హై బీపీ కౌన్సెలింగ్
నా వయసు 48 ఏళ్లు. నాకు తరచూ తలనొప్పిగా ఉండటంతో పాటు ఇటీవల బాగా తలతిరుగుతున్నట్లుగా ఉంది. ఒక్కోసారి ముందుకు పడిపోతానేమో అన్నంత ఆందోళనగా ఉంటోంది. నా లక్షణాలు చూసిన కొంతమంది మిత్రులు నీకు ’హైబీపీ ఉందేమో, ఒకసారి డాక్టర్‌కు చూపించుకో’ అంటున్నారు. వారు చెబుతున్నదాన్ని బట్టి నాకు మరింత ఆందోళన పెరుగుతోంది. దాంతో బీపీ లేకపోయినా హైబీపీ ఉన్నట్లుగా చూపిస్తుందేమో అని భయంగానూ ఉంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు.
- సుదర్శన్, వరంగల్
హైబీపీని కేవలం మీరు చెప్పిన లక్షణాలతోనే నిర్ధారణ చేయలేం. అసలు బీపీని కొలవకుండా ఆ సమస్యను నిర్ధారణ సాధ్యం కాదు. మనలో రక్తపోటు పెరగడం వల్ల ఎండ్ ఆర్గాన్స్‌లో ముఖ్యమైనదైన మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి రావచ్చు. అలాగే మన భంగిమ (పోశ్చర్)ను అకస్మాత్తుగా మార్చడం వల్ల ఒకేసారి మనలో రక్తపోటు తగ్గవచ్చు. దీన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. అలాంటి సమయాల్లోనూ మీరు చెప్పినట్లుగా ముందుకు పడిపోతారేమో లాంటి ఫీలింగ్, గిడ్డీనెస్ కలగవచ్చు. బీపీలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల మీరు చెప్పిన లక్షణాలు కనిపించినప్పటికీ, అవి బీపీ వల్లనే అని చెప్పలేం. సాధారణంగా బీపీ వల్ల ఉదయం వేళల్లో తలనొప్పి కనిపించనప్పటికీ, మరెన్నో ఆరోగ్య సమస్యలలోనూ తలనొప్పి ఒక లక్షణంగా ఉంటుంది. అలాగే మీరు చెప్పిన గిడ్డీనెస్ సమస్యకూ వర్టిగో, సింకోపీ లాంటి మరెన్నో సమస్యలు కారణం కావచ్చు. అందుకని కేవలం లక్షణాల ఆధారంగానే బీపీ నిర్ధారణ చేయడం సరికాదు. అందుకే మీరు నిర్భయంగా ఒకసారి డాక్టర్‌ను కలవండి. వారు కూడా కేవలం ఒక్క పరీక్షలోనే బీపీ నిర్ధారణ చేయరు. అనేక మార్లు, అనేక సందర్భాల్లో బీపీని కొలిచి, ఒకవేళ నిజంగానే సమస్య ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని కచ్చితంగా నిర్ధారణ చేసి, దానికి తగిన చికిత్స సూచిస్తారు. మీరు ఆందోళన పడకుండా వెంటనే డాక్టర్‌ను కలవడమే మీ సమస్యకు మేం సూచించే మంచి మార్గం.
డాక్టర్ సుధీంద్ర ఊటూరి,
కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్