
దేశంలో అవినీతి సర్వాంతర్యామి అని, ఏ వ్యవస్థా అందుకు అతీతం కాదని గ్రహించినవారిని సైతం దిగ్భ్రాంతిపరిచేలా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదం ఉదంతం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఆ ఘటనలో భారీ మొత్తంలో కాలిన కరెన్సీ నోట్ల కట్టలున్న సంచులు బయటపడ్డాయని గుప్పుమంది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో సైతం అందుకు సంబంధించిన వీడియో ఉంది. కానీ నోట్ల కట్టల సంగతి అబద్ధమని, కుట్రపూరితమని అంటున్నారు న్యాయమూర్తి.
పైగా తానుంటున్న నివాసానికి విడిగా, అందరూ వచ్చిపోగలిగేలా ఉండే ఆ స్టోర్ రూమ్‌కు తాళం కూడా ఉండదని, అలాంటిచోట అంత డబ్బు ఎవరైనా దాస్తారా అన్నది ఆయన ప్రశ్న. కానీ, సామాన్యుల్లో తలెత్తుతున్న ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. ఆయ నొక్కరే కాదు... బాధ్యతాయుత స్థానాల్లోవున్న చాలామంది సంజాయిషీ ఇవ్వకతప్పని ప్రశ్నలవి.
ఈ నెల 14 అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగితే 21వ తేదీన మీడియా బయటపెట్టేవరకూ అధికారికంగా ఎందుకు వెల్లడించలేదు? న్యాయవ్యవస్థ, పోలీస్, అగ్నిమాపక విభాగాలు మౌనంగా ఎందుకు ఉండిపోయాయి? న్యాయమూర్తిపై అంతర్గత విచారణ నిర్వహిస్తున్నామని ఈ ఉదంతం వెల్లడైన వెంటనే సుప్రీంకోర్టు తెలిపింది. కానీ ఆయన విధులకు దూరంగా వుంటారని ఆ మర్నాడు ప్రకటించింది.
బదిలీ చేశామని తాజాగా చెబుతోంది. మంచిదే. కానీ ఘటన తర్వాత వారంపాటు ఆయన విధులు ఎలా నిర్వర్తించగలిగారు? స్టోర్‌రూమ్‌కు తాళం లేదని జస్టిస్ వర్మ చెబుతున్నారు. ఘటన సంగతి తెలిశాక తానిచ్చిన ఆదేశాలతో అక్కడికెళ్లిన హైకోర్టు రిజిస్ట్రార్ సైతం ఆ మాటే అన్నారని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ అంటున్నారు.
మరి తాళంవున్న గదిలోనే మంటలు రేగాయని పోలీసులు ఎలా చెబుతున్నారు? అసలు అగ్నిమాపక విభాగం తనకున్న నిబంధనల మేరకు నిర్వహించాల్సిన పంచనామా పూర్తిచేసిందా? అక్కడ గుర్తించదగిన లేదా సగం కాలిన సరుకు గురించిన వివరాలు నమోదు చేసిందా? ఇద్దరు సాక్షులతో ఆ పంచ నామాపై సంతకం చేయించిందా? మంటలు ఆర్పిన సందర్భంలో తమకు నోట్ల కట్టలున్న సంచు లేమీ కనబడలేదని ఢిల్లీ అగ్నిమాపక విభాగం చీఫ్ అతుల్ గార్గ్ శనివారం చెప్పారు.
అలాంటి ప్రకటనేమీ తానీయలేదని ఆ మర్నాడు ఖండించారు. మళ్లీ గొంతు సవరించుకుని కరెన్సీ నోట్లు దొరకలేదని ఇప్పుడంటున్నారు. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పెట్టిన వీడియోలో కాలిపోయిన, సగంకాలిన నోట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడా నోట్లు మాయమ య్యాయి. పోలీస్ కమిషనర్ సైతం తన ప్రెస్‌నోట్‌లో పనికిరాని స్టేషనరీ సామాను కాలిపోయిందని తెలియజేశారు తప్ప కరెన్సీ నోట్ల సంగతి ప్రస్తావించలేదు.
14వ తేదీ రాత్రి జరిగిన ప్రమాదంలో కాలిబూడిదైన సామానంతా ఆ మర్నాడు ఉదయం అక్కడి నుంచి తొలగించారు. ఈ పనంతా చేసిందెవరన్న ప్రశ్నకు సమాధానం లేదు. న్యాయమూర్తితోపాటు అగ్నిమాపక విభాగం, పోలీసులు కరెన్సీ లేదని చెబుతుండగా, ఆ నివాసానికి సమీపంలోనే పారిశుద్ధ్య సిబ్బందికి ఒకటి రెండు కాలిన నోట్లు కంటబడ్డాయి. అంటే... ఇందులో నిగూఢంగా ఏదో జరుగుతున్నట్టే కదా!
ఈ ఉదంతంలో పారదర్శకంగా వ్యవహరించటానికి సర్వోన్నత న్యాయస్థానం ప్రయత్నించటం అసాధారణమైంది, అభినందించదగ్గది కూడా. మంటల్లో బుగ్గి అయిన కరెన్సీ నోట్ల వీడియోనూ, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ప్రాథమిక నివేదికనూ తన వెబ్ సైట్‌లో ఉంచింది. గతంలో న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భాలున్నా ఎన్నడూ ఇలా జరగ లేదు.
అంతేగాక పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్ నాగూ, హిమా చల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంథావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామ న్‌లతో ఈ వ్యవహారంపై విచారణకు సుప్రీంకోర్టు ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది. అయితే అంతమాత్రాన అంతా సక్రమంగా సాగుతోందని భావించనక్కరలేదు. కాలిబుగ్గయిన కరెన్సీ నోట్ల సంచులు మాయమవటం, ఎవరూ నోట్ల సంగతి ధ్రువీకరించకపోవటం సందేహాలకు తావిస్తోంది.
రాజ్యానికి సంబంధించిన మూడు ప్రధాన అంగాల్లో ఒక్క న్యాయవ్యవస్థకు మాత్రమే ఆ మూడింటి పరిధులనూ నిర్ణయించగల గొప్ప అధికారాన్ని రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఆ బరువు బాధ్యతలకు తగ్గట్టుగా న్యాయవ్యవస్థ జవాబుదారీతనంతో ఉంటున్నదా? గత అనుభవాలు గమనిస్తే లేదన్న సమాధానమే వస్తుంది. కొలీజియం వ్యవస్థను మార్చాలని నిశ్చయించుకుని ఎన్డీయే సర్కారు బిల్లు తెచ్చినప్పుడు పార్లమెంటులో అనేకులు న్యాయవ్యవస్థ తీరుతెన్నులపై తీవ్ర విమర్శలు చేశారు.
ఒకరిద్దరు న్యాయమూర్తులపై అభిశంసన వరకూ వెళ్లింది. కానీ విధాన సంబంధమైన సంక్లిష్టత వల్ల అవి వీగిపోయాయి. కొందరు రాజీనామా చేశారు. మరికొందరిపై చేసిన దర్యాప్తు అతీగతీ లేదు. న్యాయాన్యాయాలను విశ్లేషించి తీర్పులివ్వాల్సిన స్థానంలో ఉన్నందువల్ల న్యాయమూర్తులకు పటిష్ఠమైన రక్షణ కవచం ఉండాల్సిందే. దురుద్దేశంతో, కుయుక్తులతో వారిపై నీలాపనిందలు వేసే ధోరణులను అడ్డుకోవాల్సిందే. కానీ అది అవినీతి మకిలి అంటినవారికి ఆలంబన కారాదు.
ఈ రెండింటి మధ్యా సమతౌల్యం సాధించటానికి ఇంతవరకూ ఎలాంటి ప్రయ త్నమూ జరగకపోవటమే సమస్యకు మూలం. ఇప్పుడున్న కొలీజియం బదులు మరొకటి వస్తే అంతా మారిపోతుందనుకోవటానికి లేదు. స్వయంప్రక్షాళనకు నడుంబిగించి జవాబుదారీతనం పెంపొందించే పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనంతవరకూ ఈ పరిస్థితి మారదు.
Comments
Please login to add a commentAdd a comment