Sabri Becomes First Muslim Girl To Join For Learning Kathakali At Kalamandalam - Sakshi
Sakshi News home page

డాన్స్‌ స్కూల్‌లో పోరాడి సీటు.. మరో స్వర్ణకమలం

Published Sat, Jul 1 2023 1:22 AM | Last Updated on Fri, Jul 14 2023 3:58 PM

Sabri of Kollam becomes first Muslim girl to enrol for learning Kathakali at Kalamandalam - Sakshi

సంప్రదాయ నృత్యమంటే ఇష్టం లేని అమ్మాయిని ఆ నృత్యంలో లగ్నం చేసే సినిమా కథ ‘స్వర్ణకమలం’. కేరళలో ఇందుకు పూర్తి విరుద్ధమైన కథ జరిగింది. మదరసాలో చదువుకునే ఒక అమ్మాయి కథాకళి పట్ల ఆసక్తితో 80 ఏళ్ల చరిత్ర ఉన్న డాన్స్‌ స్కూల్‌లో పోరాడి సీటు సాధించుకుంది. కథాకళిలో ముస్లిం అమ్మాయిల ప్రవేశం ఇప్పటి వరకూ లేదు. ఆ నృత్యం నేర్చుకుంటున్న మొదటి అమ్మాయి సాబ్రి.

‘చిన్నప్పటి నుంచి కథాకళి చూస్తున్నా. దానికి వేసుకునే మేకప్, దాని కాస్ట్యూమ్స్, ఆ నృత్యవిధానం నన్ను ఆకర్షించాయి. ఎలాగైనా ఆ డాన్స్‌ నేర్చుకోవాలని చెప్పా. నాన్నకు కూడా ఆ డాన్స్‌ ఇష్టం. సరేనమ్మా అన్నాడు’ అంది సాబ్రి.

ఏడవ క్లాసు పూర్తి చేసిన సాబ్రి ఇప్పుడు తండ్రి నిస్సమ్, తల్లి అనీషాల ప్రోత్సాహంతో కథాకళి నృత్యం నేర్చుకోవడానికి పూనుకుంది. కేరళలోనే కాదు బహుశా దేశంలోనే కథాకళి నేర్చుకుంటున్న తొలి ముస్లిం బాలిక సాబ్రి. అందుకే ఈ అమ్మాయిని అందరూ మెచ్చుకుంటున్నారు. కళకు కులం, మతం భేదం లేదని అంటున్నారు.

► దేవుని గుడిలో చూసి..
సాబ్రి కుటుంబం కొళ్లంలో నివసిస్తుంది. తండ్రి నిస్సమ్‌ ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌. వీరి ఇంటి సమీపంలోనే శ్రీ మహదేవ కోవెల ఉంది. అక్కడ దాదాపు ప్రతి వారం ఏదో ఒక సాయంత్రం కథాకళి నృత్య ప్రదర్శన ఉంటుంది. వృత్తిలో భాగంగా నిస్సమ్‌ ఆ నృత్య ప్రదర్శన ఫొటోలు తీయడానికి వెళ్లేవాడు. కాలక్షేపంగా ఉంటుందని సాబ్రిని కూడా తీసుకెళ్లేవాడు. ‘అలా ఏడేళ్ల వయసు నుంచే నేను కథాకళి నృత్యాన్ని చూస్తున్నాను. ఐదో క్లాసు అయ్యాక ఆ డాన్సును ప్రయివేటు టీచర్‌ దగ్గరి నుంచి నేర్చుకోవాలనుకున్నాను. కాని కోవిడ్‌ వల్ల క్లాసులు ఆగిపోయాయి. అదీగాక ఒక ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పరిపూర్ణంగా నేర్చుకోవాలనిపించింది. అందుకే కళామండలంలో చేరాను’ అంది సాబ్రి.

► మగవారికే కథాకళి
కథాకళి నృత్యం ఒక తపస్సు. దానికోసం జీవితాన్ని అంకితం చేయాలి. స్త్రీల శరీర ధర్మాలు, గృహ ధర్మాలు వారిని పరిపూర్ణంగా ఈ నృత్యంలో నిమగ్నం కానివ్వవు అనే ఉద్దేశ్యంతో ఈ నృత్యాన్ని ఆది నుంచి పురుషులకే పరిమితం చేశారు. పురుష కళాకారులే కథాకళిలోని స్త్రీల వేషాలను కూడా ధరిస్తారు. ప్రదర్శనను రక్తి కట్టిస్తారు. కథాకళిని పరిరక్షించడానికి కేరళలో ప్రతిష్టాత్మకమైన డాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది త్రిసూర్‌కు దగ్గరగా ఉన్న చెరుతురితి అనే ఊరిలోని ‘కళామండలం’. ఇది కథాకళిని బాల్యం నుంచి రెసిడెన్షియల్‌ పద్ధతిలో నేర్పుతుంది. అంటే ఇక్కడ మామూలు స్కూలు, కథాకళి స్కూలు కలిసి నడుస్తాయి. 90 ఏళ్లుగా నడుస్తున్న ఈ సంస్థలో పూర్తిగా అబ్బాయిలకే ప్రవేశం. అయితే గత సంవత్సరమే అమ్మాయిలు కూడా చేరొచ్చు అని అనుమతి ఇచ్చారు. ఎవరూ చేరలేదు. ఈ సంవత్సరం పది మంది అమ్మాయిలు చేరితే వారిలో ఒకమ్మాయి సాబ్రి.

► కఠిన శిక్షణ
కళామండలంలో 8 వతరగతిలో చేరిన సాబ్రి ఇక అక్కడే హాస్టల్‌లో ఉండిపోవాలి. ఉదయం 4.30 నుంచి లేచి కథాకళి పాఠాలు నేర్చుకోవాలి. 9.30 నుంచి మళ్లీ స్కూలు పాఠాలు నేర్చుకోవాలి. సాయంత్రం ఊళ్లో ఎక్కడ కథాకళి ప్రదర్శన జరుగుతుంటే అక్కడకు తీసుకెళ్లి చూపిస్తారు. ‘కథాకళిలోని ప్రదర్శనలన్నీ హిందూ పురాణాల ఆధారంగా ఉంటాయి. మరి నీకు ఆ పాత్రలు పోషించడంలో ఇబ్బంది ఏమీ లేదా’ అంటే ‘అలా ఏమీ లేదు’ అంటుంది సాబ్రి. తండ్రి నిస్సమ్‌ కూడా ‘మా అమ్మాయి డాన్స్‌ నేర్చుకోవడంలో కళ అందరూ నేర్చుకునే హక్కు నిరూపితం అయ్యింది. ఈ నృత్యం నేర్చుకోవడంలో మా మతస్తుల నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు’ అని తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement