క్రితం 2022లో ప్రవేశపెట్టిన ‘ఆరోగ్య వృత్తి నిపుణులు, సంస్థలపై హింసా నిరోధక బిల్లు’ను తక్షణం ఆమోదించి, అమలు చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. 

నిజానికి, 2007 నుంచి మన దేశంలో మెడికల్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ (ఎంపీఏ) ఉంది. 23 రాష్ట్రాలు దాన్ని తమదైన రూపంలో అమలు చేస్తున్నాయి. ఆరోగ్య సేవకుల భద్రత నిమిత్తం అలా ఇప్పటికే చట్టాలున్నా ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయన్నది వేరే కథ. పైగా, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం శిక్ష. అంతటా ఒకే విధమైన నమూనా చట్టం అమలయ్యేలా చూడాల్సి ఉంది. 

అయితే, కేవలం చట్టాలతో పరిస్థితి చక్కబడుతుందనీ, దాడుల నుంచి వైద్యులను కాపాడగల మనీ అనుకోవడం కూడా పొరపాటే. ప్రజారోగ్య సేవకుల భద్రత అనేది దీర్ఘకాలిక ప్రణాళికతో సాగాల్సిన ప్రభుత్వ విధానం. మున్ముందుగా ఉన్నతమైన వైద్యవృత్తికీ, వైద్యులకూ సమాజంలో గౌరవం ఇనుమడించే వాతావరణం పెంపొందించాలి. రోగులకు ప్రాణదాతలై రాత్రీ పగలూ లేకుండా శ్రమించే వైద్యులకు జీతభత్యాలే కాదు... మెరుగైన పని పరిస్థితులు కల్పించడం కనీస బాధ్యత. 

ఆరోగ్య రంగానికి నిధుల పెంపుతో పాటు ‘అభయ’ లాంటివారు 36 గంటలు ఆపకుండా పని చేయాల్సిన అవస్థ తప్పించేలా తగినంతమంది వైద్య సిబ్బందిని తీసుకోవాలి. ప్రభుత్వాలు, వైద్య సంస్థలు సమష్టిగా దీని మీద దృష్టి పెట్టాలి. సుప్రీమ్‌ చెప్పినట్టు ఆస్పత్రుల్లో లైంగిక వేధింపుల నిరో ధక చట్టం (పోష్‌) వర్తిస్తుందని గుర్తించాలి. ఇవాళ్టికీ జూనియర్‌ డాక్టర్లు అమానవీయ పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తున్న తీరును గుర్తించి, ముందు అక్కడ నుంచే మార్పు మొదలుపెట్టాలి. 

కోల్‌కతా ఘటనపై ఆందోళన ఆగక ముందే, మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో బడిలో చదువుకుంటున్న ఇద్దరు కిండర్‌గార్టెన్‌ చిన్నారుల్ని కాపలాదారు రూపంలోని ఓ మానవ మృగం కాటేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్ళిన వ్యవస్థలోని విలువల పతనాన్ని మరోమారు నగ్నంగా నిలబె ట్టింది. ఈ వరుస ఘటనలు ఆందోళనతో పాటు సత్వర కార్యాచరణ అవసరాన్ని పెంచుతున్నాయి. ‘బాగా చదువుకోవాలి. బంగారు పతకం సాధించాలి. 

పెద్ద ఆసుపత్రుల్లో పనిచేయాలి. అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి’ అంటూ డైరీలో ఆఖరిరోజున సైతం రాసుకున్న ఓ మధ్యతరగతి అమ్మాయి కలల్ని చిదిమేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సిందే. ఈ ఘటనలకు మూలకారణమవుతున్న వ్యవస్థాగత లోపాల్ని సరిదిద్దాల్సిందే! సుప్రీమ్‌ తీసుకున్న చొరవ, పాలకుల చర్యలు అందుకు దోహదపడితేనే అభం శుభం తెలియని ‘అభయ’లెందరికో ఆత్మశాంతి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement