మహిళల్లో నెలసరి సమయంలో రక్తస్రావం కావడం మామూలే. కానీ రుతుస్రావాలు ఆగిపోయి... ఏడాది కాలం దాటాక మళ్లీ తిరిగి రక్తస్రావం కనిపిస్తుందంటే అదో ప్రమాద సూచన కావచ్చు. అది ఎందుకుజరుగుతోంది, దానికి కారణాలు కనుగొని... తగిన చికిత్స తప్పక చేయించుకోవాలి. మెనోపాజ్ తర్వాతకూడా రక్తస్రావం కనిపిస్తుందంటే దానికి కారణాలేమిటో, అదెంత ప్రమాదకరమో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు/ చికిత్స ఏమిటో అవగాహన కలిగించేందుకే ఈ కథనం.
ఓ మహిళకు మెనోపాజ్ తర్వాత కొద్దిపాటి రక్తస్రావం కనిపించినా దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా అయితే యాభై లేదా అరవై ఏళ్లు దాటాక ఇలా రక్తస్రావం కనిపిస్తే అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయ్యేందుకు ఆస్కారముంది. అలా రక్తస్రావం జరగడానికి కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడం తప్పనిసరి.
చేయించాల్సిన పరీక్షలివి...
మహిళల్లో మెనోపాజ్ తర్వాత రక్తస్రావం కనిపిస్తే... అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌వెజైనల్ వంటి స్కానింగ్ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలో ఎండోమెట్రియం ΄÷ర మందం గురించి తెలుస్తుంది. మెనోపాజ్ తర్వాత ఎండోమెట్రియం పొర మందం ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. పదిహేను, ఇరవై మిల్లీమీటర్లు ఉంటే అది క్యాన్సర్‌కి సూచన కావచ్చు. అప్పుడు మరికొన్ని పరీక్షలూ చేయించాలి. అల్ట్రాసౌండ్ స్కాన్‌లో గర్భాశయంలో ఉండే ఫైబ్రాయిడ్లూ, గర్భాశయ పరిమాణం, ఆకృతి, ఇతర వివరాలు తెలుస్తాయి. అండాశయాలు చిన్నగా కుంచించుకుపోయినట్లుగా కనిపించడానికి బదులు అండాశయాల్లో సిస్టులు ఉండటం, వాటి పరిమాణం పెరుగుతుండటం, కణుతుల్లాంటివి ఉండటం జరిగితే అసహజమని గుర్తించాలి.
అవసరాన్ని బట్టి ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా చేయాల్సి రావచ్చు. గర్భాశయం లోపలి ఎండోమెట్రియం పొర నమూనా సేకరించి బయాప్సీకి పంపిస్తారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న మరో పరీక్ష హిస్టెరోస్కోపీ. సమస్యను గుర్తించేందుకు మరో పరీక్ష సెలైన్ ఇన్‌ఫ్యూజన్ సోనోగ్రఫీ. అంటే, గర్భాశయంలోకి సెలైన్‌ని ఎక్కించి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తూ కారణాలు తెలుసుకుంటారు.ఇలాంటి పరీక్షలు చేసినా కూడా కారణం కనిపించక΄ోతే సిస్టోస్కోపీ, ప్రాక్టోస్కోపీ, కొలనోస్కోపీ లాంటివీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని అంచనా వేసేందుకు పాప్‌స్మియర్ చేయాల్సి రావచ్చు.
ఇతరత్రా కారణాలుండవచ్చు...
మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అనగానే అది తప్పక క్యాన్సరే అని ఆందోళన అక్కర్లేదు. ఈ పరిస్థితికి ఇతర కారణాలూ ఉండవచ్చు. ఉదాహరణకు... పెద్దవయసులో బాత్రూంకి వెళ్లినప్పుడు రక్తస్రావం కనిపించగానే వైద్యులు ముందు ప్రైవేట్ పార్ట్స్ చుట్టుపక్కల ఉండే అవయవాలను క్షుణ్ణంగా పరీక్షిస్తారు. మూత్రాశయం, మలద్వారం నుంచి కూడా రక్తస్రావం కావచ్చు. మలబద్ధకం ఉన్నప్పుడు, మలద్వారం నుంచి కూడా రక్తస్రావం అవుతుంది. ఏళ్లు గడిచేకొద్దీ యోనిలోని పొర పలుచబడటం వల్ల పొడిబారి చిట్లిపోయి, రక్తస్రావం అయ్యేందుకూ అవకాశముంది. జననేంద్రియాల్లో ఇన్‌ఫెక్షన్ ఉన్నా, గర్భాశయంలో పాలిప్స్ ఉన్నా రక్తస్రావం కనిపించవచ్చు. అలాగే జననేంద్రియ, గర్భాశయ ముఖద్వార, ఫెల్లోపియన్ ట్యూబులు, అండాశయ క్యాన్సర్లున్నా కూడా రక్తస్రావం అవుతుంది. మెనోపాజ్ దశ దాటాక హార్మోన్ చికిత్స (హెచ్‌ఆర్‌టీ) తీసుకునేవారిలో మధ్యమధ్య రక్తస్రావం కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్ కోసం వాడే టామోక్సిఫిన్ వల్ల... గర్భాశయం లోపలి పొర మళ్లీ పెరిగి కొంతమందిలో పాలిప్స్ కనిపించవచ్చు. మరికొందరిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావచ్చు.
హైబీపీ, డయాబెటిస్ వంటివి ఉంటే...?
సాధారణ ఆరోగ్యవంతులైన మహిళల కంటే అధిక బరువూ, అధిక రక్తపోటూ, మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు ఈ సమస్య బారిన పడే అవకాశాలు రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ. కాబట్టి వారు తమ బరువును అదుపులో ఉంచుకునేందుకు వ్యాయామం చేయడం తప్పనిసరి. కుటుంబంలో అనువంశికంగా, తమ ఆరోగ్య చరిత్రలో క్యాన్సర్ ఉన్న కుటుంబాల్లోని మహిళలు ముప్ఫై అయిదేళ్లు దాటినప్పటి నుంచి తప్పనిసరిగా గర్భాశయ, అండాశయ, పెద్దపేగుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ముక్యాన్సర్‌కి మందులు వాడుతున్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్‌తో ఎప్పటికప్పుడు ఎండోమెట్రియం పొర వివరాలు తెలుసుకోవాలి.
చికిత్స అవసరమయ్యేదెప్పుడంటే...
ఎండోమెట్రియం పొర నాలుగు మిల్లీమీటర్లు అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు, పాప్‌స్మియర్ ఫలితంలో ఏమీ లేదని తెలిసినప్పుడూ రక్తస్రావం కనిపించినప్పటికీ భయం అక్కర్లేదు. మూడునెలలు ఆగి మళ్లీ పరీక్ష చేయించుకుంటే చాలు.
బయాప్సీ ఫలితాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఒకవేళ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని తేలితే మళ్లీ ఎంఆర్‌ఐ స్కాన్ చేసి ఆ క్యాన్సర్ ఎండోమెట్రియం పొరకే పరిమితమైందా, లేదంటే గర్భాశయ కండరానికీ విస్తరించిందా, గర్భాశయం దాటి లింఫ్ గ్రంథులూ, కాలేయం, ఊపిరితిత్తుల వరకు చేరిందా అని వైద్యులు నిశితంగా పరీక్షిస్తారు. దాన్ని బట్టి ఎలాంటి చికిత్స / శస్త్రచికిత్స చేయాలనేది నిర్ణయిస్తారు.
అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఉంటే... దానికి అనుగుణమైన చికిత్స చేసి ఆ భాగాలను తొలగిస్తారు. తరవాత రేడియేషన్, కీమోథెరపీ లాంటివి చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. ఒకవేళ క్యాన్సర్ కాకపోతే చాలామటుకు హిస్టెరోస్కోపీలోనే పాలిప్స్, ఫైబ్రాయిడ్ల లాంటివి కనిపిస్తే... వాటిని తొలగిస్తారు. ఎండోమెట్రియం పొరమందం ఎక్కువగా పెరిగి.. రిపోర్టులో హైపర్‌ప్లేసియా అని వస్తే తీవ్రతను బట్టి ప్రొజెస్టరాన్ హార్మోను సూచిస్తారు లేదా హిస్టెరెక్టమీ చేస్తారు. కొన్నిసార్లు హార్మోన్లు లేకపోవడం వల్ల ఎండోమెట్రియం పొర పలుచబడి ‘ఎట్రోఫిక్ ఎండోమెట్రియం’ పరిస్థితి వస్తుంది. అప్పుడు అందుకు తగినట్లుగా హార్మోన్లు వాడాలని డాక్టర్లు సూచిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment