అధిక రక్తపోటుకు కారణమవుతున్న మైక్రో ప్లాస్టిక్స్
ఇన్‌ఫ్లమేషన్, హార్మోన్ల అసమతుల్యత, కేన్సర్ లాంటి వాటికీ దోహదం
తొలుత రక్తంలోకి..తర్వాత గుండె కణజాలం, కాలేయం, ఊపిరితిత్తులు తదితరాలకు వ్యాప్తి
ఆస్ట్రియాలోని డాన్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
నల్లా నీళ్లను వేడిచేసి తాగడం, స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్ల వినియోగం మంచిదని సూచన
సాక్షి, హైదరాబాద్: మన రోజువారీ అలవాట్లే మన ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయి. అందులో ప్లాస్టిక్ వినియోగం ఒకటి. ప్రస్తుతం మనం కూరగాయలు, పండ్లు, ఇతర ఆహారపదార్థాలు సులువుగా తీసుకెళ్లేందుకు వాడు తున్న ప్లాస్టిక్ కవర్లు, బ్యాగ్‌లు కూడా అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అంతేకాదు నీళ్లు తాగేందుకు అత్యధిక శాతం మంది ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ సీసాలు కూడా మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. నిత్యం ప్లాస్టిక్ సీసాలతో తాగుతున్న మంచినీటి ద్వారా శరీరంలోకి చేరుతున్న సూక్ష్మ రూపాల్లోని ప్లాస్టిక్ రేణువులు (మైక్రో ప్లాస్టిక్స్) అధిక రక్తపోటు (హై బ్లడ్‌ప్రెషర్)కు కారణమవుతున్నట్టు ఆస్ట్రియాలోని డాన్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీ తాజా పరిశోధనలో వెల్లడైంది.
గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు వంటి వాటికి బీపీనే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్‌ఫ్లమేషన్, హార్మోన్ల అసమతుల్యత, కేన్సర్ వంటి వాటికి కారణమవుతున్నాయని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ తొలుత రక్త ప్రవాహంలోకి తర్వాత సలైవా, గుండె కణజాలం, కాలేయం, ఊపిరితిత్తులు ఇంకా ప్లాసెంటా (మావి).. ఇలా అన్ని అవయవాల్లోకీ చేరుతున్నాయి. ముఖ్యంగా ‘బాటిల్డ్ వాటర్’లో హెచ్చు స్థాయిల్లో ఈ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్టుగా అధ్యయనంలో తేలింది.
అధ్యయనంలో భాగంగా మైక్రో ప్లాస్టిక్స్ –పెరుగుతున్న రక్తపోటు మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని పరిశీలించారు. ‘జర్నల్ మైక్రోప్లాస్టిక్స్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా రక్తపోటు సమస్యను గణనీయంగా తగ్గించవచ్చునని పేర్కొంది. రక్తపోటు సమస్యలను తగ్గించుకునేందుకు ప్లాసిక్ సీసాలలో మంచినీళ్లు, ఇతర పానీయాలు (ప్యాకేజ్డ్ బాటిల్స్) తీసుకునే అలవాటును మానుకుంటే మంచిదని సూచించింది. నల్లాల ద్వారా వచ్చే నీటిని కాచి వడబోశాక తాగడంతో పోల్చితే ప్లాస్టిక్ సీసాలలోని నీటిని, అలాగే కొన్ని సందర్భాల్లో గాజు సీసాల్లోని నీటిని తాగాక రక్తపోటు పెరిగినట్టుగా పరిశోధకులు
గుర్తించారు.
సింథటిక్ వ్రస్తాలు ఉతకడం వల్ల కూడా..
నిత్యం ఐదు మిల్లీమీటర్ల కంటే కాస్త తక్కువ పరిమాణంలో మైక్రోప్లాస్టిక్స్ శరీరంలో చేరుతుండడంతో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధన స్పష్టం చేసింది. గతంలోనే నిర్వహించిన ఓ అధ్యయనంలో...ప్రతి వారం బాటిళ్ల ద్వారా తీసుకునే వివిధ రూపాల్లోని ద్రవాల ద్వారా ఐదు గ్రాముల చొప్పున మైక్రోప్లాస్టిక్స్ శరీరంలో చేరుతున్నట్టు వెల్లడైంది. కారు టైర్ల అరుగుదల మొదలు పెద్దమొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాల ధ్వంసం, సింథటిక్ వ్రస్తాలు ఉతకడం తదితర రూపాల్లో కూడా ఇవి శరీరంలో చేరుతున్నట్టు తెలిపింది. మనం తీసుకునే ఆహారం, నీళ్లు, పీల్చే గాలి తదితరాల ద్వారా మనకు తెలియకుండానే ప్లాస్టిక్ రేణువులు శరీరాల్లో చేరుతున్నట్టు పేర్కొంది.
అయితే బాటిల్ నీళ్లను తాగకుండా ఉంటే ఈ సమస్యను కొంతవరకు నివారించ వచ్చని, నల్లా నీళ్లను వేడిచేసి చల్లబరిచి, ఫిల్టర్ చేసి తాగడం మంచిదని సూచించింది. దీనిద్వారా మైక్రో ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ శరీరంలో చేరడాన్ని 90 శాతం దాకా తగ్గించవచ్చునని అధ్యయనం పేర్కొంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు..రోజువారి జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ప్లాస్టిక్ బాటిళ్లలో పానీయాలను భద్రపరచడం నిలిపేయాలని సూచించింది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లకు బదులుగా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని, స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా గ్లాస్ కంటైనర్లు వినియోగించాలని, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment