
దేశంలో హై బీపీ పెరిగిపోతోంది
లండన్: దేశంలో హై బీపీతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 2015 నాటికి దేశంలో దాదాపు 20 కోట్ల మందికి హై బీపీ ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. చైనాలో అత్యధికంగా 22.60 కోట్ల మంది దీనితో బాధపడుతున్నారు. హై బీపీ ఉన్న వారిపై చేసిన అధ్యయన కథనాన్ని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు.
గత 40 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా హై బీపీ ఉన్నవారు రెట్టింపయ్యారు. 2015 నాటికి 113 కోట్లమందికి హై బీపీ ఉంది. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారు. హై బీపీ వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదముందని, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 75 లక్షల మంది దీనివల్ల మరణిస్తున్నారని అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే దీని ప్రభావం ఎక్కువగా ఉంది. అందులోనూ ఆసియాలోనే తీవ్రత ఎక్కువ. గతేడాది ప్రపంచంలో మొత్తం 113 కోట్ల మందికి హై బీపీ ఉండగా, వీరిలో దక్షిణాసియాలో 23 శాతం, తూర్పు ఆసియాలో 21 శాతం మంది ఉన్నారు. మహిళలతో పోలిస్తే పరుషులే ఎక్కువ మంది దీని బారినపడ్డారు. హై బీపీ ఉన్నవారు తక్కువమంది ఉన్న యూరప్ దేశాల్లో బ్రిటన్ ప్రథమ స్థానంలో ఉంది. అలాగే అమెరికా, కెనడా, దక్షిణా కొరియాల్లో కూడా దీని ప్రభావం చాలా తక్కువ.