WHO Reports Warns Lifestyle Diseases Main Causes 66% Deaths Country - Sakshi
Sakshi News home page

AP: ఫ్యామిలీ డాక్టర్‌.. సరికొత్త ‘జీవన శైలి’

Jan 10 2023 4:09 AM | Updated on Jan 10 2023 1:17 PM

WHO Reports Warn Lifestyle Diseases Main Cause 66 Percent Deaths Country - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో 66 శాతం మరణాలకు జీవనశైలి జబ్బులే ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. 2019 గణాంకాలే ఇందుకు నిదర్శనం. బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణ అవసరం. తరచూ పరీక్షలతోపాటు జబ్బు తీరు ఆధారంగా మందుల డోసు మారుస్తుండాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే గుండె­పోటు, బ్రెయిన్‌ స్ట్రోక్, కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.

ఈ నేపథ్యంలో మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా బాధితులకు మెరుగైన వైద్యం అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానానికి సీఎం జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ట్రయల్‌ రన్‌ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది.   

పోటెత్తుతున్న బీపీ
రాష్ట్రంలో మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, ఇతర జీవనశైలి జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించేందుకు 30 ఏళ్లు దాటిన వారందరికీ వైద్య ఆరోగ్య శాఖ స్క్రీనింగ్‌ నిర్వహిస్తోంది. 2,09,65,740 మందికి ఇప్పటివరకు పరీక్షలు చేశారు. వీరిలో 14.87 లక్షల మందికి రక్తపోటు ఉన్నట్లు నిర్ధారణ కాగా 33.84 లక్షల మంది హైరిస్క్‌ గ్రూప్‌లో ఉన్నట్లు తేలింది. ఇక 11.17 లక్షల మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించగా మరో 36 లక్షల మంది డయాబెటిస్‌ హైరిస్క్‌ గ్రూప్‌లో ఉన్నారు.

ఫ్యామిలీ డాక్టర్‌ యాప్‌లో డేటా
మధుమేహం, రక్తపోటు ఉన్నట్లు నిర్ధారించిన వారి వివరాలను ఫ్యామిలీ డాక్టర్‌ యాప్‌తో అనుసంధానించి వైద్యులు గ్రామాలకు వెళ్లినప్పుడు బాధితుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌ 21 నుంచి 4,33,157 మంది రక్తపోటు బాధితులు ఫ్యామిలీ డాక్టర్‌ క్లినిక్‌కు హాజరు కాగా 90 శాతం మందికిపైగా వ్యక్తుల్లో సమస్య అదుపులో ఉన్నట్లు తేలింది. 3.23 లక్షల మంది మధుమేహం బాధితులు క్లినిక్‌లకు హాజరు కాగా 78 శాతం మందిలో సమస్య అదుపులోకి వచ్చింది.

క్యాన్సర్‌ రోగులకు సాంత్వన
క్యాన్సర్‌ బాధితులకు ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ద్వారా పలు రకాల వైద్య సేవలు గ్రామాల్లోనే లభిస్తున్నాయి. పీహెచ్‌సీ వైద్యులు గ్రామాలకు వెళ్లినప్పుడు ఆయా చోట్ల క్యాన్సర్‌ రోగుల ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ నోటి క్యాన్సర్‌ బాధితులు 2,959 మంది, ఛాతీ క్యాన్సర్‌ బాధితులు 757 మంది, గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 3,332 మంది గ్రామాల్లోనే వైద్య సేవలు అందుకోవడం ఊరట కలిగిస్తోంది. 

వ్యయ ప్రయాసలు తొలిగాయి
నాకు బీపీ ఉంది. గతంలో వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మా ఊరిలోనే వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ ఏర్పాటైంది. ఇక్కడే బీపీ చెకప్‌ చేసి మందులు కూడా ఇస్తున్నారు. డాక్టర్‌ మా గ్రామానికే వస్తుండటంతో వ్యయ ప్రయాసలు తొలిగాయి.
– ఏపూరి భాగ్యమ్మ, కామేపల్లి, పిడుగురాళ్ల మండలం, పల్నాడు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement