
సందర్భం
తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా ఒక న్యాయమూర్తి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు మొత్తం న్యాయవ్యవస్థను కుదిపేస్తున్నవి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. న్యాయమూర్తి ఇంటికి పరుగున వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి దగ్ధమవుతున్నవి భిన్నంగా కనిపించాయి.
తమ బాధ్యతగా మంటలు ఆపి పై అధికారులకు ఎటువంటి సమాచారం ఇచ్చారో తెలియదు! కానీ మూడు రోజుల తర్వాత గానీ మీడియాలో ఈ వార్త రాలేదు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉపాధ్యాయ దగ్గరకు చేరిన వీడియోలు సుప్రీంకోర్టు వెబ్ సైట్లో అప్లోడ్ కాకపోయి వుంటే కరెన్సీ తగలబడటం అనేది బయటకు వచ్చేది కాదు. తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా... జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యలు ప్రకటించారు. అయితే ఆ చర్యలే ఇప్పుడు ప్రశ్నలు ఎదుర్కొంటున్నాయి.
న్యాయమూర్తులకు భిన్న న్యాయమా?
ఒక సాదాసీదా ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో లక్ష కరెన్సీ దొరికితే ఆ వివరాలను మీడియాకి ఇచ్చి, ఆ ఉద్యోగి ఫొటోలు విడుదల చేసే పోలీసులు జస్టిస్ యశ్వంత్ వర్మ పట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహ రించారు? దాదాపు 15 కోట్ల విలువ ఉన్న కరెన్సీ ఒక న్యాయమూర్తి ఇంట్లో లభిస్తే న్యాయవ్యవస్థ తీసుకున్న చర్య ఆ న్యాయమూర్తిని మరో హైకోర్టుకు బదిలీ చేయడమా? ఒక కేసులో విచారణ సక్రమంగా జరగదని న్యాయస్థానాలు భావించినప్పుడు నిష్పక్ష విచారణకు సీబీఐకి కేసును బదిలీ చేస్తాయి కదా. మరి ఆ కరెన్సీ విషయం నిగ్గు తేల్చమని సీబీఐని ఎందుకు ఆదేశించలేదు?
కరెన్సీతో కూడిన కేసు కాబట్టి ఈడీను ఆ కేసు తీసుకోమని ఎందుకు అడగలేదు? స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో దర్యాప్తు చేస్తే గాని నిజాలు బయటకు రావని పలు సందర్భాలలో వ్యాఖ్యానించిన న్యాయవ్యవస్థ ఈ విషయంలో అంతర్గత విచారణకు ఆదేశించడం ఏమిటి? ఒక న్యాయమూర్తి మీద ఆరోపణలు వస్తే మరో ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ వేయడం సబబా? ఆ న్యాయమూర్తి మీడియా ముందుకు వచ్చి ‘ఆ కరెన్సీ నోట్లు నావి కావు, అక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు’ అనీ నోట్ల కట్టలను చూపుతుంటే ఆయన మీద ఆంక్ష విధించలేదు.
కేసు గురించి బహిరంగంగా మాట్లాడటానికి వీలు లేదనే నిబంధన సామాన్య నిందితుడి మీద విధించడం న్యాయస్థానాలు చేస్తుంటాయి. కానీ అది ఢిల్లీ న్యాయమూర్తికి వర్తింప చేయలేదు. ‘నా పరువుకు భంగం కలిగించే కుట్రలో భాగంగా ఎవరో ఆ కరెన్సీ నోట్లు (Currency Notes) తెచ్చి నా ఇంట్లో పెట్టారు’ అని సదరు న్యాయమూర్తి అంటున్నారు.
మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఇటీవల చెన్నైలో చేసిన ప్రసంగంలో ‘న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సడలుతోంది’ అన్నారు. మరో సమావేశంలో మరో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కూడా ‘న్యాయవ్యవస్థలో అంతా సక్రమంగా ఉందనలేం’ అన్నారు. ఆ ఇద్దరు న్యాయమూర్తుల నోటి వెంట వచ్చిన మరో పదం భారతీయ న్యాయ వ్యవస్థలో ‘అంకుల్ జడ్జి సిండ్రోమ్’ నెలకొన్నది అనేది.
న్యాయవ్యవస్థలో బంధుప్రీతి పెరిగిందని, వారసులు జడ్జిలు అవుతున్నారనే విషయం ముంబైకి చెందిన న్యాయవాది మాథ్యూస్ నెడుంపర సాక్ష్యాలతో సహా ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఆయన పరిశోధనలో హైకోర్టు స్థాయిలో 50 శాతం న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు స్థాయిలో 33 శాతం న్యాయమూర్తులు గతంలో న్యాయమూర్తులుగా పనిచేసిన వారికి దగ్గర బంధువులు.
కొలీజియం ఉండటం సబబా?
న్యాయవ్యవస్థలో బంధు ప్రీతి పెరగడానికి కారణం ప్రపంచంలో మరే దేశంలో లేనటువంటి కొలీజియం వ్యవస్థ. ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో న్యాయమూర్తులు నియామకం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చేస్తాయి. మనదేశంలో కూడా రాజ్యాంగం ఆ విధానాన్ని అనుసరించింది. అయితే మధ్యలో న్యాయమూర్తులు ఆ విధానాన్ని హైజాక్ చేశారు.
కొలీజియం వ్యవస్థను స్థాపించారు. ఈ కొలీజీయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మరో నలుగురు న్యాయమూర్తులు సభ్యులు. హైకోర్టు స్థాయిలోనూ అటువంటి కొలీజియం ఉంటుంది. ఈ కొలీజియం న్యాయమూర్తుల నియామకాలను చేపడుతుంది. వారు సిఫార్సు చేసిన వారిని కేంద్ర ప్రభుత్వం నియమించాలి.
ఎన్డీయే ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ సంస్కరణ కోసం రాజ్యాంగాన్ని సవరించి ‘నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్ కమిషన్’ (ఎన్‌జేఏసీ) చట్టం చేసింది. దీని ద్వారా న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వం ద్వారా జరిగేందుకు వీలు కల్పించింది. అయితే ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసి, కొలీజియం (Collegium) ద్వారానే నియామకాల విధానం కొనసాగిస్తామన్నది. న్యాయమూర్తులు న్యాయమూర్తులను నియమించే విధానం మరెక్కడా లేదు. ఆ హక్కును ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు కోర్టు ఇస్తుందా? ప్రతి వ్యవస్థలో సీనియర్స్ తమ తర్వాతి స్థానాల వారిని నియమించడం సబబా!
న్యాయస్థానాల మీద నోరెత్తడానికి ప్రజలు భయపడే పరిస్థితి కల్పిస్తే దిక్కెవరు?
గతంలో కొలీజియం వ్యవస్థను సవాలు చేసిన న్యాయవాది మాథ్యూస్ నెడుంపర. ఆయన తన పిటీషన్‌లో వేసిన ప్రశ్నలు – ఇంతవరకు ఆ కరెన్సీని ఎందుకు భద్రపరచి, తగలబడిన వస్తువుల జాబితా తయారు చేయలేదు? ఎవరిని అరెస్టు ఎందుకు చేయలేదు? క్రిమినల్ చట్టాలను ఎందుకు అమలు చేయడం లేదు? ఈ కేసు వివరాలను ఎందుకు బయటకు రానివ్వడం లేదు? ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్కడ్ ఎన్‌జేఏసీ చట్టాన్ని తిరిగి తీసుకురావాల్సిన అవసరం గురించి ప్రతిపక్ష నేతలతో చర్చించారు. ఇకముందైనా కొలీజియం వ్యవస్థలోని లోపాలను సుప్రీంకోర్టు వదులుకుంటుందా? పారదర్శకత, జవాబుదారీతనం న్యాయవ్యవస్థ ప్రదర్శిస్తుందా?
- పి. వేణుగోపాల్ రెడ్డి
ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు
pvg2020@gmail.com