High BP
-
మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ కనిపించిందా? క్యాన్సర్ రిస్క్ ఎంత?
మహిళల్లో నెలసరి సమయంలో రక్తస్రావం కావడం మామూలే. కానీ రుతుస్రావాలు ఆగిపోయి... ఏడాది కాలం దాటాక మళ్లీ తిరిగి రక్తస్రావం కనిపిస్తుందంటే అదో ప్రమాద సూచన కావచ్చు. అది ఎందుకుజరుగుతోంది, దానికి కారణాలు కనుగొని... తగిన చికిత్స తప్పక చేయించుకోవాలి. మెనోపాజ్ తర్వాతకూడా రక్తస్రావం కనిపిస్తుందంటే దానికి కారణాలేమిటో, అదెంత ప్రమాదకరమో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు/ చికిత్స ఏమిటో అవగాహన కలిగించేందుకే ఈ కథనం.ఓ మహిళకు మెనోపాజ్ తర్వాత కొద్దిపాటి రక్తస్రావం కనిపించినా దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా అయితే యాభై లేదా అరవై ఏళ్లు దాటాక ఇలా రక్తస్రావం కనిపిస్తే అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయ్యేందుకు ఆస్కారముంది. అలా రక్తస్రావం జరగడానికి కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడం తప్పనిసరి.చేయించాల్సిన పరీక్షలివి... మహిళల్లో మెనోపాజ్ తర్వాత రక్తస్రావం కనిపిస్తే... అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌వెజైనల్ వంటి స్కానింగ్ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలో ఎండోమెట్రియం ΄÷ర మందం గురించి తెలుస్తుంది. మెనోపాజ్ తర్వాత ఎండోమెట్రియం పొర మందం ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. పదిహేను, ఇరవై మిల్లీమీటర్లు ఉంటే అది క్యాన్సర్‌కి సూచన కావచ్చు. అప్పుడు మరికొన్ని పరీక్షలూ చేయించాలి. అల్ట్రాసౌండ్ స్కాన్‌లో గర్భాశయంలో ఉండే ఫైబ్రాయిడ్లూ, గర్భాశయ పరిమాణం, ఆకృతి, ఇతర వివరాలు తెలుస్తాయి. అండాశయాలు చిన్నగా కుంచించుకుపోయినట్లుగా కనిపించడానికి బదులు అండాశయాల్లో సిస్టులు ఉండటం, వాటి పరిమాణం పెరుగుతుండటం, కణుతుల్లాంటివి ఉండటం జరిగితే అసహజమని గుర్తించాలి. అవసరాన్ని బట్టి ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా చేయాల్సి రావచ్చు. గర్భాశయం లోపలి ఎండోమెట్రియం పొర నమూనా సేకరించి బయాప్సీకి పంపిస్తారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న మరో పరీక్ష హిస్టెరోస్కోపీ. సమస్యను గుర్తించేందుకు మరో పరీక్ష సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. అంటే, గర్భాశయంలోకి సెలైన్‌ని ఎక్కించి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తూ కారణాలు తెలుసుకుంటారు.ఇలాంటి పరీక్షలు చేసినా కూడా కారణం కనిపించక΄ోతే సిస్టోస్కోపీ, ప్రాక్టోస్కోపీ, కొలనోస్కోపీ లాంటివీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని అంచనా వేసేందుకు పాప్‌స్మియర్ చేయాల్సి రావచ్చు.ఇతరత్రా కారణాలుండవచ్చు... మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అనగానే అది తప్పక క్యాన్సరే అని ఆందోళన అక్కర్లేదు. ఈ పరిస్థితికి ఇతర కారణాలూ ఉండవచ్చు. ఉదాహరణకు... పెద్దవయసులో బాత్రూంకి వెళ్లినప్పుడు రక్తస్రావం కనిపించగానే వైద్యులు ముందు ప్రైవేట్ పార్ట్స్ చుట్టుపక్కల ఉండే అవయవాలను క్షుణ్ణంగా పరీక్షిస్తారు. మూత్రాశయం, మలద్వారం నుంచి కూడా రక్తస్రావం కావచ్చు. మలబద్ధకం ఉన్నప్పుడు, మలద్వారం నుంచి కూడా రక్తస్రావం అవుతుంది. ఏళ్లు గడిచేకొద్దీ యోనిలోని పొర పలుచబడటం వల్ల పొడిబారి చిట్లిపోయి, రక్తస్రావం అయ్యేందుకూ అవకాశముంది. జననేంద్రియాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, గర్భాశయంలో పాలిప్స్ ఉన్నా రక్తస్రావం కనిపించవచ్చు. అలాగే జననేంద్రియ, గర్భాశయ ముఖద్వార, ఫెల్లోపియన్ ట్యూబులు, అండాశయ క్యాన్సర్లున్నా కూడా రక్తస్రావం అవుతుంది. మెనోపాజ్ దశ దాటాక హార్మోన్ చికిత్స (హెచ్ఆర్టీ) తీసుకునేవారిలో మధ్యమధ్య రక్తస్రావం కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్ కోసం వాడే టామోక్సిఫిన్ వల్ల... గర్భాశయం లోపలి పొర మళ్లీ పెరిగి కొంతమందిలో పాలిప్స్ కనిపించవచ్చు. మరికొందరిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావచ్చు. హైబీపీ, డయాబెటిస్ వంటివి ఉంటే...?సాధారణ ఆరోగ్యవంతులైన మహిళల కంటే అధిక బరువూ, అధిక రక్తపోటూ, మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు ఈ సమస్య బారిన పడే అవకాశాలు రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ. కాబట్టి వారు తమ బరువును అదుపులో ఉంచుకునేందుకు వ్యాయామం చేయడం తప్పనిసరి. కుటుంబంలో అనువంశికంగా, తమ ఆరోగ్య చరిత్రలో క్యాన్సర్ ఉన్న కుటుంబాల్లోని మహిళలు ముప్ఫై అయిదేళ్లు దాటినప్పటి నుంచి తప్పనిసరిగా గర్భాశయ, అండాశయ, పెద్దపేగుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ముక్యాన్సర్‌కి మందులు వాడుతున్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్‌తో ఎప్పటికప్పుడు ఎండోమెట్రియం పొర వివరాలు తెలుసుకోవాలి. చికిత్స అవసరమయ్యేదెప్పుడంటే...ఎండోమెట్రియం పొర నాలుగు మిల్లీమీటర్లు అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు, పాప్‌స్మియర్ ఫలితంలో ఏమీ లేదని తెలిసినప్పుడూ రక్తస్రావం కనిపించినప్పటికీ భయం అక్కర్లేదు. మూడునెలలు ఆగి మళ్లీ పరీక్ష చేయించుకుంటే చాలు.బయాప్సీ ఫలితాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఒకవేళ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని తేలితే మళ్లీ ఎంఆర్ఐ స్కాన్ చేసి ఆ క్యాన్సర్ ఎండోమెట్రియం పొరకే పరిమితమైందా, లేదంటే గర్భాశయ కండరానికీ విస్తరించిందా, గర్భాశయం దాటి లింఫ్ గ్రంథులూ, కాలేయం, ఊపిరితిత్తుల వరకు చేరిందా అని వైద్యులు నిశితంగా పరీక్షిస్తారు. దాన్ని బట్టి ఎలాంటి చికిత్స / శస్త్రచికిత్స చేయాలనేది నిర్ణయిస్తారు. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఉంటే... దానికి అనుగుణమైన చికిత్స చేసి ఆ భాగాలను తొలగిస్తారు. తరవాత రేడియేషన్, కీమోథెరపీ లాంటివి చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. ఒకవేళ క్యాన్సర్ కాకపోతే చాలామటుకు హిస్టెరోస్కోపీలోనే పాలిప్స్, ఫైబ్రాయిడ్ల లాంటివి కనిపిస్తే... వాటిని తొలగిస్తారు. ఎండోమెట్రియం పొరమందం ఎక్కువగా పెరిగి.. రిపోర్టులో హైపర్‌ప్లేసియా అని వస్తే తీవ్రతను బట్టి ప్రొజెస్టరాన్ హార్మోను సూచిస్తారు లేదా హిస్టెరెక్టమీ చేస్తారు. కొన్నిసార్లు హార్మోన్లు లేకపోవడం వల్ల ఎండోమెట్రియం పొర పలుచబడి ‘ఎట్రోఫిక్ ఎండోమెట్రియం’ పరిస్థితి వస్తుంది. అప్పుడు అందుకు తగినట్లుగా హార్మోన్లు వాడాలని డాక్టర్లు సూచిస్తారు. -
ప్లాస్టిక్ బాటిల్ నీళ్లతో హై బీపీ
సాక్షి, హైదరాబాద్: మన రోజువారీ అలవాట్లే మన ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయి. అందులో ప్లాస్టిక్ వినియోగం ఒకటి. ప్రస్తుతం మనం కూరగాయలు, పండ్లు, ఇతర ఆహారపదార్థాలు సులువుగా తీసుకెళ్లేందుకు వాడు తున్న ప్లాస్టిక్ కవర్లు, బ్యాగ్‌లు కూడా అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అంతేకాదు నీళ్లు తాగేందుకు అత్యధిక శాతం మంది ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ సీసాలు కూడా మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. నిత్యం ప్లాస్టిక్ సీసాలతో తాగుతున్న మంచినీటి ద్వారా శరీరంలోకి చేరుతున్న సూక్ష్మ రూపాల్లోని ప్లాస్టిక్ రేణువులు (మైక్రో ప్లాస్టిక్స్) అధిక రక్తపోటు (హై బ్లడ్‌ప్రెషర్)కు కారణమవుతున్నట్టు ఆస్ట్రియాలోని డాన్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీ తాజా పరిశోధనలో వెల్లడైంది.గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు వంటి వాటికి బీపీనే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ఫ్లమేషన్, హార్మోన్ల అసమతుల్యత, కేన్సర్ వంటి వాటికి కారణమవుతున్నాయని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ తొలుత రక్త ప్రవాహంలోకి తర్వాత సలైవా, గుండె కణజాలం, కాలేయం, ఊపిరితిత్తులు ఇంకా ప్లాసెంటా (మావి).. ఇలా అన్ని అవయవాల్లోకీ చేరుతున్నాయి. ముఖ్యంగా ‘బాటిల్డ్ వాటర్’లో హెచ్చు స్థాయిల్లో ఈ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్టుగా అధ్యయనంలో తేలింది.అధ్యయనంలో భాగంగా మైక్రో ప్లాస్టిక్స్ –పెరుగుతున్న రక్తపోటు మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని పరిశీలించారు. ‘జర్నల్ మైక్రోప్లాస్టిక్స్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా రక్తపోటు సమస్యను గణనీయంగా తగ్గించవచ్చునని పేర్కొంది. రక్తపోటు సమస్యలను తగ్గించుకునేందుకు ప్లాసిక్ సీసాలలో మంచినీళ్లు, ఇతర పానీయాలు (ప్యాకేజ్డ్ బాటిల్స్) తీసుకునే అలవాటును మానుకుంటే మంచిదని సూచించింది. నల్లాల ద్వారా వచ్చే నీటిని కాచి వడబోశాక తాగడంతో పోల్చితే ప్లాస్టిక్ సీసాలలోని నీటిని, అలాగే కొన్ని సందర్భాల్లో గాజు సీసాల్లోని నీటిని తాగాక రక్తపోటు పెరిగినట్టుగా పరిశోధకులుగుర్తించారు. సింథటిక్ వ్రస్తాలు ఉతకడం వల్ల కూడా..నిత్యం ఐదు మిల్లీమీటర్ల కంటే కాస్త తక్కువ పరిమాణంలో మైక్రోప్లాస్టిక్స్ శరీరంలో చేరుతుండడంతో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధన స్పష్టం చేసింది. గతంలోనే నిర్వహించిన ఓ అధ్యయనంలో...ప్రతి వారం బాటిళ్ల ద్వారా తీసుకునే వివిధ రూపాల్లోని ద్రవాల ద్వారా ఐదు గ్రాముల చొప్పున మైక్రోప్లాస్టిక్స్ శరీరంలో చేరుతున్నట్టు వెల్లడైంది. కారు టైర్ల అరుగుదల మొదలు పెద్దమొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాల ధ్వంసం, సింథటిక్ వ్రస్తాలు ఉతకడం తదితర రూపాల్లో కూడా ఇవి శరీరంలో చేరుతున్నట్టు తెలిపింది. మనం తీసుకునే ఆహారం, నీళ్లు, పీల్చే గాలి తదితరాల ద్వారా మనకు తెలియకుండానే ప్లాస్టిక్ రేణువులు శరీరాల్లో చేరుతున్నట్టు పేర్కొంది.అయితే బాటిల్ నీళ్లను తాగకుండా ఉంటే ఈ సమస్యను కొంతవరకు నివారించ వచ్చని, నల్లా నీళ్లను వేడిచేసి చల్లబరిచి, ఫిల్టర్ చేసి తాగడం మంచిదని సూచించింది. దీనిద్వారా మైక్రో ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ శరీరంలో చేరడాన్ని 90 శాతం దాకా తగ్గించవచ్చునని అధ్యయనం పేర్కొంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు..రోజువారి జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ప్లాస్టిక్ బాటిళ్లలో పానీయాలను భద్రపరచడం నిలిపేయాలని సూచించింది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లకు బదులుగా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని, స్టెయిన్లెస్ స్టీల్ లేదా గ్లాస్ కంటైనర్లు వినియోగించాలని, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించాలని స్పష్టం చేసింది. -
సెల్‌ఫోన్‌తో హై బీపీ!
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో మాట్లాడేవారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని, ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో తేల్చారు. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్–డిజిటల్ హెల్త్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్జౌలోని సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధకులు మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని గుర్తించారు.130 కోట్ల మందిలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30–79 సంవత్సరాల వయసు గల దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇందులో 82% మంది తక్కువ, మధ్య–ఆదాయ దేశాలలో నివసిస్తున్న వారే. భారత్‌లో 120 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటే 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రక్తపోటు సమస్య గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.హైబీపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్, ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. తాజా పరిశోధనలో వారంలో 30 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్లో మాట్లాడే వారితో పోలిస్తే మిగిలిన వారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12% ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగింది.కండరాలపై ఒత్తిడి..మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఫోన్‌ను పట్టుకోవడంతో కండరాలు ఒత్తిడికి గురవడంతో పాటు తీవ్ర తలనొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను చెవికి చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం, ఇయర్‌ఫోన్లు్ల, హెడ్ఫోన్లను నిరంతరం ఉపయోగించడంతో టిన్నిటస్ (చెవుల్లో నిరంతరం రింగింగ్ సౌండ్ వినిపించే పరిస్థితి) వంటి చెవి సమస్యలు వస్తాయంటున్నారు. ఫోన్ స్క్రీన్‌పై ఎక్కువ సేపు చూడటంతో కంటిపై ఒత్తిడి పెరిగిన కళ్లుపొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. -
డైట్లో ఈ ఆహార పదార్థాలు చేర్చి..హైబైపీకి బ్రేక్ వేయండి
మారుతున్న జీవనశైలి కారణంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ వేధించే వ్యాధి హైబీపీ. ముఖ్యంగా నిద్రలేమి ఒత్తిడి ఈ హైబీపీ బారిన పడేస్తున్నాయి. బీపీని సకాలంలో గుర్తించి నియంత్రణలో ఉంచుకోకుంటే అది స్ట్రోక్, గుండెపోటు, గుండె వైఫల్యం, కిడ్నీ వైఫల్యం సహా ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అలాంటి బీపీని నేచురల్ ప్రోబయాటిక్ ఆహారంతో చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు అవేంటో చూద్దామా..!జీర్ణవ్యవస్థకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉన్నందుకే పెరుగును నేచురల్ప్రోబయాటిక్ ఆహారం అంటారు. అరటిలో పొటాషియమ్ లవణాలుంటాయి. ఇటు అరటి, అటు పెరుగు... ఈ రెండూ రక్తపోట (హైబీపీ)ని సమర్థంగా అదుపు చేస్తాయని ఆస్ట్రేలియాలో నిర్వహించిన పరిశోధనల్లో తేలడం మాత్రమే కాదు... ఆ సంగతి ‘హైపర్‌టెన్షన్’ అనే హెల్త్‌జర్నల్‌లోనూ ప్రచురితమైంది. హైబీపీ రాకముందే నివారించాలంటే... అందుకు అరటి, పెరుగు, తియ్యటి మజ్జిగ బాగా ఉపయోగపడతాయి. వాటితోపాటు ఇంకా పూర్తిగా పులవకుండా... అందుకు సంసిద్ధంగా ఉన్న అట్ల పిండితో వేసే అట్లు, ఇడ్లీ వంటివి తీసుకుంటే కూడా హైబీపీ నేచురల్‌గానే నివారించవచ్చని వైద్య పరిశోధకులు, న్యూట్రిషన్ నిపుణులు పేర్కొంటున్నారు. (చదవండి: మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!) -
చేపలు తింటున్నారా? దానిలోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల..
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది అధిక బీపీతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా వస్తుండటం విచారకరం. ‘అధిక రక్తపోటు’ శరీరంలో గుండె సమస్యలను పెంచుతుంది. అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యని నియంత్రించవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే ఎక్కువ ఉప్పు, తీపి, కొవ్వు పదార్థాలను తినకూడదు. ఇలాంటివి తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఆహారంలో కొన్ని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చినట్లయితే రక్తపోటును నియంత్రించవచ్చు. అవేంటో తెలుసుకుందాం. ►గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చేపలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హృదయాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ► ఆధునిక కాలంలో మారిన జీవన పరిస్థితుల వల్ల చాలామందిలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడుతున్నాయి. దీనికి కారణాలు అనేకం. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. ఇందుకోసం కొన్ని చిట్కాలు ► తులసి ఆకుల రసాన్ని తీసి దానికి ఒక చెంచా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ► కిడ్నీలో రాళ్లను తొలగించడంలో టొమాటో రసం బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిస్థితిలో రెండు టమోటాలు బాగా కడిగి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ జ్యూస్‌లో ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని తాగాలి. కావాలంటే ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కిడ్నీలోని స్టోన్స్‌ను తొలగించడంలో చక్కగా పనిచేస్తుంది. ► పెరుగును ఒక గిన్నెలో తీసుకుని అందులో చెంచా నిమ్మరసం వేసి రుచికి తగినట్లుగా ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. -
పారాహుషార్!
అజ్ఞానం అనేక విధాల అపాయకరం. ఆరోగ్యం విషయంలో అది మరీ ప్రమాదకరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక ఆ సంగతి మన భారతీయులందరికీ మరోసారి గుర్తుచేసింది. మన దేశ జనాభాలో 18.83 కోట్ల మంది దాకా అధిక రక్తపోటు (హై బీపీ)తో బాధపడుతున్నారనీ, అయితే వారిలో కేవలం 37 శాతం మందికే తమ ఆరోగ్య పరిస్థితి గురించి అవగాహన ఉందనీ వెల్లడించింది. అధిక రక్తపోటు ఉందని తేలినవారిలో నూటికి 30 మందే మందులు వాడుతున్నారనీ, వారిలోనూ 15 మందే దాన్ని నియంత్రణలో ఉంచుకుంటు న్నారనీ పేర్కొంది. బీపీ ఉన్నవారిలో కనీసం సగం మంది దాన్ని నియంత్రణలో ఉంచుకోగలిగినా... వచ్చే 2040 నాటికి గుండెపోటు, పక్షవాతం వల్ల సంభవించే 46 లక్షల మరణాలను మన దేశంలో నివారించవచ్చు. డబ్ల్యూహెచ్ఓ చెబుతున్న ఈ మాటలు భారత్‌లో ‘హై బీపీ’ పట్ల పేరుకున్న అశ్రద్ధను గుర్తుచేస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణలోని ఈ లోటుపాట్లపై ప్రజలు, వారితో పాటు ప్రభుత్వం కూడా తక్షణం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్త హైపర్‌టెన్షన్ ప్రభావంపై డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన తొట్టతొలి నివేదిక ఇదే! 2019 నాటి డేటా ఆధారంగా ఈ ప్రపంచ సంస్థ చేసిన నిర్ధారణలు ఆలోచింపజేస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక బీపీతో బాధపడుతున్నారట! వారిలోనూ ప్రతి అయిదుగురిలో నలుగురు దాన్ని అదుపులో ఉంచుకోవట్లేదట! జీవనశైలిలో అనూహ్య మార్పుల వల్ల 1990 నుంచి 2019కి వచ్చేసరికల్లా బీపీ బాధితుల సంఖ్య 65 కోట్ల నుంచి రెట్టింపై, 130 కోట్లకు చేరింది. పైకి లక్షణాలేవీ ప్రత్యేకంగా కనిపించని ‘సైలెంట్ కిల్లర్’ ఇది. అందుకే, గుండె జబ్బు, కిడ్నీలు దెబ్బ తినడం లాంటి ఇతర సమస్యలు తలెత్తినప్పుడు గానీ ఈ అధిక బీపీని పలువురు గుర్తించడం లేదని వైద్యులు వాపోతున్నారు. బీపీ ఉన్నట్టు తెలిసినా సరిగ్గా మందులు వాడక అశ్రద్ధ చేసి తల మీదకు తెచ్చుకుంటున్నవారు అనేకులు. భారత్‌లో గుండెపోటు, స్ట్రోక్‌లతో మరణిస్తున్న వారిలో నూటికి 52 మంది అనియంత్రిత అధిక బీపీ (140/90కి పైన)కి బలి అవుతున్నవారే! చౌకగా మందులతో అదుపు చేయవచ్చని తెలిసినా, పలు దేశాల్లో ఈ పెను ప్రమాదకారిపై తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని తమ పౌరులందరికీ పరీక్షలు జరిపి, ఉచితంగా చికిత్స అంది స్తున్నాయి. అయితే, అల్పాదాయ దేశాల్లో అలాంటి పరిస్థితి లేదు. నిజానికి, మనదేశంలో ప్రజల్లో అధిక బీపీ దుష్ఫలితాల్ని నియంత్రించేందుకు ‘ఇండియా హైపర్‌టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్’ (ఐహెచ్‌సీఐ)ను 2017 నవంబర్లోనే కేంద్ర ఆరోగ్య శాఖ చేపట్టింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ స్థాయిలోనే అసాంక్రమిక వ్యాధుల పరీక్షలు జరిపి, చికిత్స, మందులిచ్చి, 2025 నాటి కల్లా దేశంలో 7.5 కోట్ల మందికి బీపీ, షుగర్ల నుంచి సంరక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదట 5 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొద్ది జిల్లాల్లో మొదలైన ఈ ఆరోగ్య యజ్ఞం క్రమంగా 155 జిల్లాలకు విస్తరించింది. అయితే, ఈ ఏడాది జూన్ నాటికి 27 రాష్ట్రాల్లో దాదాపు 58 లక్షల మంది బీపీ రోగులకు మాత్రం చికిత్స అందించగలిగింది. నిరుడు ఇది ఐరాస అవార్డును అందుకున్న ప్రశంసనీయ ప్రయత్నం. కానీ, బీపీ బాధితుల సంఖ్య కోట్లలో ఉన్న దేశంలో చెరువు నీటిని చెంబుతో తోడితే సరిపోదు. డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదిక సైతం ముందుగా ప్రజల్లో చైతన్యం పెంచాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతోంది. సమాజంలోని పేదవర్గాల్లో పలువురు అధిక బీపీ బాధితులు కొంతకాలం పాటు మందులు వాడి, పరిస్థితి కొద్దిగా కుదుటపడగానే మానేస్తున్నారట! కొన్ని అధ్యయనాలు వెల్లడించిన ఈ చేదు నిజం ఆందోళన రేపుతోంది. బీపీకి చికిత్స, మందులు మధ్యలో ఆపడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని భారతీయ ఆరోగ్య సంరక్షణ మార్గదర్శకాలు ఎప్పటి నుంచో చెబుతున్నదే! అయినా మనం పెడచెవిన పెడుతున్నాం. ఈ ధోరణి మారాలి. 30 ఏళ్ళ వయసు నుంచే బీపీ చూపించు కోవాలనీ, 50వ పడిలో పడ్డాక తరచూ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరనీ వైద్యులిస్తున్న సలహాను పాటించడం మంచిది. అలాగే, రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సున్నా, భారత్‌లో 8 గ్రాముల దాకా తీసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి తాజా నివేదిక సైతం హెచ్చరిస్తోంది. ఉప్పు తగ్గించడం, ధూమపానం, మద్యపానం మానే యడం, శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన ఆహారం, కంటి నిండా నిద్ర లాంటి జీవనశైలి మార్పులతో, జీవితాంతం బీపీ మందులు మానకుండా వాడడం శ్రేయస్కరం. గణాంకాలు గమనిస్తే, గత 15 ఏళ్ళలో దేశంలోని చిన్న పట్నాలు, గ్రామీణ ప్రాంతాలకు సైతం బీపీ సమస్య విస్తరించింది. ఆరోగ్య సంరక్షణ వసతుల్లోని లోటు సైతం అక్కడి సమస్యను పెంచు తోంది. మచ్చుకు, గ్రామీణ బిహార్ లాంటి చోట్ల ఆరోగ్య సేవకుల్లో మూడోవంతు మందికి మాత్రమే సరైన బీపీ చికిత్స తెలుసట! అంతర్జాతీయ పరిశోధకుల సర్వే నిరుడు తేల్చిన దిగ్భ్రాంతికరమైన నిజమిది. జిల్లా, గ్రామస్థాయుల్లో ప్రజారోగ్య సేవకుల నైపుణ్యం పెంచి, డాక్టర్ల, నర్సుల కొరతను అధిగమించడం ద్వారా ప్రభుత్వ బీపీ కార్యక్రమాన్ని మెరుగుపరచవచ్చని నిపుణుల సూచన. ఏమైనా, డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదిక ఇస్తున్న సందేశాన్ని మన విధాన నిర్ణేతలు వెంటనే చెవి కెక్కించుకోవాలి. ఎందుకంటే, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని బట్టి పంథా మార్చి, కొత్త వ్యూహాలను అనుసరించడమే ఏ సమస్యకైనా అసలైన ఔషధం. -
కళ్లల్లో ఎర్రటి మచ్చలు కనిపిస్తున్నాయా? బీపీ చెక్ చేసుకున్నారా?
హై బీపీ లేదా హైపర్ టెన్షన్... ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న ముఖ్య ఆరోగ్య సమస్య. ఒకరకంగా చెప్పాలంటే ఇది సైలెంట్ కిల్లర్ కూడా. ఎందుకంటే బీపీ అదుపులో లేకపోతే నేరుగా గుండెపైనే ప్రభావం పడుతుంది. గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, హెచ్చు తగ్గులుంటే తగిన మందులు వాడటం అవసరం. ఎందుకంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, ఇది చాప కింది నీరులా అంతర్గత అవయవాలపై తీవ్ర దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. రక్తపోటు ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు తగ్గించడం వాటిలో ముఖ్యమైనది. అధిక రక్తపోటును గుర్తించడానికి ఉత్తమ మార్గం క్రమం తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవడం. రక్తపోటు ఎక్కువగా ఉంటే కొన్ని లక్షణాలు బయటపడతాయి. కళ్ళల్లో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎలాంటి లక్షణాలు? రక్తపోటు అధికమైతే మీ కళ్ళల్లో ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ఇది రక్తనాళాల విచ్ఛిన్నం వల్ల జరుగుతుంది. కళ్ళు ఎర్రగా కనిపిస్తే బీపీ చెక్ చేసుకోవడం చాలా అవసరం. అధిక రక్తపోటు వల్ల దృష్టి సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల కళ్లు ఎర్రగా కనిపిస్తుంటే ఓసారి బీపీ చెక్ చేయించుకోవాలని గుర్తుంచుకోండి. కళ్ళల్లో కనిపించే ఈ సంకేతాలు కాకుండా బీపీ అధికమైనప్పుడు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏమిటంటే ... ►ఛాతీలో నొప్పి పెట్టడం ► శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం ► మూత్రంలో రక్తం కనిపించడం ►ఛాతీ, మెడ, చెవుల్లో ఇబ్బందిగా అనిపించడం ► తలనొప్పి తీవ్రంగా రావడం ► చిన్న చిన్న పనులు చేసినా తీవ్రమైన అలసట. -
Health Tips: హై బీపీ ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే..
ప్రస్తుత కాలంలో జీవనశైలి మూలాన వస్తున్న సమస్యలలో బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్, ఎసిడిటీ, కడుపులో పుండ్లు వంటివి ముఖ్యమైనవి. వాటిలో అతి ముఖ్యమైనది బీపి. దీనికి వయసుతో కూడా సంబంధం ఉండటం లేదు. తక్కువ వయసు వారు కూడా హైబీపితో బాధపడుతున్నారు. రక్తపోటు పెరిగిపోవడం వల్ల ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా వస్తుంటుంది. బీపీని అదుపులో ఉంచుకోవాలంటే కొన్నిరకాల ఆహారాలను తీసుకోవడం ప్రయోజనకరం. అవేంటో తెలుసుకుందాం.. పల్లీలు, బాదం, జీడిపప్పు అధిక రక్తపోటును అదుపు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే వాటిని ఎలా తీసుకోవాలో చూద్దాం. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు నట్స్‌ను దూరం పెడుతుంటారు. వీటిని తింటే మరింత బరువు పెరిగిపోతామేమోననే అపోహతో. అయితే అది సరికాదు. ఎందుకంటే వేరుశెనగ, బాదం పప్పుల వల్ల బరువు పెరగరు. ఇవి మీ శరీర బరువు మరింత పెరగకుండా అడ్డుకుంటాయి కూడా. పల్లీలు పల్లీలు లేదా వేరుసెనగ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ గుప్పెడు వేరువెనగ గింజలు తినడం వల్ల వంటి పనితీరు బాగుంటుంది. అలాగే అధిక రక్తపోటు సమస్య కూడా తొలగిపోతుంది. కొలెస్ట్రాల్ వంటి రోగాల ప్రమాదం తప్పుతుంది. ఎందుకంటే ఈ గింజలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వేరుశెనగల్లో విటమిన్ బి3 పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజూ వేరుశెనగలను తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఈ గింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బీపీని పెంచే కారకాలలో కొలెస్ట్రాల్ ముందుంటుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటే రక్తపోటుకు కళ్లెం వేయడం సులభం అవుతుంది కాబట్టి రోజూ నానబెట్టిన పల్లీలు తీసుకోవడం మంచిది. బాదం పప్పు శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తొలగించేందుకు బాదం పప్పులు ఎంతో సహాయపడతాయి. గుప్పెడు వేరుసెనగ గింజలను, నాలుగైదు బాదం పప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తింటే బీపీ, డయాబెటిస్ అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని, అధిక రక్తపోటునూ నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. వీటిని తినడం వల్ల శరీర బలం పెరుగుతుంది. జీడిపప్పులు జీడిపప్పులు తింటే బరువు పెరిగిపోతామని వీటిని ముట్టని వారు చాలా మందే ఉన్నారు. నిజానికి అది సరికాదు.. జీడిపప్పులు బరువును పెంచడానికి బదులుగా.. బరువును కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడతాయి. శీతాకాలంలో 2 నుంచి 3 జీడిపప్పులను తినడం శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే శరీర శక్తిని కూడా పెంచుతుంది. వీటిలో పిస్తాపప్పు, ఇతర గింజల కంటే ఎక్కువ పోషకాలుంటాయి. ఇది రుచిగానే కాదు.. మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఈ గింజలు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక బరువు కూడా తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయులు కూడా నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. జుట్టు, చర్మానికి ప్రయోజనకరం డ్రై ఫ్రూట్స్‌లో చాలావరకు విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ ఇ ,మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని రోజూ తింటే రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతాయి. సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పేననడంలో ఎలాంటి సందేహం లేదు. చాపకింద నీరులా గుండె కవాటాలను పూడ్చివేసి, గుండె పనితీరును మందగింపజేసే బీపీని అదుపులో ఉంచుకోకపోతే చాలా ప్రమాదం. అయితే అది మందుల ద్వారానే కాదు, నిత్యం ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చునంటున్నారు ఆహార నిపుణులు. వీటన్నింటితోపాటు కంటినిండా నిద్రపోవడం, నిత్యం వాకింగ్ చేయడం కూడా చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి. నోట్: కేవలం ఆరోగ్యం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పలు అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా అందించిన వివరాలు ఇవి. శరీర తత్త్వాన్ని బట్టి ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉండవచ్చు. ఏదేమైనా వైద్యులను సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన, చక్కటి పరిష్కారం దొరుకుతుంది. చదవండి: Diet Tips To Control Asthma: ఆస్తమా ఉందా? వీటిని దూరం పెట్టండి.. ఇవి తింటే మేలు! High Uric Acid Level: యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే అంతే సంగతులు! వీరికే ముప్పు ఎక్కువ! లక్షణాలివే! ఇలా చేస్తే.. -
Health Tips: రక్తపోటు అదుపులో ఉండాలంటే ఈ రెండు కలిపి తినండి..!
పెరుగు అంటే అదో ప్రో–బయాటిక్ ఆహారం అన్న సంగతి తెలిసిందే. ఆధునిక వైద్యవిజ్ఞానం ఈ విషయాన్ని నిరూపణ చేయడానికి చాలా ముందునుంచీ... అంటే అనాదిగా పెరుగు మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. తోడేసిన పాలు పెరుగుగా మార్చడానికి ఉపయోగపడే... మనకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉండే ప్రోబయాటిక్స్ రక్తపోటు (హైబీపీ)ని అదుపుచేయడానికి సమర్థంగా ఉపయోగపడతాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు... ఈ విషయం ఆస్ట్రేలియాలో నిర్వహించిన పరిశోధనల్లోనూ తేలిందని, ఇదే విషయం ‘హైపర్‌టెన్షన్’ అనే హెల్త్‌జర్నల్‌లోనూ ప్రచురితమైందని పేర్కొంటున్నారు. అందుకే పులవడానికి సిద్ధంగా ఉన్న పిండితో వేసే అట్లు, ఇడ్లీతో పాటు తాజా పెరుగు, తాజా మజ్జిగ రక్తపోటును సమర్థంగా అదుపు చేస్తాయన్నది వైద్యవర్గాల మాట. అంతేకాదు... చాలామందికి అరటిపండుతో పెరుగన్నం తినడం ఓ అలవాటు. అరటిలో పొటాషియమ్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పెరుగన్నం, అరటి కాంబినేషన్ రక్తపోటు అదుపునకు స్వాభావికంగా పనికి వచ్చే ఔషధం లాంటిది అంటున్నారు వైద్యనిపుణులు, న్యూట్రిషన్ నిపుణులు. -
బీపీ... బీపీ అంటుంటాంగానీ... మనందరికీ బీపీ ఉండి తీరాలి, కాకపోతే
హైబీపీకి సంబంధించిన సందేహాలు కాస్త చిత్రంగా ఉండవచ్చు. నిజానికి అదో అపోహలా అనిపించవచ్చు. కానీ అదే వాస్తవం కావచ్చు. అలాగే మరికొన్ని నిజమనిపించవచ్చు. కానీ అపోహ కావచ్చు. అందుకే అలాంటి కొన్ని సందేహాలూ, సమాధానాలు చూద్దాం. బీపీ... బీపీ అంటుంటాంగానీ... మనందరికీ బీపీ ఉండి తీరాలి. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. తెలుగులో రక్తపోటు. అది ఉండాల్సిందే. కాకపోతే 140/90 కొలతతో ఉండాలి. అది నార్మల్. అంటే బీపీ ఉండాల్సిందేగానీ... ఎంత ఉండాలో అంతే ఉండాలన్నమాట. ఇది పెరిగితే హైబీపీ!! నిజానికి ఇదో జబ్బు కాదు. కానీ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యేలా చేస్తుంది. భారతీయ సమాజంలో ఇంచుమించు కౌమారం దాటి యువదశ దాటినవారిలోని 25 శాతం మందికి హైబీపీ ఉన్నట్లు ఓ అంచనా. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇంతమంది హైబీపీ బాధితులు ఉండటం... వారిలో అనేక సందేహాలు, అపోహల కారణంగా మందులు సరిగా తీసుకోకపోవడం వల్ల మెదడు, మూత్రపిండాల వంటి ఎండ్ ఆర్గాన్స్ విఫలమై మృతిచెందడం, పక్షవాతం వంటి కారణాలతో జీవితాంతం వైకల్యాలతో బాధపడటం చాలా సాధారణం. ఈ నెల 17న వరల్డ్ హైపర్‌టెన్షన్ డే. ఈ సందర్భంగా ఈ అంశంపై అనేక సందేహాలూ, వాటికి సమాధానాలు తెలుసుకుని హై–బీపీ పట్ల అవగాహన పెంచుకుంటే ఎన్నెన్నో జీవితకాలపు వైకల్యాలనూ, మరణాలను నివారించవచ్చు. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. యువకులను మినహాయిస్తే... మధ్యవయసు దాటాక... ఏజ్ పెరుగుతున్న కొద్దీ... నార్మల్ అయిన 120/80 కంటే కొద్దిగా ఎక్కువగానే ఉండటం మామూలే కదా! ఈ అపోహ చాలాకాలం రాజ్యమేలింది. వయసు పెరుగుతున్న కొద్దీ బీపీ కొద్దిగా ఎక్కువే ఉండవచ్చని తొలుత అనుకున్నారు. (వయసు + 100) అంటూ ఓ సూత్రం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఉదాహరణకు ఓ వ్యక్తి వయసు 60 ఏళ్లు అయితే అతడి పై కొలత 160 వరకు ఉన్నా పర్లేదని అనుకున్నారు. కానీ తాజాగా ఇప్పటి లెక్కలు వేరు. ఇప్పుడు తాజాగా... పద్దెనిమిది దాటిన ఏ వయసువారికైనా బీపీ 140/90 కి పైన ఉంటే అది హైబీపీ కిందే లెక్క. తల్లిదండ్రులకు ఉంటే, పిల్లలకూ హైబీపీ వస్తుందా? తల్లిదండ్రులకు హైబీపీ ఉంటే... పిల్లలకు అది తప్పనిసరిగా వచ్చే జన్యుపరమైన సమస్య కాదు గానీ... తల్లిదండ్రులకూ, రక్తసంబంధీకులకూ, దగ్గరి బంధువులకు అధిక రక్తపోటు ఉన్నప్పుడు... వారి వారసులకు కూడా వచ్చే అవకాశాలు కాస్తంత ఎక్కువే. రక్తపోటు ఉన్నప్పటికీ చాలా చిన్నవయసు వారు మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేదేమో కదా? రక్తపోటు ఉందని తేలాక... అది ఎంత చిన్నవయసు అయినా తప్పనిసరిగా మందులు వాడాల్సిందే. లేకపోతే దీర్ఘకాలంలో కీలకమైన అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయం కలిగించే అవకాశాలు ఎక్కువ. చిన్నపిల్లల్లో హైబీపీ ఉండదు కదా? చిన్నపిల్లల్లో, అప్పుడప్పుడే యుక్తవయసుకు వస్తున్న కౌమార బాలల్లో హైబీపీ ఉండకపోవచ్చని అనిపిస్తుంది. కానీ వాళ్లలోనూ కొందరికి హైబీపీ (హైపర్‌టెన్షన్) ఉండే అవకాశం ఉంది. ఇటీవల చాలా చిన్నపిల్లలు.. అంటే 3 నుంచి 11 ఏళ్ల మధ్య వయసువారు, కౌమారంలోకి వస్తున్న పిల్లలు... అంటే 12 నుంచి 18 ఏళ్ల మధ్యవారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. అయితే చిన్నపిల్లల్లో హైబీపీ నిర్ధారణ విషయంలో కొలత చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పిల్లల్లో బీపీని తెలిపే ఛార్ట్‌ను ‘సెంటైల్ చార్ట్’ అంటారు. పిల్లల్లో నార్మల్ విలువలు వాళ్ల వయసునూ, జెండర్నూ, వాళ్ల ఎత్తును బట్టి మారుతుంటాయి. అంటే వారిలో కొలత 90 ఉంటే అది బీపీ ఉన్నట్లు కాదు. కొలత విలువ 95 పర్సంటైల్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అది పిల్లల్లో హైబీపీ ఉన్నదనడానికి సూచన. ఆ రీడింగ్ 95–99 ఉంటే హైపర్‌టెన్షన్ స్టేజ్–1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్–2గా భావించాలి. ఈ దశలూ, తీవ్రతలను బట్టి ఆయా పిల్లలకు ఎలాంటి చికిత్స ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. సుదీర్ఘకాలం పాటు హైబీపీ మందులు వాడితే వాటికి అలవాటు పడి... డ్రగ్ అడిక్షన్ వస్తుందేమో కదా? ఒకసారి హై–బీపీ నిర్ధారణ అయ్యాక... దాన్ని అదుపులో ఉంచేందుకు డాక్టర్లు మందులను సూచిస్తుంటారు. వారి బీపీ తీవ్రతను బట్టి కొందరిలో రెండు, మూడు, నాలుగు... రకాల మందులను డాక్టర్లు వాడమంటారు. తరచూ గమనిస్తూ... మందుల మోతాదును అడ్జెస్ట్ చేస్తుంటారు. జీవనశైలి మార్పులతో బీపీని అదుపులో పెడితే కేవలం రెండులోపు మాత్రలతోనే చాలాకాలం కొనసాగవచ్చు. కానీ బీపీ అదుపులో లేకపోతే మందులూ, మోతాదులు పెరుగుతాయి. హైబీపీ మందులైనా, డయాబెటిస్ మందులైనా సుదీర్ఘకాలం వాడాల్సిందే. అది బాధితుల బీపీ కొలతలను బట్టి ఉంటాయి తప్ప... బీపీ తగ్గినప్పటికీ వాటికే అలవాటు పడటం, మానకుండా ఉండలేకపోవడం వంటివి జరగవు. మందులు వాడుతున్నా... బీపీ నియంత్రణలో ఉండటం లేదు. బహుశా మందుల ప్రభావం తగ్గిపోయిందా? బహుశా బీపీ ఆ మందులకు రెసిస్టెన్స్ పెంచుకుని ఉండవచ్చా? కొంతమంది బీపీ బయటపడ్డాక... మొదటిసారి మాత్రమే డాక్టర్‌ను కలుస్తారు. అప్పుడు డాక్టర్ రాసిన మందులనే అదేపనిగా ఏళ్ల తరబడి వాడుతుంటారు. కానీ వాటితో బీపీ నిజంగానే అదుపులోకి వచ్చిందా... లేక ఆ డోస్ సరిపోవడం లేదా... ఇలాంటి విషయాలేమీ పట్టించుకోరు. మరికొందరు తొలిసారి మందులు వాడకం మొదలుపెట్టాక... రెండో వారంలోనో లేదా పది రోజుల తర్వాతనో మరోసారి బీపీ చూసుకుని, అది తగ్గడం లేదంటూ ఫిర్యాదు చేస్తారు. ఇవన్నీ సరికాదు. మందుల ప్రభావం తగ్గిపోయిందనే అపోహ కూడా వద్దు. ఒకసారి బీపీ మందులు మొదలుపెట్టాక అవి పనిచేయడం ప్రారంభించి, బీపీ అదుపులోకి రావడానికి కనీసం 3 – 4 వారాలు పట్టవచ్చు. ఇవేవీ చూడకుండానే కొందరు తాము అనుకున్నదే కరెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇది సరికాదు. అందుకే బీపీ మందులు వాడుతున్న వారు డాక్టర్ నిర్దేశించిన ప్రకారం... ఆయా సమయాలకు ఫాలో అప్‌కు వస్తుండాలి. ఉద్వేగ లక్షణాలు ఉంటే అది హై–బీపీ యేనా? కొంతమంది తాము నర్వస్‌గా ఉండటం, తలనొప్పి తరచూ వస్తుండటం, చెమటలు పడుతున్నట్లుగా, నిద్రపట్టకుండా, కోపంగా లేదా బాగా ఉద్వేగంగా/ఉద్రిక్తంగా ఉన్నప్పుడు హైబీపీ ఉందనో లేదా ఆ టైమ్‌లో బీపీ పెరిగి ఉందనో చెబుతుంటారు. అంతేకాదు... కొంతమందికి హాస్పిటల్‌కు వెళ్లగానే, అక్కడి డాక్టర్లను చూడగానే బీపీ పెరుగుతుంది. అదే ఇంటిదగ్గర లేదా మరోచోట రీడింగ్ తీసినప్పుడు నార్మల్‌గా ఉంటుంది. ఇలా తెల్లకోట్లలో ఉండే డాక్టర్లను చూసినప్పుడు రక్తపోటు పెరగడాన్ని ‘వైట్ కోట్ సిండ్రోమ్’ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో లేదా పైన చెప్పిన లక్షణాలన్నీ లేదా వాటిలో కొన్ని ఉన్నప్పుడు హైబీపీ ఉన్నట్లేనా అని సందేహ పడుతుంటారు. పై లక్షణాలతోనూ, సహజ భావోద్వేగాలతోనూ రక్తపోటు కొంతమేరకు పెరగవచ్చు. కానీ వాళ్ల భావోద్వేగాలు తగ్గగానే నార్మల్ అవుతుంది. అలాంటి కండిషన్లలో పెరిగేదాన్ని హైబీపీగా పరిగణించరు. అయితే ఓ వ్యక్తిలో పలుమార్లు రీడింగ్ తీశాక కూడా... రక్తపోటు 140/90 అనే విలువకు మించి ఉంటే అప్పుడు మాత్రమే హైబీపీగా పరిగణిస్తారు. సాధారణంగా రక్తపోటుకు సంబంధించిన లక్షణాలేమీ లేకపోతే హైబీపీ లేనట్లేనా? చాలామందికి లక్షణాలేమీ కనిపించకుండానే హైబీపీ ఉండవచ్చు. వారికి హైబీపీ ఉన్నట్లే తెలియకుండానే అది ఏళ్లతరబడి ఉండే అవకాశం ఉంది. రక్తపోటు చాలాకాలంగా చాలా ఎక్కువగా ఉండటం వల్ల మన దేహంలో ఎండ్ ఆర్గాన్స్‌గా పిలిచే మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయి. అలా అవి పూర్తిగా పాడైపోయాక... అప్పుడుగానీ ఆయా అవయవాలు దెబ్బతిన్నందున కనిపించే లక్షణాలు బయటపడవు. హైబీపీ వల్ల దెబ్బతిని, బాధితులను ప్రాణాంతక పరిస్థితులకు నెడుతున్నందునే దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. అందువల్ల లక్షణాలు కనిపించనంత మాత్రాన బీపీ లేదని అనుకోవడం సరికాదు. ఒకసారి డాక్టర్‌ను కలిసి, చెకప్ చేయించుకున్న తర్వాతే నిశ్చింతగా ఉండాలి. కొన్నిసార్లు లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ అవి తాత్కాలికం కావచ్చు. అలాంటిప్పుడు ఒకవేళ బాధితులకు హైబీపీ లేకపోయినా, అది ఉన్నట్టుగా డాక్టర్లు పొరబడే అవకాశాలు లేవా? హైబీపీ వల్ల కొందరిలో తలనొప్పి, తలతిరగడం వంటివి కనిపించవచ్చు. కానీ ప్రతి తలనొప్పీ అధిక రక్తపోటు వల్లనే కాకపోవచ్చు. బీపీ తాలూకు లక్షణాలు అని చెప్పుకునే కండిషన్లు కనిపించినప్పుడు అసలు బీపీని కొలవకుండానే కేవలం లక్షణాలతో ఆ సమస్య ఉందని అనుకోవడం సరికాదు. డాక్టర్లు అలా పొరబడే అవకాశం లేదు. ఎందుకంటే... రక్తపోటు పెరగడం వల్ల మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి రావచ్చు. అలాగే కొందరిలో వారి బాడీ పోష్చర్ అకస్మాత్తుగా మారడం వల్ల రక్తపోటు తగ్గవచ్చు. దీన్ని ‘ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్’ అంటారు. అలాంటి సమయాల్లో కొందరికి ముందుకు తూలిపడిపోతామనే ఫీలింగ్ లేదా తలతిరగడం వంటివి కనిపించవచ్చు. బీపీ తగ్గిన ఇలాంటి సందర్భాల్లోనూ బీపీ పెరిగినప్పుడు కనిపించే గిడ్గీనెస్ వంటి లక్షణాలు æ కనిపిస్తాయి. అందువల్ల డాక్టర్లు కేవలం లక్షణాల ఆధారంగా కాకుండా... అనేక మార్లు, అనేక సందర్భాల్లో బీపీని కొలిచిచూస్తారు. ఇలా పరీక్షించినప్పుడు అన్నిసార్లూ కొలత పెరిగి ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని హైబీపీగా నిర్ధారణ చేస్తారు. హైబీపీ ఉందని నిర్ధారణ అయ్యింది. డాక్టర్లు మందులు మొదలుపెట్టారు. కొన్నాళ్ల తర్వాత బీపీ అదుపులోకి వచ్చిందనుకోండి. అప్పుడు మందులు మానేయవచ్చా? ఒకసారి హైబీపీ నిర్ధారణ అయి... మందులు మొదలుపెట్టాక వాటి ప్రభావంతో బీపీ అదుపులోకి వస్తుంది. దాంతో బీపీ నియంత్రణలోనే ఉంది కదా అని చాలామంది మళ్లీ మందులు మానేస్తుంటారు. మళ్లీ బీపీ చెక్ చేయించుకోరు. దీని లక్షణాలు బయటకు కనిపించవు కాబట్టి అది పెరిగిన విషయం తెలియదు. అందుకే ఒకవేళ బీపీ నియంత్రణలోకి వచ్చిందని మందులు ఆపేసినా... మాటిమాటికీ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. బీపీ ఏమాత్రం పెరిగినట్లు అనిపించినా వెంటనే డాక్టర్ సలహా తో తగిన మోతాదు నిర్ణయించుకుని, మందులు తిరిగి మొదలుపెట్టాలి. అంతేకాదు... మందులు వాడుతున్నప్పటికీ తరచూ బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రస్తుతం మందులు వాడుతున్నప్పటికీ... ఆ మోతాదు సరిపోక బీపీ పెరిగితే... డాక్టర్లు మందులు మార్చడమో లేదా సరైన మోతాదు అందేలా మరో మాత్ర లేదా రెండు మాత్రలు పెంచడమో చేస్తారు. ఈ నేపథ్యంలో బీపీ మందులు వాడుతున్నప్పుడు వాటిని మానేయకపోవడం మంచిది. తరచూ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండటం అవసరం. బార్డర్‌లైన్‌లో ఉన్నప్పుడు మందులు అవసరం లేదనీ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్లతో బీపీని అదుపులో ఉంచుకోవాలంటూ డాక్టర్లు చెబుతారు కదా. మరి ఇప్పుడు కూడా మందులేవీ వాడకుండా మంచి జీవనశైలి అనుసరిస్తే సరిపోదా? ప్రతివారూ ఇలాగే అనుకుంటారు. కానీ జీవనశైలి నియమాలను కరెక్ట్‌గా పాటించరు. పాటించినా కొద్దికాలం మాత్రమే. లక్షణాలేవీ బయటకు కనిపించని హైబీపీ దీర్ఘకాలికంగా ఏవైనా కీలక అవయవాలపై దుష్ప్రభావం చూపితే... అప్పుడు జరిగే నష్టం... అప్పుడు వైద్యపరీక్షలకూ, చికిత్సకూ పడే ఆర్థికభారం, ఏదైనా ఎండ్ ఆర్గాన్ శాశ్వతంగా దెబ్బతింటే కలిగే నష్టం లాంటివి చాలా జబ్బుభారాన్ని (డిసీజ్ బర్డెన్ను) పెంచుతాయి. వాటికంటే అసలు మనకు భారమే తెలియని రీతిలో, చాలా చవకైన మందులను రోజూ ఒకపూట లేదా రెండు పూటలు తీసుకోవడం మేలు. దానివల్ల సుదీర్ఘకాలం, అన్ని అవయవాలనూ పదిలంగా ఉంచుతూ హాయిగా జీవించవచ్చు. గుండెపోటు, పక్షవాతం లాంటి మరెన్నో అనారోగ్యాలనూ, అనర్థాలను నివారించుకోవచ్చు. ఉప్పు పూర్తిగా మానేయాలా? హైబీపీ అనగానే ఉప్పు వల్ల రక్తపోటు పెరుగుతుందని సాధారణ ప్రజలకు కూడా ఇప్పుడు తెలిసిన విషయం. అయితే తమకు ఎలాంటి అనర్థాలూ జరగకూడదనే ఉద్దేశంతో చాలామంది ఉప్పును పూర్తిగా మానేస్తుంటారు. కానీ మన దేహంలోని చాలా కీలకమైన జీవక్రియలు (ఉదాహరణకు మెదడు నుంచి నాడుల ద్వారా కండరాలకు వచ్చే ఆదేశాలూ, వాటి అమలు వంటివి) ఉప్పు/ఇతర లవణాలలోని అయాన్ల ద్వారానే జరుగుతుంటాయి. ఉప్పు పూర్తిగా మానేసిన కొందరిలో ‘హెపోనేట్రీమియా’ అనే కండిషన్ వచ్చి, ఒక్కోసారి ప్రాణాంతకంగానూ మారవచ్చు. అందుకే ఉప్పును పూర్తిగా మానేయడం కంటే... మునుపు వాడుతున్న దాంట్లో సగం లేదా సగం కంటే తక్కువ వాడటం మంచిది. - డాక్టర్ హరిరామ్ వి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ -
ప్రీ–హైపర్‌టెన్షన్ దశ అంటే..?
ప్రతి వ్యక్తి రక్తనాళాల్లోనూ రక్తం ఒక నిర్దిష్టమైన రీతిలో, కొంత వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వేగం కొనసాగాలంటే రక్తనాళాల్లో రక్తం కొంత ఒత్తిడితో ప్రవహించాలి. ఇలా రక్తానికి ఒత్తిడి ఉండాలంటే అది గుండె స్పందనల వల్లనే సాధ్యమవుతుంది. రక్తాన్ని గుండె పంప్ చేసినప్పుడు మంచి రక్తనాళాల్లో (ఆర్టరీస్) లో రక్తం ఎంత పీడనంతో ప్రవహిస్తుందో తెలుసుకునే కొలత (రీడింగ్)ను ‘సిస్టోలిక్ ప్రెషర్’ అంటారు. అలాగే రెండు సిస్టోలిక్ ప్రెషర్స్ మధ్యన రక్తనాళాల్లో రక్త పీడనాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఇలా రక్తపోటుకు రెండు విలువలు ఉంటాయి. దీన్నే సాధారణంగా 120/80 గా పేర్కొంటుంటారు. ఇది సాధారణ విలువ. ఇక ఇప్పుడు ప్రీ–హైపర్‌టెన్షన్ అంటే ఏమిటో చూద్దాం. ప్రీ–హైపర్‌టెన్షన్ సాధారణంగా డాక్టర్ దగ్గరికి రోగి వెళ్లగానే కొలత రక్తపోటును పరిశీలిస్తారు. ఒకవేళ అది 120/80 ఉంటే ఇక దాని గురించి ఆలోచించరు. కానీ ఈ కొలతలు ఎప్పుడూ ఒకేలా ఉండకుండా కొంత మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు సిస్టోలిక్ రక్తపోటు విలువ 120కి బదులుగా 121 నుంచి 139 ఉందనుకోండి. అలాగే కింది విలువ 80కి బదులుగా 81 నుంచి 89 వరకు ఉందనుకోండి. ఆ కొలతలు ఉన్న దశను పూర్తిగా రక్తపోటు ఉన్న దశగా చెప్పడం కుదరదు. అందుకే డాక్టర్లు ఆ దశను ‘ప్రీహైపర్‌టెన్షన్’ (రక్తపోటు రాబోయే ముందు దశ)గా పేర్కొంటారు. ఈ ‘ప్రీహైపర్‌టెన్షన్’ దశ భవిష్యత్తులో ‘హైబీపీ’కి దారితీయవచ్చు. వెసులుబాటు ఇదే... ప్రీ–హైపర్‌టెన్షన్‌లో రోగి వెంటనే మందులు వాడాల్సిన అవసరం లేదు. ఆ హెచ్చరికలతో అప్రమత్తమై కొన్ని జాగ్రత్త చర్యలను మొదలుపెట్టవచ్చు. అంటే కేవలం మన జీవనశైలిలోని అలవాట్లను చక్కబరచుకోవడం ద్వారా రక్తపోటును అదుపులోకి తెచ్చుకునే వెసులుబాటు మనకు ఉంటుందన్నమాట. చదవండి: ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోండిలా.. వంటలూ వడ్డింపులతో క్యాన్సర్ నివారణ తోడుగా ప్రమాదకరమైన పరిస్థితి కూడా... రక్తపోటు పెరగడం వల్ల ఏర్పడే దీర్ఘకాలిక నష్టాలు మనకు వెంటనే కనిపించవు. పైగా రక్తపోటు పెరిగి ఉందన్న విషయం మొదట్లో అసలు రోగికి తేలియనే తెలియకపోవచ్చు కూడా. అందువల్ల దీనివల్ల జరిగే నష్టం అలా జరుగుతూపోయి ఏవైనా అవయవాలు దెబ్బతిన్న లక్షణాలు బయటపడేవరకు జరిగిన నష్టం మనకు తెలియదు. అప్పుడు మాత్రమే మనకు హైబీపీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదో ప్రమాదకరమైన పరిస్థితి. అందుకే వయసు నలభై దాటిన వారు అప్పుడప్పుడూ తమ బీపీని పరీక్షించుకుంటూ ఉండి, అది పంపించే హెచ్చరికలను పరిశీలించుకుంటూ ఉండటం మేలు. ప్రీ–హైపర్‌టెన్షన్ దాటి ఇక బీపీ నిర్ధారణ ఇలా... బీపీ ఉన్నట్లుగా నిర్ధారణ కోసం తరచూ రక్తపోటును చెక్ చేసుకుంటూ ఉండాలి. బీపీ ఎక్కువగా ఉన్నట్లు తెలిపే కొలతలు రెండు / మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు వస్తే దాన్ని హైబీపీగా నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడిక ప్రీ–హైపర్‌టెన్షన్ విషయాన్ని మరచిపోయి... తప్పక బీపీ నియంత్రణ మందులను డాక్టర్ సూచించిన విధంగా వాడాలి. హైబీపీకి కారణాలు ఇక పెరుగుతున్న వయసు, స్థూలకాయం, హైబీపీ ఉన్న కుటుంబచరిత్ర, ఒకే చోట కుదురుగా కూర్చుని పనిచేసే జీవనశైలి, ఆహారంలో ఎప్పుడూ పొటాషియమ్ ఎక్కువగా ఉండేలా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పొగాకు నమిలే అలవాటు, మద్యం తీసుకోవడం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అనేక అంశాలు హైబీపీకి రిస్క్ ఫ్యాక్టర్లు. మనందరికీ రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్ అంటే తెలుసు. కానీ రక్తపోటు వచ్చేందుకు ముందు మన దేహం కొన్ని హెచ్చరికలు చేస్తుంటుంది. వాటిని జాగ్రత్తగా గమనిస్తే అసలు రక్తపోటును నివారించడమో లేదా మరింత ఆలస్యంగా వచ్చేలా జాగ్రత్తపడటమో చేయవచ్చు. అలా హెచ్చరించే ఆ దశను ‘ప్రీ–హైపర్‌టెన్షన్’ దశగా చెప్పవచ్చు. ప్రీ హైపర్‌టెన్షన్ దశలోనే జాగ్రత్త పడితే మనం మనకెన్నో ఆరోగ్య అనర్థాలూ, కిడ్నీ, బ్రెయిన్ లాంటి కీలక అవయవాలు దెబ్బతినే పరిస్థితిని నివారించవచ్చు. ఆ ‘ప్రీ–హైపర్‌టెన్షన్’ దశపై అవగాహన కోసమే ఈ కథనం. ఈ జాగ్రత్త తీసుకోండి అంతగా హైబీపీ లేకుండా కేవలం ప్రీహైపర్‌టెన్షన్ ఉన్నప్పుడు... అది ప్రమాదకర దశ కాదని రిలాక్స్ కాకూడదు. అది పంపే హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తం కండి. వెంటనే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే అప్పటికీ జాగ్రత్త తీసుకోకపోతే అది గుండెపోటు, పక్షవాతం, మెదడుకు సంబంధించిన ఇతర సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. -డాక్టర్ సౌమ్యబొందలపాటి, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ పైల్స్ నివారణ ఇలా : మొలల లక్షణాలు అంతగా బాధించని స్థితినుంచి మేల్కొని కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల వాటిని సమర్థం గా నివారించవచ్చు. పైగా ఇది మంచిది కూడా. దీనివల్ల బాధాకరమైన పరిస్థితులను, చికిత్సను తప్పించుకోవచ్చు. ► మలబద్దకం లేకుండా చూసుకుంటూ విసర్జన సమయాన్ని క్రమబద్ధం చేసుకోవాలి. ∙మలబద్దకం లేకుండా ఉండటం కోసం ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే తాజా ఆకుకూరలు, పొట్టుతో ఉన్న ధాన్యంతో చేసిన పదార్థాలు, తాజాపండ్లు ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు నీళ్లు పుష్కలంగా తాగాలి. ∙మలబద్దకానికి ఆస్కారం ఇచ్చే పచ్చళ్లు, మసాలాలు, వేపుళ్లు, కారం, బేకరీ ఐటమ్స్ అయిన పిజ్జా, బర్గర్ల వంటి వాటి నుంచి దూరంగా ఉండాలి. ∙చాలాసేపు కూర్చుని చేయాల్సిన వృత్తుల్లో ఉన్నవారు అదేపనిగా కూర్చోకుండా గంటకు ఒకసారి లేచి పదినిమిషాలు తిరిగి మళ్లీ కూర్చోవాలి. -
రజనీకాంత్‌కు తీవ్ర అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : 'అన్నాత్తై’షూటింగ్ కోసం గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఉంటున్న ప్రముఖ సినీనటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ (70) శుక్రవారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులు రావడంతో ఆయన్ను హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయన్ను ప్రత్యేక ఐసీయూకు తరలించి రక్తపోటులో హెచ్చుతగ్గులను నియంత్రించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, బీపీ కూడా సాధారణ స్థితికి చేరుకుందని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే ఆయనకు కరోనా పరీక్షలు కూడా చేశామని, ఆయనకు ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని స్పష్టం చేశారు. ఆస్పత్రి వర్గాలు ఈ మేరకు శుక్రవారంసాయంత్రం మీడియా బులెటన్ విడుదల చేశాయి. ఆయనకు మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. శనివారం ఉదయం కూడా పరీక్షలు నిర్వహించి అంతా సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాకే డిశ్చార్జ్ చేయనున్నుట్ల ప్రకటించారు. మరోవైపు రజనీకాంత్ వ్యక్తిగత వైద్యులు సహా ఆయన కుమార్తె ఐశ్వర్య చెన్నై నుంచి అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హోం క్వారంటైన్లో ఉండగా... ఈ నెల 14న హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్.. 15వ తేదీ నుంచి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైన ‘అన్నాత్తై’షూటింగ్లో పాల్గొంటూ ఫిలిం సిటీలోని సితారా హోటల్లో ఉంటున్నారు. అయితే రెగ్యులర్ పరీక్షల్లో భాగంగా ఈ నెల 22న మొత్తం చిత్ర బృందానికి నిర్వహించిన కరోనా టెస్టుల్లో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రజనీ సహా ముఖ్య నటీనటులెవరికీ కరోనా సోకనప్పటికీ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో నయనతార చెన్నై వెళ్లిపోగా రజనీ మాత్రం హోటల్ గదిలోనే హోం క్వారంటైన్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం, రక్తపోటులో హెచ్చుతగ్గులు రావడంతో వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. త్వరగా కోలుకోవాలి: గవర్నర్ తమిళిసై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంతుతున్న రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. అపోలో ఆస్పత్రికి ఫోన్ చేసి రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యకు ఫోన్ చేసి రజనీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రజనీ ఆరోగ్యం గురించి తెలుసుకొనేందుకు ఆయన అభిమానులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకోగా పోలీసులు వారిని అదుపు చేశారు. ఈ నేపథ్యంలో బంధువులు, అభిమానులు, ప్రముఖులెవరూ పరామర్శల కోసం ఆస్పత్రికి రావొద్దని కుటుంబ సభ్యులు కోరారు. -
శబ్ద కాలుష్యంతో హైబీపీ, కేన్సర్!
సాక్షి, హైదరాబాద్ : పెద్ద పెద్ద శబ్దాలు, వాటితో ఏర్పడే శబ్ద కాలుష్యం వల్ల హైబీపీ, కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వచ్చే పెద్ద శబ్దాలు, ఎయిర్‌పోర్టుల్లో విమానాల ల్యాండింగ్, టేకాఫ్ అప్పుడు వచ్చే ధ్వని వంటివి జన్యువుల (కేన్సర్ సంబంధిత డీఎన్ఏల్లో) మార్పులకు కారణం కావొచ్చు. ఈ శబ్దాలు, వాయు కాలుష్యం మనుషుల్లో అధిక రక్తపోటు (హైబీపీ), కేన్సర్ కారక కణతులు ఏర్పడటానికి, అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. పెద్ద శబ్దాలు ఎలాంటి ప్రభావం చూపుతాయనేది తెలుసుకునేందుకు ఎలుకలపై జర్మనీలోని ‘యూనివర్సిటీ మెడికల్ సెంటర్ ఆఫ్ మెయింజ్’ విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన అధ్యయనంలో పలు విషయాలు తెలిశాయి. కేవలం 4రోజు లు కూడా విమానాల శబ్దాలను ఎలుకలు తట్టుకోలేకపోయాయని, వాటిలో హైబీపీ, గుండె సంబంధిత సమస్యలతో పా టు వాటి కేన్సర్ అభివృద్ధికి కారణమయ్యే డీఎన్ఏ డ్యామేజీకి దారితీసినట్టుగా గుర్తించారు. ‘మా అధ్యయనం ద్వారా వెల్లడైన సమాచారం లోతైన విశ్లేషణకు ఉపయోగపడతాయి’అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన మథాయాస్ ఉల్జే వెల్లడించారు. ఈ పరిశోధన పత్రాలను ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సొసైటీస్ ఫర్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీ జర్నల్‌లో ప్రచురించారు. చదవండి: కుక్కలకు భయపడి.. చిరుత చెట్టెక్కింది! -
ఆ కొలువులతో హైబీపీ రిస్క్..
లండన్ : వారం రోజుల పాటు నైన్ టూ ఫైవ్ జాబ్‌లతో కుస్తీపట్టే ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు తప్పవని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఒకే చోటు కూర్చుని ఏకబిగిన ఇన్నేసి గంటలు పనిచేస్తే అధిక రక్తపోటు సహా పలు వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. 3500 మంది కార్యాలయ ఉద్యోగుల ఆరోగ్యాన్ని విశ్లేషించిన మీదట కెనడాలోని లావల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వివరాలు వెల్లడించారు. వారానికి 40 గంటలు పైబడి పనిచేసే ఉద్యోగుల్లో అంతకంటే తక్కువ పనిగంటలు పనిచేసే వారితో పోలిస్తే అధిక రక్తపోటుకు గురయ్యే ముప్పు మూడింట రెండు వంతులు అధికమని వెల్లడైంది. వారానికి 40 గంటలు పనిచేసే వారిలో హైపర్‌టెన్షన్‌కు లోనయ్యే అవకాశం 50 శాతంగా నమోదైంది. ఇక వారానికి 35 గంటలే పనిచేసేవారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఇక వారానికి 49 గంటలకు పైగా పనిచేసే వారిలో ఈ రిస్క్ ఏకంగా 70 శాతంగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. పని ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామం కొరవడటం ఈ పరిస్ధితికి దారితీస్తోందని అథ్యయనం తెలిపింది. అధిక రక్తపోటు స్ర్టోక్, గుండె పోటు, కిడ్నీ వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. ఐదేళ్ల పాటు సాగిన ఈ అథ్యయనంలో మూడు ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగులను పరీక్షించారు. -
పిల్లల్లో బీపీ
చిన్నపిల్లల్లో, అప్పుడే యుక్తవయసుకు వస్తున్న కౌమార బాలల్లో హైబీపీ (హైపర్‌టెన్షన్) ఉంటోందా? ఉంటోంది. ఇప్పుడీ సమస్య వారిని వేధిస్తోంది. తమకు తెలియకుండానే నూరేళ్ల పాటు హాయిగా,ఆరోగ్యంగా జీవించాల్సిన వారి బతుకుల్లో అంధత్వం, మూత్రపిండాల వ్యాధి రూపంలో వారి బతుకుల్లో చీకటి నింపుతోంది. ఇటీవల ఈ సమస్య పెరుగుతోంది. రేపు ‘వరల్డ్ హైపర్‌టెన్షన్ డే’సందర్భంగా చిన్నపిల్లల్లో హై–బీపీ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం. చిన్నపిల్లల్లోనూ(3 నుంచి 11 ఏళ్ల మధ్య వయసు పిల్లలు), కౌమారంలోకి వస్తున్న తరుణ వయస్కుల్లోనూ (12 నుంచి 18 ఏళ్ల మధ్యవారు) హైబీపీ కనిపించడం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో బీపీ చాలా జాగ్రత్తగా కొలవాలి. పిల్లల్లో బీపీని తెలిపే ఛార్ట్‌ను సెంటైల్ చార్ట్ అంటారు. పిల్లల్లోనూ, కౌమార బాలల్లోనూ బీపీ కొలిచే సమయంలో ఆ విలువలు వాళ్ల వయసునూ, జెండర్నూ, వాళ్ల ఎత్తును బట్టి మారుతూ ఉంటాయి. అందుకే... తల్లిదండ్రులు మొదట పిల్లల వయసు, బరువు, ఎత్తు... వీటన్నింటినీ కొలిచి... నాలుగైదు రోజుల పాటు మామూలు ఆపరేటస్తోనే రెండు చేతులకూ, కాళ్లకూ వాళ్ల బీపీ రీడింగ్స్ తీసుకోవాలి. వాటిని హాస్పిటల్లో పిల్లల డాక్టర్‌కు చూపిస్తే... వారు ఆ రీడింగ్స్‌ను బట్టి లెక్క వేసి, పర్సంటైల్ నిర్ణయించి, హైబీపీ ఉన్నదీ లేనిదీ తెలుసుకుంటారు.ఇందులో కొలత 90 ఉంటే అది బీపీ ఉన్నట్లు కాదు. బీపీ పర్సంటైల్ 95 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అది పిల్లల్లో హైబీపీ ఉన్నదనడానికి సూచన. ఆ రీడింగ్ 95–99 ఉంటే ఆ పిల్లలకు హైపర్‌టెన్షన్ స్టేజ్–1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్–2గా పరిగణించవచ్చు. ఈ తీవ్రతలను బట్టి అంటే... స్టేజ్–1, స్టేజ్–2లను పరిగణనలోకి తీసుకునే ఏ తీవ్రత ఉన్న పిల్లలకు ఎలాంటి చికిత్స అన్నది నిర్ణయిస్తారు. పిల్లల హై–బీపీల్లో రకాలు పిల్లల్లో ఉన్న హైబీపీని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది ఎసెన్షియల్ లేదా ప్రైమరీ హైపర్‌టెన్షన్. ఇందులో హైబీపీకి కారణం ఏమిటన్నది తెలియదు. అయితే సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనిపించే ఎక్కువగా బరువు ఉండటం, ఊబకాయం (ఛైల్డ్‌హుడ్ ఒబేసిటీ) వంటివి దీనికి కారణాలు కావచ్చని భావిస్తుంటారు. చాలామంది పిల్లల్లో బాల్యం వీడేముందు లేదా కౌమారంలోకి ప్రవేశించే ముందు ఈ ఎసెన్షియల్ లేదా ప్రైమరీ హైపర్ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక రెండోది సెకండరీ హైపర్‌టెన్షన్. ఈ రెండో రకం హైబీపీకి మూత్రపిండాల జబ్బులు లేదా హార్మోన్లలో సమస్య వంటిది ఏదో ఒక కారణం ఉంటుంది. ఎవరిలోనైనా లక్షణాలు బయటకు కనిపిస్తూ హైపర్‌టెన్షన్ ఉందంటే ఆ పిల్లలకు దీర్ఘకాలిక దుష్ప్రభావాలు రావచ్చనడానికి సూచన. పైగా ఏ కారణం వల్ల వారికి ఇలా హైపర్‌టెన్షన్ కనిపిస్తోందో, దానికి చికిత్స తీసుకోకపోతే భవిష్యత్తులో అది మరింత ప్రమాదకరంగా మారి ప్రాణాంతకమైన గుండెజబ్బులు, మూత్రపిండాల జబ్బులు లేదా కంటిచూపును ప్రభావితం చేయడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. ఇక మరికొంతమంది పిల్లల్లో హైబీపీ విచిత్రంగా కనిపిస్తుంటుంది. ఇలాంటివారిలో ఆ పిల్లలు హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రమే వారిలో హైబీపీ కనిపిస్తుంటుంది. వారి సాధారణ పరిసరాలు, ఇళ్లు, ఆటస్థలాల్లో పరీక్షించినప్పుడు వారిలో హైబీపీయే కనిపించదు. ఇలాంటి పిల్లలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లే. వారి సమస్యకు ఎలాంటి చికిత్సా అవసరం ఉండదు. ఈ పిల్లల హై–బీపీని ‘వైట్ కోట్ హైపర్‌టెన్షన్’ అంటారు. అంటే హాస్పిటల్లో డాక్టర్లను చూసినప్పుడు మాత్రమే ఆందోళనతో వారి బీపీ పెరుగుతుందన్నమాట. అయితే ఈ తరహా బీపీని నిర్ధారణ చేయడం చాలా జాగ్రత్తగా జరగాలి. దాదాపు 12 నెలల పాటు వారిని వేర్వేరు చోట్ల పరీక్షిస్తూ ఉన్న తర్వాతే ఆ పిల్లల బీపీని వైట్‌కోట్ హైపర్‌టెన్షన్‌గా పరిగణించాల్సి ఉంటుంది. హై–బీపీ పిల్లల్లో కనిపించే సమస్యలు హై–బీపీ ఉన్న పిల్లల్లో అది వారి ఆరోగ్యంపై చాలా రకాలుగా దుష్ప్రభావాలు చూపుతుంటుంది. ఉదాహరణకు ఇలాంటి పిల్లలు త్వరగా ఉద్వేగాలకు గురికావడం, చాలా వేగంగా చిరాకు పడటం, ఎదుగుదల చాలా తక్కువగా ఉండటం, వాంతులు చేసుకుంటూ ఉండటం, తినడంలో సమస్యలు, ఫిట్స్, శ్వాసవ్యవస్థకు సంబంధించిన సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఇవిగాక మరికొన్ని సమస్యలూ ఉంటాయి. తక్షణం కనిపించే సమస్యలు(అక్యూట్ కాంప్లికేషన్స్) హైబీపీతో బాధపడే పిల్లల్లో అప్పటికప్పుడు కొన్ని అనర్థాలు కనిపించవచ్చు. వారిలో హైపర్టెన్సివ్ ఎన్సెఫలోపతి వంటి మెదడుకు సంబంధించిన సమస్య కనిపించవచ్చు. అంటే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వారు మగతగా మారిపోవడం, కోమాలోకి వెళ్లడం, బీపీ వచ్చాక ఫిట్స్ వస్తూ ఉండటం, మెదడులో రక్తస్రావం కావడం, గుండెవైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్), మూత్రపిండాల వైఫల్యం (రీనల్ ఫెయిల్యూర్) వంటి సమస్యలు కనిపించవచ్చు. కేవలం హైబీపీ ఉన్నంతమాత్రాన ఈ సమస్యలన్నీ వచ్చేస్తాయని కాదు. అయితే ఈ పిల్లల్లో వచ్చిన బీపీ తీవ్రత, ఆ హైబీపీ ఎంతసేపు కొనసాగింది వంటి అంశాల మీద ఈ దుష్ప్రభావాలు ఆధారపడి ఉంటాయి. హైపర్టెన్సివ్ ఎన్సెఫలోపతి వచ్చిన పిల్లలు చాలా బద్దకంగా, మగతగా, మందకొడిగా ఉంటారు. వారు తరచూ తలనొప్పి వస్తుందంటూ ఫిర్యాదు చేస్తుంటారు. ఇక ఫిట్స్ రావడం, చూపునకు సంబంధించిన సమస్యలు రావడం కూడా మామూలే. వారిలో వచ్చే హార్ట్‌ఫెయిల్యూర్ సమస్య అన్నది వారిలో హైబీపీ తీవ్రత చాలా ఎక్కువగా పెరిగితే అది భవిష్యత్తులో వారికి ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చు. ఇలా చాలా తక్కువ సమయంలోనే చాలా ఎక్కువ బీపీ కనిపిస్తున్న పిల్లల కేసులను ఎమర్జెన్సీగా పరిగణించి, ఆ పిల్లల్లోని బీపీ నియంత్రణలో ఉండేలా చికిత్స చేయడం అవసరం. దీర్ఘకాలిక దుష్పరిణామాలు ఇక పెద్దల్లో మాదిరిగానే పిల్లల్లో కూడా హైబీపీ వల్ల కళ్లు దెబ్బతిని చూపు ప్రభావితం కావడం, గుండె, కిడ్నీలు, మెదడు, రక్తనాళాలు దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. వైద్య పరీక్షలు – నిర్ధారణ పిల్లల్లో కనిపించే లక్షణాలు బట్టి పిల్లల్లో హైబీపీని తెలుసుకోడానికి చాలా జాగ్రత్తగానూ, చాలా నిశితంగానూ వారిని పరీక్షించాల్సి ఉంటుంది. పిల్లల్లో ఉన్న ఆహారపు అలవాట్లను పరిగణనలోకి తీసుకోవాలి. పిల్లలు పొట్టకు సంబంధించిన ఫిర్యాదులు ఏవైనా చేస్తున్నారా అన్నదాని ఆధారంగా కూడా వారిలో బీపీని పరీక్షించాలి. అలాగే పిల్లల్లో మూత్రపిండాల సమస్య, గుండెజబ్బులు, థైరాయిడ్ సమస్యలు ఉంటే వారి బీపీని తప్పక పరీక్షించాలి. పిల్లల్లో డయాబెటిస్ ఉన్నా, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ మోతాదులు ఎక్కువగా ఉన్నా, వారి బరువు ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నా... ఇక గుండెజబ్బులు, పక్షవాతం, కిడ్నీ సమస్యల వంటివి చాలా చిన్న వయసులోనే (ప్రీమెచ్యుర్ కార్డియోవాస్క్యులార్ డిసీజెస్, స్ట్రోక్స్ అండ్ రీనల్ డిజార్డర్స్) కనిపించినా... ఆ పిల్లల బీపీని చాలా నిశితంగా పరీక్షిస్తూ ఉండాలి. ఇలా పరీక్షించే సమయంలో పిల్లల ఎత్తు, వారి బరువు, వారి బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) వంటి అంశాలను పరిశీలించాలి. అలాగే ఆ పిల్లల తల్లిదండ్రుల్లో స్థూలకాయం, ఉండాల్సిన దానికంటే ఎక్కువగా బరువు ఉండటం వంటివి కనిపిస్తుంటే అలాంటి పిల్లల్లో ఎసెన్షియల్/ప్రైమరీ హైపర్‌టెన్షన్ కనిపించే అవకాశాలు ఎక్కువ. అందుకే తల్లిదండ్రులు ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా బరువున్న సందర్భాల్లోనూ ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ పిల్లలను చాలా జాగ్రత్తగా పరీక్షించాలి. ఇలా పిల్లల్లో బీపీని కొలవాల్సిన సందర్భాల్లో కేవలం బీపీ ఆపరేటస్ను వారి చేతులకు మాత్రమే అమర్చడం కాకుండా... వాళ్ల కాళ్లకు సైతం అమర్చి బీపీ కొలతలు తీసుకుంటూ ఉండాలి. ఈ రెండురకాల కొలతలు తీసుకొని పరిశీలించడం, పోల్చిచూడటం చాలా అవసరం. కాళ్ల దగ్గర బీపీ కొలతలు తీసుకునేప్పుడు రెండు కాళ్లకూ కొలతలు తీసుకుంటే మంచిది లేదా కనీసం ఒక కాలికైనా కొలత తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పిల్లలను భౌతికంగా (ఫిజికల్‌గా) పరీక్షించే సమయంలో వారు శారీరకంగా ఎంత శ్రమపడుతున్నారు (ఫిజికల్ యాక్టివిటీ) వంటి అంశాలనూ చూడాలి. అలాగే పిల్లల్లో హై–బీపీ కనిపిస్తోందంటే చాలామందిలో అది ఏ మూత్రపిండాల సమస్యవల్లనో లేదా గుండెజబ్బుల వల్లనో లేదా హార్మోనల్ సమస్యల వల్లనో అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆ దిశగా కారణాలు తెలుసుకోవడం కోసం ఆయా అవయవాలకు సంబంధించిన పరీక్షలూ చేయించడం అవసరం. అలాగే కొన్ని కీలకమైన అవయవాలు (మెదడు, గుండె, మూత్రపిండాలు) ఏవైనా దెబ్బతిన్నాయా, ఒకవేళ దెబ్బతిని ఉంటే అది ఏమేరకు అన్న విషయాలు తెలుసుకోవడం కూడా అవసరం. ఈ సందర్భంగా ఆ పరీక్షలు కూడా చేయించాల్సి ఉంటుంది. చాలా తక్కువ వయసు చిన్నారుల్లో హైబీపీ కనిపిస్తుంటే సాధారణ భౌతిక పరీక్షలతోపాటు వారి కుటుంబ ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ)తో పాటు ఆ కుటుంబ సభ్యులకు ఉన్న ఆరోగ్య సమస్యలనూ పరిగణనలోకి తీసుకొని పిల్లలను చాలా నిశితంగా పరీక్షించాల్సి ఉంటుంది. సమస్యను ఎదుర్కోవడం ఎలా(మేనేజ్మెంట్) సమస్యను ఎదుర్కోవడానికి ముందుగా ఆ చిన్నారిలో కనిపిస్తున్నది ఎసెన్షియల్/ప్రైమరీ హైపర్టెన్షనా లేక సెకండరీ హైపర్టెన్షనా అని నిర్ధారణ చేసుకోవాలి. ఆ తర్వాత హైబీపీని అదుపులో ఉంచడం కోసం జీవనశైలిలో మార్పులు అవసరం. ఒకవేళ సమస్య అన్నది సెకండరీ హైపర్‌టెన్షన్‌తో అయితే సమస్యను బట్టి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. జీవనశైలిలో మార్పులు: హైపర్‌టెన్షన్ ఉన్న పిల్లలు వారి డాక్టర్ల సూచన మేరకు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు వారు చాలా ఎక్కువగా బరువు ఉంటే ఆ బరువును తగ్గించుకోవడం, ఎత్తుకు తగిన బరువు మాత్రమే ఉండేలా నియంత్రించుకోవడం వంటివి చేయాలి. ఇందుకోసం శారీరకంగా ఒళ్లు అలసిపోయేలా వ్యాయామం చేయడం, ఆటలు ఆడటం వంటివి అవసరం. ఇది కేవలం వారిని భౌతికంగా మాత్రమే కాకుండా... మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంచుతుంది. వ్యాయామాలు చేయడం వల్ల అతిగా శ్రమతో పాటు విసుగు కలిగించవచ్చు. ఇలాంటి పిల్లలకు తేలిగ్గా, ఉత్సాహంగా అనుసరించగలిగేలా నడక, సైక్లింగ్, స్కూల్లో ఆడే ఆటలు, ఈత వంటివి బాగా సహాయం చేస్తాయి. పిల్లల్లో రోజూ కనీసం 30 – 60 నిమిషాల పాటు ఈ తరహా శారీరక వ్యాయామాలు చాలా అవసరం. ఆహారపరమైన మార్పులు: పిల్లలు తినే ఆహారాల్లో ఉప్పు చాలా తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆహారాల్లో పైనుంచి ఏమాత్రం ఉప్పు కలపకూడదు. ఇక ఉప్పు మోతాదు ఎక్కువగా ఉండే బయటి ఆహారాలైన క్యాన్డ్ ఫుడ్, పిజ్జాలు, ఫ్రెంచ్‌ఫ్రైస్, సాల్టెడ్ పొటాటో చిప్స్ వంటి జంక్ ఫుడ్ నుంచి పూర్తిగా దూరంగా ఉంచాలి. పిల్లలు తీసుకునే ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు, పొట్టుతీయని ఆహారధాన్యాలతో చేసే వంటలు, కొవ్వు లేని పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూడాలి. అతిగా వేయించిన వేపుళ్లు, తీపి మిఠాయిలు చాలా పరిమితంగా మాత్రమే పిల్లలు తీసుకునేలా చూడాలి. సెకండరీ హైపర్‌టెన్షన్‌ను ఎదుర్కోండి ఇలా... పిల్లల్లో సెకండరీ హైపర్‌టెన్షన్ ఉన్నప్పుడు వారికి ఏ సమస్యను బట్టి హై–బీపీ వచ్చిందో ముందుగా ఆ సమస్యకు తగిన చికిత్స అందించడం అవసరం. ఆ మందులతో పాటు పిల్లల్లో హైబీపీ తగ్గించడానికి, ఆ బీపీని నియంత్రణలో ఉంచడానికి కూడా మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే మిగతా జీవనశైలి మార్పులు కూడా అనుసరించాలి. ఒకవేళ పిల్లల్లో హైపర్‌టెన్షన్‌కు సంబంధించన ఎలాంటి దుష్ప్రభావాలూ లేకపోయినా... ఆ పిల్లల బరువు మితిమీరి ఉంటే మాత్రం భవిష్యత్తులో వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా ముందుగానే నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వారి ఎత్తుకు తగినంత బరువు ఉండేలా... వారి బరువు తగ్గేందుకు చర్యలు తీసుకోవాలి. దీన్నే ‘స్టెప్–డౌన్’ చికిత్సగా పరిగణిస్తారు. ఇలాంటి పిల్లల్లో 8 – 12 నెలల పాటు వారి ఎత్తుకు తగినంత బరువుకు వచ్చేలా వైద్యనిపుణులు జీవనశైలి మార్పులు సూచిస్తారు. ఇలాంటి హై–రిస్క్ ఉన్న పిల్లలందరికీ ప్రతి మూడు నెలల కోసారి బీపీ పరీక్షించడం, వారి వారి రిస్క్ (ముప్పు)ను బట్టి కంటి, గుండె, మూత్రపిండాలకు సంబంధించిన తగిన పరీక్షలు చేయిస్తూ ఉండటం అవసరం. ఇక మందులను కూడా ఇతర అవయవాలపై దుష్ప్రభావాలు (సైడ్–ఎఫెక్ట్స్) పడకుండే ఉండేలా చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి వాడటం అవసరం. ఇలా మందులు వాడే పిల్లల్లో ఆ దుష్ప్రభావాలను తెలుసుకోవడం కోసం ప్రతి ఏడాదీ ఆయా అవయవాల పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ఏయే సందర్భాలు ఎమర్జెన్సీగా పరిగణించాలి... పిల్లల్లో హైబీపీ కనిపించినప్పుడు చాల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బీపీ ఎక్కువగా ఉన్న ప్రతిసారీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం లేకపోయినా... నిర్దిష్టంగా కొన్ని సందర్భాల్లో మాత్రం తప్పక హాస్పిటల్లో ఉంచే చికిత్స అందించాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా బీపీ పెరగడం, మెదడు, గుండె, మూత్రపిండాలు ప్రభావితం కావడం జరిగితే... ఆ పిల్లలను తప్పక హాస్పిటల్లో ఉంచే చికిత్స అందించాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న కారణాలను దృష్టిలో ఉంచుకొని పిల్లల భౌతిక పరీక్షల సమయంలో వారి దేహ నిర్మాణాన్ని, వారి ఎత్తు, బరువులను పరిగణనలోకి తీసుకొని వైద్యులు కూడా ఒకసారి వారి బీపీని పరీక్షించడం అవసరం. ఆ బీపీలో తేడాలు ఏవైనా కనిపించినప్పుడు దానికి కారణాలను కనుగొనాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలాంటి పిల్లల విషయంలో క్రమం తప్పకుండా తప్పనిసరిగా ఫాలోఅప్‌కు వస్తుండాలని తల్లిదండ్రులకు సూచించాలి. వారి బీపీ తీవ్రతను బట్టి తల్లిదండ్రులకు తగిన కౌన్సెలింగ్ ఇస్తుండటం అవసరం. ఈ పిల్లల్లోహైబీపీవిషయంలోజాగ్రత్తగా ఉండాలి... ఈ కింద పేర్కొన్న పిల్లల విషయంలో హైపర్‌టెన్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఎవరంటే... ♦ నెలలు నిండకముందే పుట్టిన పిల్లలు, పుట్టినప్పుడు చాలా తక్కువ బరువుతో ఉన్నవారు. ♦ పుట్టుకతోనే గుండెజబ్బులు (కంజెనిటల్ హార్ట్ డిసీజెస్) ఉన్నవారు. ♦ తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కు గురవుతున్నారు లేదా మూత్రపిండాలు, మూత్రసంబంధమైన వ్యాధులు ఉన్నవారుకుటుంబంలో ఎవరికైనా మూత్రపిండాల వ్యాధి ఉంటే ఆ కుటుంబంలోని పిల్లలు. ♦ చిన్నవయసులోనే క్యాన్లర్లు వచ్చిన పిల్లలు ♦ వీళ్లకు మాత్రమే కాకుండా... ఫిట్స్‌తో బాధపడేవారు, ఎప్పుడూ మగతగా ఉన్నట్లు కనిపించే పిల్లలు, తలనొప్పులతో బాధపడే పిల్లలు, చూపు సమస్యలు ఉన్న పిల్లలనూ బీపీ విషయంలో చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. తరచూ పరీక్షించాలి. -
రక్తపోటు నియంత్రణతో ఆ రిస్క్‌కు చెక్
లండన్ : అధిక రక్తపోటుతో గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు, కిడ్నీ వ్యాధులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్న క్రమంలో బీపీని నియంత్రణలో ఉంచితే అల్జీమర్స్, డిమెన్షియా ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా అథ్యయనంస్పష్టం చేసింది. రక్తపోటును అదుపులో ఉంచుకునే వారిలో మతిమరుపు రిస్క్ 19 శాతం తక్కువగా ఉన్నట్టు 50 సంవత్సరాల పైబడిన 9000 మందిపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఇక వీరిలో డిమెన్షియా ముప్పు 15 తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. రక్తపోటును పూర్తి అదుపులో ఉంచుకోవడం ద్వారా డిమెన్షియా ముప్పును తగ్గించవచ్చని పరిశోధనలో తేలని క్రమంలో ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు మార్గం సుగమమైందని అల్జీమర్స్ అసోసియేషన్‌కు చెందిన చీఫ్ సైన్స్ అధికారి డాక్టర్ మారియా కరిల్లో చెప్పుకొచ్చారు. రక్తపోటును మూడేళ్ల పాటు పూర్తిగా అదుపులో ఉంచుకుంటే అది గుండె, మెదడు ఆరోగ్యాలపై సానుకూల ప్రభావం చూపినట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన నార్త్ కరోలినాకు చెందిన వేక్ ఫారెస్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అథ్యాపకుడు ప్రొఫెసర్ జెఫ్ విలియమ్సన్ వెల్లడించారు. -
ఆహా..నివారణం
మనిషికి ఆరోగ్యాన్ని మించినహారం ఉండదు. మీ జీవితాలను ఆరోగ్యంతో సత్కరించుకోండి. కొత్త సంవత్సరంలో మీరంతా ఆరోగ్యంగా ఉండటానికి, అనారోగ్య నివారణకు ఇదిగో... మీ కోసమే ఈ సూచనల మాల. హైబీపీ నివారణ, నియంత్రణలకు ఆహార నియమాలు హైబీపీ రానివాళ్ల నివారణకూ, ఒకవేళ వస్తే నియంత్రణకూ విధిగా పాటించాల్సిన ఆహార నియమాలివి... అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియవూలు తప్పనిసరిగా పాటించాల్సింది. హైబీపీకి ఇప్పుడు అవుల్లో ఉన్న ఆహార నియవూవళిని ‘డ్యాష్’ అంటారు. ‘డయటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అన్న వూటలకు సంక్షిప్తరూపమే ఈ డ్యాష్. హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పుష్కలంగా తీసుకోవాలి. వాటిలో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ కాబట్టి ఆ ఆహారం తీసుకోవడం ప్రధానం. అలాగే వాళ్లకు క్యాల్షియం కూడా అవసరం. అయితే ఇందుకోసం వాళ్లు కొవ#్వ పాళ్లు (వెన్నపాళ్లు) తక్కువగా ఉన్న పాలూ, పాల ఉత్పాదనలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఉప్పు (సోడియం) పాళ్లను తగ్గించాలి. బరువపెరక్కుండా చూసుకోవాలి. హైబీపీ ఉంటే దాన్ని నియంత్రించుకోవడం కోసం జీవనశైలిలో వూర్పులు విధిగా పాటించాల్సి ఉంటుంది. అంటే... ఉప్పుతో పాటు సోడియం పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలైన నిల్వ ఆహారం (ప్రిజర్వ్డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. అలాగే తాజాపళ్లు, పొట్టు ఉన్న తృణధాన్యాలు మీ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ఆపేయాలి. బరువ పెరగకుండా శారీరక కార్యకలాపాలు (ఫిజికల్ యాక్టివిటీస్) ఉండేలా చూసుకోవాలి. క్యాన్సర్‌తో పాటు చాలా రకాల ఇతర జబ్బులనుంచి నివారణ జరగానికి ఆహారం విషయంలో ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు చాలా మేలు చేస్తాయి. పీచు ఎక్కువగా తీసుకోవడం : మన ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ప్రధానం. ఈ పీచులోనూ రెండు రకాలుంటాయి. అవి నీటిలో కరిగే పీచు. ఓట్స్ తవుడు, వేరుశనగలు, బీన్స్‌లో ఈ తరహా పీచు ఉంటుంది. ఇక నీళ్లలో కరగని పీచు. గోధుమపొట్టు, తాజా పండ్లపై ఉండే పొట్టు, గింజలలో ఈ తరహా పీచు ఉంటుంది. అది ఎలాంటి పీచు పదార్థమైనా ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు. దీనికి చేయాల్సిందల్లా మన ఆహారంలో పొట్టుతీయని ధాన్యాలు, తాజా పండ్లు, ఆకుపచ్చటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఇది అన్ని రకాల క్యాన్సర్లకు నివారణే అయినా ప్రత్యేకంగా జీర్ణవ్యవస్థ తాలూకు క్యాన్సర్లను సమర్థంగా నివారిస్తుంది. ఈ పీచు మలబద్దకంతో పాటు ఇంకా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎన్నో వ్యాధుల నుంచి నివారణనిస్తుంది. ఆకుకూరలు పెంచండి : మీ ఆహారంలో ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలనూ, తాజా పండ్లను పెంచడం క్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తుంది. అదే సమయంలో మీ ఆహారంలో ఫ్రెంచ్‌ఫ్రైస్, చిప్స్, ఐస్‌క్రీమ్స్‌ను వీలైనంతగా తగ్గించండి. మాంసాహారం విషయంలో చేపలు ఎక్కువగా తీసుకోండి. వేటమాంసం, రెడ్మీట్ను గణనీయంగా తగ్గించండి. వీలైతే దానికి బదులు చికెన్, చేపలు తినడమే మేలు. తాజా పండ్లు, ఆకుకూరల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా క్యాన్సర్లను నివారిస్తాయి కాబట్టి వాటిని కూడా ఎక్కువగా తీసుకోవడం క్యాన్సర్ నివారణకు దోహదపడుతుంది. దాంతోపాటు లైకోపిన్ అనే పోషకం ఎక్కువగా ఉండే టమాటా, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే క్యారట్ వంటివి కూడా క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. ఇవి సాధారణ ఆరోగ్యానికి దోహదం చేయడమే కాకుండా... మరికొన్ని సాధారణ ఇతర జబ్బులనూ నివారిస్తుంది. ఉప్పుతో క్యాన్సర్‌కు ఉన్న సంబంధం : ఉప్పుకూ క్యాన్సర్‌కూ నేరుగా సంబంధం లేకపోయినా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలైన పచ్చళ్లు, అప్పడాలు ఎక్కువగా తినే మన దక్షిణ భారతదేశవాసుల్లో ఈసోఫేగల్ క్యాన్సర్లు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లు, నేసోఫేరింజియల్ క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఉప్పును పరిమితంగా తీసుకోవాలి. చక్కెరలతో క్యాన్సర్ ఎక్కువా? : చక్కెర ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి క్యాన్సర్‌కు నేరుగా దోహదపడతాయని చెప్పలేకపోయినా... స్థూలకాయం అన్నది క్యాన్సర్‌కు ఒక తెలిసిన రిస్క్. కాబట్టి చక్కెరలను పరిమితంగా తీసుకోవాలి. ఇక కొందరు తెల్లగా ఉండే చక్కెర కంటే కాస్తంత గోధుమ రంగులో ఉండే చక్కెర మంచిదనీ, దానికంటే తేనె వల్ల సమకూరే చక్కెర మంచిదని అనుకుంటుంటారు. తేనె లోని పోషకాలను మినహాయించి కేవలం చక్కెర వరకే చూస్తే... ఏ రకం చక్కెరతోనైనా అదే రిస్క్ ఉంటుంది. కాబట్టి మనం తీపిని ఏ రూపంలో తీసుకున్నా దాన్ని పరిమితంగానే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. ఆల్కహాల్ ఆపేయండి : ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువే. పైగా నోరు, గొంతు (ఫ్యారింగ్స్), ఆహారనాళం (ఈసోఫేగస్), రొమ్ము, పెద్దపేగు, మలద్వార (కోలోరెక్టల్) క్యాన్సర్లకు ఆల్కహాల్ ఒక కారణం. కాబట్టి ఆల్కహాల్ మానేస్తే చాలా రకాల క్యాన్సర్లకు మనం ద్వారాలు మూసేసినట్లే. ఎముకలను పరిరక్షించుకోడానికి.. ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియమ్ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. మరో విషయం ఎముకలు ఆరోగ్యంగా ఉన్నవారిలో గుండె కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే. ఎందుకంటే... రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న 60 శాతం మంది గుండెపోటుకు గురవుతుంటారు. కాబట్టి ఎముకలను కాపాడుకోవడం అంటే దాంతోపాటు గుండెనూ రక్షించుకోవడం లాంటిది. అందుకే ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోడానికి క్యాల్షియమ్ పుష్కలంగా తీసుకోవాలి. క్యాల్షియమ్ పాలలో పుష్కలంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందువల్ల ఎముకల ఆరోగ్యం కోసం రోజూ కనీసం 200 ఎం.ఎల్. పాలు తాగడం అన్నది క్యాల్షియమ్ పొందడానికి సులువైన, రుచికరమైన మార్గం. మెదడుకు మేలు చేసే ఆహారాలు మెదడు చురుగ్గా ఉండాలన్నీ, మెదడుకు సంబంధించిన డిమెన్షియా వంటి వ్యాధుల నివారణ జరగాలన్నా మనం తినేవాటిల్లో ఈ కింది ఆహారాలు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. చేపల్లో : పండు చేప / పండుగప్ప, వంజరం, కనగర్తలు (మాకరెల్)... వీటిలో మెదడు చురుకుదనానికి దోహదం చేసే ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ. నూనెల్లో : మెదడు చురుకుదనానికి దోహదం చేసే నూనెల్లో ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్, కొవ్వులను అరికడుతుంది. కాబట్టి మెదడుకు వచ్చే పక్షవాతం (స్ట్రోక్), అల్జీమర్స్ వ్యాధులను నివారిస్తుంది. పండ్లలో : మెదడుకు మేలు చేసే పండ్లలో బెర్రీలుమంచివి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు వంటివి మెదడుకు మంచివి. ఆకుకూరలు : కూరగాయల్లో : పాలకూర మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇక బీట్రూట్, చిక్కుళ్లు వంటి వాటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మెదడు కణాలను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచి, వాటిని అనేక వ్యాధులనుంచి రక్షణ కల్పిస్తాయి. వీటితో పాటు డార్క్ చాకొలెట్, గ్రీన్ టీ కూడా ఇటు మెదడుకు, అటు గుండెకూ మేలు చేస్తాయి. మెదడుకు హాని చేసే ఆహారాలు నిల్వ ఉంచిన ఉప్పటి పదార్థాలైన చిప్స్, టిన్న్‌డ్ సూప్స్ మెదడుకు హనికరంగా పరిణమిస్తాయి. కాబట్టి వాటిని చాలా పరిమితంగా తీసుకోవాలి. మనం తీసుకునే ఉప్పు రోజుకు 6 గ్రాములకు మించితే అది ఆరోగ్యంతో పాటు మెదడుకూ చేటు చేస్తుంది. కొవ్వుల్లో డాల్డా, మాంసాహారంలో ఉండే కొవ్వులు మెదడుకు అంత మంచిది కాదు. అందుకే మాంసాహారం తినేవారు కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలే తీసుకోవాలి. బటర్, క్రీమ్ కూడా పరిమితంగా వాడాలి. ఆల్కహాల్ మెదడుకు హాని చేస్తుంది. ఇది తీసుకున్నప్పుడు తక్షణ ప్రభావంగా మెదడుని స్థబ్దంగా ఉంచుతుంది. ఇక దీర్ఘకాలంలో డిమెన్షియా (మతిమరపు) వంటి మెదడు సమస్యలకు దోహదం చేస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా మానేయాలి. గుండెజబ్బులను ఆహార పదార్థాలతోనే నివారించుకోవడం ఇలా.. మొక్కజొన్నల్లోని క్రోమియమ్ గుండెజబ్బులను తగ్గిస్తుంది. స్వీట్‌కార్న్‌లోని క్రోమియమ్ ఎంత ఎక్కువైతే గుండెజబ్బు అవకాశాలు అంత తగ్గుతాయి. కీవీ ఫ్రూట్స్ రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను సమర్థంగా 15 శాతం తగ్గించగలదు. రక్తాన్ని పలచబార్చేందుకు మందుల దుకాణంలో కొనే ఆస్పిరిన్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో... కీవీ పండు కూడా అలాంటి ఫలితాలను ఇస్తుందని ఓస్లో యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. మీకు కీవీ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే తరచూ తినండి. ప్రతిరోజూ కనీసం 60 ఎం.ఎల్. దానిమ్మ జ్యూస్ తాగేవారికి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ప్రతిరోజూ దానిమ్మ జ్యూస్ తాగేవారిలో ఒక ఏడాది తర్వాత రక్తనాళాల్లో అడ్డంకులు చాలావరకు తగ్గుతాయని ఇజ్రాయెల్‌లోని రామ్‌బమ్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అప్పుడప్పుడూ చాక్లెట్ మిల్క్‌షేక్‌లు తాగుతుండాలి. గుండెజబ్బుల రిస్క్ తగ్గించుకునేందుకు ఇదో రుచికరమైన మార్గం. చాక్లెట్‌లోని కోకోలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం రక్తనాళాలు గరుకుగా మారి రక్తం గడ్డగట్టే గుణాన్ని (అథెరోస్కీ›్లరోసిస్ను) గణనీయంగా తగ్గిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ బార్సెలోనా పరిశోధకులు చెబుతున్నారు. చికెన్ సలామీ (మన దగ్గర అయితే చికెన్ షేర్వాతో గ్రేవీ ఎక్కువగా ఉండేలా వండే కోడి కూర)లో కాస్తంత నిమ్మకాయ పిండుకుని తినడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు వెల్లడించారు. అయితే ఇక్కడ రెడ్‌మీట్, వేటమాంసాల షేర్వా అదే ఫలితాన్ని ఇవ్వదని, కొవ్వులు పెంచుతుందని గుర్తుంచుకోవాలి. రోజూ మనం మూడు పూటల్లో తీసుకునే ఆహార పరిమాణాన్నే ఆరు పూటలుగా విభజించుకొని తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గడానికి దోహదపడుతుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ చెబుతోంది. కొవ్వులేని పాలతో తోడేసిన పెరుగు తినడం గుండెకూ మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి అన్ని విధాలా మేలు చేస్తుంది. జుట్టు రాలడం ఆగాలా? మీకు జుట్టు ఊడిపోతోందా? ఆహారంతోనే దాన్ని ఆపుదామనుకుంటే మీ భోజనంలో ఉండాల్సిన పోషకాలివి.. మీ ఆహారంలో జింక్, ఐరన్, విటమిన్–సి... ఈ మూడు పోషకాలు ఉంటే జుట్టు రాలడం ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. అందుకే జుట్టు రాలడాన్ని నివారించాలంటే ఈ మూడు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. జింక్ కోసం తినాల్సినవి... గుమ్మడి గింజల్లో జింక్ సమృద్ధిగా ఉంటుంది. అంతేకాదు... సీఫుడ్, డార్క్‌చాక్లెట్, వేరుశనగలు, వేటమాంసంలో జింక్ ఎక్కువ. ఇక పుచ్చకాయ తిన్నప్పుడు వాటి గింజలను ఊసేయకండి. ఒకటో రెండో కాస్త నమలండి. ఎందుకంటే పుచ్చకాయ గింజల్లోనూ జింక్ ఎక్కువే. ఐరన్ కోసం తినాల్సినవి... జుట్టు విపరీతంగా ఊడిపోయేవారు జింక్‌తో పాటు, ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ సిఫార్సు చేస్తోంది. ఐరన్ కోసం గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీఫుడ్స్ వంటివి తప్పక తినాలి. మాంసాహారంలో అయితే కాలేయం, కిడ్నీల్లో ఐరన్ చాలా ఎక్కువ. శాకాహారులైతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ పుష్కలం. అందుకే మీ ఛాయిస్‌ను బట్టి మీకు నచ్చే రుచికరమైన వాటిని తిని, జుట్టు రాలకుండా చూసుకోండి. విటమిన్–సి కోసం తినాల్సినవి... అన్ని ఆహార పదార్థాల్లో కంటే ఉసిరిలో విటమిన్–సి చాలా ఎక్కువ. అందుకే ఉసిరిని ఏ రూపంలో తీసుకున్నా విటమిన్–సి పుష్కలంగా దొరుకుతుంది. నిమ్మజాతి పండ్లన్నింటిలోనూ విటమిన్–సి ఎక్కువే అన్న సంగతి అందరికీ తెలిసిందే. బత్తాయి, నారింజ పండ్లు రుచికి రుచి... విటమిన్–సి కి విటమిన్–సి. ఇకపై ఆహారాలన్నీ తీసుకుంటూ హార్మోన్ల అసమతౌల్యత ఏదీ లేకుండా చూసుకోవాలంటే మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేపలు ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ క్రమం తప్పకుండా తీసుకుంటూ జుట్టు ఆరోగ్యం కోసం వారంలో కనీసం రెండు సార్లు తలస్నానం చేస్తే చాలు... ఎలాంటి సమస్య లేని ఆరోగ్యవంతుల్లో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఒక రెండు నెలలపాటు ఈ ఆహార నియమాలు పాటించాక కూడా తగిన ఫలితం కనిపించకపోతే ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకొని డర్మటాలజిస్ట్‌ను కలవాలి. ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ అసమతౌల్యత ఉంటే జుట్టు రాలడం చాలా ఎక్కువ. అలాంటి సమస్య ఏదైనా ఉంటే దాన్ని డర్మటాలజిస్ట్ పరిష్కరిస్తారు. ఎసిడిటీని నివారించే ఆహారాలు.... ఎసిడిటీని నివారించడానికి కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం మేలు. అలాగే తిన్నా ఎసిడిటీకి తావివ్వని ‘స్టమక్ ఫ్రెండ్లీ‘ ఆహారాలూ ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు దాని నివారణ కోసం తీసుకోకూడని, తీసుకోవాల్సిన ఆహారాల జాబితా ఇది... సుజాతా స్టీఫెన్ చీఫ్ న్యూట్రిషనిస్ట్, యశోద హాస్పిటల్స్ మలక్‌పేట, హైదరాబాద్ -
అధిక రక్తపోటుతో అల్జీమర్స్ ముప్పు
లండన్ : రక్తపోటు నియంత్రణలో లేకుంటే గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పుపై వైద్య నిపుణులు హెచ్చరిస్తుండగా, అధిక రక్తపోటుతో అల్జీమర్స్ ముప్పు పొంచిఉందని తాజామ అథ్యయనం వెల్లడించింది. నార్త్ కరోలినాకు చెందిన వేక్ ఫారెస్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డేటా బీపీతో అల్జీమర్స్ రిస్క్ ఉందనే సంకేతాలు పంపింది. రక్తపోటును నియంత్రించుకోవడంతో పాటు నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యకర బరువును మెయింటెన్ చేయడం ద్వారా అల్జీమర్స్ ముప్పును నివారించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు 67 సంవత్సరాల సగటు వయసు కలిగిన వృద్ధుల్లో ఆరోగ్యకర రక్తపోటును మెయింటెన్ చేసే వారిలో అల్జీమర్స్ ముప్పు తక్కువగా ఉందని చికాగోలో జరిగిన అల్జీమర్స్ అంతర్జాతీయ సదస్సులో సమర్పించిన ఓ నివేదిక వెల్లడించింది. బీపీ నియంత్రణలో ఉన్న వారిలో అధిక రక్తపోటు కలిగిన వారితో పోలిస్తే డిమెన్షియా,అల్జీమర్స్ రిస్క్ 19 శాతం తక్కువగా ఉన్నట్టు వేక్‌ఫారెస్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వెల్లడించారు. గుండె జబ్బుల నివారణకు ఏ జాగ్రత్తలు పాటిస్తారో వాటినే అల్జీమర్స్ ముప్పును తగ్గించేందుకు పాటించవచ్చని అల్జీమర్స్ అసోసియేషన్ చీఫ్ సైన్స్ ఆఫీసర్ డాక్టర్ మరియా కరిలో తెలిపారు. -
మిలీనియల్స్‌కు రక్తపోటు ముప్పు
లండన్ : ఆధునిక ప్రపంచాన్ని ముందుకు నడిపించాల్సిన మిలీనియల్స్ ఒత్తిడి ఊబిలో చిత్తవుతున్నారని తాజా అథ్యయనం హెచ్చరించింది. 18 నుంచి 34 ఏళ్ల మధ్యన మిలీనియల్స్‌గా పిలవబడే ఈతరం యువత తీవ్ర ఒత్తడితో సతమతమవుతూ అధిక రక్తపోటు బారిన పడే ప్రమాదం ఉందని తేల్చిచెప్పారు.మిలీనియల్స్‌లో 96 శాతం మంది ఒత్తిడిలో కూరుకుపోయారని, వారితో పోలిస్తే 55 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 66 శాతం మందే తాము ఒత్తిడికి గురవుతున్నామని చెబుతున్నారని సర్వేలో వెల్లడైందని ప్రముఖ ఐర్లాండ్ వైద్యురాలు, టీవీ వ్యాఖ్యాత డాక్టర్ పిక్సీ మెకెనా వెల్లడించారు. రక్తపోటుకు పోషకాహార లోపం, మద్యపానం వంటి కారణాలతో పాటు ఒత్తిడి ప్రధాన కారణమని మెకెనా చెప్పుకొచ్చారు. రక్తపోటు ఇక ఎంతమాత్రం వయసుపైబడిన వారిలో కనిపించే వ్యాధి కానేకాదని తమ అథ్యయనంలో వెల్లడైందన్నారు. వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, మద్యపానం, అధిక బరువు, అధికంగా ఉప్పు తీసుకోవడం వంటి కారణాలతో మిలీనియల్స్‌లో అధిక రక్తపోటు రిస్క్ అధికంగా ఉందని చెప్పారు. తాము నిర్వహించిన సర్వేలో బాధ్యతలు మీదపడుతున్నప్పటికీ మధ్యవయస్కుల్లో ఒత్తిడి స్ధాయి తక్కువగా ఉన్నట్టు వెల్లడైందన్నారు. -
నీవు లావా కావా
నీవు లావా? కావా?? ఇదో పెద్ద పోరాటం.ఇంగ్లిష్‌లో బ్యాటిల్ ఆఫ్ ద బల్జ్ అంటారు. ‘‘ఏవోయ్ శ్రీనివాస్... అలా చిక్కిశల్యమైపోయావేమిటీ?’’ అన్న కామెంట్స్ ఈరోజుల్లో అస్సలు వినిపించడంలేదు. ‘‘ఏవయ్యా శ్రీనివాస్... కాస్త ఒళ్లు చేసినట్టున్నావ్ కదూ’’ ఇది ఇప్పుడు ఫ్రీక్వెంట్‌గా వినిపించే మాట. ఇలా చిక్కలేక... చిక్కుల్లో ఉన్నవాళ్లకీ లావు పెరిగి బిక్కుబిక్కుమంటున్నవాళ్లకీఅసలు నువ్వు లావా..? కావా..?అని చెప్పడానికే ‘ఊబకాలమ్’లో ఈ స్పెషల్ రెండో కథనం. ఒక వ్యక్తి స్థూలకాయుడా కాదా అని నిర్ణయించడం ఎలా? ఇందుకు ‘బీఎమ్ఐ’ గురించి తెలుసుకోవాలి. ఒక వ్యక్తి స్థూలకాయుడా కాదా అని నిర్ధారణ చేయడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎమ్ఐ) అనే ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. దీన్ని కొలిచే పద్ధతి ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి బరువును కిలోగ్రాములలో కొలవాలి. ఆ విలువను అతడి ఎత్తు స్క్వేర్తో భాగించాలి. స్క్వేర్ అంటే అదే సంఖ్యను మళ్లీ అదే సంఖ్యతో గుణించడం. ఈ ఎత్తు విలువను మీటర్లలో తీసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 100 కిలోలు. అతడి ఎత్తు 1.7 మీటర్లు. అప్పుడు అతడి బీఎమ్ఐ విలువ ఎంత అంటే... 100 / 1.7 ’ 1.7 = 34.60 కి.గ్రా./మీ. స్క్వేర్. ఇప్పుడు ఈ విలువను బీఎమ్ఐ పట్టికతో సరిపోల్చుకుని మీరు ఏ స్థూలకాయ స్థాయిలో ఉన్నారో నిర్ణయించుకోవచ్చు. సాధారణంగా విదేశాలలో జరిగే అధ్యయనాల ప్రకారం వచ్చిన విలువలనే మన దేశవాసులకూ అన్వయిస్తుంటారు. కానీ స్థూలకాయం విషయంలో ఈ ప్రమాణాలు విదేశీయులకూ, భారతీయులకూ ఒకటి కాదు. (పైన వచ్చిన విలువ విదేశీయుల లెక్కలో స్వల్ప స్థూలకాయమే అయినా... భారతీయుల విషయంలో మాత్రం అధిక స్థూలకాయం కిందనే లెక్క.)బీఎమ్ఐ ఆధారంగా నిర్ధారణ చేసే స్థూలకాయ వర్గాలు విదేశీయులతో పోల్చి చూస్తే, భారతీయులలో కాస్త తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే విదేశీయులతో పోల్చి చూస్తే మనకు శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ, కండరాల పరిమాణం తక్కువ. అందువల్ల మనం తక్కువ స్థూలకాయస్థాయిలో ఉన్నప్పటికీ వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. భారతీయులలో స్థూలకాయం... భారతీయుల్లో బీఎమ్ఐ విలువ 25 – ఆపైన ఉంటే స్వల్ప స్థూలకాయం ఉన్నట్లే. ఒకవేళ బీఎమ్ఐ విలువ 30 – ఆ పైన ఉంటే అధిక స్థూలకాయం ఉన్నట్టుగా పరిగణించాలి. స్థూలకాయాన్ని నిర్ణయించే మరో లెక్క నడుము–హిప్ రేషియో.నడుము చుట్టుకొలత మహిళల్లో 80 సెం.మీ. కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 90 సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం సమస్య ఉన్నట్లు. ఇక నడుం–హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మహిళల్లో 0.8 కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 0.9 కంటే ఎక్కువగానూ ఉంటే స్థూలకాయం సమస్య ఉన్నట్లుగా పరిగణించాలి. ఉదాహరణకు ఒక పురుషుడి నడుము 100 సెం.మీ. ఉండి అతడి హిప్ కేవలం 80 సెం.మీ. ఉందనుకోండి. అప్పుడు 100 / 80 = 1.25. అంటే 0.9 కంటే ఎక్కువ కాబట్టి అతడికి స్థూలకాయం ఉన్నట్లే. అలాగే ఒక మహిళ నడుము 90 సెం.మీ. ఉండి, ఆమె హిప్ 100 సెం.మీ. ఉంటే... 90 / 100 = 0.9. అది 0.8 కంటే ఎక్కువే కాబట్టి ఆమెది స్థూలకాయమేనని పరిగణించవచ్చు. పైన పేర్కొన్న పద్ధతుల ద్వారా మీరు స్థూలకాయులా కాదా అని మీకు మీరే తెలుసుకోవచ్చు. సెంట్రల్ ఒబేసిటీ... చాలామంది ఒళ్లంతా లావెక్కడాన్నే ఒబేసిటీగా అనుకుంటుంటారు. కానీ సన్నగా ఉండి పొట్ట పెరగడం కూడా ఒబేసిటీ కిందనే లెక్క. పొట్టచుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు పేరుకొనిపోతుంది. నిజానికి ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా వచ్చే స్థూలకాయం కంటే పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడం అత్యంత ప్రమాదకరం. డయాబెటిస్, హైబీపీ, రక్తంలో కొవ్వు శాతం పెరగడం (హైపర్ లిపిడిమియా) వంటి సమస్యలు వచ్చే అవకాశం... సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీలో చాలా ఎక్కువ. ఇదేగాక మరికొన్ని రకాల స్థూలకాయాలనూ పరిగణనలోకి తీసుకోవచ్చు. అవి... 1. ఇనాక్టివ్ ఒబేసిటీ: ఎలాంటి వ్యాయామమూ, శారీరక శ్రమ లేని కారణంగా ఒంట్లో పలు చోట్ల కొవ్వు పేరుకుపోయి వచ్చే స్థూలకాయాన్ని ఇనాక్టివ్ ఒబేసిటీ అంటారు. 2. ఫుడ్ ఒబేసిటీ: వేళకాని వేళల్లో, రాత్రివేళల్లో ఇష్టం వచ్చినట్లుగా తినడం వల్ల కొవ్వు రూపంలో వచ్చే స్థూలకాయమిది. 3. యాంగై్జటీ ఒబేసిటీ: కొందరిలో యాంగై్జటీ లేదా డిప్రెషన్ ఉన్నప్పుడు ఊబకాయం వస్తుంది. ఇలాంటి ఒబేసిటీ తగ్గించాలంటే మొదట వారి మానసిక సమస్యను నయం చేయాల్సి ఉంటుంది. అంతేతప్ప సాధారణ ఊబకాయం ఉన్నవారిలో అనుసరించే మార్గాలు వీరికి అంతగా ఉపకరించవు. 4. వీనస్ ఒబేసిటీ: కొందరికి కొన్ని నిర్దిష్ట సమయాల్లో ఊబకాయం వస్తుంటుంది. అంటే... ఒక నిర్దిష్టమైన వయసులోనో లేదా మహిళల్లో అయితే నిర్దిష్టంగా గర్భధారణ సమయంలోనో... ఇలా. ఈ తరహాలో నిర్దిష్ట సమయాల్లోనే కనిపించే ఊబకాయం కేవలం వ్యాయామంతోనే తగ్గిపోతుంది. ఊబకాయానికి కారణాలు ∙జన్యుపరమైన కారణాలు: సాధారణంగా తల్లిదండ్రుల్లో ఊబకాయం ఉన్నప్పుడు కుటుంబాల్లో అది వంశపారంపర్యంగా వస్తుండటం మామూలే. దీన్ని తగ్గించడం చాలావరకు సాధ్యంకాదు. అయితే ప్రయత్నం మీద కొంత తగ్గి, చురుగ్గా తమ కార్యకలాపాలు జరుపుకుంటే ఆరోగ్యంగా ఉన్నట్లే పరిగణించవచ్చు. ∙వయసు: చాలామంది మధ్యవయసుకు వచ్చేసరికి బరువు పెరగడం మామూలే. స్త్రీపురుషులిద్దరిలోనూ ఈ పరిణామం చోటుచేసుకున్నా మహిళల్లో మరీ ఎక్కువ. ప్రత్యేకంగా మెనోపాజ్ దశ దాటిన మహిళల్లో ఇది మరీ ఎక్కువ. ఇక పురుషుల్లో అయితే పొట్ట రావడం చాలా సహజం. ఇది ఒంట్లో సరిగ్గా మధ్య భాగంలో వస్తుంటుంది కాబట్టి ఇలా జరగడాన్ని కొందరు సరదాగా ‘మిడిల్ ఏజ్డ్ మిడ్ ట్రెజర్’ అంటూ చమత్కరిస్తుంటారు. ∙ఆహార అలవాట్లు: కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం (శాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్‌ఫ్యాట్స్, షుగర్స్)తో పాటు పిజ్జా, బర్గర్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, వేళకు తినకపోవడం, రాత్రి డ్యూటీలు పెరగడం వల్ల రాత్రిపూట చాలా ఎక్కువ ఆహారం తీసుకొని, పగలు పడుకోవడం వంటి కారణాల వల్ల బరువు పెరుగుతుంటారు. ∙శరీర కదలికలు మందగించడం: ఇటీవల కూర్చొని చేసే వృత్తుల వల్ల బరువు పెరగడం అన్నది బాగా పెరిగిపోయింది. పైగా ఆధునిక వృత్తుల్లో ఒంటి కదలికలకు ఏమాత్రం ఆస్కారం లేకపోవడంతో, శరీరానికి తగిన శ్రమ లేక క్యాలరీలు దహనం కాక అవి కొవ్వుల రూపంలో పేరుకుపోవడం వల్ల ఊబకాయం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ∙కొన్ని రకాల జబ్బులు (మెడికల్ రీజన్స్): హైపోథైరాయిడిజమ్, కుషింగ్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) వంటి వైద్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఒంటి బరువు పెరుగుతుంది. ∙కొన్ని రకాల మందులు వాడటం: స్టెరాయిడ్స్‌తో కూడిన మందులు వాడినప్పుడు ఊబకాయం రావడం మామూలే. డిప్రెషన్ ఉన్నవారు వాడే యాంటీ డిప్రెసెంట్స్, మూర్ఛవ్యాధిగ్రస్తులు వాడే యాంటీ ఎపిలెప్టిక్ మందులతోనూ ఒళ్లు వస్తుంది. (బరువు తగ్గడానికి ఉపయోగపడే వేర్వేరు ప్రక్రియల గురించి విపులంగా వచ్చే వారం) ఒంట్లో కొవ్వు ఎంత ఉండాలి... శరీరంలో శక్తిగా మారక మిగిలిపోయిన ఆహారం కొవ్వుగా మారి నిల్వ ఉంటుందన్న విషయం తెలిసిందే. మరి కొవ్వు పేరుకోవడం స్థూలకాయానికి దారితీస్తుందన్న అంశమూ అందరికీ తెలుసు. అలాగని కొవ్వును పూర్తిగా పరిహరించకూడదు. ఎందుకంటే... మనకు కంటి చూపుకు అవసరమైన విటమిన్–ఏ, ఎముకలకు బలాన్నిచ్చి, అనేక క్యాన్సర్లనుంచి కాపాడుతూ శరీర రక్షణ వ్యవస్థకు బలం సమకూర్చే విటమిన్–డి, ఒంటికి అందాన్ని పెంచే విటమిన్–ఈ, రక్తం గడ్డకట్టేలా చేసి ప్రమాదాల్లో ప్రాణాలను నిలిపే విటమిన్–కే ల విటమిన్లన్నీ శరీరంలోకి ఇంకడం అన్న ప్రక్రియ కొవ్వు లేకపోతే జరగదు. అలాగే మనలోని చాలా కీలక అవయవాల చుట్టూ కొవ్వు ఒక రక్షణ కవచంలా పేరుకుపోయి ఉంటుంది. శరీరం రోజూ ఎదుర్కొనే చిన్న కొద్దిపాటి దెబ్బలకు కీలక అవయవాలు దెబ్బతినకుండా వాటి చుట్టూ కొవ్వు పేరుకుపోయేలా ప్రకృతి అద్భుతమైన ఏర్పాటు చేసింది. అందుకే మనం గమనిస్తే... గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. అలాగే కిడ్నీలు కొవ్వులో కూరుకుపోయే ఉంటాయి. ఇక పేగుల చుట్టూ కూడా అంతో ఇంతో కొవ్వులు ఉండనే ఉంటాయి. అందుకే మన విటమిన్ల శోషణకూ, మన అవయవాల రక్షణకు అవసరమైన మేరకు కొవ్వు ఉండాల్సిందే. బరువు తగ్గడానికి మార్గాలు : మనం అనుసరించే సాధారణ మార్గాలకు తోడుగా బరువు తగ్గడానికి చాలా రకాల ప్రక్రియలూ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని ... ∙అధిక బరువు (బీఎమ్ఐ 23 – 24.99) ఉన్నవారు, స్వల్ప స్థూలకాయం (బీఎమ్ఐ 25 – 29.99) ఉన్నవారు రోజూ క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవాలి (బ్రిస్క్ వాకింగ్), తేలికపాటి వ్యాయామాలు మంచివే. స్పోర్ట్స్ ఆడటం చాలా మంచి వ్యాయామం. ఆటలో భాగంగా మనకు తెలియకుండానే చాలా మంచి వ్యాయామం జరిగిపోతుంటుంది ∙మసాలాలు ఏమాత్రం వాడని ఆహారం తీసుకోవాలి. సాధారణంగా మసాలాలు లేని ఆహారమంతగా రుచి అనిపించదు. దాంతో మనం ఆహారం తీసుకునే పరిమాణం తగ్గుతుంది. ఇలా బ్లాండ్ డైట్ రూపంలో పోషకాలు సమకూరి దేహం ఆరోగ్యవంతం కావడంతో పాటు బరువు తగ్గడానికీ ఇది తోడ్పడుతుంది ∙ప్రోటీన్ డైట్లో శాకాహార ప్రోటీన్లు తీసుకోవడం, వంటల్లో నూనెలు, నెయ్యి వంటి ఫ్యాట్స్‌ను చాలా పరిమితంగానే వాడటం, మాంసాహారం ఇష్టంగా తినేవారు వేటమాంసం వంటి రెడ్‌మీట్‌కు బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపల వంటి వైట్ మీట్ తీసుకోవడం ∙తప్పనిసరిగా క్రమం తప్పకుండా వేళకు తినడం ∙చిరుతిండ్లకూ, కూల్‌డ్రింక్స్‌కూ, ఆల్కహాల్‌కూ దూరంగా ఉండటం... వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితో బరువు పెరగకుండా చూసుకోవచ్చు. ఇది అధిక బరువు ఉన్నవారికే గాక... అందరికీ ఆరోగ్యాన్నిచ్చే ప్రక్రియ. అయితే ఒకవేళ బీఎమ్ఐ 30 – ఆ పైన ఉంటే ఈ మామూలు మార్గాలు పనిచేయవు. అప్పుడు కొందరు కొన్ని ప్రత్యేక మార్గాలను అనుసరిస్తుంటారు.వాటిలో ముఖ్యమైన కొన్ని... ∙పొట్ట, తొడలు, పిరుదులు వంటి చోట్ల పేరుకున్న కొవ్వును లైపోసక్షన్ ద్వారా తగ్గించడం ∙కూల్ స్కల్ప్టింగ్ అనే ప్రక్రియ ద్వారా బరువు తగ్గించుకోవడం ∙ఒక వ్యక్తిని మరణానికి చేరువ చేసేంతగా ఊబకాయం ఉంటే (దీన్నే ఇంగ్లిష్‌లో మార్బిడ్ ఒబేసిటీ అంటారు) ‘బేరియాట్రిక్ సర్జరీ’ అని పిలిచే శస్త్రచికిత్స చేయించుకోవాలి. ఒక వాస్తవం పిండిపదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అనేవి వాటి అణు నిర్మాణం ఆధారంగా రెండు రకాలు. మామూలుగా ఉండేవి ఒకటైతే... సంక్లిష్టమైన నిర్మాణం ఉండేవి రెండో రకం. బిస్కెట్లు, చాక్లెట్లు, వంటి వాటిల్లో మామూలు పిండిపదార్థాలు ఉంటాయి. బరువు తగ్గాలంటే విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు కూడా లేని ఈ రకమైన ఆహారాన్ని తీసుకోకపోవడం మేలు. అయితే పండ్లు, బీన్స్, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్లలో ఉండే సంక్లిష్టమైన పిండిపదార్థాల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. ఊబకాయంతో యువత గుండెకూ చేటే! ఊబకాయం యుక్తవయస్కుల గుండెలకూ చేటు చేస్తుందని బ్రిటిష్ శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరం బరువు పెరిగితే గుండెజబ్బులు వస్తాయని గతంలోనే పలు పరిశోధనలు రుజువు చేయగా.. ఈ పరిస్థితి యువతకూ చేటు చేస్తుందన్న విషయం తాజాగా అర్థమైందని అంటున్నారు కాట్లిన్ వేడ్. బ్రిస్టల్ మెడికల్ స్కూల్‌కు చెందిన ఈ శాస్త్రవేత్త బ్రిటన్‌కు చెందిన యువకులపై పరిశోధనలు చేశారు. బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న యువకుల గుండె కండరాలు బాగా మందంగా ఉన్నాయని, పైగా చాలామందికి అధిక రక్తపోటు సమస్య కూడా ఉందని తెలిసిందని కాట్లిన్ తెలిపారు. పదిహేడు నుంచి 21 ఏళ్ల వయసున్న కొన్ని వేల మంది వివరాలతో తాము ఈ పరిశోధన జరిపామని సరికొత్త జన్యు విశ్లేషణ పద్ధతులను ఉపయోగించి పరిశీలించగా బాడీమాస్ ఇండెక్స్ ఎంత ఎక్కువగా ఉంటే... రక్తపోటు తీవ్రత అంతేస్థాయిలో ఎక్కువగా ఉందని... ఫలితంగా గుండెచప్పుళ్ల మధ్య ధమనులపై ఒత్తిడి కూడా ఎక్కువవుతోందని వివరించారు. అధికబరువు వల్ల గుండెలోని ఒక కవాటం (లెఫ్ట్ వెంట్రికల్) వ్యాకోచం చెందుతున్నట్లు తెలిసిందని కాట్లిన్ అన్నారు. ఈ మార్పులన్నింటి ఫలితంగా గుండెకండరాల బరువు పెరిగి అవి మందంగా మారుతున్నట్లు చెప్పారు. మొత్తమ్మీద చూస్తే యుక్తవయసు నుంచి ఆరోగ్యకరమైన బాడీ మాస్ ఇండెక్స్ ఉండేలా చూసుకోవడం ద్వారా భవిష్యత్తులో గుండెజబ్బుల బారిన పడకుండా రక్షించుకోవచ్చునని నిర్ద్వంద్వంగా తెలుస్తున్న మాట!! డా.ఎమ్. గోవర్థన్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
ఆ సమయంలో బీపీ ఎక్కువైతే..?
నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్. నాకు బీపీ ఉంది. గర్భిణులకు హైబీపీ వస్తే ప్రాణాంతకం అని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? బీపీ నియంత్రణకు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు. –పి.స్రవంతి, గుంటూరు. కొంతమందిలో బీపీ ప్రెగ్నెసీ రాకముందు నుంచే ఉండి, తర్వాత ప్రెగ్నెన్సీతో కొద్దికొద్దిగా పెరగడం జరుగుతుంది. దీనిని క్రానిక్ హైపర్‌టెన్షన్ అంటారు. కొందరిలో గర్భం దాల్చిన తర్వాత కొన్ని నెలలకు, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, బరువును బట్టి, హార్మోన్ల మార్పులను బట్టి బీపీ పెరగడం జరుగుతుంది. దీనిని జెస్టేషనల్ హైపర్‌టెన్షన్ అంటారు. వీరిలో రక్తనాళాలు సరిగ్గా వ్యాకోచించకుండా ఉండటం వల్ల తల్లిలో అవయవాలకు రక్త సరఫరా తగ్గడం, అలాగే శిశువుకు రక్తం సరిగ్గా అందకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. సరైన సమయంలో బీపీ నియంత్రణ జరగకపోవడం, నిర్లక్ష్యం చెయ్యడం వల్ల తల్లిలో కిడ్నీలు, లివర్, మెదడు, కళ్లు దెబ్బతినడం, వాటి పనితీరు మందగించడం, దానివల్ల ఫిట్స్ రావడం, కళ్లు కనిపించకపోవడం, అధిక రక్తస్రావంతో తల్లికి ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. కడుపులో బిడ్డ బరువు పెరగకపోవడం, ఉమ్మ నీరు బాగా తగ్గిపోవడం, బిడ్డ కడుపులో చనిపోవడం, నెలలు నిండకుండానే కాన్పు చెయ్యవలిసి రావడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. బీపీ సమస్య ఎప్పుడు వస్తుంది అని ముందే అందరికీ చెప్పడం కష్టం. డాక్టర్ దగ్గర సక్రమంగా చెకప్‌లు చేయించుకోవడం, బీపీ పెరిగితే డాక్టర్ పర్యవేక్షణలో బీపీకి మందులు వాడుకుంటూ ఆహారంలో కొద్దిగా ఉప్పు తగ్గించుకుని, బరువు ఎక్కువ పెరగకుండా చూసుకోవడం – రెండు వారాలకు ఒకసారి (అవసరమైన రక్త పరీక్షలు) సీబీపీ, కిడ్నీ, లివర్ టెస్ట్‌లు చేసుకుంటూ బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవడానికి స్కానింగ్, డాప్లర్, సీటీజీ వంటివి క్రమంగా చేయించుకుంటూ ముందుకు వెళ్లాలి. ఎన్ని మందులు వాడినా ఒక్కోసారి బీపీ నియంత్రణలోకి రాకపోవడం, రక్త పరీక్షల్లో తేడా రావడం, బిడ్డకి ఇబ్బంది మొదలవడం జరిగితే, వెంటనే కాన్పు చెయ్యవలసి వస్తుంది. లేకపోతే తల్లి ప్రాణానికి హాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భంనుంచి బిడ్డ బయటకు వస్తేగాని బీపీ తగ్గడం జరగదు. బీపీ నియంత్రణకు నువ్వు చేయవలసింది, ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్ పర్యవేక్షణలో బీపీ మందులు సరిగ్గా వేసుకోవడం, అధిక బరువు పెరగకుండా ఆహారం మితంగా తీసుకుంటూ, నడక, చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం, మానసిక ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా ఉండటం. ప్రసుత్తం నేను ప్రెగ్నెంట్. వృత్తిరీత్యా నేను గంటల తరబడి సెల్ఫోన్లో మాట్లాడుతుంటాను. ‘గర్భిణులు సెల్ఫోన్లో మాట్లాడటం పుట్టబోయే బిడ్డకు చేటు’ అని చదివాను. ఇది ఎంతవరకు నిజం? –ఆర్.నాగమణి, హైదరాబాద్. ఈ ఆధునిక కాలంలో సెల్‌ఫోన్ అనేది ఒక నిత్యావసరంగా మారిపోయింది. అందరూ గంటల తరబడి ఫోన్లలో మాట్లాడటం, కాలక్షేపం చెయ్యడం జరుగుతోంది. ఎక్కువసేపు సెల్‌ఫోన్ శరీరానికి దగ్గర ఉండటం వల్ల కొన్నిసార్లు పుట్టబోయే పిల్లల్లో ఏకాగ్రత తక్కువ ఉండటం, హైపర్ యాక్టివ్‌గా ఉండటం, బిహేవియరల్ సమస్యలు వంటి కొన్ని చిన్న చిన్న మానసిక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. అలాగే తల్లుల్లో కూడా ఫోన్లలో ఎక్కువసేపు మాట్లాడుతూ, అనవసరమైన విషయాలు చర్చించుకుంటూ, మానసిక ఒత్తిడిని, లేనిపోని అనుమానాలను పెంచుకుంటూ ఉండటం జరుగుతుంది. దీనివల్ల కూడా బిడ్డలో మానసిక ఎదుగుదలలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ‘గర్భిణులు సమతులాహారం తీసుకోవాలి’ అనే మాట తరచుగా వింటుంటాను. అయితే దీని గురించి నాకు అవగాహన లేదు. ఎలాంటి పదార్థాలు తీసుకోవడాన్ని ‘సమతులాహారం’ అంటారో వివరంగా తెలియజేయగలరు. – జి.రాధ, కర్నూలు. సమతులాహారం అంటే తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫ్యాట్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ వంటివన్నీ కొద్దికొద్దిగా కలగలిపి ఉండటం. గర్భిణీలలో తొమ్మిది నెలలపాటు బిడ్డ ఆరోగ్యంగా పెరగాలి అంటే పైన చెప్పిన సమతులాహారం (బ్యాలెన్స్డ్ డైట్) తీసుకోవడం మంచిది. దీనివల్ల బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదల బాగుంటుంది. బిడ్డ అవయవాలు, కండరాలు, ఎముకలు, నాడీ వ్యవస్థ ఇంకా ఇతర వ్యవస్థలు సరిగ్గా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఆహారంలో కొద్దిగా అన్నం లేదా చపాతీ లేదా తృణధాన్యాలతో చేసిన ఆహారం, ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పాలు, పెరుగు, పండ్లు ఉండేటట్లు చూసుకోవాలి. దీనినే సమతులాహారం అంటారు. మామూలు వారితో పోలిస్తే, పెరిగే బిడ్డ అవసరాలకు గర్భిణీలు ఆహారంలో 300 క్యాలరీలు అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
హైపర్ టెన్షన్.. రెండో స్థానంలో తెలంగాణ
ప్రపంచ ‘అధిక రక్తపోటు’కు రాజధానిగా దేశాన్ని పిలుస్తుండగా, దేశంలో తెలంగాణ రెండోస్థానంలో ఉంది. జాతీయ పోషకాహార సంస్థ నివేదిక ప్రకారం తెలంగాణలో 39 శాతం మంది పురుషులు, 29 శాతం మంది మహిళలు అధికరక్తపోటుతో బాధపడుతుండగా, మెదక్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉన్నట్లు వెల్లడైంది. అయితే చాలా మందికి తమకు అధికరక్త పోటు సమస్య ఉన్నట్లు తెలియదు. తీరా తెలిసే సమయానికి కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది. ఇది గుండె, మూత్ర పిండాలు, మెదడు పనితీరును దెబ్బతీస్తూ.. సైలెంట్ కిల్లర్‌గా మారుతోంది. నేడు ప్రపంచ అధికరక్తపోటు (హైపర్ టెన్షన్) దినం సందర్భంగా ప్రత్యేక కథనం. – సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్ ఉరుకులు పరుగుల జీవితం.. అతిగా మద్యపానం.. అధిక బరువు.. పని ఒత్తిడి.. కాలుష్యం.. వెరసీ మనిషి ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయి. ఫలితంగా గ్రేటర్లో 30 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు వరల్డ్ హైపర్‌టెన్షన్ లీగ్ సౌత్ ఏసియా రీజియన్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్ ఎస్.రామ్ ప్రకటించారు. ఆసక్తికరమైన అంశమే మిటంటే 90 శాతం మందికి తమకు బీపీ ఉన్నట్లు తెలీదు. తెలిసిన వారిలో పది శాతానికి మించి వైద్యులను సంప్రదించడం లేదు. సాధారణంగా నాలుగు పదుల వయసు పైబడిన వారిలో కన్పించే అధికరక్తపోటు సమస్య ప్రస్తుతం పాతికేళ్లకే బయపడుతున్నాయి. పాతికేళ్లు దాటిన ప్రతి 10 మందిలో 4 అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు తేలింది. బాధితుల్లో ఎక్కువ శాతం మార్కెటింగ్, ఐటీ అనుబంధ ఉద్యోగులు ఉండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సకాలంలో గుర్తించకపోవడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడంతో కార్డియో వాస్క్యూలర్ (హార్ట్ ఎటాక్), మూత్రపిండాల పని తీరు దెబ్బతినడంతో పాటు చిన్న వ యసులోనే పక్షవాతంతో కాళ్లు, చేతులు పడిపోవడం, జ్ఞాపకశక్తి సన్నగిల్లి మతి మరుపు రావడం, కంటిచూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మారిన జీవన శైలి వల్లే.. ఇటీవల అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం మనిషికి కాలు కూడా కదపనీయడం లేదు. కూర్చున్న చోటు నుంచి కనీసం లేవకుండానే అన్ని పనులూ కానిచ్చే అవకాశం వచ్చింది. సెల్‌ఫోన్ సంభాషణలు, ఇంటర్నెట్ చాటింగ్‌లు మనిషి జీవనశైలిని పూర్తిగా మార్చేశాయి. ఇంటి ఆహారానికి బదులు హోటళ్లలో రెడీమేడ్‌గా దొరికే బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, మద్యం కూడా అధిక బరువుకు కారణమవుతున్నాయి. గ్రేటర్లో పెరుగుతున్న స్థూలకాయానికి ఇదే కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. యువకుల్లోనే ఈ సమస్య ఎక్కువ ఉంది. హైపర్ టెన్షన్ బాధితుల్లో 40 శాతం మంది గుండెనొప్పితో మృతి చెందుతుండగా, 25 శాతం మంది కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నారు. మరో 10 శాతం మంది పక్షవాతంతో జీవచ్ఛవంలా మారుతున్నారు. అధిక రక్తపోటుకు130/80 రెడ్ సిగ్నల్ గతంలో 140/90 ఉంటే హైపర్‌టెన్షన్‌కు రెడ్‌సిగ్నల్‌గా పరిగణించేవారు. ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల రక్తపోటు నిర్వచనం మారింది. 130/80 ఉంటే రెడ్‌సిగ్నల్‌గా భావించాల్సిందే. చికిత్సలను నిర్లక్ష్యం చేయడం వల్ల మధుమే హం, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, పక్షవాతం బా రినపడే ప్రమాదం లేకపోలేదు. – డాక్టర్ సి.వెంకట్ ఎస్ రామ్, అపోలో ఉప్పు తగ్గించడమొక్కటే పరిష్కారం.. అధికరక్తపోటు ఉన్నట్లు గుర్తించడం సులభమే. బీపీ వల్ల తరచూ తలనొప్పి వస్తుంది. ప్రతి ఒక్కరూ విధిగా బీపీ చెకప్ చేయించుకోవాలి. పని ఒత్తిడి, ఇతర చికాకులకు దూరంగా ఉండాలి. ఆహారంలో ఉప్పు, పచ్చళ్ల వాడకాన్ని తగ్గించాలి. పప్పు, కాయకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మద్యపానం, దూమపానాలకు దూరంగా ఉండాలి. రోజుకు కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. – డాక్టర్ శ్రీభూషణ్‌రాజు, నిమ్స్ -
మాజీ మంత్రి కన్నాకు అస్వస్థత
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున అధిక రక్తపోటుతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆయన్ను గుంటూరులోని లలిత సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వైద్యులు డాక్టర్ విజయ, డాక్టర్ రాఘవశర్మ తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. నాలుగు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించిన తరువాత డిశ్చార్జి చేస్తామని చెప్పారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో బీపీ టాబ్లెట్ వేసుకున్నారని, బుధవారం తెల్లవారుజామున మరింత ఇబ్బందిగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకొచ్చామని కన్నా కుమారుడు, మాజీ మేయర్ కన్నా నాగరాజు తెలిపారు. -
చిన్న పిల్లల్లోనూ హైబీపీ!
చిన్న పిల్లల్లో రక్తపోటు అంతగా కనిపించదని మనలో చాలా మంది భావిస్తుంటారు. కానీ దాదాపు 25 శాతం మంది పిల్లల్లో చిన్న వయసులోనే రక్తపోటు (హైబీపీ) కనిపిస్తున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నిర్వహించిన ఒక అధ్యయనంలో దాదాపు 18 ఏళ్ల లోపు వయసున్న పిల్లల్లో 23 శాతం మందికి అధిక రక్తపోటు ఉన్నట్లు తేలింది. మరో 10 శాతం మంది పిల్లల్లో వారు యుక్తవయసు దశకు రాకముందే ప్రీ–హైబీపీ లక్షణాలు కనిపించాయని తెలిసింది. ఫలితంగా చాలా మంది పిల్లలు చిన్న వయసులోనే గుండెజబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి. హైపర్‌టెన్షన్ రెండు రకాలు. కారణం లేకుండా కనిపించేదాన్ని ప్రైమరీ హైపర్‌టెన్షన్ అంటారు. అయితే ఏదైనా కారణంతో వచ్చేదాన్ని సెకండరీ హైపర్‌టెన్షన్ అంటారు. చిన్న పిల్లల్లో హైబీపీకి కారణాలు : ప్రైమరీ హైపర్‌టెన్షన్‌కు... ∙పిల్లలకు స్థూలకాయం ఉండటం ∙క్యాల్షియమ్ జీవక్రియల్లో మార్పులు ∙కుటుంబ చరిత్రలో ఎవరికైనా బీపీ ఉండటం ∙రెనిన్ హార్మోన్లో మార్పుల వంటివి ప్రైమరీ హైపర్‌టెన్షన్‌కు కారణం కావచ్చు. సెకండరీ హైపర్‌టెన్షన్‌కు... ∙పిల్లల్లో కనిపించే హైపర్‌టెన్షన్‌కు చాలావరకు సెకండరీ హైపర్‌టెన్షన్ కారణం. అంటే... ∙మూత్రపిండాల సమస్య ∙ఏదైనా మందులు వాడటం ∙మెదడుకు సంబంధించిన రుగ్మతలు ∙గుండెజబ్బులు ∙గ్రంథులకు సంబంధించిన సమస్యలు ∙రక్తనాళాల సమస్యలు... ఇవన్నీ సెకండరీ బీపీకి కారణాలు చిన్నపిల్లలకు బీపీ పరీక్షలు... మూడేళ్లు దాటిన పిల్లలకు తప్పనిసరిగా బీపీ చూడాలి. ఇలా చిన్న పిల్లలకు బీపీ చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా బీపీని తెలిపే ఛార్ట్ అయిన సెంటైల్ను ఫాలో కావాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారికి మరింత నిశితంగా చూడాలి. బీపీని తెలిపే ఛార్ట్‌ను సెంటైల్ చార్ట్ అంటారు. ఇందులో కొలత 90 ఉంటే అది బీపీ ఉన్నట్లు కాదు. ఆ రీడింగ్ 95–99 ఉంటే ఆ పిల్లలకు హైపర్‌టెన్షన్ స్టేజ్–1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్–2గా పరిగణించవచ్చు. ఈ తీవ్రతలను బట్టి అంటే... స్టేజ్–1, స్టేజ్–2లను పరిగణనలోకి తీసుకునే ఏ తీవ్రత ఉన్న పిల్లలకు ఎలాంటి చికిత్స అన్నది నిర్ధారణ చేస్తారు. లక్షణాలు : పిల్లల్లో హైబీపీ ఉన్నా దాని లక్షణాలు పెద్దగా బయటకు కనిపించకపోవచ్చు. బీపీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని లక్షణాలతో అది బయటపడవచ్చు. ఆ లక్షణాలివి... ∙తరచూ తలనొప్పి రావడం ∙కళ్లు తిరగడం ∙రక్తస్రావం ∙కంటిచూపులో మార్పులు ∙ఫిట్స్ రావడం ∙పిల్లలు చికాకుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో ప్రైమరీ హైపర్‌టెన్షన్ నివారణకు... ∙స్థూలకాయం (ఒబేసిటీ) తగ్గేలా చూడటం ∙కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించడం ∙నూనె పదార్థాలు, ఉప్పు తగ్గించడం ∙ఏరోబిక్స్ వంటి ఆటల్లో పిల్లలు పాల్గొనేలా చూడటం... ఈ జాగ్రత్తలతో హైబీపీని చాలావరకు నియంత్రించవచ్చు. చికిత్స : ∙హెపర్టెన్షన్లో హైబీపీ వచ్చిన కారణాన్ని గుర్తించి దానికి చికిత్స చేయాల్సి ఉంటుంది. ∙స్టేజ్–1లో ఉన్న పిల్లలకు సైతం మందులు లేకుండానే పైన పేర్కొన్న జాగ్రత్తలతో నివారించవచ్చు. -
పేరెంట్స్‌కు హైబీపీ ఉంటే నాకూ వస్తుందా?
హై–బీపీ కౌన్సెలింగ్ నా వయసు 35. మా కుటుంబంలో తల్లిదండ్రులకు హైబీపీ ఉంది. నాకూ వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. పేరెంట్స్‌కు బీపీ ఉన్నప్పుడు అది నాకు కూడా వచ్చే అవకాశం ఉందా? దీన్ని నివారించడానికి నేనేం చేయాలో చెప్పండి. – జగన్నాథరావు, వరంగల్ మీ తల్లిదండ్రులకూ, మీ రక్తసంబంధీకులకూ, మీకు చాలా దగ్గరి బంధువులకు అధిక రక్తపోటు ఉంటే మీకు కూడా వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువే. అయితే, మీ జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవడం ద్వారా కుటుంబంలో హైబీపీ చరిత్ర ఉన్నప్పటికీ దీన్ని చాలావరకు నివారించుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది చాలా సులభం. అది... ∙ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తీసుకోవాలి. ∙మీరు ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలి. ∙మీరు శారీరక శ్రమను ఇష్టపడుతూ చేయండి. నడక వంటి వ్యాయామాలు దీనికి బాగా ఉపకరిస్తాయి. ∙ బరువు పెరగకుండా చూసుకోండి. మీ ఎత్తుకు మీరెంత బరువుండాలో దానికి మించకుండా నియంత్రించుకుంటూ ఉండండి ∙పొగాకు వాడకాన్ని పూర్తిగా మానేయండి. ∙ఆల్కహాల్ పూర్తిగా మానేయండి. తరచూ తలనొప్పి... హైబీపీ కావచ్చా? నా వయసు 48 ఏళ్లు. నాకు తరచూ తలనొప్పిగా ఉండటంతో పాటు ఇటీవల బాగా తలతిరుగుతున్నట్లుగా ఉంది. ఒక్కోసారి ముందుకు పడిపోతానేమో అన్నంత ఆందోళనగా ఉంటోంది. నా లక్షణాలు చూసిన కొంతమంది మిత్రులు ‘‘నీకు హైబీపీ ఉందేమో, ఒకసారి డాక్టర్‌కు చూపించుకో’’ అంటున్నారు. వారు చెబుతున్నదాన్ని బట్టి నాకు మరింత ఆందోళన పెరుగుతోంది. నాకు తగిన సలహా ఇవ్వగలరు. – ఎమ్. సుదర్శన్, నిజామాబాద్ హైబీపీని కేవలం మీరు చెప్పిన లక్షణాలతోనే నిర్ధారణ చేయలేం. అసలు బీపీని కొలవకుండా ఆ సమస్యను నిర్ధారణ సాధ్యం కాదు. మనలో రక్తపోటు పెరగడం వల్ల ఎండ్ ఆర్గాన్స్‌లో ముఖ్యమైనదైన మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరిగి తలనొప్పి రావచ్చు. కొందరిలో మైగ్రేన్ వల్ల కూడా తలనొప్పి రావచ్చు. అలాగే మనం ఉన్న భంగిమ (పోష్చర్)ను అకస్మాత్తుగా మార్చడం వల్ల ఒకేసారి మనలో రక్తపోటు తగ్గవచ్చు. దీన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. అలాంటి సమయాల్లోనూ మీరు చెప్పినట్లుగా ముందుకు పడిపోతారేమో లాంటి ఫీలింగ్, గిడ్డీనెస్ కలగవచ్చు. బీపీలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల మీరు చెప్పిన లక్షణాలు కనిపించినప్పటికీ, అవి కేవలం బీపీ వల్లనే అని చెప్పలేం. సాధారణంగా బీపీ వల్ల ఉదయం వేళల్లో తలనొప్పి కనిపించనప్పటికీ, మరెన్నో ఆరోగ్య సమస్యలలోనూ తలనొప్పి ఒక లక్షణంగా ఉంటుంది. అలాగే మీరు చెప్పిన గిడ్డీనెస్ సమస్యతో పాటు వర్టిగో, సింకోప్ లాంటి మరెన్నో సమస్యలు కూడా మీకు కనిపిస్తున్న లక్షణాలకు కారణం కావచ్చు. అందుకని కేవలం లక్షణాల ఆధారంగానే బీపీ నిర్ధారణ చేయడం సరికాదు. అందుకే మీరు నిర్భయంగా ఒకసారి డాక్టర్‌ను కలవండి. అయితే డాక్టర్ కూడా కూడా కేవలం ఒక్క పరీక్షలోనే బీపీ నిర్ధారణ చేయరు. అనేక మారు బీపీని కొలిచి, ఒకవేళ నిజంగానే సమస్య ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని కచ్చితంగా నిర్ధారణ చేసి, దానికి తగిన చికిత్స సూచిస్తారు. హైబీపీ నిర్ధారణకు పరీక్షలేమిటి? నా వయసు 48. నాకు తరచూ తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. దాంతో నాకు హైబీపీ ఉందేమోనని అనుమానం వస్తోంది. హైబీపీ నిర్ధారణకు ఏయే పరీక్షలు చేయించాలి? – కృష్ణ, ఖమ్మం రక్తపోటు ఉన్నట్లు అనుమానించేవారు చేయించుకోవాల్సిన సాధారణ పరీక్షలు ఇవి... ∙పూర్తిస్థాయి మూత్ర పరీక్ష (కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్) ∙రక్తంలో హీమోగ్లోబిన్ పాళ్లు ∙రక్తంలో పొటాషియమ్ స్థాయి ∙బ్లడ్ యూరియా అండ్ క్రియాటిన్ లెవెల్స్ ∙ఈసీజీ ∙కిడ్నీ సైజ్‌ను తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ అబ్డామిన్ పరీక్ష ∙రక్తంలో చక్కెర పాళ్లు తెలుసుకునే రాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్ష... ఇవి మామూలుగా చేయించాల్సిన పరీక్షలు. అయితే కొందరిలో మరికొన్ని ప్రతేక పరీక్షలు అవసరమవుతాయి. ఈ ప్రత్యేక పరీక్షలు ఎవరికి అవసరమంటే ... ∙కుటుంబ చరిత్రలో రక్తపోటు వల్ల మూత్రపిండాలు దెబ్బతిన్న వారికి ∙డయాబెటిస్ పేషెంట్లు అందరికీ ∙కాళ్లలో, పాదాల్లో వాపు వస్తున్నవారికి ∙రక్తపోటు అదుపు చేయడానికి రోజూ రెండు కంటే ఎక్కువ మందులు ఉపయోగిస్తున్నవారికి ∙ముప్ఫయి ఏళ్ల వయసు రాకముందే రక్తపోటు వచ్చిన వారికి, రక్తపోటు కనుగొని ఐదేళ్లు దాటిన వారికి ∙తీవ్రమైన తలనొప్పి వస్తున్నవారు, రక్తపోటు పెరగడం వల్ల గుండెదడ, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందిపడే వారికి ఇవి అవసరం. హైబీపీ వల్ల కిడ్నీలకు ఏదైనా ప్రమాదం జరిగిందేమో తెలుసుకోడానికి ఈ పరీక్షలు చేయిస్తారు. అవి... ∙24 గంటలలో మూత్రంలో పోయే ప్రోటీన్లు, క్రియాటిన్ పాళ్లు తెలుసుకునే పరీక్ష. (మూత్రంలో పోయే ప్రోటీన్లను కేవలం ఒక శాంపుల్తోనే తెలుసుకునే పరీక్షలూ అందుబాటులోకి వచ్చాయి) ∙కిడ్నీ బయాప్సీ ∙మూత్రపిండాల్లోని రక్తనాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కాన్ ∙బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ ∙రీనల్ యాంజియోగ్రామ్. - డాక్టర్ ఎమ్. గోవర్ధన్, సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్