ఒకే ఒక్కడు సిద్ధం! ‘జో జీతా వొహీ సికిందర్’ అంటారు. తాను సిద్ధమేనని సికిందర్ ప్రకటించారు. సాగర తీరంలో ఆయన చేసిన రణగర్జనకు జన ప్రభంజన ఘోష ప్రతిధ్వని పలి కింది. ఏమా జనం? లక్షలాది నింగి చుక్కలు ఒక్కచోటనే రాలిప డ్డట్టు లేదూ! బీదాబిక్కీ జనం, బడుగు బలహీనవర్గాల ప్రజలే వారంతా! తమ జీవితాలకు గొడుగు పట్టిన జగన్‌మోహన్‌రెడ్డి జైత్రయాత్రకు తాము సైతం అన్నట్టుగా తరలివచ్చారు. యుద్ధా నికి సిద్ధమంటూ నాయకుని గొంతుతో వారంతా శ్రుతి కలి పారు. జన హోరుపై గౌరవంతో సముద్రుడు తన కెరటాలను అవనతం చేశాడేమో! జన సాగర సందడిలో అలల చప్పుడు వినిపించలేదు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు సిద్ధమ య్యారు సరే! మరి ప్రత్యర్థుల సంగతి? ఆ ప్రత్యర్థి ఏకవచ నమా? బహువచనమా అనే సందేహం అవసరం లేదు. బహు వచనంగా కనిపించే ఏకవచనం. చంద్రబాబు బహురూపి. ఒక రూపం నుంచి మరో రూపంలోకి పాదరసంలా ప్రవహించగల నేర్పరి. పాదరసం ఒక లోహం. కానీ సాధారణ పరిస్థితుల్లో ద్రవ రూపంలో కనిపిస్తుంది. ఈయనా అంతే – ద్రవరూపంలో కని పించే ఒక లోహ విశేషం. ఈ ఎన్నికల కోసం ఆయన ఇప్పటికే ఆరు రూపాల్లోకి ప్రవహించారు. ఇందులో కొన్ని పాత రూపాలే. కొన్ని కొత్తవి. ఆరు ముఖాల వాడిని సంస్కృతంలో షణ్ముఖం అంటారు. తమిళ సంప్రదాయంలో ఆర్ముగం అంటారు. ఇప్పుడు మన ఆర్ముగం చంద్రబాబు ఆరు ముఖాలతో ఆరు శిబిరాలను తన కోసం సన్నద్ధం చేసుకున్నారు.
ఇందులో మొదటి ముఖం తనదైతే, రెండోది యెల్లో మీడియా లీడర్ రామోజీది. వీరిద్దరు సియామీ కవలలు. ఇద్దరిలో ఎవరిది ఒకటో నెంబరో తేల్చడం కష్టం. పొలిటికల్ ఫేస్ కనుక బాబునే ఒకటి అనుకుందాం. ఇక మూడో ముఖం జగమెరిగిన జనసేనాధిపతి. తన కోవర్టుల సాయంతో కబ్జా చేసిన బీజేపీ రాష్ట్ర శాఖ నాలుగో ముఖం. తాను కొనుగోలు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ ఐదో ముఖం. ఈ సిక్ యూని ట్‌ను ‘కొనుగోలు’ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త ‘కనుగోలు’ సేవలు ఉచితంగా లభిస్తాయట! ఇక సందర్భాన్ని బట్టి తనకు ఉపయోగపడే పనులు చేసిపెడుతూ, అప్రకటిత ఓఎస్‌డీగా పనిచేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర శాఖ ఆరో ముఖం. ఇందులో ఎవరికి నిర్దేశించిన పాత్రను వారు పోషిస్తూ చంద్రబాబుకు తోడ్పాటునందిస్తుంటారు.
జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుంచే చంద్రబాబు, యెల్లో మీడియాలు తదుపరి ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి. అప్పటి
నుంచే జగన్ సర్కార్‌పై యెల్లో మీడియాలో దుమ్మెత్తి పోయడం ప్రారంభించారు. కాకపోతే ఆరు శిబిరాలను సమయాత్తం చేసి ఆరు ముఖోటాలను తగిలించడానికి ఇంత సమయం పట్టింది. ఇప్పుడు షణ్ముఖ కూటమి సిద్ధమైంది. షడ్యంత్రం కూడా ఎప్పుడో సిద్ధమైంది. ఆరు రకాల మాయోపాయాలను ఉప యోగించి నడిపే కుట్రను ‘షడ్యంత్రం’ అని పూర్వం అనేవారు. శాస్త్ర ప్రకారం చేసే కుతంత్రమన్నమాట. మన ఆర్ముగం మాస్టారు ఆరు రకాలేం ఖర్మ... అరవై రకాల మాయోపాయాలను ఏకకాలంలో ప్రయోగించగల నేర్పరి.
కీలకమైన ఆరు మాయలను చెప్పాల్సి వస్తే దాంట్లో మొద టిది మోసం లేదా వెన్నుపోటు లేదా నమ్మకద్రోహం. గూగుల్ ఇమేజెస్‌లో వెన్నుపోటు అనే అక్షరాలు టైప్ చేస్తే వచ్చే బొమ్మల్లో 90 శాతానికి పైగా చంద్రబాబు బొమ్మలే కనిపిస్తాయి. అకడమిక్ ఆసక్తి ఉన్నవారెవరైనా పరీక్షించి చూసుకోవచ్చు. వెన్నుపోటు కేటగిరీలో బాబు, యెల్లో మీడియాలు యూనివర్సల్ పేటెంట్ హోల్డర్లు. మిగిలిన నాలుగు ముఖాలకు కూడా తరతమ భేదా లతో ఈ లక్షణం ఉన్నది. మాయోపాయాల్లో రెండోది – దుష్ప్ర చారం లేదా గోబెల్స్ ప్రచారం. తప్పుడు ప్రచారాలకు ఆది గురువుగా పేరొందిన గోబెల్స్ మహాశయుడు ఇప్పుడు కనుక బతికి వుంటే యెల్లో మీడియా బడిలో మరోసారి ఓనమాలు దిద్దుకునేవాడు. యెల్లోమీడియా ఘనత ఈ రంగంలో దిగంతా లకు వ్యాపించింది.
మూడో మాయోపాయం – అవకాశవాద పొత్తులు. నాలు గోది – వ్యవస్థలను దురుపయోగపరచడం. ఐదవది – పార దర్శకత లేమి. ఆరవది – గోముఖ వ్యాఘ్రంలా పెత్తందారీవర్గ స్వభావాన్ని దాచిపెట్టడం. ఈ ఆరు లక్షణాల్లో చంద్రబాబుకు, యెల్లో మీడియాకు ఉన్న ప్రావీణ్యతను గురించి కొత్తగా చెప్పన వసరం లేదు. వీరు కూడగట్టుకున్న కొత్త మిత్రులందరిలోనూ ఈ లక్షణాలు అంతో ఇంతో కనిపిస్తాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన పదేళ్లలో విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు. ఆయనకొక సైద్ధాంతిక నిబద్ధత లేదని పలు మార్లు రుజువైంది. మాట నిలకడ లేదని కూడా ఆయన పదేపదే నిరూపించుకుంటున్నారు.
ఒక నమ్మదగిన నాయకుడుగా స్థిరపడలేకపోయాడు. చంద్రబాబు ప్రయోజ నాలు తప్ప ఆయనకంటూ సొంత ఎజెండా ఏమీ లేదని ప్రతి సందర్భంలోనూ రుజువు చేసుకుంటున్నారు. కాపు సామాజిక వర్గంలో మెజారిటీ ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల విముఖత ప్రదర్శిస్తారు. అదొక సహజ వ్యతిరేకత. అందువల్ల ఆ వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఓ వేదికను ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ ఓట్లు పరోక్షంగా తనకు లభించేట్టుగా పన్నిన కుతంత్రమేనని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఈ ప్రయత్నం ఫలించే అవకాశం లేదు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ వేదిక కూడా కూలిపోయే అవకాశమే ఎక్కువ.
పవన్ కల్యాణ్ పార్టీని ఎన్టీఏ కూటమిలో చేర్పించడం కూడా చంద్రబాబు వ్యూహమేనని తెలియని వారెవరూ రాష్ట్రంలో లేరు. తన పార్టీ ఎంపీలను, పైరవీకార్లను కూడా బీజేపీలో చేర్పించింది చంద్రబాబేనన్న సంగతి జగమెరిగిన సత్యమే. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగితే మాత్రం లోకానికి నిజం తెలియకుండా ఉంటుందా? గడిచిన ఎన్నికల్లో జరిగిన దారుణ పరాభవంతో బాబుకు జ్ఞానోదయమైంది. రాష్ట్రంలో యాభై శాతం ఓట్లను అప్పటికే స్థిరపరచుకున్న జగన్‌తో పోరా డాలంటే తన బలం సరిపోదనీ మిగిలిన అన్ని పార్టీల నుంచి రకరకాల పద్ధతుల్లో మద్దతు స్వీకరించాలనీ ఆయనకు అర్థమైంది. అవకాశవాద పొత్తులు మాత్రమే కాదు, జగన్ అను కూల ఓటర్లలో కూడా ఏదో ఒకరకంగా కోత పెట్టాలి. ఈ రకంగా సాగిన ఆలోచనల్లోంచే ఈ షణ్ముఖ కూటమి పుట్టింది.
బీజేపీలో చేరిన బాబు కోవర్టులు, బీజేపీ భాగస్వామిగా చేరిన పవన్ కల్యాణ్‌ల ప్రయత్నాలతో పాటు తన పాత పరిచ యాలతో చేసిన లాబీయింగ్ ఫలితంగా బీజేపీ రాష్ట్రశాఖకు బాబు వదినమ్మ అధ్యక్షురాలిగా వచ్చారు. వర్గ ప్రయోజనాల రక్షణ కోసం ఆ వదినమ్మ బాబుకు అండగా నిలబడుతున్నారు. ఫలితంగా రాష్ట్ర బీజేపీని ఒక ఫ్రాంచైజీగా చంద్రబాబు మార్చేసు కున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దానితోపాటు ఈగలు తోలుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ దుకాణాన్ని కూడా తెరి పించి అద్దె చెల్లిస్తున్నారు. దానికి షర్మిలను అధ్యక్షురాలిగా వేయించుకున్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ప్రముఖ నాయకుని సలహా మేరకే చంద్రబాబును కలిశానని ప్రశాంత్ కిశోర్ చెప్పిన సంగతి సోషల్ మీడియా చూసేవారికి గుర్తుండే ఉంటుంది. సదరు ప్రముఖ నాయకుడి పేరు డీకే శివకుమార్. 2018 కర్ణాటక ఎన్నికల్లో డబ్బు సాయం చేసినప్పటి నుంచి డీకేకూ, చంద్రబాబుకూ దోస్తీ కుదిరింది. ఆ దోస్త్ ద్వారా రాయ బారం నడిపి, షర్మిలను ఇక్కడికి డిప్యుటేషన్ వేయించుకున్నా డని కాంగ్రెస్ వర్గాల భోగట్టా..
దీన్నే చావు తెలివితేటలంటారు. ప్రభుత్వ అనుకూల వోటును ఎంతోకొంత చీల్చడం కోసం కాంగ్రెస్ కొంపను బాబు అద్దెకు తీసుకున్నారు. నెగిటివ్ ఓటును చీల్చడం సాధ్యమవు తుందేమోగానీ పాజిటివ్ ఓటును చీల్చలేమన్న కనీస అవగా హన అనుభవజ్ఞుడైన బాబుకు లేకపోవడం ఒక విషాదం. విశ్వస నీయతను కోల్పోవడంలో పవన్ కల్యాణ్ కంటే పదిరెట్ల వేగాన్ని షర్మిల ప్రదర్శించారు. వివిధ సందర్భాల్లో ఒకే అంశంపై ఆమె వ్యక్తం చేసిన విరుద్ధ అభిప్రాయాలు వింటే చాలు, ఆమెకు ఏ రకమైన రాజకీయ నిబద్ధతా లేదనే విషయం ఎవరికైనా అర్థమ వుతుంది. ఈ ఎన్నికల్లో ఆమె పార్టీ ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం లేకపోయినా చంద్రబాబు పడుతున్న పాట్లను వివరించడానికే ఈ ప్రస్తావన! అంతకన్నా ప్రాధాన్యత లేదు. సీపీఐ వ్యవహారం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అదొకప్పుడు పేదల ఇళ్లస్థలాల కోసం పోరాడిన పార్టీ. ఇప్పుడు జగన్ ప్రభుత్వం 30 లక్షల మంది మహిళలకు ఇళ్లు కట్టిస్తుంటే టీడీపీ పలురకాలుగా అడ్డుపడింది. ఆ పార్టీకి సీపీఐ వంతపాడటం విచిత్రం. ఈ అయిదేళ్లలో ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు.
జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఈ షణ్ముఖ కూటమి ఆపసోపాలు పడుతున్నది. ఆయన చేసిందేమిటి? ఆయన ఎటువంటి వ్యక్తి! ఏడున్నర దశాబ్దాల భారత రాజకీయ చరి త్రలో ఏ నాయకుడి మీద జరగనంత దుష్ప్రచారాన్ని జగన్ మీదా యెల్లో మీడియా సాగించింది. వ్యక్తిత్వ హననానికి ఉండ వలసిన హద్దులన్నీ చెరిపేసి బర్బర మనస్తత్వాన్ని ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్షం కుమ్మక్కయి ఒకే ఒక్క యువకుడిని వేధించడం, రాజకీయ అంకురాన్ని మొలకెత్తకుండా కేసులు పెట్టడం, పదహారు నెలలు జైల్లో ఉంచడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదు. అవి తప్పుడు కేసులనీ, రాజకీయ కేసులనీ అర్థం కావడానికి మనిషికి కామన్ సెన్స్ ఉంటే చాలు. జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటే ముఖ్యమంత్రిని చేసేవాళ్లమని గులామ్‌నబీ ఆజాద్ ఒక బహిరంగ సభలోనే చెప్పారు. ఆయన అప్పట్లో సోనియా గాంధీ కోటరీలోని ముఖ్యవ్యక్తి.
ముఖ్యమంత్రిని చేయనందుకే ఆయన కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయారని అప్పట్లోనే దుష్ప్రచారాన్ని సృష్టించారు. తనను ముఖ్యమంత్రి చేయాలని ఆయన సంతకాలు సేకరించారని ఓ అభాండం వేశారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న యువకుడిపై ఇటు వంటి అమానవీయ దాడి చేయడానికి ఎంత బరితెగింపు ఉండాలి. ఆయనకు సంతకాల సేకరణతో ఎటువంటి సంబంధం లేదని అప్పట్లోనే పలువురు కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. తాజాగా తెలంగాణ ఎన్నికలకు ముందు ఓ ఇంట ర్వ్యూలో భట్టి విక్రమార్క కూడా ఈ ఆరోపణను నిర్ద్వంద్వంగా ఖండించారు. రోశయ్యను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా నిండు పేరోలగంలో ప్రతిపాదించిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డే అనే సత్యాన్ని దాచేస్తే దాగుతుందా!
ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లాల్సి వచ్చింది మాట కోసం. ప్రజలకిచ్చిన ఒక్క మాట కోసం! తన తండ్రి మరణ వార్తను తట్టుకోలేక ఉమ్మడి రాష్ట్రంలో వందలాదిమంది గుండె పగిలి చనిపోయారు. ఈ ఉదంతం అప్పటికి ముప్పయ్యారేళ్ల వయసున్న జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా కలచివేసింది. ఆ కుటుంబాల సభ్యులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఓదార్చుతానని నిండు సభలో ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకత్వం అడ్డుకున్నది. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండలేని రాజకీయ జీవితం ఎందుకన్న ప్రశ్నను ఆయన వేసుకున్నారు. ‘పదవులూ, అధికారాల కంటే మాట నిలబెట్టుకోవడమే నాకు ముఖ్యమ’ని ఓదార్పు యాత్రను ప్రారంభించారు. కష్టాల పాలవుతావని నాయకత్వం హెచ్చరించింది. ఖాతరు చేయకుండా ముందడుగు వేశాడు. ఫలితంగా పదేళ్లపాటు కష్టాలు కడగండ్లతో కూడిన కడలిని ఈదవలసి వచ్చింది. అగ్ని సరస్సున వికసించిన వజ్రంలా రాటుదేలి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు.
పదేళ్లలో ఏర్పడిన కోట్లాది ప్రజల సాంగత్యం ఆయననొక తాత్వికునిగా, రాజనీతిజ్ఞునిగా, పాలనాదక్షునిగా తీర్చిదిద్దింది. షడ్ యంత్రాన్ని తిప్పికొట్టగల ఆరు అద్భుతమైన లక్షణాలు ఆయన అయిదేళ్ల పాలనలోంచి మనం గ్రహించవచ్చు. విశ్వస నీయత, పారదర్శకత, దార్శనికత, బహుజన పక్షపాతం, పాలనా దక్షత, మెరుగైన విద్య – ఆరోగ్యాలతో కూడిన ఉన్నత సమాజ నిర్మాణం. ఈ లక్షణాలు ఫలితాలివ్వడం ప్రారంభమైంది. అందుకే ఆయనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతు న్నది. నిన్నటి భీమిలి సభలో అదే ఆత్మవిశ్వాసం సమర శంఖం పూరించింది. ‘వైనాట్ 175?’ అని ఆ విజయశంఖం ప్రశ్నించింది. ‘యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా?’ అని ఆ సింహ నాదం ప్రశ్నించింది. సిద్ధం.. సిద్ధం.. సిద్ధం – లక్షలాది గళాల్లో ఓ తారకమంత్రం మార్మోగింది. మరో అద్భుతమైన విజయానికి రంగం సిద్ధమైంది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
షణ్ముఖ కూటమి... సిద్ధమా?
Published Sun, Jan 28 2024 1:04 AM | Last Updated on Sun, Jan 28 2024 4:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment