Madarsa
-
యూపీ మదర్సాచట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం(నవంబర్ 5) కొట్టివేసింది. మదర్సా చట్టంలో రాజ్యాంగ ఉల్లంఘన ఏదీ లేదని స్పష్టం చేసింది. 17 లక్షల మంది విద్యార్థులు మరియు 10,వేల మంది మదర్సా ఉపాధ్యాయులను రాష్ట్ర విద్యా వ్యవస్థలో సర్దుబాటు చేయాలనే అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. మదర్సాచట్టాన్ని పూర్తిగా కొట్టివేయనవసరం లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించింది. అభ్యంతరాలున్న పలు సెక్షన్లను సమీక్షించవచ్చని తెలిపింది.ఇదీ చదవండి: అన్ని ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వానివి కావు: సుప్రీంకోర్టు -
ఉత్తరాఖండ్‌లో ఉద్రిక్తత
హల్ద్వానీ: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన మదరసా కూల్చివేతకు స్థానిక యంత్రాంగం ప్రయత్నించడం ఇందుకు కారణం. ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు వురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితు లను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు పట్టణంలో కర్ఫ్యూ విధించడంతోపాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని బన్భూల్పూర్ ప్రాంతంలో మదరసా, ప్రార్థనలకు వినియోగించే ఒక నిర్మాణం ఉన్నాయి. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా కట్టిన ఆ నిర్మాణాలను కూల్చివేసేందుకు గురువారం సాయంత్రం మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత ప్రక్రియ మొదలైంది. అరగంటలోపే భారీ సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. కొందరు చుట్టుపక్కల భవనాలపైకెక్కి మున్సిపల్ సిబ్బంది, పోలీసులపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. సంఘటన స్థలంలో గుమికూడిన వారు రాళ్లు, కర్రలు, పెట్రోలు బాంబులు, దేశవాళీ తుపాకులతో అధికారులు, సిబ్బందిని ఆగ్రహంతో ప్రశ్నిస్తూ దాడికి యత్నించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. ఆందోళనకారుల ఒక గుంపు వెంటబడగా పోలీసులు సమీపంలోని పోలీస్‌స్టేషన్ లోపలికి వెళ్లారు. అక్కడికి చేరుకున్న గుంపు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలకు నిప్పుపెట్టింది. పోలీస్ స్టేషన్‌కు సైతం నిప్పుపెట్టేందుకు ప్రయత్నించగా లోపలున్న పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని నైనిటాల్ జిల్లా మేజిస్ట్రేట్ వందనా సింగ్ చెప్పారు. పోలీస్ స్టేషన్‌తోపాటు సిబ్బందిపై దాడికి యత్నించినట్లు గుర్తించిన సుమారు 20 మందిలో నలుగురిని అరెస్ట్ చేసి, మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. మృతి చెందిన ఆరుగురిలో ముగ్గురికి బుల్లెట్ గాయాలు, మరో ముగ్గురికి ఇతర గాయాల య్యాయని చెప్పారు. క్షతగాత్రులైన 60 మందిలో చాలా మంది ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారని ఎస్పీ(సిటీ) హర్బన్స్ సింగ్ చెప్పారు. ఒక జర్నలిస్ట్ సహా గాయపడిన ఏడుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. -
డాన్స్ స్కూల్లో పోరాడి సీటు.. మరో స్వర్ణకమలం
సంప్రదాయ నృత్యమంటే ఇష్టం లేని అమ్మాయిని ఆ నృత్యంలో లగ్నం చేసే సినిమా కథ ‘స్వర్ణకమలం’. కేరళలో ఇందుకు పూర్తి విరుద్ధమైన కథ జరిగింది. మదరసాలో చదువుకునే ఒక అమ్మాయి కథాకళి పట్ల ఆసక్తితో 80 ఏళ్ల చరిత్ర ఉన్న డాన్స్ స్కూల్లో పోరాడి సీటు సాధించుకుంది. కథాకళిలో ముస్లిం అమ్మాయిల ప్రవేశం ఇప్పటి వరకూ లేదు. ఆ నృత్యం నేర్చుకుంటున్న మొదటి అమ్మాయి సాబ్రి. ‘చిన్నప్పటి నుంచి కథాకళి చూస్తున్నా. దానికి వేసుకునే మేకప్, దాని కాస్ట్యూమ్స్, ఆ నృత్యవిధానం నన్ను ఆకర్షించాయి. ఎలాగైనా ఆ డాన్స్ నేర్చుకోవాలని చెప్పా. నాన్నకు కూడా ఆ డాన్స్ ఇష్టం. సరేనమ్మా అన్నాడు’ అంది సాబ్రి. ఏడవ క్లాసు పూర్తి చేసిన సాబ్రి ఇప్పుడు తండ్రి నిస్సమ్, తల్లి అనీషాల ప్రోత్సాహంతో కథాకళి నృత్యం నేర్చుకోవడానికి పూనుకుంది. కేరళలోనే కాదు బహుశా దేశంలోనే కథాకళి నేర్చుకుంటున్న తొలి ముస్లిం బాలిక సాబ్రి. అందుకే ఈ అమ్మాయిని అందరూ మెచ్చుకుంటున్నారు. కళకు కులం, మతం భేదం లేదని అంటున్నారు. ► దేవుని గుడిలో చూసి.. సాబ్రి కుటుంబం కొళ్లంలో నివసిస్తుంది. తండ్రి నిస్సమ్ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. వీరి ఇంటి సమీపంలోనే శ్రీ మహదేవ కోవెల ఉంది. అక్కడ దాదాపు ప్రతి వారం ఏదో ఒక సాయంత్రం కథాకళి నృత్య ప్రదర్శన ఉంటుంది. వృత్తిలో భాగంగా నిస్సమ్ ఆ నృత్య ప్రదర్శన ఫొటోలు తీయడానికి వెళ్లేవాడు. కాలక్షేపంగా ఉంటుందని సాబ్రిని కూడా తీసుకెళ్లేవాడు. ‘అలా ఏడేళ్ల వయసు నుంచే నేను కథాకళి నృత్యాన్ని చూస్తున్నాను. ఐదో క్లాసు అయ్యాక ఆ డాన్సును ప్రయివేటు టీచర్ దగ్గరి నుంచి నేర్చుకోవాలనుకున్నాను. కాని కోవిడ్ వల్ల క్లాసులు ఆగిపోయాయి. అదీగాక ఒక ఇన్స్టిట్యూట్ నుంచి పరిపూర్ణంగా నేర్చుకోవాలనిపించింది. అందుకే కళామండలంలో చేరాను’ అంది సాబ్రి. ► మగవారికే కథాకళి కథాకళి నృత్యం ఒక తపస్సు. దానికోసం జీవితాన్ని అంకితం చేయాలి. స్త్రీల శరీర ధర్మాలు, గృహ ధర్మాలు వారిని పరిపూర్ణంగా ఈ నృత్యంలో నిమగ్నం కానివ్వవు అనే ఉద్దేశ్యంతో ఈ నృత్యాన్ని ఆది నుంచి పురుషులకే పరిమితం చేశారు. పురుష కళాకారులే కథాకళిలోని స్త్రీల వేషాలను కూడా ధరిస్తారు. ప్రదర్శనను రక్తి కట్టిస్తారు. కథాకళిని పరిరక్షించడానికి కేరళలో ప్రతిష్టాత్మకమైన డాన్స్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది త్రిసూర్‌కు దగ్గరగా ఉన్న చెరుతురితి అనే ఊరిలోని ‘కళామండలం’. ఇది కథాకళిని బాల్యం నుంచి రెసిడెన్షియల్ పద్ధతిలో నేర్పుతుంది. అంటే ఇక్కడ మామూలు స్కూలు, కథాకళి స్కూలు కలిసి నడుస్తాయి. 90 ఏళ్లుగా నడుస్తున్న ఈ సంస్థలో పూర్తిగా అబ్బాయిలకే ప్రవేశం. అయితే గత సంవత్సరమే అమ్మాయిలు కూడా చేరొచ్చు అని అనుమతి ఇచ్చారు. ఎవరూ చేరలేదు. ఈ సంవత్సరం పది మంది అమ్మాయిలు చేరితే వారిలో ఒకమ్మాయి సాబ్రి. ► కఠిన శిక్షణ కళామండలంలో 8 వతరగతిలో చేరిన సాబ్రి ఇక అక్కడే హాస్టల్లో ఉండిపోవాలి. ఉదయం 4.30 నుంచి లేచి కథాకళి పాఠాలు నేర్చుకోవాలి. 9.30 నుంచి మళ్లీ స్కూలు పాఠాలు నేర్చుకోవాలి. సాయంత్రం ఊళ్లో ఎక్కడ కథాకళి ప్రదర్శన జరుగుతుంటే అక్కడకు తీసుకెళ్లి చూపిస్తారు. ‘కథాకళిలోని ప్రదర్శనలన్నీ హిందూ పురాణాల ఆధారంగా ఉంటాయి. మరి నీకు ఆ పాత్రలు పోషించడంలో ఇబ్బంది ఏమీ లేదా’ అంటే ‘అలా ఏమీ లేదు’ అంటుంది సాబ్రి. తండ్రి నిస్సమ్ కూడా ‘మా అమ్మాయి డాన్స్ నేర్చుకోవడంలో కళ అందరూ నేర్చుకునే హక్కు నిరూపితం అయ్యింది. ఈ నృత్యం నేర్చుకోవడంలో మా మతస్తుల నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు’ అని తెలిపాడు. -
లవ్ జిహాద్‌కు మదర్సాలే కేంద్రాలు
బరేలీ: ’లవ్ జిహాద్, ప్రపంచ కలహాలకు కేంద్రాలకు మారిన మదర్సాలను మూసివేయాలని వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచి వ్యాఖ్యానించారు. ‘హిందువులు డబ్బు సంపాదన గురించే ఆలోచిస్తారు. ఒక ప్రత్యేకవర్గం మాత్రం భారత్‌ను పాలించాలని ఆలోచిస్తుంటుంది. వెయ్యేళ్లు భారత్‌ను పాలించడమే వారి ఎజెండా’అని యూపీలోని బరేలీలో ఆదివారం ఆమె మీడియాతో అన్నారు. ‘లవ్ జిహాద్ మదర్సాల నుంచే మొదలవుతోంది. అక్కణ్నుంచే వ్యాప్తి చెందుతుంది. దేశంలో మదర్సాలు మూసేసిన రోజున లవ్ జిహాద్ ఉనికిలోనే ఉండదు. అప్పుడు ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి’అని ఆమె మీడియాతో అన్నారు. -
అస్సాంలోని మదర్సాలన్నిటినీ మూసేస్తాం
బెళగావి: అస్సాంలోని అన్ని మదర్సా (ముస్లిం మత పాఠశాల)లను మూసి వేస్తామని ఆ రాష్ట్ర సీఎం హిమాంత బిశ్వ శర్మ తెలిపారు. ఆధునిక భారతదేశంలో మదర్సాల అవసరం అవసరం లేదని చెప్పారు. ‘దేశానికి, అస్సాం రాష్ట్రానికి సేవలు చేసేందుకు అవసరమైన డాక్టర్లు, ఇంజినీర్లు, ఇతర వృత్తి నిపుణులను తయారు చేసే స్కూళ్లు, కాలేజీలతో మాత్రమే అవసరం ఉంది. మదర్సాలతో కాదు’అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 600 మదర్సాలను మూసివేశాం, మిగతా వాటినీ మూసేస్తామని అన్నారు. కర్ణాటకలోని బెళగావిలో గురువారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిత్యం బంగ్లాదేశ్ నుంచి వస్తున్న జనంతో మన సంస్కృతి, ఆచారాలకు ముప్పు ఏర్పడిందన్నారు. ‘మన దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లమని గర్వంగా చెప్పుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, హిందువును అని గర్వంగా చెప్పుకునే వారు కావాలి’అని హిమాంత చెప్పారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చరిత్రను వక్రీకరించాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ను నయా మొఘలుల పార్టీగా అభివర్ణించారు. ఒకప్పుడు మొఘలులు భారత్‌ను బలహీనం చేసేందుకు ప్రయత్నించారు..కాంగ్రెస్ ఇప్పుడదే చేస్తోందన్నారు. -
ఇద్దరు పిల్లల కాళ్లను గోలుసులతో కట్టేసి తాళం.. ఆ తర్వాత..
ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టేసి, తాళం పెట్టి వారిని తీవ్రంగా కొట్టారు. ఎలాగోలా వారు అక్కడి నుంచి తప్పించుకుని పేరెంట్స్ వద్దకు చేరుకున్నారు. వారి పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. లక్నో సమీపంలో గోసైంగంజ్ శివలార్‌లో ఉన్న సుఫమ్‌దింతుల్ ఉలమా మదర్సాలోని మౌలానా ఇద్దరు పిల్లలను ఇనుప గొలుసులతో కట్టేశాడు. వారిలో ఒక విద్యార్థి గోసైంగంజ్ రాణిమౌ నివాసి అయిన షేరా కుమారుడు షాబాజ్ కాగా.. మరో విద్యార్థి, బారాబంకి జర్మావు నివాసి రాజు. అయితే, వీరిద్దరినీ గొలుసులతో కట్టివేడయంతో ఏడుస్తూ బయటకు పరుగులు తీశారు. దీంతో రోడ్డుమీద వీరిని చూసిన స్థానికులు పిల్లలను ఆపి విషయం తెలుసుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరినీ వెంటనే గోసైంగంజ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో పోలీసు అధికారి శైలైంద్ర గిరి.. పిల్లలను అడిగి విషయం తెలుసుకున్నారు. మదర్సా ఉపాధ్యాయులు తమను బెత్తంతో కొట్టారని, కాళ్లను గొలుసుతో కట్టేశారని విద్యార్థులు ఆరోపించారు. అనంతరం ఈ సమాచారాన్ని షాబాజ్ తండ్రి షేరాకు చేరవేశారు. స్టేషన్‌కు వచ్చిన షేరా.. గతంలో కూడా తమ బిడ్డ రెండు సార్లు మదర్సా నుంచి పారిపోయాడని తెలిపారు. షాబాజ్‌కు చదువు రాదని షేరా పోలీసులకు చెప్పారు. షాబాజ్‌కు చదువు నేర్పించేదుకే వారు ఇలా కొట్టారని పేర్కొన్నారు. షాబాజ్ తమ మాట వినడని అందుకే ఉపాధ్యాయులే అతడికి బుద్దిచెప్పాలని తాము కోరినట్టు వివరించారు. షాబాజ్‌కు ఇష్టం లేకున్నా మదర్సాకు పంపించామని అన్నారు. ఈ సందర్బంగానే మదర్సా ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని లిఖితపూర్వంగా ఆయన పోలీసు స్టేషన్లో నోట్ రాసి ఇచ్చారు. ఇది కూడా చదవండి: పెళ్లికి వెళ్తుండగా మృత్యుపంజా -
నిరసనకారులకు ప్రియాంక పరామర్శ
ముజఫర్‌నగర్/మీరట్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్, మీరట్‌లో జరిగిన నిరసనల్లో.. పోలీసుల దాడిలో గాయపడ్డ వారి కుటుంబాలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కలిశారు. ‘పోలీసులు ప్రజలను రక్షించాలి. కానీ ఇందుకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారు’అని ప్రియాంక ఆరోపించారు. లక్నోలోని బిజ్నూర్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పోలీసుల దాడిలో గాయపడ్డ ముజఫర్‌నగర్‌లోని మౌలానా అసద్ రజా హుస్సేనీని ఆమె పరామర్శించారు. మదరసాలో హుస్సేనీ పిల్లలతో కలసి ఉండగా, పోలీసులు వారిపై దాడికి పాల్పడి.. పిల్లలను కూడా జైలులో పెట్టారని ఆమె ఆరోపించారు. నిరసనల్లో జరిగిన హింసలో మరణించిన నూర్ మొహమ్మద్ కుటుంబాన్ని కలసి ఆమె పరామర్శించారు. పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించి ఇబ్బంది పెట్టిన రఖియా పర్వీన్‌ను కూడా ఆమె కలిశారు. ఏదైనా తప్పు చేస్తే చర్యలు తీసుకుంటే ఎవరూ తప్పు పట్టరని, అయితే ఎలాంటి తప్పు చేయకుండానే పోలీసులు అతిగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో సంబంధముందన్న ఆరోపణలతో అరెస్టయిన సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్, మాజీ ఐపీఎస్ అధికారి ధరపురి సహా 13 మందికి లక్నోలోని ఓ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
‘ఏడేళ్ల వయసులో నాపై అత్యాచారం చేశారు’
ఢాకా: చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన మదర్సాలు కొన్ని వికృత కార్యాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. పసిమొగ్గలపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ అరాచాకాల గురించి నోరు విప్పితే.. ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడటం లేదు. గతకొద్దికాలంగా బంగ్లాదేశ్‌లో ఈ అరాచాకాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ చిన్నారి మదర్సాలోని ఓ ఉపాధ్యాయుడు తన పట్ల తప్పుగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. దాంతో ఆ చిట్లితల్లిని అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాక మదర్సాలో పిల్లలు ఎదుర్కొంటున్న భయంకర పరిస్థితుల గురించి ప్రపంచానికి వెల్లడించింది. బాలిక మృతితో దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు మదర్సా సిబ్బందిని అదుపులోకి తీసుకుంది. ఈ సంఘటన తర్వాత చాలా మంది తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటకు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢాకా విశ్వవిద్యాలయంలో జర్నలిజం చదువుతున్న హోజైఫా అల్ మమ్దుహ్ తాను ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి ఫేస్బుక్ ద్వారా వెల్లడించాడు. ఆ వివరాలు.. ‘విద్యాభ్యాసం నిమిత్తం నేను ఢాకాలోని మూడు మదర్సాల్లో ఉన్నాను. ప్రతి చోట ఇలాంటి అకృత్యాలు చాలా సహజం. మదర్సాలో పని చేసే సిబ్బంది మాతో పాటు హస్టల్లోనే ఉండేవారు. సిబ్బందే కాక సీనియర్ విద్యార్థులు కూడా దారుణాలకు పాల్పడేవారు. పగలంతా ఏదో విధంగా గడిపిన విద్యార్థులు రాత్రి అవుతుందంటేనే భయంతో బిగుసుకుపోయేవారు. ఆ రాత్రి ఎవరికి కాళరాత్రిగా మారనుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపేవాళ్లం. దాదాపు మదర్సాలో ఉన్న ప్రతి విద్యార్థిపై ఈ అకృత్యాలు జరిగేవి. మేమంతా స్వయంగా బాధితులమే కాక ప్రత్యక్షంగా సాక్షులం కూడా. నేను కూడా ఈ నరకాన్ని అనుభవించాను. అది కూడా చాలా చిన్న వయసులో. ఏడేళ్ల వయసులో నాపై అత్యాచారం జరిగింది. నా సీనియర్లే నాతో ఇలా ప్రవర్తించారు. ఆ తర్వాత ఇలాంటి మరికొన్ని దారుణాల మధ్యే నా విద్యాభ్యాసం ముగిసింది. నాకు తెలిసిన చాలా మంది మదర్సా టీచర్లు పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని పాపంగా భావిస్తారు. కానీ పిల్లలతో లైంగిక సంబంధం కొనసాగించడం వారి దృష్టిలో పెద్ద నేరం కాదు. బాధితులు, నేరస్తులు ఒకే చోట ఉండటం మూలానా ఇలాంటి దారుణాలు బయటకు రావు. పైగా విద్యార్థులంతా పేదవారు కావడంతో మౌనంగా ఈ నరకాన్ని భరిస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు. హోజైఫా పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ జర్నలిస్టు స్ఫూర్తితో మరి కొంత మంది ధైర్యంగా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం గురించి దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో కొందరు మదర్సా నిర్వహకులు హోజైఫా వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అతడు యూదు మతానికి లేదా క్రిస్టియన్ మతానికి చెందిన వాడని.. అందుకనే ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మదర్సాలో చదవడం ఇష్టం లేని వారే ఇలాంటి ఆరోపణలు చేస్తారని మండి పడుతున్నారు. మదర్సాల ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మదర్సాకు చేరిన పిల్లలు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం పట్టణ పరిధిలోని సఫాయిబస్తీకి చెందిన మదర్సా నిర్వాహకుడు అరెస్టు కావడంతో, పోలీసులు అప్పటి నుంచి నిర్వాహకుడికి సంబంధించిన అన్ని కార్యకలాపాలపై దృష్టి సారించి తనిఖీలు నిర్వహించారు. బుధవారం సఫాయిబస్తీ మదర్సాను పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు తనిఖీలు చేసి అనంతరం అందులో ఉర్దూ నేర్చుకుంటున్న పిల్లలను, కొత్తగూడెంలోని శ్రీసత్యసాయి అనాథ శరణలయానికి తరలించారు. ఈ క్రమంలో ముస్లిం మతపెద్దలు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులతో చర్చలు జరిపి పిల్లల బాధ్యతను తీసుకుంటామని, ఆగస్టు 1వ తేదిన పిల్లల చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెడతామని, ఈలోగా బిహార్‌లోని పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని రప్పిస్తామని వివరించారు. దీంతో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, మతపెద్దలతో లెటర్ రాయించుకొని పిల్లలను తిరిగి మదర్సాకు పంపించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటక్షన్ ఆఫీసర్ హరికుమారి, సీఐ కుమారస్వామి, ఎల్‌పివో శివకుమారి, కేర్ టేకర్ వినోద్, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. -
జై శ్రీరాం అనలేదని మదర్సా విద్యార్ధులపై దాడి
లక్నో : ఓ మదర్సాకు చెందిన నలుగురు విద్యార్ధులను జై శ్రీరాం అని నినదించలేదని కొందరు వ్యక్తులు చితకబాదిన ఘటన యూపీలోని ఉన్నావ్‌లో చోటుచేసుకుంది. సివిల్ లైన్స్ ఏరియాలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు మదర్సా విద్యార్ధులకు గాయాలయ్యాయి. విద్యార్ధులు క్రికెట్ ఆడుతుండగా వారిని నిందితులు బ్యాట్లు, కర్రలతో కొట్టారని పోలీసులు తెలిపారు. క్రికెట్ మ్యాచ్ సాగుతుండగా ఈ ఘటన జరిగిందని ఉన్నావ్ ఎస్పీ మాధవ్ ప్రసాద్ వర్మ వెల్లడించారు. నలుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మదర్సా నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు. మరోవైపు విద్యార్ధులను జై శ్రీరాం నినాదాలు చేయాలని బలవంతం చేయలేదని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ పేర్కొనడం గమనార్హం. -
మదర్సా ముసుగులో మత మార్పిడులు
అశ్వారావుపేట: అశ్వారావుపేటలో మదర్సా పేరుతో నిర్వహిస్తున్న బాల్యవివాహాలు, మతమార్పిడుల గుట్టు గురువారం రట్టయింది. అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం గ్రామపంచాయతీ అల్లూరి సీతారామరాజు నగర్లో పన్నెండేళ్ల క్రితం మదర్సా పేరుతో వేంసూరుకు చెందిన ఓ కుటుంబం ఓ సంస్థను స్థాపించారు. మొదట్లో సర్వశిక్షా అభయాన్ నుంచి పాఠ్యపుస్తకాలు, ఇద్దరు విద్యావలంటీర్లను సమకూర్చారు. ఆ తర్వాత పాఠ్యపుస్తకాలు, విద్యావలంటీర్లను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆతర్వాత అక్కడేం జరుగుతోందో ఎవరికీ పట్టని విషయమైంది. కాగా అక్కడ ఇస్లాం పాఠాలో బోధిస్తున్నామని.. ప్రభుత్వ విద్యతో తమకు సంబంధం లేదని.. పేద ముస్లిం పిల్లలను దూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి నమాజ్, తదితర ఆధ్యాత్మిక బోధన చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పుతున్నారు. ఈక్రమంలో పలువురు దాతలు వారికి విరాళాలు ఇచ్చేవారు. ఈ విరాళాలతో సంస్థను నిర్వహిస్తున్నారు. ఇంత వరకు సజావుగా ఉన్నా.. బుధవారం సాయంత్రం ఆయేషా అనే ఓ మైనర్ బాలిక తనకు బలవంతంగా నిర్వాహక బృందంలో ఓ వివాహితుడితో వివాహం జరిపించారని ఆరోపించడంతో వివాదం మొదలైంది. కాలనీ వాసులు సైతం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గురువారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై బైఠాయించారు. రాత్రి వేళల్లో మదర్సాగా చెప్పుకునే ప్రాంతానికి ఎవరెవరో కార్లపై వస్తుంటారని.. తెల్లారకుండానే వెళ్లిపోతుంటారని ఆరోపిస్తున్నారు. చిన్నపిల్లలకు సరిగా తిండి పెట్టకుండా చిత్రహింసలు పెడుతుంటారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా కాలనీ వాసులే మమ్మల్ని కొట్టి బూతులు తిడుతున్నారని అక్కడ ఆశ్రయం పొందే చిన్నారులు, మహిళలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న అశ్వారావుపేట సీఐ ఎం అబ్బయ్య సంఘటనా స్థలానికి వచ్చి విచారణ జరిపారు. హాజరు పట్టిక, దాతల రశీదులు, అడ్మిషన్ ఫారాలు, గత పన్నెండేళ్లుగా చదువుకున్న విద్యార్థులు, వారి తల్లితండ్రుల వివరాలు తెలపాలని కోరగా సమాధానం చెప్పలేకపోయారు. ఇంటర్మీడియట్ చదువుకున్న ఓ యువతి అక్కడ పాఠ్యాంశాలు, ఆధ్యాత్మిక బోధన చేస్తున్నట్లు చెబుతున్నారు. నలుగురి మతమార్పిడి..? మదర్సా ముసుగులో మత మార్పుడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నలుగురు బాలికలను మత మార్పిడి చేసినట్లు సమాచారం. అశ్వారావుపేటకు చెందిన రమాదేవిని, అనంతారం తండాకు చెందిన సరితను మతం మార్పించి, సాజిద, ఫాతిమాగా పేర్లు మార్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బాధితులు పోలీసుల విచారణలో కూడా చెప్పినట్లు సమాచారం. బలవంతంగా పెళ్లిచేసి చిత్రహింసలు పెట్టారు ఈ మదర్సా మా మామయ్య వలీది. నేను కొత్తగూడెంలో చదువుకుంటుండగా మదర్సా చూడ్డానికి వచ్చాను. నాకు పద్నాలుగోయేటనే బలవంతంగా ఇక్కడ భార్య చనిపోయిన వ్యక్తితో వివాహం చేశారు. మాతల్లి మతిస్థిమితం సరిగ్గా ఉండదు. మా అక్కను హైదరాబాదు వాళ్లకు ఇచ్చి పెళ్లి చేశారు. చిత్రహింసలు పెట్టి అతనితో కాపురం చేయించారు. కొన్ని రోజుల తర్వాత మదర్సాలో ముసలి వాళ్లను రానీయడం లేదు. మామామయ్య నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. సుమారు అరవై పెళ్లిళ్లు చేశాడు. నాతల్లికే మూడు పెళ్లిళ్లు చేశాడు. మూడేళ్ల క్రితం బెల్లంపల్లికి చెందిన బాలిక ఇక్కడకు వచ్చి మిషన్కుట్టుకునేది. వలీ కుమారుడు ఆబాలికను శారీరకంగా వాడుకున్నాడు. నాకు ఇక్కడ జరిగిన అన్యాయమే తిరిగి ఇతర బాలికలకూ జరుగుతోంది. వీరిని కఠినంగా శిక్షించాలి. –ఎస్కే ఆయేషా, బాధితురాలు మదర్సా పేరుతో అన్ని పనులు చేయిస్తున్నారు.. మదర్సా పేరుతో చిన్న పిల్లలతో పనులు చేయిస్తున్నారు. సిమెంట్ పనులు చేయిస్తుంటారు. రాత్రివేళల్లో కార్లపై స్త్రీ పురుషులు వస్తుంటారు. ఇక్కడేం జరుగుతోందో అర్థమవుతున్నా.. ఏమీ మాట్లాడలేని పరిస్థితి. రోడ్డును ఆక్రమించారు, చిన్నపిల్లలకు సేవ చేస్తున్నామని అంటూ వారిని ఇబ్బందులు పెడుతున్నారు. –సంపంగి సులోచన, స్థానికురాలు ఎందుకిలా చేస్తున్నారు..? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ గురుకులాలు, ముస్లిం మదర్సాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుస్తుండగా అశ్వారావుపేటలో ప్రభుత్వం, స్థానిక ముస్లిం కమిటీ, ఏ ఇతర ఇస్లాం సంస్థతో అనుబంధం లేకుండా బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా ఇక్కడ ఓ సంస్థను ఎందుకు నిర్వాహిస్తున్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తును ప్రారంభించారు. పోలీస్, పోలీస్ నిఘా విభాగాల సిబ్బంది వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. అక్కడున్న నిర్వాహక బృందంలో పెద్దవ్యక్తి, ఆయన కుమారుడు, ఆయన బావమరిది అక్కడున్న మహిళలు, యుక్త వయస్కులయిన యువతులను బలవంతంగా వివాహమాడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. వారికి కలిగిన సంతానమే ఇక్కడ ఆధ్యాత్మిక విద్యనభ్యసిస్తున్నట్లుగా చూపుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రతి ఒక్కరి భర్త, పిల్లలు, తల్లితండ్రుల పేర్లు విడివిడిగా నమోదు చేసుకుంటున్నారు. గతేడాది 23 మంది చిన్నారుల విద్యాబోధనకు, భోజన వసతి నిర్వాహణకు రూ.922174 ఖర్చు అయినట్లు వార్షిక నివేదికలో పొందుపరచడం గమనార్హం. నిధుల సమీకరణ కోసమా లేక ఇంకేమైనా భద్రతాపరమైన ముప్పు వాటిల్లే ప్రమాదముందా అనే కోణంలో పోలీసులు గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. సీఐ అబ్బయ్య స్పందిస్తూ ప్రాథమిక సమాచారం సేకరించే పనిలో ఉన్నామన్నారు. పదిమంది చిన్నారులను సంరక్షించిన డీసీపీఓ చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలకు స్పందించిన డీసీపీవో హరికుమారి గురువారం రాత్రి మదర్సాకు చేరుకున్నారు. అక్కడున్న చిన్నారుల ఆధార్‌కార్డులు ఇతర వివరాలను పరిశీలించారు. ఆ«ధారాలు, ధ్రువీకరణ పత్రాలు సరిగా లేని పదిమంది చిన్నారులను కొత్తగూడెం హోం కు తరలించారు. ఆమె వెంట అశ్వారావుపేట సీడీపీవో అన్నపూర్ణ ఉన్నారు. -
తొలిదశ ఎన్నికల వేళ పాక్ అనూహ్య నిర్ణయం
ఇస్లామాబాద్ : పుల్వామాలో భారత్ సీఆర్పీఎఫ్ జవాన్ల మీద జరిగిన దాడికి ప్రతీకారంగా.. బాలాకోట్‌లోని జైషే ఉగ్ర స్థావరాలపై భారత్ వైమనిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని భారత్ ఆరోపిస్తుండగా.. పాక్ మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాక్ తొలిసారి భారత్ వైమానిక దాడులు జరిపిన బాలాకోట్ పరిసర ప్రాంతంలో సందర్శించడానికి అంతర్జాతీయ మీడియాను అనుమతించింది. భారత్ వైమనిక దాడి చేసిన 43 రోజుల తర్వాత.. భారత్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు పాక్ ఈ పర్యటనకు అనుమతించడం పట్లా సర్వత్రా ఉత్కంఠతకు తెర తీసింది. పలు అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన వ్యక్తులతో పాటు.. వివిధ దేశాల దౌత్యవేత్తలు.. భద్రతా బలగాలకు చెందిన దాదాపు 24 మంది పర్యటనలో పాల్గొన్నారని సమాచారం. పాక్ అధికారులు వీరందరిని దాడి జరిగినట్లుగా చెప్పబడుతున్న ప్రాంతానికి తీసుకెళ్లారు. భారత వైమానకి దళం దాడి జరపిన ప్రాంతం ఉగ్రవాద శిబిరం కాదని.. అది ఒక మదర్సా అని పాక్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మదర్సాలో దాదాపు 130 దాకా విద్యార్థులున్నట్లు సమాచారం. అంతేకాక ఈ దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ అధికారి ఒకరు.. ‘అంతర్జాతీయ మీడియాతో పాటు భారత్‌కు చెందిన జర్నలిస్టులు.. దౌత్యవేత్తలు, భద్రతా సిబ్బంది బాలాకోట్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం ఇక్కడ దాడులకు పాల్పడింది. భారత్ చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఎలాంటి ఉగ్ర సంస్థలు లేవు. భారత్ నియమాలను ఉల్లఘించి వైమానిక దాడి జరిపింది ఓ మదర్సా మీద. వాస్తవ పరిస్థితులను తెలుసుకొండి. భారత్ చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని నమ్మకండి’ అంటూ ట్వీట్ చేశారు. A group of international media journalists mostly India based and Ambassadors & Defence Attachés of various countries in Pakistan visited impact site of 26 February Indian air violation near Jabba, Balakot. Saw the ground realities anti to Indian claims for themselves. pic.twitter.com/XsONflGGVP — Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) April 10, 2019 -
పబ్లిసిటీ కోసం ప్రాణాలతో చెలగాటం
అనంతపురం సప్తగిరి సర్కిల్: సీఎం చంద్రబాబు ప్రచార యావ పిల్లల ప్రాణాల మీదకు తెచ్చింది. బుధవారం రాత్రి అనంతపురం జిల్లా కేంద్రం సప్తగిరి సర్కిల్లో టీడీపీ బహిరంగ సభ జరిగింది.అయితే సభకు చంద్రబాబు వస్తున్నా.. జనం రాకపోవడంతో బెంబేలెత్తిన టీడీపీ శ్రేణులంతా జనాన్ని తీసుకొచ్చేందుకు తలో దిక్కుకు పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మైనార్టీ నేత షకీల్‌షఫి తాను ముతవల్లీగా ఉన్న జామియా మసీదుకు అనుబంధంగా కొనసాగుతున్న మదరసా నుంచి హడావుడిగా విద్యార్థులను తీసుకొచ్చారు. అయితే నిబంధనల ప్రకారం మదరసా విద్యార్థులను రాజకీయ పార్టీల సభలకు తీసుకురాకూడదు. కానీ, సీఎం చంద్రబాబు వద్ద మెప్పు పొందేందుకు షకీల్‌షఫి వారిని తీసుకొచ్చి..వారి చేతికి పూల బుట్టలిచ్చి మసీదు బాల్కనీపైకి ఎక్కించి సీఎంపై చల్లాలని సూచించారు. దీంతో చిన్నారులంతా పూలు చల్లే క్రమంలో ఒక్కసారిగా గెంతడంతో బాల్కనీ కూలిపోయింది. ఘటనలో పైన ఉన్న మదరసా చిన్నారులతో పాటు.. మసీదులో ప్రార్థనలు చేసేందుకు వచ్చినవారు.. బాల్కనీ కింద ఉన్న పలువురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన షకీల్‌షఫి.. తనకు చెడ్డపేరు వస్తుందనే భయంతో రక్తమోడుతున్న చిన్నారులను ఆస్పత్రికి తరలించకుండా ప్రైవేటు వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించారు. వారి పరిస్థితి ఎలా ఉందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. ముస్లింలు తమ వెంటే ఉన్నట్లు ప్రచారం కోసమే! రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు పూర్తిస్థాయిలో తమ వెంటే ఉన్నారని ప్రచారం చేసుకునేందుకే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జామియా మసీదు ముతవల్లి షకీల్ షఫి మదరసా విద్యార్థులను తరలించారని ముస్లిం మత పెద్దలు విమర్శలు గుప్పిస్తున్నారు. పరామర్శించని సీఎం చంద్రబాబు బహిరంగ సభ జరుగుతున్న సమయంలో మసీదు బాల్కనీ కూలి దాదాపు 40 మందికి పైగా గాయపడినా.. చంద్రబాబు పట్టించుకోలేదు. క్షతగాత్రులను పరామర్శించేందుకు రాలేదు. దీంతో ఆయనకు ఓట్లు కావాలి కానీ.. జనం పాట్లు పట్టవా అంటూ క్షతగాత్రుల బంధువులు విమర్శించారు. -
మదర్సాలపై వక్ఫ్ బోర్డ్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
లక్నో : మదర్సాలు ఐసిస్ సిద్ధాంతాలను ప్రోత్సహిస్తున్నాయంటూ వాటిని మూసివేయాలని యూపీ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ కోరారు. విద్యార్ధులు ఐసిస్ భావజాలానికి లోనవకుండా దేశవ్యాప్తంగా మదర్సాలను మూసివేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రిజ్వీ లేఖ రాశారు. మదర్సాలను మూసివేయకుంటే 15 ఏళ్లలో సగానికి పైగా ముస్లిం జనాభా ఐసిస్‌కు మద్దతు పలుకుతుందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పట్టు పెంచుకునేందుకు ఐసిస్ ప్రయత్నిస్తోందన్నారు.మదర్సాలకు వెళుతూ ముస్లిం విద్యార్ధులు సమాజానికి దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మదర్సాల్లో సాధారణ విద్య కొరవడటంతో ఇతర మతాలకు దూరమవుతున్నారన్నారు. ఇస్లామిక్ విద్య పేరుతో విద్యార్ధుల్లో అతివాద ధోరణలను నూరిపోస్తున్నారన్నారు. ఈ ధోరణి ముస్లిం పిల్లలతో పాటు దేశానికి ప్రమాదకరమని రిజ్వీ హెచ్చరించారు. ప్రాధమిక స్ధాయిలో మదర్సాలను మూసివేయాలని, స్కూల్ విద్య అనంతరం సంస్కృతి గురించి తెలుసుకోగోరే విద్యార్ధులు వాటిలో చేరవచ్చని సూచించారు. -
త్వరలో ‘జాతీయ మదర్సా బోర్డు’
న్యూఢిల్లీ: దేశంలోని మదర్సాలన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు వీలుగా జాతీయ మదర్సా బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు మైనారిటీ విద్య జాతీయ పర్యవేక్షణ కమిటీ (ఎన్‌ఎంసీఎంఈ) వెల్లడించింది. ఇందుకోసం ముందుగా గుర్తింపు లేకుండా పెద్ద సంఖ్యలో నడుస్తున్న మదర్సాల వివరాలను సేకరించనున్నట్లు తెలిపింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్చార్డీ) శాఖ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీ ఇటీవల సమావేశమై పలు ప్రతిపాదనలు రూపొందించింది. అన్ని రాష్ట్రాల్లో మదర్సా బోర్డులు ఏర్పాటు చేయాలంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, విద్యావేత్తలు, వివిధ సంస్థల కార్యకర్తలు, హెచ్చార్డీ అధికారులు సభ్యులుగా ఉంటారు. -
జాతీయ గీతాన్ని అవమానించిన ప్రిన్సిపాల్
