Lifestyle Diseases
-
మనం మారాల్సిందే!
గణాంకాలు వాస్తవ పరిస్థితికి సూచికలు. అనేక సందర్భాల్లో భవిష్యత్ దృశ్యాన్ని ముందుగా కళ్ళ ముందు నిలిపి, గాఢనిద్ర నుంచి మేల్కొలిపే అలారం మోతలు. భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందనీ, అధిక రక్తపోటు సహా జీవనశైలి వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికమవుతోందనీ తాజా దేశవ్యాప్త సర్వే వెల్లడించిన అంశాలు అలాంటివే. లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ సర్వేలోని అనేక విషయాలు ఇటు ప్రజల్నీ, అటు ప్రభుత్వాలనూ అప్రమత్తం చేస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న మధుమేహం, స్థూలకాయం, అధిక రక్తపోటు లాంటి జీవనశైలి వ్యాధులపై తక్షణ కార్యాచరణ అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. మధుమేహం, అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీ)పై అతి పెద్ద సర్వే ఇది. ఇందులో 2008 నుంచి 2020 మధ్యకాలంలో దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 20 ఏళ్ళు, ఆ పైబడిన వయసువాళ్ళను దాదాపు 1.13 లక్షల మందిని సర్వే చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిధులతో భారత వైద్య పరిశోధన మండలితో కలసి మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ సర్వేలో వెల్లడైన అంశాలు ఆందోళన రేపుతున్నాయి. 2017లో భారతీయుల్లో 7.5 శాతం మందికే మధుమేహం ఉండేది. 2021 నాటికి ఆ సంఖ్య 11.4 శాతానికి, మరో మాటలో 10.1 కోట్ల మందికి పెరిగింది. అలాగే 15.3 శాతం మంది, అంటే 13.6 కోట్ల మంది మధుమేహం వచ్చే ముందస్తు లక్షణాలతో జీవితం సాగిస్తున్నారు. అంటే ‘టైప్–2 డయాబెటిస్’ అన్న మాట. ఇక, దేశంలో 28.6 శాతం (25.4 కోట్ల మంది) సాధారణ స్థూలకాయంతో, 39.5 శాతం (35.1 కోట్ల మంది) ఉదర ప్రాంత స్థూలకాయంతో ఉన్నట్టు తేలింది. చెడ్డ కొవ్వు (ఎల్డీఎల్ కొలెస్ట్రాల్)తో 18.5 కోట్ల మంది అనారోగ్యం పాలవుతున్నారు. నూటికి 35.5 మందిని అధిక రక్తపోటు వేధిస్తోంది. అసాంక్రమిక వ్యాధులు దేశంపై ఎంతటి భారం మోపుతున్నాయో కనుగొనేందుకు గాను దేశంలోని ప్రతి రాష్ట్రాన్నీ అధ్యయనంలో భాగం చేసిన తొలి విస్తృత స్థాయి అధ్యయనం ఇది. దేశంలో ఎక్కువగా మధుమేహం ఉన్న రాష్ట్రాలు – గోవా (26.4 శాతం), పుదుచ్చేరి (26.3 శాతం), కేరళ (25.5 శాతం). అలాగే, షుగర్ వ్యాధిపీడితులు తక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్లలో సైతం వ్యాధిపీడితుల సంఖ్య సర్రున పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం హెచ్చరిక. ముందుగా అనుకున్నదాని కన్నా భారత జనాభాలో మధుమేహం అధికంగా ఉందని ఈ సర్వేతో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. ‘ఇది గడియారం ముల్లు ముందుకు కదులుతున్న టైమ్ బాంబ్’ అని ఈ అధ్యయన సారథి అంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ప్రతి 11 మంది వయోజనుల్లో ఒకరిని మధుమేహం పీడిస్తోందని లెక్క. షుగర్‌తో గుండె పోటు, అంధత్వం, కిడ్నీల వైఫల్యం ముప్పుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరిక సరేసరి. ఈ నేపథ్యంలో కాయకష్టం, క్రమబద్ధమైన జీవనశైలి ఉండే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, ఆధునిక జీవనశైలి నిండిన పట్టణాల్లోనే మధుమేహం ఎక్కువగా ఉందనేది ఈ అధ్యయన ఫలితం. ఇది ఓ కీలక సూచిక. మనం మార్చుకోవాల్సింది ఏమిటో చెప్పకనే చెబుతున్న కరదీపిక. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వగైరా వంశపారంపర్యం, ఆహారపుటలవాట్లు, జీవనశైలి ద్వారా వస్తాయనేది నిపుణుల మాట. జన్యుపరంగా కుటుంబంలోనే ఉంటే ఏమో కానీ, ఇతరులు మాత్రం తినే తిండి, బతికే తీరులో జాగ్రత్తల ద్వారా ఈ అనారోగ్యాలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఒకవేళ వచ్చినా... జీవనశైలి మార్పులతో యథాపూర్వ ఆరోగ్యాన్ని పొందవచ్చు. వైద్యులు పదేపదే చెబుతున్న సంగతే తాజా అధ్యయనం సైతం తేల్చింది. ఈ మాటను ఇకనైనా చెవికెక్కించుకోవాలి. మారిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడు అనివార్యంగా జీవన శైలి మారింది. అది మన ఆహారపుటలవాట్లలో మార్పు తెచ్చింది. చివరకు తెలియకుండా మన ఆరోగ్యాన్ని మనమే బలిపెట్టుకొనే దశకు చేరుకున్నాం. అందుకే ఇకనైనా అనారోగ్యం తెచ్చే ఆహారపుటలవాట్లు, జీవనశైలి సహా అనేకం మనం మార్చుకోవాలి. మరోపక్క అందుకు తగ్గట్టు ప్రజల్లో చైతన్యం పెంచే బాధ్యత ప్రభుత్వాల పైనా ఉంది. అది ఈ అధ్యయనం చెబుతున్న పాఠం. అలాగే, దేశంలో ఆరోగ్య రక్షణ రంగంలో చేయాల్సిన ప్రణాళిక, చేపట్టాల్సిన చర్యలకు ఈ తాజా సర్వే ఫలితాలు మార్గదర్శకమే. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మధుమేహ ధోరణి ఒక స్థిరీకరణ దశకు చేరుకుంటే, అనేక ఇతర రాష్ట్రాల్లో అది పెరుగుతోంది. ఫలితంగా ఆయా రాష్ట్రాల తక్షణ చర్యలకీ అధ్యయనం ఉపకరిస్తుంది. మరోపక్క అన్నిచోట్లా, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వసతులు మరింత అందుబాటులో ఉండేలా చూడాలి. ఫాస్ట్‌ఫుడ్ మోజు, సోమరితనం వల్ల పిల్లల్లోనూ జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న వేళ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు ముఖ్యం. ఆరోగ్యకరమైన తిండి, శారీరక శ్రమ వల్ల టైప్–2 మధుమేహాన్ని నూటికి 60 కేసుల్లో తగ్గించవచ్చట. అందుకని ప్రభుత్వాలు పౌరసరఫరా వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలు పంపిణీ చేసి, ప్రజలను ఆరోగ్యదాయక ఆహారం వైపు మళ్ళించవచ్చు. ప్రజల్ని అటువైపు ప్రోత్సహించడంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలూ చైతన్యశీల పాత్ర పోషించాలి. ఈ జీవనశైలి వ్యాధులు జాతిని నిర్వీర్యం చేసి, అభివృద్ధిని కబళించే ప్రమాదం పొంచివుంది గనక తక్షణమే తగిన విధానాల రూపకల్పన అవసరం. పరిస్థితులు చేయి దాటక ముందే నష్టనివారణ చర్యలకు నడుంకట్టడం వివేకవంతుల లక్షణం. -
AP: ఫ్యామిలీ డాక్టర్.. సరికొత్త ‘జీవన శైలి’
సాక్షి, అమరావతి: దేశంలో 66 శాతం మరణాలకు జీవనశైలి జబ్బులే ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. 2019 గణాంకాలే ఇందుకు నిదర్శనం. బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణ అవసరం. తరచూ పరీక్షలతోపాటు జబ్బు తీరు ఆధారంగా మందుల డోసు మారుస్తుండాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా బాధితులకు మెరుగైన వైద్యం అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ట్రయల్ రన్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. పోటెత్తుతున్న బీపీ రాష్ట్రంలో మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, ఇతర జీవనశైలి జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించేందుకు 30 ఏళ్లు దాటిన వారందరికీ వైద్య ఆరోగ్య శాఖ స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. 2,09,65,740 మందికి ఇప్పటివరకు పరీక్షలు చేశారు. వీరిలో 14.87 లక్షల మందికి రక్తపోటు ఉన్నట్లు నిర్ధారణ కాగా 33.84 లక్షల మంది హైరిస్క్ గ్రూప్‌లో ఉన్నట్లు తేలింది. ఇక 11.17 లక్షల మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించగా మరో 36 లక్షల మంది డయాబెటిస్ హైరిస్క్ గ్రూప్‌లో ఉన్నారు. ఫ్యామిలీ డాక్టర్ యాప్‌లో డేటా మధుమేహం, రక్తపోటు ఉన్నట్లు నిర్ధారించిన వారి వివరాలను ఫ్యామిలీ డాక్టర్ యాప్‌తో అనుసంధానించి వైద్యులు గ్రామాలకు వెళ్లినప్పుడు బాధితుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 4,33,157 మంది రక్తపోటు బాధితులు ఫ్యామిలీ డాక్టర్ క్లినిక్‌కు హాజరు కాగా 90 శాతం మందికిపైగా వ్యక్తుల్లో సమస్య అదుపులో ఉన్నట్లు తేలింది. 3.23 లక్షల మంది మధుమేహం బాధితులు క్లినిక్‌లకు హాజరు కాగా 78 శాతం మందిలో సమస్య అదుపులోకి వచ్చింది. క్యాన్సర్ రోగులకు సాంత్వన క్యాన్సర్ బాధితులకు ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా పలు రకాల వైద్య సేవలు గ్రామాల్లోనే లభిస్తున్నాయి. పీహెచ్సీ వైద్యులు గ్రామాలకు వెళ్లినప్పుడు ఆయా చోట్ల క్యాన్సర్ రోగుల ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ నోటి క్యాన్సర్ బాధితులు 2,959 మంది, ఛాతీ క్యాన్సర్ బాధితులు 757 మంది, గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 3,332 మంది గ్రామాల్లోనే వైద్య సేవలు అందుకోవడం ఊరట కలిగిస్తోంది. వ్యయ ప్రయాసలు తొలిగాయి నాకు బీపీ ఉంది. గతంలో వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మా ఊరిలోనే వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఏర్పాటైంది. ఇక్కడే బీపీ చెకప్ చేసి మందులు కూడా ఇస్తున్నారు. డాక్టర్ మా గ్రామానికే వస్తుండటంతో వ్యయ ప్రయాసలు తొలిగాయి. – ఏపూరి భాగ్యమ్మ, కామేపల్లి, పిడుగురాళ్ల మండలం, పల్నాడు జిల్లా -
అందరికీ ఆరోగ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: మారుతున్న ఆహార అలవాట్లతో 40 ఏళ్లు నిండకుండానే జీవనశైలి జబ్బులు చుట్టుముడుతున్నాయి. వ్యాధి ముదిరిపోయే వరకు గుర్తించకపోవడంతో ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ముప్పుగా పరిణమించిన అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీ) కట్టడిలో భాగంగా సార్వత్రిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మధుమేహం, రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) సహా పలు రకాల స్క్రీనింగ్ పరీక్షలను ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి చేపడుతున్నారు. సగానికిపైగా స్క్రీనింగ్ పూర్తి రాష్ట్రవ్యాప్తంగా 4,66,67,774 మందికి స్క్రీనింగ్ చేపట్టాల్సి ఉండగా ఇప్పటికే 2,67,69,033 మందికి పూర్తయ్యింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 74.48% అనకాపల్లిలో 67.24%, నంద్యాలలో 66.72 శాతం జనాభాకు స్క్రీనింగ్ చేశారు. బీపీలో కోనసీమ టాప్ ఇప్పటివరకూ నిర్వహించిన సర్వేలో 11,92,104 మంది రక్తపోటుతో బాధ పడుతున్నట్టు గుర్తించారు. 8,93,904 మందికి మధుమేహం ఉన్నట్టు తేలింది. కోనసీమ జిల్లాలో అత్యధికంగా 99,376 మంది బీపీ బాధితులున్నారు. పశ్చిమ గోదావరిలో 81,072, ఏలూరులో 77,048, కాకినాడలో 75,640 మందికి హైపర్‌టెన్షన్ ఉన్నట్టు వెల్లడైంది. మధుమేహం బా«ధితులు అత్యధికంగా గుంటూరు జిల్లాలో 65,772 మంది ఉన్నారు. కోనసీమలో 63,012, కృష్ణాలో 61,935 మంది షుగర్‌తో బాధపడుతున్నారు. స్క్రీనింగ్ వివరాలతో ఐడీలు ఎన్సీడీ సర్వేలో గుర్తించిన అసాంక్రమిక వ్యా«ధుల బాధితులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వీరి కోసం పీహెచ్‌సీల్లో ఎన్సీడీ క్లినిక్‌లను సైతం వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. ఎన్సీడీ స్క్రీనింగ్‌తో పాటు ప్రజలకు డిజిటల్ ఆరోగ్య ఐడీని ఆరోగ్య కార్యకర్తలు సిద్ధం చేస్తున్నారు. స్క్రీనింగ్‌లో వెల్లడైన ఆరోగ్య వివరాలను ఐడీ ద్వారా ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. చికిత్స కోసం ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ నమోదు చేయగానే సంబంధిత వ్యక్తి ఆరోగ్య చరిత్ర అంతా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఆరోగ్య చరిత్రను పరిగణలోకి తీసుకుని వైద్యులు వేగంగా సరైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టారు. -
Foods For Bone Health: అరటి, పాలకూర, డ్రై ఫ్రూట్స్, చేపలు, బొప్పాయి.. ఇవి తింటే..
ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్, ఎముకలు, కండరాల సంబంధిత సమస్యలు.. వృద్ధులకు మాత్రమేకాకుండా అన్ని వయసుల వాళ్లు ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే తక్షణం కాల్షియం తీసుకోవడం ప్రధమ సలహా. అయితే, ఎముకల ఆరోగ్యం మెరుగుపరచడానికి కేవలం కాల్షియం మాత్రమే సరిపోదు. ప్రొటీన్లు, విటమిన్ ‘డి’లు కూడా బలమైన ఎముకల నిర్మాణానికి తోడ్పడతాయి. ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ అంజు సూద్ ఎముకలకు పుష్టిని చేకూర్చే ఆహారాలను సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. అరటి పండు జీర్ణ ప్రక్రియలో అరటి పండు పాత్ర ఎంతో కీలకం. దీనిలో మాగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకలు, దంతాల నిర్మాణంలో విటమిన్లు, ఇతర మినరల్స్ చాలా ముఖ్యం. ప్రతి రోజూ ఒక అరటి పండు తినడం మూలంగా ఎముకలకు అవసరమైన బలం చేకూర్చడమేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. పాలకూర కాల్షియం అధికంగా ఉండే ఆకు పచ్చ కూరలు తినడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా, పుష్టిగా తయారవుతాయి. కప్పు ఉడికించిన పాలకూరలో ప్రతిరోజూ శరీరానికి అవసరమయ్యే 25 శాతం వరకు కాల్షియం అందుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. ఫైబర్ అధికంగా ఉండే పాలకూరలో విటమిన్ ‘ఎ’, ఐరన్ స్థాయిలు కూడా నిండుగానే ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ వీటిలో కాల్షియంతోపాటు, మాగ్నిషియం, పొటాషియం కూడా ఎముకల ఆరోగ్యానికి అవసరమే. ఎముకలు కాల్షియంను పీల్చుకోవడానికి, నిల్వ ఉండటానికి మాగ్నిషియం ఎంతో సహాయపడుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. మీ శరీరంలోని మొత్తం పొటాషియంలో కేవలం దంతాలు, ఎముకలు 85% ఉపయోగించుకుంటాయని వెల్లడించింది. పాల ఉత్పత్తులు ఎముకల ఆరోగ్యం ప్రస్థావన వచ్చినప్పుడు ఖచ్చితంగా పాలు, పెరుగు, వెన్నవంటి పాల ఉత్పత్తుల ప్రాముఖ్యం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం కప్పు పాలు, పెరుగు రోజూ తీసుకుంటే సరిపడినంత కాల్షియం అందుతుందని పేర్కొంది. ఆరెంజ్ పండ్లు తాజా ఆరెంజ్ జ్యూస్ చాలా మంది ఇష్టంగా తాగుతారు. దీనిలో పోషకాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. దీనిలోని కాల్షియం, విటమిన్ ‘డి’ ఎముకలకు బలం చేకూర్చడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. క్రమంతప్పకుండా ఆరెంజ్ పండ్లు తింటే.. ముఖ్యంగా ఆస్టియోపొరాసిస్ అనే ఎముకల వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. బొప్పాయి దీనిలో కూడా కాల్షియం స్థాయిలు అధికంగానే ఉంటాయి. 100 గ్రాముల బొప్పాయి ముక్కలు తింటే 20 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుందని నిపుణులు చెబుతున్నారు. చేపలు చేపల్లో ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎముకల పుష్టికి ఎంతో ఉపయోగపడతాయి. కొవ్వు అధికంగా ఉండే చేపలు ఫ్రై, కర్రీ, గ్రిల్.. ఏవిధంగా తీసుకున్నా పోషకాలు అందుతాయి. సాధారణంగా 35 ఏళ్ల వరకు మాత్రమే ఎముకల అభివృద్ధి జరుగుతుంది. ఆ తర్వాత ఎముకలు అరగడం లేదా క్షీణించడం మొదలవుతుంది. అందువల్ల ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరచుకుని, పోషకాహారాన్ని క్రమంతప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: ఎంత క్యూట్‌గా రిలాక్స్ అవుతుందో .. నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది! -
జీవనశైలి వ్యాధులే టాప్ కిల్లర్స్
సాక్షి,న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా టీబీ, డయేరియా వంటి వ్యాధుల కన్నా గుండె, శ్వాస సంబంధిత వ్యాధులతోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. అత్యంత వెనుకబడిన రాష్ర్టాల్లోనూ జీవనశైలి వ్యాధులు విస్తృతమయ్యాయని పేర్కొంది. 1990ల వరకూ అంటు,సీజనల్ వ్యాధుల కారణంగా అధిక మరణాలు నెలకొంటే తాజాగా జీవనశైలి వ్యాధులే జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయని స్టేట్ లెవెల్ డిసీజ్ బర్డెన్ ఇనీషియేటివ్ పేరిట వెల్లడైన నివేదిక పేర్కొంది. దేశం అభివృద్ధి బాట పట్టినా పౌష్టికాహార లేమి ఇప్పటికీ అనారోగ్య కారణాల్లో ముందువరసలో ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక 2016లో చోటుచేసుకున్న మరణాల్లో అంటు సీజనల్ వ్యాధుల కారణంగా మృత్యువాత పడిన వారి సంఖ్య 26 శాతం కాగా, జీవనశైలి వ్యాధుల మరణాలు 60 శాతం పైగా ఉన్నాయి.గాయాలబారిన పడి మరణించిన వారి సంఖ్య 11 శాతంగా నమోదైంది. ఈశాన్య రాష్ట్రాల వారిలో జీవనశైలి వ్యాధులు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక దేశవ్యాప్త మరణాల్లో 28 శాతం గుండె సంబంధిత వ్యాధులు కారణం కాగా, డయేరియా, ఇన్ఫెక్షన్లతో 15.5 శాతం, శ్వాసకోశ సమస్యలతో 11 శాతం, గాయాలతో 10.7 శాతం, క్యాన్సర్‌తో 8.3 శాతం మృత్యువాతన పడుతున్నారు. పక్షవాతం, మధుమేహం, కిడ్నీ వ్యాధులతో కూడా పెద్దసంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయని నివేదిక తెలిపింది. భారతీయ వైద్య పరిశోధన మండలి, భారత ప్రజారోగ్య ఫౌండేషన్ సంయుక్తంగా ఈ నివేదికను వెల్లడించాయి. -
లైఫ్‌స్టైల్ డిసీజెస్ కౌన్సెలింగ్
విటమిన్-డి తగ్గితే ప్రమాదమా? నా వయసు 29 ఏళ్లు. ఇటీవల విపరీతమైన నిస్సత్తువతో బాధపడుతూ, డాక్టర్‌ను కలిసి వైద్యపరీక్షలు చేయించాను. విటమిన్-డి పాళ్లు చాలా తక్కువగా ఉన్నాయని, మందులు ఇచ్చారు. విటమిన్-డి తగ్గడం వల్ల ఏదైనా ప్రమాదమా? - విజయ్‌కుమార్, ఇబ్రహీంపట్నం మన ఎముకలకు అవసరమైన క్యాల్షియమ్‌ను పీల్చుకునేందుకు విటమిన్-డి దోహదపడుతుంది. విటమిన్-డి తగ్గడం వల్ల ఎముకలు మెత్తబడిపోతాయి. పిల్లల్లో రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. పెద్దల్లో ఆస్టియోమలేసియా అనే వ్యాధికి విటమిన్-డి లోపం కారణమవుతుంది. ఇవేగాక విటమిన్-డితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తాజా పరిశోధనల వల్ల విటమిన్-డి లోపం వల్ల రొమ్ముక్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, గుండెజబ్బులు, డిప్రెషన్, బరువు పెరగడం (స్థూలకాయం) వంటి అనేక సమస్యలు వస్తాయని తేలింది. విటమిన్-డి పాళ్లు తగినంత ఉన్నవారిలో పై వ్యాధులు అంత తేలిగ్గా రావని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. విటమిన్-డి వల్ల మన ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. అంతేకాదు... ఇది మనలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. మన కండరాల వ్యవస్థ, నరాల పటిష్టత, కండరాలకూ, నరాలకూ మంచి సమన్వయం... ఇవన్నీ విటమిన్-డి వల్ల సాధ్యపడతాయి. మనలోని కణాలు తమ జీవక్రియలను సక్రమంగా నెరవేర్చడానికి విటమిన్-డి దోహదపడుతుందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. విటమిన్-డి ని పొందడం ఎలా? ఇంతటి విలువైన విటమిన్-డిని పొందడం చాలా తేలిక. ఉదయం వేళలోని లేత ఎండలో కనీసం 30 నిమిషాల పాటు మన ముఖం, కాళ్లు, చేతులు, వీపు వంటి శరీర భాగాలు ఆ లేత ఎండకు ఎక్స్పోజ్ అయ్యేలా తిరగడం వల్ల మనకు విటమిన్-డి లభిస్తుంది. అయితే ఈ సమయంలో సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోకూడదు. వారంలో కనీసం రెండుసార్లయినా ఇలా తిరగడం మంచిది. ఆహార పదార్థాల ద్వారా... కొన్ని రకాల ఆహారపదార్థాలలోనూ విటమిన్-డి పుష్కలంగా ఉందని రుజువైంది. అవి... సాల్మన్ చేపలు మాకరెల్ చేపలు ట్యూనా చేపలు పుట్టగొడుగులు (అయితే వీటిలో విటమిన్-డి పాళ్లను పెంచడానికి అల్ట్రావయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ అయ్యేలా చేయాలి) పాలు లేదా పెరుగు గుడ్డులోని తెల్ల, పచ్చ సొనలు ఛీజ్ వంటి ఆహారాల్లోనూ ఇది ఎక్కువ. మీలో విటమిన్-డి పాళ్లు తగ్గాయంటున్నారు కాబట్టి ఇప్పుడు మార్కెట్లోనూ విటమిన్-డి టాబ్లెట్లు దొరుకుతున్నాయి. మీ డాక్టర్ సలహాతో వాటిని వాడండి. స్వాభావికంగా విటమిన్-డి పాళ్లను పెంచుకునేందుకు ఉదయపు లేత ఎండలో నడుస్తూ, పైన పేర్కొన్న ఆహారం తీసుకోండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి, కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్