Longest Dance Marathon: Maharashtra Girl Sets Guinness World Record, Dances For 127 Hours - Sakshi
Sakshi News home page

Srushti Sudhir Jagtap: రికార్డు సృష్టించింది!

Published Tue, Jul 25 2023 5:22 AM | Last Updated on Tue, Jul 25 2023 1:21 PM

Longest dance marathon: Maharashtra girl sets Guinness World Record, Dances for 127 hours - Sakshi

∙నాట్యం చేస్తూ, రికార్డు అందుకుంటూ...

సాధించాలంటే కఠోర సాధన ఉండాలి. అంతకు మించిన అంకితభావం ఉండాలి. ఈ రెండూ ఉంటే రికార్డు సాధనకు వయసు అనేది ప్రధానం కాదని నిరూపించింది సృష్టి సుధీర్‌ జగ్‌తాప్‌. పదహారేళ్ల సృష్టి విరామం లేకుండా 127 గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్‌ డాన్స్‌ మారథాన్‌ (ఇండివిడ్యుయల్‌ కేటగిరీ)లో గిన్నిస్‌ రికార్డు సాధించింది.

మహారాష్ట్రలోని లాతూర్‌కి చెందిన సృష్టి... లాతూర్‌లోని పోదార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుతోంది. ఆమె అమ్మానాన్న సుధీర్, సంజీవని ఇద్దరూ టీచర్లు. వాళ్ల తాతగారు ‘బాబన్‌ మనే’ స్వయానా నాట్యగురువు. సృష్టికి చిన్నప్పటి నుంచి నాట్యసాధన అలవాటయింది. కానీ ఆమెకు రికార్డు కోసం నాట్యం చేయాలనే ఆకాంక్షకు కారణం బందనా నేపాల్‌. ఆమె 2018లో 126 గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్‌ డాన్స్‌ మారథాన్‌లో గిన్నిస్‌ రికార్డు సాధించింది.

అప్పుడు ‘భారతీయ నాట్యరీతులు లెక్కలేనన్ని ఉన్నాయి. మన నాట్యరీతికి ఓ రికార్డు ఉంటే బావుణ్ను. ఆ రికార్డు ద్వారా ప్రపంచదేశాలకు మన శాస్త్రీయ నాట్యం గురించి తెలుస్తుంది’... అనే ఆలోచన సృష్టిలో రేకెత్తింది. ఆమె ఆలోచనకు తల్లిదండ్రులు, తాత అండగా నిలిచారు. గిన్నిస్‌ రికార్డు కోసం కథక్‌ నాట్య సాధన చేయాలనుకుంది. తాత పర్యవేక్షణలో 15 నెలల పాటు కఠోరసాధన చేసింది. ధ్యానంలో యోగనిద్ర కూడా సాధన చేయించారు బాబన్‌ మనే. రోజుకు నాలుగు గంటల సేపు ధ్యానం, మూడు గంటల సేపు వ్యాయామం, ఆరు గంటల సేపు నాట్యసాధన... ఇదీ రికార్డు కోసం ఆమె చేసిన దీక్ష.
 
గంటకు ఐదు నిమిషాల విరామం
సృష్టి 127 గంటల నాట్య ప్రద్శన మే నెల 29వ తేదీన పోదార్‌ స్కూల్‌ వేదిక మీద మొదలైంది. నాట్యప్రదర్శన ఐదు రోజుల పాటు నిర్విరామంగా సాగింది. ఆహారం అందక దేహం నీరసించి, డీహైడ్రేషన్‌కు లోను కాకుండా ఉండడానికి గంటకోసారి ఐదు నిమిషాల సేపు విరామం తీసుకునేది. ఆ విరామంలో ఎనర్జీ డ్రింక్‌ తీసుకుంటూ తన నాట్యదీక్షను కొనసాగించింది. సృష్టి నాట్యం చేసినంత సేపూ ఆమె తల్లిదండ్రులు వేదిక పక్కనే ఉండి ఆమెకు కావలసినవి అందిస్తూ వచ్చారు. నాట్య ప్రదర్శనను వీక్షించిన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధి స్వప్నిల్‌ దంగారికర్‌ సర్టిఫికేట్‌ ప్రదానం చేస్తూ సృష్టిని ప్రశంసల్లో ముంచెత్తారు.

‘‘రికార్డు సాధనలో నా లక్ష్యం నెరవేరింది. ఐదు రోజుల ఐదు గంటల పాటు (విరామంతో కలిపి దాదాపు ఆరు రోజులు) సాగిన నాట్య ప్రదర్శన మధ్యలో అప్పుడప్పుడూ తల, శరీరం తూలిపోతున్న భావన కలిగాయి. నా లక్ష్యం 127 గంటలను పూర్తి చేయడం. లాంగెస్ట్‌ డాన్స్‌ మారథాన్‌లో ఇండియాకు రికార్డు సాధించడం. దేహం నిస్సత్తువతో ఇకచాలనే సంకేతాలు జారీ చేసినప్పుడు నా లక్ష్యాన్ని గుర్తు చేసుకుని క్షణాల్లో నన్ను నేను సంబాళించుకున్నాను. మానసికంగా స్థిరంగా ఉంటే దేహం కూడా సహకరిస్తుంది’ అన్నది పదహారేళ్ల సృష్టి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement