వీరమల్లు సైద్ధాంతిక విన్యాసం! | Sakshi Editorial On Pawan Kalyan By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

వీరమల్లు సైద్ధాంతిక విన్యాసం!

Published Sun, Mar 16 2025 1:01 AM | Last Updated on Sun, Mar 16 2025 1:01 AM

Sakshi Editorial On Pawan Kalyan By Vardhelli Murali

జనతంత్రం

సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించి పుష్కర కాలం పూర్తయింది. పిఠాపురంలో నిన్న ఆ వేడుక వైభవంగానే జరిగింది. తాను అసెంబ్లీ గేటు తాకడానికి అవకాశం కల్పించిన పిఠాపురాన్ని ఈ రకంగా పవన్‌ గౌరవించారు. అసెంబ్లీ గేటును తాకే క్రమంలో పనిలో పనిగా కొన్ని తొడలు విరగ్గొట్టినట్టుగా కూడా ఆయన చెప్పారు. వీరమల్లు కదా, ఆ మాత్రం ఎలివేషన్‌ అవసరమే! పుష్కర సభ అంగరంగ వైభవంగా జరిగిందనీ, లక్షలాది జనసందోహంతో పొంగిపొరలిందనీ యెల్లో మీడియా వేనోళ్ల పొగిడింది.

యెల్లో మీడియా సాధారణంగా చంద్రబాబుకూ, ఆయన పార్టీకీ మాత్రమే పరిమితం చేసే ప్రచార గౌరవాన్ని పవన్‌ సభకు కూడా కల్పించి ఔదార్యాన్ని చాటుకున్నది. అందులో ఒక పత్రిక సభలో జనగణన కూడా చేసింది. సభలో జనం కూర్చోవడానికి 14 ఎకరాలు కేటాయించారనీ, ఆ స్థలంలో లక్షలాదిమంది కిక్కి రిసిపోయారని రాసింది. జనం కిక్కిరిసి కూర్చుంటే ఎకరాకు ఐదు వేల మందిని లెక్కవేయడం ఆనవాయితీ. అంతకంటే ఐదు రెట్లు లేదా పది రెట్లు ఎక్కువగా కిక్కిరిశారని యెల్లో మీడియా చెబుతున్నది. ఏమో గుర్రం ఎగరావచ్చు! ఎవరికీ అభ్యంతరం లేదు. జనం కూర్చోవడానికి కేటాయించిన స్థలం 14 ఎకరాలు కాదని, తొమ్మిదెకరాలు మాత్రమేనని స్థానికుల సమాచారం. ఆ స్థానికులు గిట్టనివారు కావచ్చు. యెల్లో మీడియా రాసిందే అక్షర సత్యం కావచ్చు. సభ విజయవంతమైనందుకు పవన్‌ కల్యాణ్‌కు సనాతనాభివందనాలు!

ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ అధికారంలో భాగస్వామి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనుక ఎన్నికల హామీల అమలు గురించో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాల గురించో మాట్లాడుతారని జనం ఆశించడం సహజం. కానీ, అటువంటి ఆశలకు ఆయన అవకాశం ఇవ్వలేదు. కాలు వల కింద కూడా ఎండిపోతున్న పంటల గురించి ఆయన మాట్లాడలేదు. చెమటోడ్చి తెచ్చిన పంటలకు పడిపోతున్న ధరల గురించీ ఆయన మాట్లాడలేదు. అవసరమైన ఔషధా లతో, అందుబాటులో వైద్యులతో తొమ్మిది నెలల కిందటి దాకా ధైర్యం నింపిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇప్పుడు వెలవెల బోతున్న వైనం కూడా ఆయన ప్రసంగంలో చోటు చేసుకోలేదు.

అధోముఖయానం చేస్తున్న జీఎస్టీ వసూళ్ల సాక్షిగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం గురించిన ప్రస్తావనే రాలేదు. పేద, మధ్యతరగతి వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపిన విద్యా విప్లవానికి ఎందుకు కళ్లెం వేశారన్నదానిపై వివరణే వినిపించ లేదు. డొక్కా సీతమ్మ పేరు పెట్టి ఇంటర్‌ విద్యార్థుల కోసం ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం నెల తిరక్కుండానే పరమ నాసిరకంగా ఎందుకు దిగజారిందో ఆయన చెప్పలేదు. ఆర్‌బీకే సెంటర్లలో అందుబాటులో లేకుండా ఎరువులూ, విత్తనాలూ ఎందుకు అదృశ్యమయ్యాయో, ఇల్లిల్లూ తిరిగి సేవలందించిన వలంటీర్లు ఏమయ్యారో అనే విషయాల గురించి పవన్‌ మాట్లాడలేదు.

ఎమ్మెల్యేలూ, నాయకులూ జనం మీద పడి దోచుకుతింటున్నారని యెల్లో మీడియానే కోడై కూస్తున్నది. పంపకాల్లో తేడా లతో కూటమి నాయకులు కాట్లాడుకుంటున్నారని కూడా పచ్చ కోడి గూడెక్కి కూస్తున్నది. అధికారులు కలెక్షన్‌ కౌంటర్లు తెరిచి అక్కడ వారి సతీమణుల్ని కూర్చోబెడుతున్నారని కూడా ఆరోప ణలు చేస్తున్నది. ఇటువంటి కీలక విషయాల జోలికి ఆయన వెళ్లలేదు. లౌకిక విషయాల గురించి ఆయన మాట్లాడ దలుచు కోలేదు. ఆయన ప్రసంగమంతా అలౌకిక పారవశ్యమే!

ఈ సభ ద్వారా ఆయన మూడు అంశాలను చెప్పదలుచు కున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. మొదటి నుంచీ ఆయన రాజకీయ ప్రయాణమంతా సిద్ధాంతబద్ధంగానే సాగిందని జనం నమ్మాలనేది ఆయన మొదటి పాయింట్‌. బాల్యం నుంచే తాను సనాతన ధర్మం కోసం పోరాడుతున్నానని చెప్పుకోవడం, తద్వారా ఆ శ్రేణుల్లో అగ్రభాగాన నిలబడాలని కోరుకోవడం రెండో పాయింటు. కొందరు విశ్లేషకులు, మరికొందరు మీడియా వ్యక్తులు ఊహిస్తున్నట్టు కూటమిలో విభేదాలేమీ ఉండబోవనీ, అక్కడ మోదీకీ – ఇక్కడ బాబుకూ విధేయుడనే అనే సందేశాన్ని శ్రేణులకు పంపించడం మూడో పాయింటు.

లెఫ్ట్‌ నుంచీ సెంటర్‌కూ, అక్కడి నుంచి రైట్‌కూ తన సిద్ధాంత విధేయత మారిందని మీడియాలో వస్తున్న విమర్శలపై పవన్‌ కల్యాణ్‌ అసహనం వ్యక్తం చేశారు. చేగువేరాను తాను అభిమానించడానికి కారణం అతను కమ్యూనిస్టు కావడం కాదట! వైద్యవృత్తిని వదిలేసి విప్లవకారుడుగా మారినందు వల్లనే అభిమానించానని చెప్పుకొచ్చిన పవన్‌ కల్యాణ్‌ భాషణపై సీపీఎం అగ్రనాయకుడు బీవీ రాఘవులు వ్యంగ్యంగా స్పందించారు. చేగువేరా మెడిసిన్‌ చదివిన మాట నిజమే కానీ, ఆయన వైద్యవృత్తిలో ఎప్పుడున్నారో నాకైతే తెలియదన్నారు. 

నిజంగానే వైద్యుడిగా చే ప్రాక్టీస్‌ చేసిందేమీ లేదు. అంతర్జాతీయ విప్లవ కారుడుగానే ఆయన ప్రసిద్ధుడు. చేగువేరా మీద అభిమానానికి పవన్‌ చెప్పిన కారణమే నిజమైతే, విప్లవాలు – యుద్ధాల వీధి గుమ్మాల్లో నిలబడి వైద్యసేవలందించిన డాక్టర్‌ నార్మన్‌ బెథూన్, డాక్టర్‌ ద్వారకానాద్‌ కోట్నిస్‌ల అభిమానిగా ఆయన మారి ఉండాలి. అసలు ప్రాక్టీసే చేయని చేగువేరాను విప్లవకర వైద్యుని కోటాలో అభిమానించడం అనే కథ సరిగ్గా అతకలేదు.

తాను బాల్యం నుంచే సనాతనవాదినని పవన్‌ ఈ సభలో చెప్పుకున్నారు. సనాతన ధర్మం తన రక్తంలోనే వుందని చెప్పారు. పధ్నాలుగేళ్ల వయసు నుంచే దీక్షలు చేస్తున్నట్టు కూడా చెప్పారు. తనపై సినిమాల ప్రభావం బాగా ఎక్కువని కూడా పవన్‌ అంగీకరించారు. సినిమాలు, కథలు, నవలలతో బాగా ప్రభావితమయ్యే వ్యక్తులు కొందరు వాటిలోని పాత్రలతో తమను పోల్చుకోవడం అనే ఫ్యాంటసీలో మునిగి తేలుతుంటారు. 

చేగువేరా ప్రభావం బాగా ఉన్న రోజులో తమ తండ్రి గారు కమ్యూనిస్టని పవన్‌ చెప్పేవారు. అంతటితో ఆగకుండా, నానమ్మ దీపారాధన చేస్తుంటే ఆ దీపంతో నాన్నగారు సిగరెట్‌ కాల్చుకునేవారని కూడా ఒక సందర్భంలో ఆయన చెప్పారు. ఇంతకన్నా అవగాహనా రాహిత్యం ఇంకొకటి ఉండదు. కమ్యూనిస్టు లంటే దైవదూషకులనే అర్థం ఇందులో స్ఫురిస్తున్నది. కమ్యూనిస్టు అయినంత మాత్రాన నాస్తికుడై ఉండాలనేదేమీ లేదు. 

నాస్తికుడైనంత మాత్రాన దైవదూషణ చేస్తారనీ, అవమానిస్తా రనీ అర్థం కాదు. వారి వారి విశ్వాసాలకు, నమ్మకాలకు కట్టుబడి ఉంటారంతే! దైవదూషణ వంటి పనులకు విశ్వాసాలతో సంబంధం లేదు. అది వ్యక్తిగతం. పూజా పునస్కారాలు చేసే సంప్రదాయ కుటుంబాల్లో పుట్టిన నిగమశర్మ వంటి వారి కథలు కూడా మనం విన్నాము.

ఇప్పుడాయన సనాతన ధర్మ ప్రభావానికి లోనైన తర్వాత కుటుంబ కథలో కొంత మార్పు చేశారు. కేవలం ఇరవయ్యేళ్ల వయసులోనే నాన్నగారు కమ్యూనిస్టు భావజాలంతో ఉండే వారని, ఆ తర్వాత రామభక్తుడిగా మారారని పిఠాపురం సభలో పవన్‌ చెప్పారు. తన చిన్నతనం నుంచే ఇంట్లో రామనామ జపం వినిపించేదని ఆయన అన్నారు. 

తన సనాతనధర్మ నిబద్ధతపై ఎవరూ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదనీ, ఈ దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని మరోసారి ఆవేశం ప్రదర్శించారు. ఇదంతా ఎందుకంటే, తాను చిన్నతనం నుంచీ సిద్ధాంత నిబ ద్ధతతోనే ఉన్నాననీ, ఆ సిద్ధాంతం సనాతన ధర్మమేననీ ఇప్పు డాయన సవరణ చేయదలుచుకున్నారు.

చేగువేరా కమ్యూనిస్టని కాదు... మంచి వైద్యుడూ, విప్లవ కారుడైనందువల్ల అభిమానించారు. మరి శ్రీశ్రీ, దాశరథి,శేషేంద్ర వంటి వారి సంగతేంది? అవకాశం దొరికిన ప్రతిసారీ వారి కవితా పంక్తుల్ని వల్లెవేయడం పవన్‌కు అలవాటు. వారు సనాతనవాదులా? సామ్యవాదులా? పిఠాపురం సభలో కూడా దాశరథినీ, శ్రీశ్రీని ఆయన తలచుకున్నారు. ‘‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో...’’ అనే దాశరథి గేయం సామ్యవాద గీతమా? సనాతనవాద గీతమా?. ప్రసంగాన్ని ముగిస్తూ శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ‘అవతారం’ కవితను ఆసాంతం చదివి వినిపించారు. 

‘‘యముని మహిషపు లోహఘంటలు మబ్బుచాటున ఖణేల్‌మన్నాయి / నరకలోకపు జాగిల మ్ములు / గొలుసు త్రెంచుకు ఉరికి పడ్డాయి / ఉదయ సూర్యుని సప్త హయములు / నురుగులెత్తే పరుగు పెట్టేయి / కనకదుర్గా చండసింహం జూలు దులిపీ, ఆవులించింది...’’ ... ఇలా పురాణ ప్రతీకలతో సాగిపోతుందా కవిత.

ఇంతకాలం ఈ ప్రతీకలన్నీ ప్రభవించబోయే విప్లవానికి సూచికలుగా భావించారంతా! మరి సనాతన ధర్మ పరిరక్షణా యాత్రికునికి ఈ కమ్యూనిస్టు విప్లవ ప్రతీకలెందుకో! ఆయన విడమరిచి చెబితే తప్ప సామాన్యులకు అర్థం కాదు. ఆయన ప్రసంగంలో ఒకపక్క చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తు తూనే మోదీ తరఫున వకాల్తా పుచ్చుకొని తమిళనాడులోని డీఎమ్‌కే పార్టీ మీద దాడి చేశారు. 

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేయబోతున్నదనీ, దీనిపై ఐక్యంగా పోరాడదామనీ ఆ పార్టీ వాళ్లు వాళ్ల ప్రయత్నమేదో చేస్తున్నారు. బీజేపీ దీర్ఘకాల లక్ష్యాలకు ఇటువంటి చిన్నచిన్న ప్రయత్నాలు కూడా విఘాతం కలిగిస్తా యని బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. వారి మనసెరిగి పవన్‌ ప్రసంగించారు. అప్పుడెప్పుడో చిన్నతనంలో ఆయన మద్రా స్‌లో ఉన్నప్పుడు తమిళుడెవరో ‘గొల్టీ’ అని గిచ్చాడట! దాన్ని ప్పుడు గుర్తుచేసుకున్నారు.

పవన్‌ సభ ప్రారంభానికి ముందే చంద్రబాబు, లోకేశ్‌ బాబు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. యెల్లో మీడియా ఆ సభకు పూర్ణకుంభ స్వాగతం పలికింది. ఈ మూడు పార్టీల కూటమిలో లుకలుకలున్నాయనీ, విడిపోతాయనీ, బీజేపీ – జన సేన కలిసి ఒక కూటమిగా ఏర్పడుతాయనీ ఊహిస్తున్న విశ్లేష కులు ఇప్పటికైనా తమ ఆలోచనల్ని సరిదిద్దుకోవాలి. విభేదా లేమీ లేవు. ముగ్గురూ కలిసి పనిచేస్తారు. బీజేపీ–సంఘ్‌ పరి వార్‌ల దీర్ఘకాలిక లక్ష్యానికి సహకరిస్తూనే మిగిలిన ఇద్దరు ఎవరి ఇంటిని వాళ్లు చక్కదిద్దుకుంటారు. 

విశ్వసనీయ సమాచారం ప్రకారం లోకేశ్‌ను సీఎం కుర్చీలో త్వరగా కూర్చోబెట్టాలనే ఒత్తిడి బాబు మీద పెరుగుతున్నది. ఆ పరిస్థితుల్లో డిప్యూటీగా ఉండటం పవన్‌కు ఇబ్బంది కనుక ఆయన కేంద్రానికి వెళతారనీ, వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిన బీజేపీ తరఫున సనాతన ప్రచారానికి ఆయనను నియోగిస్తారని తెలుస్తున్నది. పవన్‌ స్థానంలో నాగబాబు రాష్ట్ర కేబినెట్‌లోకి రావచ్చు. జనసేన కార్య కర్తలు ఇంతకంటే పెద్ద దృశ్యాన్ని ఆశిస్తే నిరాశ తప్పకపోవచ్చు.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement