Dr. Sudhindra uturi
-
సెంట్రల్ బ్లడ్‌ప్రషర్ అంటే...?
బ్లడ్‌ప్రషర్ కౌన్సెలింగ్ ఒకసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నాకు మామూలు బీపీ చూడడంతో పాటు ‘సెంట్రల్ బ్లడ్ ప్రెషర్’ కూడా చూశారు. ఈమాట వినడమే కొత్త! సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి? దీనికీ, మామూలుగా కొలిచే బ్లడ్ ప్రెషర్‌కూ తేడా ఏమిటి? - సుహాసిని, చెన్నై సాధారణంగా మనం బ్లడ్ ప్రెషర్‌ను బీపీ ఆపరేటస్‌తో కొలుస్తుంటాం. ఇందులో ఒక పట్టాలాంటి దాన్ని చేతికి కట్టులా కట్టి, దాన్ని గాలితో నింపి, బిగిసేలాచేసి, రక్తనాళాల్లో ప్రవహించే రక్తపు వేగాన్ని కొలుస్తాం. దీన్నే బీపీ అంటారు. రక్తపోటును గుండె దగ్గరే కొలిస్తే... ఆ విలువ సరైనది అని వైద్యనిపుణులు అభిప్రాయం. అలా నేరుగా గుండె స్పందించినప్పుడు అక్కడి రక్తనాళాల్లో రక్తపీడనాన్ని కొలుస్తారు. ఇలా నేరుగా తీసుకున్న గుండెదగ్గరి రక్తనాళాల్లోని రక్తపు పీడనాన్ని ‘సెంట్రల్ బ్లడ్ ప్రెషర్’ అంటారు. ఇటీవల ఈ విధమైన సెంట్రల్ బ్లడ్‌ప్రెషర్‌ను కొలవడానికి ఒక పెన్ వంటి సాధనాన్ని రూపొందించారు. దీని కొనను మణికట్టు (రిస్ట్) వద్ద ఉండే నాడి దగ్గర మృదువుగా ఆనించి, ఆ వచ్చిన కొలతలను కంప్యూటర్‌కు అనుసంధానిస్తారు. ఆ ‘పల్స్ వేవ్’ విలువలను కంప్యూటర్ గణించి, నేరుగా గుండెదగ్గరి రక్తనాళాల్లో రక్తపోటు ఎంత ఉందో లెక్కలు వేస్తుంది. దీని ఆధారంగా మనం గుండెదగ్గరి రక్తపోటును తెలుసుకుంటామన్నమాట. ఇలా నేరుగా గుండెదగ్గర అది స్పందించినప్పుడు రక్తం తొలుత గురైన పీడనాన్నీ అంటే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్‌నూ, సాధారణంగా చేతి దగ్గర పట్టా చుట్టి, అందులో గాలి నింపి తీసుకునే సాధారణ బ్లడ్ ప్రషర్‌నూ తెలుసుకుంటూ ఇంకా ఈ విలువలను సరిపోల్చి చూస్తున్నారు. మామూలుగా మనం చేతి దగ్గర తీసే బ్లడ్‌ప్రెషర్‌ను కొన్ని కోట్లమందిలో అనేకసార్లు గణించి సాధారణ రక్తపోటు ప్రమాణాన్ని ‘120/80’గా నిర్ణయించాం. కానీ సెంట్రల్ బ్లడ్‌ప్రెషర్‌తో తీసే విలువలకు ఇంకా నిర్ణీత ప్రమాణాలను రూపొందించలేదు. ఎందుకంటే మన రక్తపోటు క్షణక్షణానికీ మారిపోతూ ఉంటుంది. అంతేగానీ స్థిరంగా ఉండదు. కాబట్టి ఒక స్థిరమైన నార్మల్ విలువ వచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంకా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. త్వరలోనే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్‌కూ ‘ప్రమాణాలను’ రూపొందిస్తే అప్పుడు మామూలు బ్లడ్‌ప్రెషర్ స్థానాన్ని ఆధునికంగా తీసే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ విలువలు ఆక్రమించడం జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ల అంచనా. ప్రస్తుతానికి ఈ సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ కొలవడం ఇంకా అన్నిచోట్లా అందుబాటులోకి రాలేదు కాబట్టి అప్పటివరకూ సాంప్రదాయికంగా మనం కొలిచే సాధారణ రక్తపోటు విలువలనే ఇంకా తీసుకుంటున్నాం. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
లైఫ్‌స్టైల్ డిసీజెస్ కౌన్సెలింగ్
విటమిన్-డి తగ్గితే ప్రమాదమా? నా వయసు 29 ఏళ్లు. ఇటీవల విపరీతమైన నిస్సత్తువతో బాధపడుతూ, డాక్టర్‌ను కలిసి వైద్యపరీక్షలు చేయించాను. విటమిన్-డి పాళ్లు చాలా తక్కువగా ఉన్నాయని, మందులు ఇచ్చారు. విటమిన్-డి తగ్గడం వల్ల ఏదైనా ప్రమాదమా? - విజయ్‌కుమార్, ఇబ్రహీంపట్నం మన ఎముకలకు అవసరమైన క్యాల్షియమ్‌ను పీల్చుకునేందుకు విటమిన్-డి దోహదపడుతుంది. విటమిన్-డి తగ్గడం వల్ల ఎముకలు మెత్తబడిపోతాయి. పిల్లల్లో రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. పెద్దల్లో ఆస్టియోమలేసియా అనే వ్యాధికి విటమిన్-డి లోపం కారణమవుతుంది. ఇవేగాక విటమిన్-డితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తాజా పరిశోధనల వల్ల విటమిన్-డి లోపం వల్ల రొమ్ముక్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, గుండెజబ్బులు, డిప్రెషన్, బరువు పెరగడం (స్థూలకాయం) వంటి అనేక సమస్యలు వస్తాయని తేలింది. విటమిన్-డి పాళ్లు తగినంత ఉన్నవారిలో పై వ్యాధులు అంత తేలిగ్గా రావని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. విటమిన్-డి వల్ల మన ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. అంతేకాదు... ఇది మనలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. మన కండరాల వ్యవస్థ, నరాల పటిష్టత, కండరాలకూ, నరాలకూ మంచి సమన్వయం... ఇవన్నీ విటమిన్-డి వల్ల సాధ్యపడతాయి. మనలోని కణాలు తమ జీవక్రియలను సక్రమంగా నెరవేర్చడానికి విటమిన్-డి దోహదపడుతుందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. విటమిన్-డి ని పొందడం ఎలా? ఇంతటి విలువైన విటమిన్-డిని పొందడం చాలా తేలిక. ఉదయం వేళలోని లేత ఎండలో కనీసం 30 నిమిషాల పాటు మన ముఖం, కాళ్లు, చేతులు, వీపు వంటి శరీర భాగాలు ఆ లేత ఎండకు ఎక్స్పోజ్ అయ్యేలా తిరగడం వల్ల మనకు విటమిన్-డి లభిస్తుంది. అయితే ఈ సమయంలో సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోకూడదు. వారంలో కనీసం రెండుసార్లయినా ఇలా తిరగడం మంచిది. ఆహార పదార్థాల ద్వారా... కొన్ని రకాల ఆహారపదార్థాలలోనూ విటమిన్-డి పుష్కలంగా ఉందని రుజువైంది. అవి... సాల్మన్ చేపలు మాకరెల్ చేపలు ట్యూనా చేపలు పుట్టగొడుగులు (అయితే వీటిలో విటమిన్-డి పాళ్లను పెంచడానికి అల్ట్రావయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ అయ్యేలా చేయాలి) పాలు లేదా పెరుగు గుడ్డులోని తెల్ల, పచ్చ సొనలు ఛీజ్ వంటి ఆహారాల్లోనూ ఇది ఎక్కువ. మీలో విటమిన్-డి పాళ్లు తగ్గాయంటున్నారు కాబట్టి ఇప్పుడు మార్కెట్లోనూ విటమిన్-డి టాబ్లెట్లు దొరుకుతున్నాయి. మీ డాక్టర్ సలహాతో వాటిని వాడండి. స్వాభావికంగా విటమిన్-డి పాళ్లను పెంచుకునేందుకు ఉదయపు లేత ఎండలో నడుస్తూ, పైన పేర్కొన్న ఆహారం తీసుకోండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి, కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
పేరెంట్స్‌కు బీపీ... నాకూ రావచ్చా?
హైబీపీ కౌన్సెలింగ్ నా వయసు 35. మా కుటుంబంలో తల్లిదండ్రులకు హైబీపీ ఉంది. ఇది నాకు కూడా వస్తుందా? దీన్ని నివారించడానికి నేనేం చేయాలో చెప్పండి. - నాగరాజు, కూసుమంచి మీ తల్లిదండ్రులకూ, మీ రక్తసంబంధీకులకూ, మీకు చాలా దగ్గరి బంధువులకు అధిక రక్తపోటు ఉంటే మీకు కూడా వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువే. అయితే, మీ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవడం ద్వారా కుటుంబంలో హైబీపీ చరిత్ర ఉన్నప్పటికీ దీన్ని చాలావరకు నివారించుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది చాలా సులభం. అది... - ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తీసుకోవాలి. అందులో మీరు తీసుకునే సోడియమ్ పాళ్లు 1500 మి.గ్రా.కు మించకుండా చూసుకోవాలి. - మీరు శారీరక శ్రమను ఇష్టపడుతూ చేయండి. నడక వంటి వ్యాయామాలు దీనికి బాగా ఉపకరిస్తాయి. - బరువు పెరగకుండా చూసుకోండి. మీ ఎత్తుకు మీరెంత బరువుండాలో దానికి మించకుండా నియంత్రించుకుంటూ ఉండండి. - పొగాకు వాడకాన్ని పూర్తిగా మానేయండి. - ఆల్కహాల్ పూర్తిగా మానేయండి. హైబీపీ ఉన్నవారు ఎప్పుడూ కాస్త చాలా ఒత్తిడితో బాధపడుతున్నట్లుగా (నర్వస్‌గా), చెమటలు పడుతున్నట్లుగా, నిద్రపట్టకుండా ఉండే లక్షణాలతో కనిపిస్తుంటారు కదా. నాకు పైన పేర్కొన్న లక్షణాలేమీ లేవు. కానీ హైబీపీ ఉందేమోనన్న సందేహం వెంటాడుతోంది. నాకు బీపీ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? - సురేశ్, హైదరాబాద్ చాలామందికి హైబీపీ ఉన్నట్లే తెలియదు కానీ వాళ్లలో చాలామందికి ఆ వ్యాధి ఏళ్లతరబడి ఉంటుంది. అందుకే దీన్ని ‘సెలైంట్ కిల్లర్’ అంటుంటారు. మీకు లక్షణాలు కనిపించనంత మాత్రాన బీపీ లేదని నిర్ధారణ చేసుకోకండి. మీ రక్తనాళాలు పాడైపోయాక గానీ ఆ లక్షణాలు బయటకు కనిపించవు. మీరు ఒకసారి డాక్టర్‌ను కలిసి బీపీ పరీక్షింపజేసుకోండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి, కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
హై బీపీ కౌన్సెలింగ్
నా వయసు 48 ఏళ్లు. నాకు తరచూ తలనొప్పిగా ఉండటంతో పాటు ఇటీవల బాగా తలతిరుగుతున్నట్లుగా ఉంది. ఒక్కోసారి ముందుకు పడిపోతానేమో అన్నంత ఆందోళనగా ఉంటోంది. నా లక్షణాలు చూసిన కొంతమంది మిత్రులు నీకు ’హైబీపీ ఉందేమో, ఒకసారి డాక్టర్‌కు చూపించుకో’ అంటున్నారు. వారు చెబుతున్నదాన్ని బట్టి నాకు మరింత ఆందోళన పెరుగుతోంది. దాంతో బీపీ లేకపోయినా హైబీపీ ఉన్నట్లుగా చూపిస్తుందేమో అని భయంగానూ ఉంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - సుదర్శన్, వరంగల్ హైబీపీని కేవలం మీరు చెప్పిన లక్షణాలతోనే నిర్ధారణ చేయలేం. అసలు బీపీని కొలవకుండా ఆ సమస్యను నిర్ధారణ సాధ్యం కాదు. మనలో రక్తపోటు పెరగడం వల్ల ఎండ్ ఆర్గాన్స్‌లో ముఖ్యమైనదైన మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి రావచ్చు. అలాగే మన భంగిమ (పోశ్చర్)ను అకస్మాత్తుగా మార్చడం వల్ల ఒకేసారి మనలో రక్తపోటు తగ్గవచ్చు. దీన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. అలాంటి సమయాల్లోనూ మీరు చెప్పినట్లుగా ముందుకు పడిపోతారేమో లాంటి ఫీలింగ్, గిడ్డీనెస్ కలగవచ్చు. బీపీలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల మీరు చెప్పిన లక్షణాలు కనిపించినప్పటికీ, అవి బీపీ వల్లనే అని చెప్పలేం. సాధారణంగా బీపీ వల్ల ఉదయం వేళల్లో తలనొప్పి కనిపించనప్పటికీ, మరెన్నో ఆరోగ్య సమస్యలలోనూ తలనొప్పి ఒక లక్షణంగా ఉంటుంది. అలాగే మీరు చెప్పిన గిడ్డీనెస్ సమస్యకూ వర్టిగో, సింకోపీ లాంటి మరెన్నో సమస్యలు కారణం కావచ్చు. అందుకని కేవలం లక్షణాల ఆధారంగానే బీపీ నిర్ధారణ చేయడం సరికాదు. అందుకే మీరు నిర్భయంగా ఒకసారి డాక్టర్‌ను కలవండి. వారు కూడా కేవలం ఒక్క పరీక్షలోనే బీపీ నిర్ధారణ చేయరు. అనేక మార్లు, అనేక సందర్భాల్లో బీపీని కొలిచి, ఒకవేళ నిజంగానే సమస్య ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని కచ్చితంగా నిర్ధారణ చేసి, దానికి తగిన చికిత్స సూచిస్తారు. మీరు ఆందోళన పడకుండా వెంటనే డాక్టర్‌ను కలవడమే మీ సమస్యకు మేం సూచించే మంచి మార్గం. డాక్టర్ సుధీంద్ర ఊటూరి, కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
హై బీపీ కౌన్సెలింగ్
నేను గత ఐదేళ్లుగా హైబీపీతో బాధపడుతున్నాను. ఇటీవల ఒకసారి బీపీ చెక్ చేయించుకోడానికి డాక్టర్గారిని కలిస్తే ఆయన కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. నాకు లక్షణాలేమీ లేకపోయినా ఎందుకిలా చేశారు? వివరించగలరు. - శ్రీనాథ్, కరీంనగర్ దీర్ఘకాలంగా హైబీపీతో బాధపడుతున్నవారిలో కొన్నిసార్లు రక్తపోటులో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా రక్తపోటు హెచ్చుతగ్గులు ఉన్నవారిలోనూ, దీర్ఘకాలంగా హైబీపీతో బాధపడుతున్నవారిలోనూ ఎండ్ ఆర్గాన్స్ అనే కీలకమైన శరీర అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మెదడు, కాలేయం, మూత్రపిండాల వంటి వాటిని ఎండ్ ఆర్గాన్స్‌గా పరిగణించవచ్చు. ఎందుకంటే రక్తం ఇక్కడివరకు చేరి మళ్లీ వెనక్కు తిరుగుతుంది. ఇలాంటి కీలకమైన అవయవాలు హైబీపీ దుష్ర్పభావాల వల్ల దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. పైగా కిడ్నీ, కాలేయం వంటి అవయవాలు చాలావరకు దెబ్బతిన్న తర్వాత గాని వాటికి సంబంధించిన లక్షణాలేవీ బయటపడవు. అందుకే వాటిని ముందే తెలుసుకోగలిగితే రాబోయే ముప్పును సమర్థంగా నివారించవచ్చు. ఈ కారణం వల్లనే హైబీపీ ఉన్నవారిలో తరచూ కీలక అవయవాలైన కాలేయం పనితీరు పరీక్షలనూ, కిడ్నీ పనితీరును తెలుసుకునేందుకు దోహదపడే గ్లోమెరులార్ ఫిల్టరేషన్ రేట్, క్రియాటినిన్ వంటి పరీక్షలనూ చేయిస్తుంటారు డాక్టర్లు. మీరు డాక్టర్ ఇచ్చిన సలహా పాటించండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి, కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
హై బీపీ కౌన్సెలింగ్
