జనతంత్రం
అది మహారాజాధిరాజ రాజమార్తాండ రాజగండభేరుండ చక్రవర్తులు నివసించదగిన మహాప్రాసాదమట! ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లు దాని ముందు దిగదుడుపట! అంతోటి మహత్తరమైన ప్యాలెస్‌ను మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసం కోసం నిర్మించుకున్నారట! సామెతలు ఊరికే పుట్టవు. వినేవారు వెర్రివాళ్లయితే చెప్పేవారు చంద్రబాబు అనే నానుడి ఊరికే రాలేదు.
చంద్రబాబు ఎప్పుడూ అబద్ధాలే చెబుతారు. ఎందుకంటే నిజం చెబితే ఆయన తల వెయ్యి వక్కలవుతుందనే ముని శాపం ఉన్నదని వైఎస్సార్ విమర్శిస్తుండేవారు. క్లాస్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ (’78) బ్యాచ్‌మేట్స్ కదా! పూర్తి అవగాహనతోనే మాట్లాడి ఉంటారు.రిషికొండలో గత ప్రభుత్వం హయాంలో టూరిజం శాఖ నిర్మించిన భవనాలను శనివారం నాడు చంద్రబాబు సందర్శించారు.
‘ప్రజాస్వామ్యంలో కూడా ఇటువంటి కట్టడాలుంటాయా!’ అంటూ బోలెడంత ఆశ్చర్యాన్ని మీడియా ముందు ఆయన గుమ్మరించారు. ఆ నిర్మాణాలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యామని కూడా ఆయన చెప్పారు. ఆయనే చెప్పిన లెక్క ప్రకారం ఆ నిర్మాణాలకయిన ఖర్చు రూ.430 కోట్లు.
ఈ భవనాల నిర్మాణాని కంటే ఏడెనిమిదేళ్ల ముందు అమరావతిలో చంద్రబాబు కొన్ని ‘తాత్కాలిక’ భవనాలను నిర్మించారు. అందులో తాత్కాలిక సచివాలయానికే సుమారు వెయ్యి కోట్లు ఖర్చయింది. రిషికొండ నిర్మాణాల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ఖర్చు. ఈ లెక్కన ఆ తాత్కాలిక భవనం అంబర్ ప్యాలెసో, మైసూర్ ప్యాలెసో అయుండాలి.
మరి వెయ్యి కోట్ల తాత్కాలిక ప్యాలెస్‌ను చూసినప్పుడు ఎందుకని దిగ్భ్రాంతి కలుగలేదు? నిర్మాణ సంస్థవారు దిగ్భ్రాంతి కలిగించే హంగూ ఆర్భాటాలను ఇక్కడి నుంచి వేరేచోటుకు తరలించి లెక్క తాత్కాలికంలో రాసేశారా? ఆ లెక్కతో ఏ జూబిలీ హిల్స్ ప్యాలెస్‌కో నగిషీలు చెక్కారా? ఎందుకని ఆ వెయ్యి కోట్ల తాత్కాలిక భవనం ఏపీ ముఖ్యమంత్రిని నివ్వెరపాటుకు గురి చేయలేకపోయింది? భవనం లోపలికి కూడా వానచినుకులు ప్రవేశించగలిగే వర్ష పారదర్శకత మినహా మరే ప్రత్యేకతా ఈ తాత్కాలిక సచివాలయంలో ప్రజలకు కనిపించలేదు.
ముఖ్యమంత్రికి మనస్తాపం కలిగించిన మరో అంశం పర్యావరణ విధ్వంసమట! రుషి పుంగవులు తపస్సు చేసిన రుషికొండను ధ్వంసం చేసి జగన్ సర్కార్ ప్యాలెస్‌ను కట్టిందట! అసలు రుషికొండకు గుండుకొట్టి పర్యాటకం కోసం ‘హరిత రిసార్ట్స్’ నిర్మించిందే టీడీపీ సర్కార్. పాతబడిన ఆ భవనాలను తొలగించి వాటి స్థానంలో ఈ కొత్త భవనాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే జగన్ సర్కార్ నిర్మించింది. ఈ భవనాలు తాత్కాలికం కాదు. శాశ్వత ప్రభుత్వ భవనాలు.
అమరావతిలో ఐకానిక్ భవనాలు నిర్మించాలని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. అదిగో అటువంటి ఐకానిక్ భవనాన్నే విశాఖలో జగన్ సర్కార్ నిర్మించింది. అమరావతికి లేని హంగు విశాఖకు ఎందుకని ఆయన భావిస్తున్నారేమో!పాత నిర్మాణాల స్థానంలో కొత్తగా ఏయే భవనాలను నిర్మిస్తున్నారో, ఎందుకోసం నిర్మిస్తున్నారో తెలియజేస్తూ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు వివరాలు అందజేసింది.
కానీ, తెలుగుదేశం, దాని మిత్రపక్షాలు మాత్రం జగన్‌మోహన్‌రెడ్డి నివసించడం కోసమే ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తున్నారని ప్రచారం మొదలుపెట్టాయి. ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ ధనంతో సొంత భవనాన్ని ఎవరైనా ఎట్లా నిర్మించుకుంటారు? కనీస ఇంగిత జ్ఞానం కదా! కానీ, గోబెల్స్ దుష్ప్రచారాలకు ఇంగితంతో పనిలేదు. అవసరార్థం ఏ ప్రచారమైనా చేస్తారు. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త అవసరం వచ్చిపడింది. కనుక చంద్రబాబు పనిగట్టుకొని అదే దుష్ప్రచారానికి రంగురంగుల రెక్కలు తొడిగి జనం మీదకు వదిలారు.
అలవి కాని హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చారు. ఐదు నెలలు గడిచిపోయాయి. ‘హామీల అమలు ఇంకెప్పుడ’ని పబ్లిక్ వాయిస్ ప్రశ్నించడం మొదలైంది. ఈ వాయిస్ వినిపించగూడదు. అందుకోసం ఇంకెక్కడో ఓ కృత్రిమ వివాదం చిటపటలాడాలి. డైవర్షన్ స్కీమ్ పాహిమాం! అప్పుడెప్పుడో రెండేళ్ల కిందట వైఎస్ విజయమ్మ వాహనానికి జరిగిన ప్రమాదం ఇప్పుడెందుకు వార్తల్లోకి వచ్చింది? తాయెత్తు మహిమ. షర్మిల ఆస్తుల వివాదం ఎందుకొచ్చింది? తిరుపతి లడ్డూలో కల్తీ ఆరోపణలు ఎందుకొచ్చాయి? కృష్ణా వరదల్లో బోట్ల వివాదం ఎందుకు తెరపైకి తెచ్చారు? ఇలాంటివెన్నో తాయెత్తులు, ఎత్తులు ఈ ఐదు మాసాల్లో చూడవలసి వచ్చింది. టాపిక్ డైవర్షనే ఆ తాయెత్తు మంత్రం.
పరిపాలన వైఫల్యాలనూ, వాగ్దాన భంగాలనూ ఈ ఎత్తులూ, తాయెత్తులూ ఎంతకాలం కప్పి ఉంచగలవు? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దారుణమైన శాంతిభద్రతల పరిస్థితి ఎన్నడూ లేదన్న మాట జనం నోట వినబడుతున్నది. వాగ్దానాలు అటక మీద పడుకున్నాయి. నాణ్యమైన విద్యకు, వైద్యానికి పేద వర్గాలను దూరం చేశారు. మహిళా సాధికారత పథకాలను చాపచుట్టేశారు.
ఇప్పుడు తాజాగా ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును బరాజ్ స్థాయికి కుదించాలన్న కేంద్ర ఆదేశాలకు డూడూ బసవన్నలా తలూపి వచ్చారు. ఫలితంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సుదూర స్వప్నంగా మిగిలిపోనున్నది. విశాఖ ఉక్కు భవిష్యత్తు దినదినగండంగా మార్చేస్తున్న కేంద్రం ముందు జోహుకుం అంటున్నారు. అవమాన గాయాలతో ఉత్తరాంధ్ర ప్రజల్లో సెగ రగులుతున్నది. అందుకే విశాఖలో ఈ సరికొత్త డైవర్షన్ తాయెత్తు ప్రయోగం.
వెయ్యికోట్లు ఖర్చు పెట్టి నీళ్లుకారే తాత్కాలిక భవనాన్ని నిర్మించిన వ్యక్తి 430 కోట్ల ఖర్చుతో ఐకానిక్ కట్టడాన్ని కడితే ఔరా అని ముక్కున వేలేసుకోవడాన్ని చూసి సిగ్గేస్తున్నది బాబూ! ఏపీలో ముఖ్యమంత్రిగా ఉంటూ హైదరాబాద్ సెవెన్ స్టార్ హోటల్‌లో కొద్దిరోజులు సకుటుంబ సపరివారంగా గడపడానికి 30 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టిన వ్యక్తి, క్యాంపు కార్యాలయాలకు, వాటి సెక్యూరిటీ ఏర్పాట్లకూ 126 కోట్లు ఖర్చు చేసిన నాయకుని నోట వినిపించిన మాట – రిషికొండలో బాత్ టబ్‌లకూ, కమోడ్‌లకూ, ఫ్యాన్‌లకూ లక్షలు ఖర్చు చేశారని! చచ్చేంత సిగ్గేస్తున్నది బాబూ!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment