
విచ్చలవిడిగా వాటర్, ఆయిల్, రసాయనాల బాటిళ్ల వాడకం
2023తో పోలిస్తే 2024లో విపరీతంగా పెరిగిన వైనం
2024లో ఏకంగా 1,42,23,000 కేజీలకు చేరుకున్న ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం
ఒక్కసారి వాడి పడేసిన బాటిళ్ల వినియోగమే అధికం
2024లో జమ అయిన 96.6 లక్షల కేజీల ప్లాస్టిక్ సామగ్రి
చెత్తకుండీల్లో కుప్పలు తెప్పలుగా ప్లాస్టిక్ బాటిళ్లు, క్యారీ బ్యాగులు
ఏటా పెరుగుతున్న ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం
అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ముంబైలో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం తగ్గడం లేదు. వాటర్ బాటిళ్లు, ఆయిల్ బాటిళ్లు, ఫినాయిల్, బాత్రూంలు శుభ్రంచేసే యాసిడ్, ఇతర రసాయనాల బాటిళ్ల వినియోగం విచ్చల విడిగా జరుగుతోంది. వివిధ అవసరాలకు వాడి పారేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లవల్ల పర్యావరణానికీ హాని జరుగుతోంది. 2023తో పోలిస్తే 2024లో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. 2023లో 67 లక్షల కేజీల ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం జరగ్గా అదే 2024లో ఏకంగా 1,42,23,000 కేజీలకు చేరుకుంది. దీన్ని బట్టి రెట్టింపునకుపైగా ప్లాస్టిక్ వినియోగం జరిగినట్లు స్పష్టమవుతోంది.
వన్ టైం యూజ్ బాటిళ్లే ఎక్కువ..
ముంబైలోని వివిధ చెత్త కుండీలలో లభించిన ప్లాస్టిక్ బాటిళ్లను బట్టి ఇందులో అధికంగా ఒకసారి వినియోగించే (వన్ టైం యూజ్) బాటళ్లే అధికంగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో వివిధ రకాల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, తినుబండారాల పార్శిల్ ప్యాకింగులు ఉన్నాయి. ఒకప్పుడు గల్లీలలొ, ఫూట్‌పాత్‌లపై, రోడ్ల పక్కన, ఖాళీ మైదానాలలో బీఎంసీ ఏర్పాటుచేసిన కుండీలలో చెత్త అధికంగా కనిపించేది. కానీ ఇప్పడు అదే చెత్త కుండీలలో ప్లాస్టిక్ బాటిళ్లు, క్యారీ బ్యాగులు అధికంగా కనిపిస్తున్నాయి. ఇలా చెత్త కుండీలలో లభించిన ప్లాస్టిక్ బాటిళ్లను నిర్వీర్యంచేసి మళ్లీ కొత్తగా తయారుచేయడానికి వీలున్న బాటిళ్లను బీఎంసీ పారిశుద్ధ్యం విభాగం సిబ్బంది పోగు చేస్తున్నారు. బాటిళ్లతోపాటు భోజనం చేసే ప్లేట్లు, నీటి గ్లాస్‌లు, స్పూన్లు, పార్శిల్ కంటైనర్లు, స్ట్రాలు, కప్‌లు, సంచులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఏ మాత్రం తగ్గలేదు. 2023లో నిర్వీర్యం చేసి మళ్లీ వినియోగించే వీలున్న 85–90 లక్షల కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించగా అదే 2024లో 96.6 లక్షల కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించింది. అదే 2022లో 67,12,557 కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించింది.
రోజూ 7–8 వేల మెట్రిక్ టన్నుల చెత్త
ముంబైలో ప్రçస్తుతం చెత్త నిర్వీర్యం చేసే 48 కేంద్రాలు పని చేస్తున్నాయి. ముంబైలో రోజూ 7–8 వేల మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. పొడి చెత్తలో ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులు, పేపర్లు, కార్డు బోర్డులు, థర్మకోల్, పుట్ట బాక్స్‌లు, గాజు బాటిళ్లు, పాత దుస్తులు, ఈ–చెత్త ఉంటున్నాయి. 2024లో 6,15,513 కేజీల ఈ–చెత్త పోగుచేశారు. ఇందులో థర్మకోల్ కూడా అధికంగా ఉంది. ఇదిలాఉండగా 2005 జూలై 26వ తేదీన ముంబైలో వచి్చన వరదల్లో 200 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోగా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అప్పట్లో వరదలకు ప్రధాన కారణం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగమేనని తేలింది. దీంతో తేరుకున్న బీఎంసీ 50 మైక్రాన్లకంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై నిషేధం విధించింది. ఆ తరువాత 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్టాస్టిక్ క్యారీ బ్యాగులు తయారుచేసే కంపెనీలపై, నిల్వచేసే గోడౌన్లపై, విక్రయించే వ్యాపారులపై వినియోగదారులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఆ సమయంలో 833 మంది విక్రయించే వ్యాపారులు, వినియోగదారుల నుంచి 3,148 కేజీల ప్టాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రూ.41.70 లక్షల జరిమానా వసూలు చేశారు. ప్రస్తుతం ప్లాస్టిక్ తయారు, విక్రయం, వినియోగించే వారిపై అంతగా చర్యలు తీసుకోవడం లేదు. నామమాత్రంగా దాడులు చేసి కంపెనీలకు సీలు వేయడం, విక్రయించే వ్యాపారులు, వినియోగించే సామాన్యులపై చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వినియోగం భారీగానే జరుగుతోంది.