విటమిన్-డి తగ్గితే ప్రమాదమా?
నా వయసు 29 ఏళ్లు. ఇటీవల విపరీతమైన నిస్సత్తువతో బాధపడుతూ, డాక్టర్‌ను కలిసి వైద్యపరీక్షలు చేయించాను. విటమిన్-డి పాళ్లు చాలా తక్కువగా ఉన్నాయని, మందులు ఇచ్చారు. విటమిన్-డి తగ్గడం వల్ల ఏదైనా ప్రమాదమా?
- విజయ్‌కుమార్, ఇబ్రహీంపట్నం
మన ఎముకలకు అవసరమైన క్యాల్షియమ్‌ను పీల్చుకునేందుకు విటమిన్-డి దోహదపడుతుంది. విటమిన్-డి తగ్గడం వల్ల ఎముకలు మెత్తబడిపోతాయి. పిల్లల్లో రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. పెద్దల్లో ఆస్టియోమలేసియా అనే వ్యాధికి విటమిన్-డి లోపం కారణమవుతుంది. ఇవేగాక విటమిన్-డితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తాజా పరిశోధనల వల్ల విటమిన్-డి లోపం వల్ల రొమ్ముక్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, గుండెజబ్బులు, డిప్రెషన్, బరువు పెరగడం (స్థూలకాయం) వంటి అనేక సమస్యలు వస్తాయని తేలింది. విటమిన్-డి పాళ్లు తగినంత ఉన్నవారిలో పై వ్యాధులు అంత తేలిగ్గా రావని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. విటమిన్-డి వల్ల మన ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. అంతేకాదు... ఇది మనలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. మన కండరాల వ్యవస్థ, నరాల పటిష్టత, కండరాలకూ, నరాలకూ మంచి సమన్వయం... ఇవన్నీ విటమిన్-డి వల్ల సాధ్యపడతాయి. మనలోని కణాలు తమ జీవక్రియలను సక్రమంగా నెరవేర్చడానికి విటమిన్-డి దోహదపడుతుందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
విటమిన్-డి ని పొందడం ఎలా?
ఇంతటి విలువైన విటమిన్-డిని పొందడం చాలా తేలిక. ఉదయం వేళలోని లేత ఎండలో కనీసం 30 నిమిషాల పాటు మన ముఖం, కాళ్లు, చేతులు, వీపు వంటి శరీర భాగాలు ఆ లేత ఎండకు ఎక్స్‌పోజ్ అయ్యేలా తిరగడం వల్ల మనకు విటమిన్-డి లభిస్తుంది. అయితే ఈ సమయంలో సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోకూడదు. వారంలో కనీసం రెండుసార్లయినా ఇలా తిరగడం మంచిది.
ఆహార పదార్థాల ద్వారా...
కొన్ని రకాల ఆహారపదార్థాలలోనూ విటమిన్-డి పుష్కలంగా ఉందని రుజువైంది. అవి... సాల్మన్ చేపలు మాకరెల్ చేపలు ట్యూనా చేపలు పుట్టగొడుగులు (అయితే వీటిలో విటమిన్-డి పాళ్లను పెంచడానికి అల్ట్రావయొలెట్ కిరణాలకు ఎక్స్‌పోజ్ అయ్యేలా చేయాలి) పాలు లేదా పెరుగు గుడ్డులోని తెల్ల, పచ్చ సొనలు ఛీజ్ వంటి ఆహారాల్లోనూ ఇది ఎక్కువ. మీలో విటమిన్-డి పాళ్లు తగ్గాయంటున్నారు కాబట్టి ఇప్పుడు మార్కెట్‌లోనూ విటమిన్-డి టాబ్లెట్లు దొరుకుతున్నాయి. మీ డాక్టర్ సలహాతో వాటిని వాడండి. స్వాభావికంగా విటమిన్-డి పాళ్లను పెంచుకునేందుకు ఉదయపు లేత ఎండలో నడుస్తూ, పైన పేర్కొన్న ఆహారం తీసుకోండి.
డాక్టర్ సుధీంద్ర ఊటూరి,
కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్
రీహ్యాబిలిటేషన్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
లైఫ్‌స్టైల్ డిసీజెస్ కౌన్సెలింగ్
Published Sun, Jul 5 2015 10:56 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM
Advertisement
Advertisement