
జీవితంలో బాల్యం ఆటపాటల్లో శరవేగంగా గడచిపోతుంది. శరీరంలో శక్తులన్నీ ఉడిగిపోయినప్పుడు మీదపడే వార్ధక్యం కుంటినడకన సాగుతుంది. బాల్యంలో ఊహ తెలిసే దశకు వచ్చినప్పుడు త్వరగా యువకులుగా మారిపోవాలని కోరుకోవడం సహజం. నడివయసు కూడలికి వచ్చే సరికి యవ్వనం కొద్దిరోజుల్లోనే కరిగిపోతుందనే బెంగ మనసును పీడించడం కూడా అంతే సహజం.
జీవితంలోని బాల్య వార్ధక్యాల మధ్య వచ్చే యవ్వనం ఒక కీలక దశ. అంతేకాదు, ఉత్పాదక దశ కూడా! బాల్య వార్ధక్య దశల్లో జీవనభారాన్ని మోసే శక్తి ఉండదు. ఒంట్లోని జవసత్త్వాలు ఉండే యవ్వనంలోనే జీవితాన్ని ఎంతోకొంత తీర్చిదిద్దుకోవడానికి కుదురుతుంది. జీవితంలో అందుబాటులో ఉన్న స్వేచ్ఛా సౌఖ్యాలను తనివితీరా అనుభవించడానికి వీలవుతుంది.
యవ్వనాన్ని సార్థకం చేసుకోగలిగిన మనుషులు లోకంలో తక్కువగానే ఉంటారు. చాలామంది యవ్వనాన్ని నిరర్థకంగా గడిపేసి, వార్ధక్యంలో గడచిపోయిన రోజులను తలచుకుంటూ వగచి వలపోస్తారు. ‘లడక్‌పన్ ఖేల్ మే ఖోయా/ జవానీ నీంద్‌భర్ సోయా/ బుఢాపా దేఖ్‌కర్ రోయా’ అన్నాడు హిందీ సినీకవి శైలేంద్ర.
బాల్యాన్ని ఆటపాటల్లో పోగొట్టుకుని, యవ్వనాన్ని ఒళ్లెరుగని నిద్రలో పోగొట్టుకుని, వార్ధక్యంలో వాటిని తలచుకుని రోదించే మనుషుల తీరును ఆయన మూడు ముక్కల్లో తేల్చేశాడు. ఇదే విషయాన్ని శంకరాచార్యుడు ‘బాల స్తావ త్క్రీడాసక్తః తరుణ స్తావ త్తరుణీసక్తః/ వృద్ధ స్తావ చ్చింతాసక్తః పరమే బ్రహ్మణి కో2పి న సక్తః’ అని ఏనాడో చెప్పాడు.
బాల్య వార్ధక్యాలను ఎక్కువ కాలం కొనసాగించాలని ఎవరూ కోరుకోరు గాని, యవ్వనాన్ని వీలైనంతగా పొడిగించుకోవాలని, కుదిరితే గిదిరితే జీవితాంతం నిత్యయవ్వనులుగా కొనసాగాలని కోరుకోనివారు ఉండరు. నిత్యయవ్వనం మానవమాత్రులకు అసాధ్యమని అందరికీ తెలుసు. ఇది తీరే కోరిక కాదని తెలిసినా, కోరుకుంటారు. తీరని కోరికలను కూడా కోరుకోవడమే కదా మానవ స్వభావం.
శుక్రాచార్యుడి శాపం వల్ల ముదిమి పొందిన యయాతి తన కొడుకు పురుడి ద్వారా పునఃయవ్వనం పొందాడు. సుకన్యను చేపట్టిన చ్యవనుడు అశ్వనీ దేవతల అనుగ్రహంతో పునఃయవ్వనం పొందాడు. జరా మరణాలను జయించి అమరులు కావడానికి దేవతలు అమృతం తాగారు. అమృతం కోసం దానవులతో కలసి క్షీరసాగర మథనం చేశారు.
అమృతం దానవులకు దక్కకుండా ఉండటానికి శ్రీమహావిష్ణువు జగన్మోహిని అవతారం దాల్చి, దేవతలకు అమృతం పంచిపెట్టాడు. మన పురాణాల్లో ఉన్న ఈ గాథలు అందరికీ తెలిసినవే! ఇలాంటి గాథలు ప్రాచీన గ్రీకు పురాణాల్లోనూ ఉన్నాయి. గ్రీకుల యవ్వన దేవత హీబీ దేవతలకు ‘ఆంబ్రోజా’ అనే దివ్య ఫలహారాన్ని, ‘నెక్టర్’ అనే అమృతం వంటి పానీయాన్ని పంచిపెట్టిందట! ‘ఆంబ్రోజా’, ‘నెక్టర్’ల మహిమ వల్లనే దేవతలు నిత్య యవ్వనులు కాగలిగారని గ్రీకు పురాణాల కథనం.
‘జీవితం మధుశాల యవ్వనం రసలీల/ రేపటి మాటేల? నవ్వుకో ఈవేళ’ అన్నారు వీటూరి. ‘పాడు జీవితము యవ్వనము మూడునాళ్ల ముచ్చటలోయి/ అయ్యయ్యొ నీదు పరుగులెచ్చట కోయి’ అన్నారు ఆరుద్ర. జీవితం క్షణభంగురం అని వేదాంతులు చెబుతారు. కోరికలు దుఃఖ హేతువులని, వాటిని జయించాలని ప్రవచనాలు చెబుతారు.
ఎవరు ఎన్ని చెప్పినా, జీవితాన్ని ఆస్వాదించడానికి యవ్వనం ముఖ్య సాధనమనే ఎరుక కలిగినవారే ఏ క్షణానికి ఆ క్షణమే యవ్వనోద్ధృతితో జీవితాన్ని నిండుగా ఆస్వాదిస్తారు. వెర్రి వేదాంతుల మాటలను తలకెక్కించుకునే అర్భకులు– క్షణభంగుర సిద్ధాంతం బుర్రలో బొంగరంలా గింగిరాలు తిరుగుతుంటే, యవ్వనాన్ని అనవసరంగా వృథా చేసుకుని, నిష్ప్రయోజకులుగా బతుకు చాలిస్తారు.
పునఃయవ్వనం పొందినవాళ్లు మనకు పురాణాల్లోను, కాల్పనిక సాహిత్యంలోను తప్ప నిజజీవితంలో కనిపించరు. నిత్యయవ్వనం మానవాళి సామూహిక ఆకాంక్ష. దీనిని నెరవేర్చడానికే ఆధునిక వైద్య పరిశోధకులు కూడా శక్తివంచన లేకుండా పరిశోధనలు సాగిస్తున్నారు.
వారి వైద్య పరిశోధనలు ఫలించినట్లయితే, పునఃయవ్వనం పొందడానికి జనాలు ఎగబడి మరీ పోటీలు పడతారు. పరిశోధనలు ప్రాథమిక దశలో ఉండగానే, కొందరు అపర కుబేరులు ఖర్చుకు వెనుకాడ కుండా తమ యవ్వనాన్ని పొడిగించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్న ఉదంతాలు అడపాదడపా కథనాలుగా వెలువడుతూనే ఉన్నాయి.
యవ్వనం ఉడిగి వయసుమళ్లి వార్ధక్యం ముంచుకు రావడాన్ని సహజ పరిణామంగానే చాలా కాలంగా భావిస్తూ వస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకు వార్ధక్యాన్ని వ్యాధిగా గుర్తించ లేదు గాని, వార్ధక్యం కూడా ఒక వ్యాధేనని కొందరు వైద్యపరిశోధకుల వాదన. వార్ధక్యాన్ని నివారించి, వయసును వెనక్కు మళ్లించే దిశగా వైద్య పరిశోధనలు ఇటీవలి కాలంలో ముమ్మరంగా సాగుతున్నాయి.
వయసును వెనక్కు మళ్లించడానికి అమృతం వంటిదేదీ అవసరం లేదని, అసలైన యవ్వన కీలకం మానవ దేహంలోనే ఉందని తాజాగా జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవ శరీరంలో ఒత్తిడికి లోనయ్యే కణాలకు ‘ఏపీ2ఏ1’ అనే ప్రొటీన్ సరఫరాను నిలిపివేసినట్లయితే, శరీరంలోని ప్రతి కణం పునఃయవ్వనాన్ని పొందగలుగుతుందని చెబుతున్నారు.
‘ఏపీ2ఏ1’ ప్రొటీన్‌ను నియంత్రించడానికి చేపట్టే చికిత్స పద్ధతులే పునఃయవ్వన చికిత్స పద్ధతులు కాగలవని అంటున్నారు. వారి ప్రయోగాలే గనుక ఫలిస్తే, ముందుండేది ముసళ్ల పండుగ కాదు, మానవాళికి అది యవ్వనోత్సవమే అవుతుంది.