నా వయసు 40. ఇటీవలే తల తిరుగుతుంటే డాక్టర్‌ను సంప్రదించి బీపీ చెక్ చేయించుకున్నాను. అప్పుడు నా బీపీ 140/94 ఉంది. డాక్టర్ వరసగా ఐదు రోజుల పాటు ఎక్కడైనా చెక్ చేయించుకొని ఆ విలువలతో మళ్లీ రమ్మన్నారు. ఈ ఐదు రోజులూ మాకు దగ్గర్లోని ఒక ఫార్మసీలో నర్స్ దగ్గర చెక్ చేయించుకుంటే 120/80 ఉంది. నాకు బీపీ ఉన్నట్లా లేనట్లా? - సుధీర్‌కుమార్, నల్లగొండ మీరు డాక్టర్ వద్ద చెక్ చేయించుకున్నప్పుడు వచ్చిన బీపీ ఎక్కువే ఉంది. డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు కలిగే యాంగ్జైటీవల్లనో, ఆందోళన కారణంగానో వచ్చే బీపీని ‘వైట్ కోట్ హైపర్‌టెన్షన్’ అంటారు. మీరు ఫార్మసీలో చెక్ చేయించినప్పటి విలువలు నార్మల్‌గానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. మీరు చెప్పిన కింది విలువ 94 చాలా ఎక్కువ. ఏదైనా తేడా ఉన్నప్పుడు అది ప్లస్ లేదా మైనస్ 10 ఉండవచ్చు. కానీ మీరు పేర్కొన్న కింది విలువ 94 ఉండటం అంత మంచి సూచన కాదు. బీపీని కొలిచే సమయంలో నిశితత్వం కూడా అవసరం. కాబట్టి ఈసారి మీరు రోజులోని ఏదో ఒక నిర్ణీత సమయంలో బీపీ కొలతను ఐదురోజుల పాటు తీసుకోండి. అది కూడా ఏ ఫార్మసీ దగ్గరో కాకుండా సర్టిఫైడ్ ఫిజీషియన్ దగ్గరకు వెళ్లి తీసుకోండి. ఆ విలువ నార్మల్‌గా ఉంటే మీకు బీపీ లేనట్టే. ఒకవేళ ఆ విలువలు 140/85 ఉంటే అది ప్రీ-హైపర్‌టెన్షన్ దశగా భావించి, మీ జీవనశైలిలో మార్పులతో బీపీని అదుపులో పెట్టుకోవచ్చు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి, కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
హై బీపీ కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. గతంలో బాగా ఎక్సర్సైజ్ చేసేవాణ్ణి. ఆ తర్వాత కూడా , కుదరనప్పుడు ఆపడం వంటివి చేసినా కొంతకొంత గ్యాప్స్ తర్వాత ఎక్సర్సైజు చేయడం మొదలుపెట్టేవాణ్ణి. అయితే ఇటీవల నాకు బీపీ ఉన్నట్లుగా డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్లు చేయవచ్చా? - ఆనంద్, హైదరాబాద్ మీరు మీ హైపర్‌టెన్షన్‌కు మందులు వాడుతున్నారో లేదో మీ లేఖలో రాయలేదు. హైబీపీతో బాధపడేవాళ్లు కూడా ఎక్సర్సైజ్ చేయవచ్చు. కాకపోతే కొన్ని నియమాలు పాటించాలి. మిగతావారిలా హైబీపీ ఉన్నవాళ్లు పరగడునే ఎక్సర్సైజ్ చేయకూడదు. ఏదైనా తిని, ఆ తర్వాత బీపీ మందులు వేసుకున్న తర్వాతే ఎక్సర్సైజ్లు మొదలుపెట్టాలి. అప్పుడే బీపీ విలువలు ఎక్కువ, తక్కువలు కాకుండా ఉంటాయి. ఇక హైబీపీ ఉన్నవారు ఎక్సర్సైజ్ చేసేప్పుడు తప్పనిసరిగా వార్మ్అప్ వ్యాయామాలు చేశాకే అసలు వ్యాయామాలు చేయాలి. ఆ తర్వాత క్రమంగా కూల్‌డౌన్ ఎక్సర్‌సైజ్‌లూ చేయాలి. కొంతగ్యాప్ తర్వాత మొదలుపెట్టేవారైతే నేరుగా ఒకేసారి ఎక్సర్సైజ్లు మొదలుపెట్టకూడదు. మొదటివారం 15 నిమిషాలు, రెండోవారం 30 నిమిషాలు, ఆ తర్వాతి వారం 45 నిమిషాలు ఓ మోస్తరు వేగంతో నడక వంటి వ్యాయామాలు చేయాలి. రోజుకు 45 నిమిషాల పాటు ఓ మోస్తరు వేగంతో నడవడం అనేది హైబీపీ ఉన్నవారికి ఉత్తమమైన వ్యాయామ ప్రక్రియ. ఇక బీపీ ఉన్నవారు ఉదయం వేళలలో వ్యాయామం చేయడం మంచిది. డాక్టర్ సుధీంద్ర ఊటూరి, కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటీషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్