కాళ్ల నుంచి మెడ దాకా.. నరకం! | Guillain Barre Syndrome cases rise to 110 in Pune | Sakshi
Sakshi News home page

కాళ్ల నుంచి మెడ దాకా.. నరకం!

Published Wed, Jan 29 2025 6:03 AM | Last Updated on Wed, Jan 29 2025 6:03 AM

Guillain Barre Syndrome cases rise to 110 in Pune

మహారాష్ట్రలోని పుణేలో కలకలం సృష్టిస్తున్న గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌

కాళ్ల నుంచి మెడ కండరాల దాకా శరీరమంతా అచేతనం కావడం ప్రధాన రోగ లక్షణం

నిర్ధారణ, చికిత్స పద్ధతులివీ...

గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌(Guillain Barre Syndrome) (జీబీఎస్‌).. మహారాష్ట్రలోని పుణేలో తాజాగా కలకలం సృష్టిస్తున్న వ్యాధి. దీని బారినపడి 110 మంది ఆస్పత్రులపాలయ్యారని.. మహారాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒకరు ఈ వ్యాధితో మరణించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏదైనా వైరల్‌ లేదా బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ సోకాక పోస్ట్‌ వైరల్‌ లేదా పోస్ట్‌ బ్యాక్టీరియల్‌ వ్యాధిగా కనిపించే ఈ సమస్య కాళ్లు చచ్చుబడిపోవడంతో ప్రారంభమవుతుంది. చిత్రంగా బాధితుల వైటల్స్‌... అంటే నాడి, రక్తపోటు వంటివన్నీ సాధారణంగానే ఉంటాయి. కానీ కాళ్ల దగ్గర్నుంచి క్రమంగా పైవైపునకు శరీరం అచేతనమవుతూ వస్తుంది. అలా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తే శ్వాస తీసుకోలేక బాధితులు మృతిచెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్స పద్ధతుల గురించి వివరాలివీ..

కలుషిత నీటి వాడకంతో మొదలు..
గతంలో జీబీఎస్‌ వ్యాధి చాలా అరుదుగా కనిపించేది. ప్రతి లక్ష మందిలో కేవలం ఒకరిద్దరికే ఈ వ్యాధి వచ్చేది. ఇప్పుడు వందలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరిగింది. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. అయితే పుణేలో అనేక మంది కలుషితమైన నీటిని వాడటంతో ఈ వ్యాధి ప్రబలినట్లు తేలింది. సాధారణంగా పోస్ట్‌ వైరల్‌/బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల ఈ వ్యాధి వస్తుంటుంది. అక్కడి నీళ్లలో నోరో వైరస్, క్యాంపైలో బ్యాక్టీరియా ఉందని.. ఆ వైరస్, బ్యాక్టీరియాల ప్రభావంతో వ్యాధినిరోధక శక్తి బాధితుల నరాలపై ఉన్న మైలీన్‌ పొరను దెబ్బతీయడంతో ఈ ఆటోఇమ్యూన్‌ వ్యాధి వచ్చినట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది. 

బాధితులు అచేతనం కావడం ఎందుకంటే... 
మనిషి ప్రతి అవయవాన్నీ మెదడు నియంత్రిస్తుంటుంది. మెదడు నుంచి దేహంలోని ప్రతి భాగానికీ ఆదేశాలందించే నరాలపై మైలీన్‌ అనే పొర ఉంటుంది. సొంత వ్యాధినిరోధక వ్యవస్థలోని యాంటీబాడీస్‌ తమ సొంత మైలీన్‌ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్‌ అందకపోవడంతో అవయవాలు చచ్చుబడి అచేతనమవుతాయి.

ఇవీ లక్షణాలు..
మెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోతాయి.
అచేతనం కావడం కింది నుంచి ప్రారంభమై పైకి పాకుతుంది. దాంతో వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమవుతుంది.
గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.
అచేతనమయ్యే ఈ ప్రక్రియ ఛాతీ, కండరాలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్‌ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది. ఈ జబ్బును పూర్తిగా ప్రమాదకరంగా మార్చే అంశమిదే.

వేర్వేరుగా తీవ్రత స్థాయి
కండరాలు అచేతనం కావడంలోని ఈ తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో స్వల్పంగా ఉంటే మరికొందరిలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే నడక కష్టమవుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే బాధితులు పూర్తిగా మంచానికే పరిమితమవుతారు. చాలా మందిలో తమ ప్రమేయం లేకుండా జరిగిపోయే కీలకమైన జీవక్రియలు చాలా అరుదుగా మాత్రమే ప్రభావితమవుతాయి. కొందరిలో అవి కూడా ప్రభావితమైనప్పుడు గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చుతగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు.

ఎప్పుడు ప్రమాదకరమంటే...
వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం కావచ్చు. మైలీన్‌ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితుడు క్రమంగా కోలుకో వడం మొదలవుతుంది. ఇలా కోలుకోవడమ న్నది రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు. 

జీబీ సిండ్రోమ్‌ లక్షణాలే కనిపించే మరికొన్ని జబ్బులు 
శరీరంలో పొటాషియం లేదా కాల్షియం పాళ్లు తగ్గితే జీబీఎస్‌లో కనిపించే లక్షణాలే కనిపి స్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. ఇక శరీరంలో అకస్మాత్తుగా క్రియాటినిన్‌ పాళ్లు పెరిగిపోవడం, డిఫ్తీరియా, హెచ్‌ఐవీ, లింఫోమా వంటి జబ్బుల్లోనూ జీబీ సిండ్రోమ్‌లోని లక్షణాలే కనిపిస్తాయి.

నిర్ధారణ ఇలా..
గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌ వంటి లక్షణాలతోనే మరికొన్ని ఇతర సమస్యలు వ్యక్తం కావడంతోపాటు పొటాషియం, కాల్షియం వంటి ఖనిజ లవణాలు తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి జీబీ సిండ్రోమ్‌ నిర్థారణ చాలా స్పష్టంగా జరగాలి. అందుకే రోగుల్లో తొలుత సాధారణ రక్తపరీక్ష చేసి అందులో పొటాషియం, కాల్షియం పాళ్లను, క్రియాటినిన్‌ మోతాదులను పరిశీలిస్తారు. అవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు నర్వ్‌ కండక్షన్‌ పరీక్షల ద్వారా జీబీ సిండ్రోమ్‌ను నిర్ధారణ చేస్తారు. అయితే ఈ పరీక్షతో వ్యాధి తీవ్రత తెలియదు. కొన్నిసార్లు వెన్ను నుంచి నీరు తీసే ‘సెరిబ్రో స్పైనల్‌ ఫ్లూయిడ్‌’(సీఎస్‌ఎఫ్‌) పరీక్ష కూడా అవసరం కావచ్చు.

చికిత్స..
ఈ జబ్బులో రోగి తన రోజువారీ పనులను సొంతంగా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటే ఈ కింది చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. 
    ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ చికిత్స: శరీర బరువు ఆధారంగా వారికి తగిన మోతాదులో 5 రోజులపాటు ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ ఇంజెక్షన్లను ఇవ్వడమన్నది ఒక చికిత్స ప్రక్రియ. ఇవి దేహంలో మైలీన్‌ షీత్‌ను ధ్వంసం చేసే యాంటీబాడీస్‌ను బ్లాక్‌ చేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతాయి. 

ప్లాస్మా ఎక్సే్చంజ్‌ చికిత్స: ఈ చికిత్స ప్రక్రియలో శరీరం బరువునుబట్టి ప్రతి కిలోగ్రాముకూ 250 ఎంఎల్‌ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. అందులో ఐదు విడతలుగా రోజు విడిచి రోజు రక్తంలోని ప్లాస్మాను తీసేయడం ద్వారా ప్లాస్మాలోని యాంటీబాడీస్‌ను తొలగించడం జరుగుతుంది. ఈ రెండు చికిత్సల్లో ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ చికిత్స చాలా ఖరీదైనది. దానితో పోలిస్తే ప్లాస్మా ఎక్సే్చంజ్‌ చికిత్స దాదాపు సగం ఖర్చులోనే అవుతుంది. 

మరణాలు 5 శాతం లోపే..
ఈ వ్యాధి సోకిన వారిలో 70 శాతం మంది పూర్తిగా కోలుకుంటారు. మరో 10 శాతం మందిలో చెప్పుకోదగ్గ పురోగతి ఉండదు. కేవలం 3 శాతం నుంచి 5 శాతం రోగులు మెరుగైన చికిత్స ఇప్పించినప్పటికీ మృతువాత పడే అవకాశాలున్నాయి. యువకులు, టీనేజీ పిల్లలు వేగంగానే కోలుకుంటారు. పైగా దీని ఉనికేలేని తెలుగు రాష్ట్రాల వారిలో ఆందోళన అక్కర్లేదు. కాకపోతే కలుషితమైన నీరు, ఆహారం వాడకపోవడం అన్ని విధాలా మేలని గుర్తించాలి. – ఫ్యామిలీ హెల్త్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement