గణాంకాలు వాస్తవ పరిస్థితికి సూచికలు. అనేక సందర్భాల్లో భవిష్యత్ దృశ్యాన్ని ముందుగా కళ్ళ ముందు నిలిపి, గాఢనిద్ర నుంచి మేల్కొలిపే అలారం మోతలు. భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందనీ, అధిక రక్తపోటు సహా జీవనశైలి వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికమవుతోందనీ తాజా దేశవ్యాప్త సర్వే వెల్లడించిన అంశాలు అలాంటివే.
లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ సర్వేలోని అనేక విషయాలు ఇటు ప్రజల్నీ, అటు ప్రభుత్వాలనూ అప్రమత్తం చేస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న మధుమేహం, స్థూలకాయం, అధిక రక్తపోటు లాంటి జీవనశైలి వ్యాధులపై తక్షణ కార్యాచరణ అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.
మధుమేహం, అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీ)పై అతి పెద్ద సర్వే ఇది. ఇందులో 2008 నుంచి 2020 మధ్యకాలంలో దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 20 ఏళ్ళు, ఆ పైబడిన వయసువాళ్ళను దాదాపు 1.13 లక్షల మందిని సర్వే చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిధులతో భారత వైద్య పరిశోధన మండలితో కలసి మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ సర్వేలో వెల్లడైన అంశాలు ఆందోళన రేపుతున్నాయి. 2017లో భారతీయుల్లో 7.5 శాతం మందికే మధుమేహం ఉండేది.
2021 నాటికి ఆ సంఖ్య 11.4 శాతానికి, మరో మాటలో 10.1 కోట్ల మందికి పెరిగింది. అలాగే 15.3 శాతం మంది, అంటే 13.6 కోట్ల మంది మధుమేహం వచ్చే ముందస్తు లక్షణాలతో జీవితం సాగిస్తున్నారు. అంటే ‘టైప్–2 డయాబెటిస్’ అన్న మాట. ఇక, దేశంలో 28.6 శాతం (25.4 కోట్ల మంది) సాధారణ స్థూలకాయంతో, 39.5 శాతం (35.1 కోట్ల మంది) ఉదర ప్రాంత స్థూలకాయంతో ఉన్నట్టు తేలింది. చెడ్డ కొవ్వు (ఎల్డీఎల్ కొలెస్ట్రాల్)తో 18.5 కోట్ల మంది అనారోగ్యం పాలవుతున్నారు. నూటికి 35.5 మందిని అధిక రక్తపోటు వేధిస్తోంది.
అసాంక్రమిక వ్యాధులు దేశంపై ఎంతటి భారం మోపుతున్నాయో కనుగొనేందుకు గాను దేశంలోని ప్రతి రాష్ట్రాన్నీ అధ్యయనంలో భాగం చేసిన తొలి విస్తృత స్థాయి అధ్యయనం ఇది. దేశంలో ఎక్కువగా మధుమేహం ఉన్న రాష్ట్రాలు – గోవా (26.4 శాతం), పుదుచ్చేరి (26.3 శాతం), కేరళ (25.5 శాతం). అలాగే, షుగర్ వ్యాధిపీడితులు తక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్‌లలో సైతం వ్యాధిపీడితుల సంఖ్య సర్రున పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం హెచ్చరిక.
ముందుగా అనుకున్నదాని కన్నా భారత జనాభాలో మధుమేహం అధికంగా ఉందని ఈ సర్వేతో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. ‘ఇది గడియారం ముల్లు ముందుకు కదులుతున్న టైమ్ బాంబ్’ అని ఈ అధ్యయన సారథి అంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచంలో ప్రతి 11 మంది వయోజనుల్లో ఒకరిని మధుమేహం పీడిస్తోందని లెక్క. షుగర్‌తో గుండె పోటు, అంధత్వం, కిడ్నీల వైఫల్యం ముప్పుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరిక సరేసరి. ఈ నేపథ్యంలో కాయకష్టం, క్రమబద్ధమైన జీవనశైలి ఉండే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, ఆధునిక జీవనశైలి నిండిన పట్టణాల్లోనే మధుమేహం ఎక్కువగా ఉందనేది ఈ అధ్యయన ఫలితం. ఇది ఓ కీలక సూచిక. మనం మార్చుకోవాల్సింది ఏమిటో చెప్పకనే చెబుతున్న కరదీపిక.
మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వగైరా వంశపారంపర్యం, ఆహారపుటలవాట్లు, జీవనశైలి ద్వారా వస్తాయనేది నిపుణుల మాట. జన్యుపరంగా కుటుంబంలోనే ఉంటే ఏమో కానీ, ఇతరులు మాత్రం తినే తిండి, బతికే తీరులో జాగ్రత్తల ద్వారా ఈ అనారోగ్యాలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఒకవేళ వచ్చినా... జీవనశైలి మార్పులతో యథాపూర్వ ఆరోగ్యాన్ని పొందవచ్చు. వైద్యులు పదేపదే చెబుతున్న సంగతే తాజా అధ్యయనం సైతం తేల్చింది. ఈ మాటను ఇకనైనా చెవికెక్కించుకోవాలి.
మారిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడు అనివార్యంగా జీవన శైలి మారింది. అది మన ఆహారపుటలవాట్లలో మార్పు తెచ్చింది. చివరకు తెలియకుండా మన ఆరోగ్యాన్ని మనమే బలిపెట్టుకొనే దశకు చేరుకున్నాం. అందుకే ఇకనైనా అనారోగ్యం తెచ్చే ఆహారపుటలవాట్లు, జీవనశైలి సహా అనేకం మనం మార్చుకోవాలి. మరోపక్క అందుకు తగ్గట్టు ప్రజల్లో చైతన్యం పెంచే బాధ్యత ప్రభుత్వాల పైనా ఉంది. అది ఈ అధ్యయనం చెబుతున్న పాఠం.
అలాగే, దేశంలో ఆరోగ్య రక్షణ రంగంలో చేయాల్సిన ప్రణాళిక, చేపట్టాల్సిన చర్యలకు ఈ తాజా సర్వే ఫలితాలు మార్గదర్శకమే. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మధుమేహ ధోరణి ఒక స్థిరీకరణ దశకు చేరుకుంటే, అనేక ఇతర రాష్ట్రాల్లో అది పెరుగుతోంది. ఫలితంగా ఆయా రాష్ట్రాల తక్షణ చర్యలకీ అధ్యయనం ఉపకరిస్తుంది.
మరోపక్క అన్నిచోట్లా, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వసతులు మరింత అందుబాటులో ఉండేలా చూడాలి. ఫాస్ట్‌ఫుడ్ మోజు, సోమరితనం వల్ల పిల్లల్లోనూ జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న వేళ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు ముఖ్యం. ఆరోగ్యకరమైన తిండి, శారీరక శ్రమ వల్ల టైప్–2 మధుమేహాన్ని నూటికి 60 కేసుల్లో తగ్గించవచ్చట.
అందుకని ప్రభుత్వాలు పౌరసరఫరా వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలు పంపిణీ చేసి, ప్రజలను ఆరోగ్యదాయక ఆహారం వైపు మళ్ళించవచ్చు. ప్రజల్ని అటువైపు ప్రోత్సహించడంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలూ చైతన్యశీల పాత్ర పోషించాలి. ఈ జీవనశైలి వ్యాధులు జాతిని నిర్వీర్యం చేసి, అభివృద్ధిని కబళించే ప్రమాదం పొంచివుంది గనక తక్షణమే తగిన విధానాల రూపకల్పన అవసరం. పరిస్థితులు చేయి దాటక ముందే నష్టనివారణ చర్యలకు నడుంకట్టడం వివేకవంతుల లక్షణం.
Lifestyle Diseases In India: మనం మారాల్సిందే!
Published Fri, Jun 16 2023 3:20 AM | Last Updated on Fri, Jun 16 2023 10:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment