దీర్ఘకాలంగా హైబీపీతో బాధపడుతున్నవారిలో కొన్నిసార్లు రక్తపోటులో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు ఉంటాయి.
నేను గత ఐదేళ్లుగా హైబీపీతో బాధపడుతున్నాను. ఇటీవల ఒకసారి బీపీ చెక్ చేయించుకోడానికి డాక్టర్‌గారిని కలిస్తే ఆయన కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. నాకు లక్షణాలేమీ లేకపోయినా ఎందుకిలా చేశారు? వివరించగలరు.
- శ్రీనాథ్, కరీంనగర్
దీర్ఘకాలంగా హైబీపీతో బాధపడుతున్నవారిలో కొన్నిసార్లు రక్తపోటులో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా రక్తపోటు హెచ్చుతగ్గులు ఉన్నవారిలోనూ, దీర్ఘకాలంగా హైబీపీతో బాధపడుతున్నవారిలోనూ ఎండ్ ఆర్గాన్స్ అనే కీలకమైన శరీర అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మెదడు, కాలేయం, మూత్రపిండాల వంటి వాటిని ఎండ్ ఆర్గాన్స్‌గా పరిగణించవచ్చు. ఎందుకంటే రక్తం ఇక్కడివరకు చేరి మళ్లీ వెనక్కు తిరుగుతుంది. ఇలాంటి కీలకమైన అవయవాలు హైబీపీ దుష్ర్పభావాల వల్ల దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. పైగా కిడ్నీ, కాలేయం వంటి అవయవాలు చాలావరకు దెబ్బతిన్న తర్వాత గాని వాటికి సంబంధించిన లక్షణాలేవీ బయటపడవు. అందుకే వాటిని ముందే తెలుసుకోగలిగితే రాబోయే ముప్పును సమర్థంగా నివారించవచ్చు.
ఈ కారణం వల్లనే హైబీపీ ఉన్నవారిలో తరచూ కీలక అవయవాలైన కాలేయం పనితీరు పరీక్షలనూ, కిడ్నీ పనితీరును తెలుసుకునేందుకు దోహదపడే గ్లోమెరులార్ ఫిల్టరేషన్ రేట్, క్రియాటినిన్ వంటి పరీక్షలనూ చేయిస్తుంటారు డాక్టర్లు. మీరు డాక్టర్ ఇచ్చిన సలహా పాటించండి.
డాక్టర్ సుధీంద్ర ఊటూరి,
కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్