లక్నో : విద్యార్ధులకు జాతీయ గీతంపై గౌరవాన్ని పెంపొందించాల్సిన ఉపాధ్యాయుడే దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ గీతంపై అవమానకరంగా ప్రవర్తించాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాలేజీలో జెండా ఆవిష్కరించిన అనంతరం విద్యార్థినిలు జాతీయ గీతం పాడుతుండగా కళాశాల ప్రిన్సిపాల్ దానికి నిరాకరించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మహారాజ్‌ఘనీలో మదర్సా బాలికల కళాశాలలో బుధవారం చోటుచేసుకుంది. సహా ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు మదర్సా ప్రిన్సిపాల్ ఫజ్ల్‌ర్ రెహ్మాన్‌తో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు జూనైద్ అన్సారీ, నిజాంలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అరేబియా అలే సునాత్ బాలికల కళాశాల యూపీ మదర్సా బోర్డుపై 2007లో నమోదు చేయబడి ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న కాలేజేలో ప్రిన్సిపాల్ జెండా ఆవిష్కరించగానే విద్యార్థినిలు జాతీయ గీతం పాడుతుండగా వారికి ప్రిన్సిపాల్ వారించినట్లు త్రిపాఠి అనే ఉపాధ్యాయుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. త్రిపాఠి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా జాతీయ గీతాన్ని అవమానించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుని, కళాశాల గుర్తింపుని రద్దు చేయవల్సిందిగా జిల్లా మెజిస్టేట్ అమర్నాథ్ ఉపాధ్యాయ అధికారులను ఆదేశించారు. కాగా దేశంలోని అన్ని మదర్సాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తప్పనిసరిగా నిర్వహించాలని కే్ంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాల జారీ చేసిన విషయం తెలిసిందే. -
బొట్టు పెట్టుకొని మదర్సా వెళ్లిందని..!
తిరువనంతపురం : మత సంప్రదాయాలు, కట్టుబాట్లు మంటగలిపిందనే కారణంగా ఐదో తరగతి విద్యార్థినిని మదర్సా నుంచి బహిష్కరించిన ఘటన ఉత్తర కేరళలో చోటుచేసుకుంది. వివరాలు... కేరళకు చెందిన ఉమర్ మలయిల్ అనే వ్యక్తి కూతురు మదర్సాలో విద్యనభ్యసిస్తోంది. ఐదో తరగతి చదువుతున్న ఆమె ఒక షార్ట్ ఫిలింలో నటించేందుకు సిద్ధపడింది. నటనలో భాగంగా నుదటిపై గంధాన్ని బొట్టుగా ధరించింది. దీంతో ఆగ్రహించిన మదర్సా యాజమాన్యం.. ముస్లిం అయివుండి ఇలాంటి చర్యకు పాల్పడడం ఎంత మాత్రం సబబు కాదని పేర్కొంటూ ఆమెను బహిష్కరించింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తండ్రి తన కూతురి పట్ల మదర్సా వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఫేస్బుక్లో చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి. ‘ చదువుతో పాటు ఆటపాటల్లోనూ ముందు ఉండే నా కూతురు అనేక బహుమతులు పొందింది. ఎంతో ప్రతిభావంతురాలైన నా కూతుర్ని మదర్సా నుంచి తొలగించారనే వార్త తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యాను. నుదుటన గంధపు తిలకం ధరించడమే ఆమె చేసిన పొరపాటు అని వారు చెప్పారు. ఆ సమాధానానికి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదంటూ’ ఉమర్ మలయిల్ వాపోయారు. కాగా ఆయన పోస్టుకు స్పందించిన నెటిజన్లు మదర్సా తీరును తప్పు పట్టగా.. మరికొంత మంది మాత్రం ‘నీ కూతురికి సరైన శిక్ష పడింది. ఇస్లాంను, షరియా చట్టాలను ఉల్లంఘించినందుకు తగిన శాస్తి జరిగిందంటూ’ నెగటివ్ కామెంట్లు చేశారు. -
యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
లక్నో : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మదర్సాలో చదివే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూనిఫాం దరించాలని యూపీ సీఎం అదిత్యానాథ్ ఆదేశాలు జారిచేశారు. మదర్సా ప్రతినిధులందరితో చర్చించిన తరువాత యూనిఫాం కోడ్ పెట్టాలని నిర్ణయించినట్లు రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మొహ్సిన్ రజా తెలిపారు. ఈ నిర్ణయంపై అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని, యూనిఫాం కోడ్ వల్ల విద్యార్ధుల్లో అందరూ సమానమన్న భావం ఏర్పాడుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని మదర్సా పాఠశాలో విద్యార్థులందరూ కుర్తా-ఫైజామా దరించి పాఠశాలకు రావాలని, యూనిఫాం ప్రభుత్వమే అందిస్తుందని మొహ్సిన్ రజా వెల్లడించారు. యూపీ సీఎంగా యోగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మదర్సా పాఠశాల్లో పలు కీలక సంస్కరణలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని మదర్సా పాఠశాలలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యూకేషన్ రీసెర్చ్, ట్రైనింగ్ (ఎన్సీఆర్టీ) సిలబస్‌ను ప్రవేశపెట్టాలని 2017లో సీఎం యోగి ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. మదర్సా పాఠశాలలు ప్రతి ఏడాది ఆగస్ట్ 15న జెండా ఎగరవేయాలని 2017లో యూపీ ప్రభుత్వం ఆదేశించడంతో.. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మదర్సాలు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. -
మదర్సాలో దారుణం..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఘజియాబాద్‌లోని మదర్సాలో పదేళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చిన ఇద్దరు దుండగులు అనంతరం సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాధిత బాలికను ఐస్‌క్రీమ్ పార్లర్‌కు తీసుకువెళ్లిన నిందితుడు అక్కడి నుంచి ఘజియాబాద్‌లోని మదర్సాకు తీసుకువెళ్లి మరో నిందితుడితో కలిసి దారుణానికి పాల్పడ్డారు. నేరం ఆనవాళ్లు లేకుండా చేసేందుకు నిందితుడు తన ఫోన్‌తో పాటు బాధితురాలి ఫోన్‌ను ధ్వంసం చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడు మదర్సాలోనే నివసిస్తూ చదువుకుంటున్నాడని చెప్పారు. బాలికను ప్రలోభపెట్టిన నిందితుడు పరారీలో ఉన్నాడని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. నిందితులపై కిడ్నాప్, పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్ధానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. -
మదర్సాలో 70 శాతం విద్యార్థులు హిందువులే
-
మదర్సాలో 70శాతం హిందూ విద్యార్థులు
సూరత్ : గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో గల మదర్సా ఇస్లామియా హైస్కూల్లో దాదాపు 70 శాతం మంది విద్యార్థులు హిందువులే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఈ మదర్సాలో ఎల్కేజీ నుంచి ఫ్లస్‌టూ వరకు తరగతులు ఉన్నాయి. మిగతా ముప్ఫై శాతం విద్యార్థులు ముస్లింలు. సూరత్‌లోని మోతవరచ్చలో గల ఈ హైస్కూల్లో మత భేదాలు ఉండవు. దాదాపు వందేళ్ల నుంచి ఇదే పద్దతి కొనసాగుతుందని పాఠశాల ప్రిన్స్‌పల్ గులామ్ హుస్సేన్ తెలిపారు. ఇక్కడ వివిధ కుల, మతాల పిల్లలు చదువుకోవడానికి వస్తారని స్థానికులే కాకుండా చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న వారు కూడా ఇక్కడ చదువుతున్నట్టు ఆయన తెలిపారు. ఇక్కడ అన్ని సబ్జెక్టులతో సమానంగా మానవత్వం గురించి విద్యార్థులకు బోధిస్తామని తెలిపారు. -
మదర్సా వ్యవస్థను రద్దు చేయండి : వసీం రిజ్వీ
లక్నో : మదర్సా వ్యవస్థను రద్దు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ సెంట్రల్ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీని హత్య చేస్తామంటూ బెదిరించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ డీసీపీ తెలిపారు. మదర్సాల గురించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే తనని, తన కుటుంబాన్ని హతమారుస్తామని మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు బెదిరిస్తున్నారని షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ రిజ్వీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డులను కూడా పోలీసులకు అందజేశారు. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ రిజ్వీ..! ‘పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్‌లలో పేరుపొందిన ఉగ్రవాదులు దియోబంధి మదర్సాలలో తయారు చేయబడ్డారు... ముస్లిం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మదర్సాలు టెర్రరిస్టులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని’ ఆరోపిస్తూ రిజ్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, కేబినెట్ సెక్రటరీకి ఐదు పేజీలతో కూడిన ఈ- మెయిల్ చేశారు. మదర్సా వ్యవస్థను రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి లేఖ రాసి రజ్వీ వార్తల్లోకెక్కారు. ‘వారంతా పాకిస్తాన్ వెళ్లాలి’... రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే వారంతా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలంటూ రిజ్వీ వ్యాఖ్యానించారు. మసీదు పేరిట జిహాద్‌ను వ్యాప్తి చేసేవారు అబూ బకర్ ఆల్-బాగ్దాదీ లేదా ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా షియా వర్గానికి చెందినవారు రజ్వీ వ్యాఖ్యలను ఖండించారు. ఆయనను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి లేఖలు.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సహకరించాలని గత నెలలో రిజ్వీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. అంతేకాకుండా దేశంపై, దేవుడిపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలంటే అయెధ్యలో రామ మందిర నిర్మాణం, లక్నోలో మసీద్-ఇ-అమన్ నిర్మించేందుకు ప్రభుత్వానికి రాహుల్ గాంధీ సహకరించాలని సూచించారు. -
8 గంటల్లో ఖురాన్ పఠనం
మరిపెడ (డోర్నకల్): మదర్సాలో ఓ విద్యార్థి ఏకధాటిగా 8 గంటలపాటు ఖురాన్ మొత్తం పఠనం చేశాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడుకి చెందిన సయ్యద్ ఆసిఫ్ మహబూబాబాద్ జిల్లా మరి పెడ మండల కేంద్రంలోని మదర్సాలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఖురాన్‌ను కంఠస్థం చేసేందుకు సాధారణంగా మూడేళ్లు పడుతోందని, ఆసిఫ్ 15 నెలల్లో పూర్తి చేశాడని మదర్సా బోధకుడు మౌలానా తెలిపారు. మంగళవారం ఆసిఫ్‌ను ముస్లిం మత పెద్దలు సన్మానించారు. -
మదర్సాలపై షియా బోర్డ్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : మదర్సాలలో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ అధికారులు తయారుకావడం లేదని.. కొన్ని మదర్సాలలో ఉగ్రవాద బీజాలే పడుతున్నాయని షియా బోర్డు చీఫ్ వాసిం రిజ్వి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మదర్సాలను ప్రధాన విద్యా స్రవంతిలోకి చేరేలా చర్యలు చేపట్టాలని కోరారు. మదర్సాలను విద్యా మండళ్ల పర్యవేక్షణ కిందకు తీసుకురావాలని, వీటిని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలకు అనుబంధంగా చేర్చాలని సూచించారు. మతపరమైన విద్యను ఐచ్ఛికం చేయాలని కోరారు. కొన్ని మదర్సాలు ఉగ్ర కార్యకలాపాలకు నిలయంగా మారాయని రిజ్వి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు రిజ్వి ప్రకటనపై పలు ఇస్లామిక్ సంస్థలు మండిపడుతున్నాయి. షియా బోర్డ్ ఛైర్మన్‌ను బఫూన్‌గా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. ‘వాసిం రిజ్వి పెద్ద జోకర్..అవకాశవాద వ్యక్తి..ఆయన తన ఆత్మను ఆర్ఎస్ఎస్కు అమ్ముకున్నార’ ని వ్యాఖ్యానించారు. మదర్సాలలో ఉగ్ర బోధనలు జరిగితే అందుకు తగిన ఆధారాలను ఆయన నేరుగా హోంమంత్రికి అందించవచ్చు కదా అని ప్రశ్నించారు. -
కళ్లలో కారం, వెల్లుల్లి రసం
-
కళ్లలో కారం, వెల్లుల్లి రసం
మదర్సాలో చిన్నారులకు టీచర్ చిత్రహింసలు కనిగిరి: చిన్న తప్పి దానికి మదర్సాలోని విద్యార్థులను దారుణంగా శిక్షించిందో టీచర్. ఓ విదార్థిని కళ్లలో కారం కొట్టించి, వెల్లుల్లి రసం పిండించి.. మరో ఇద్దరు విద్యార్థినుల ముఖం, కాళ్లు, చేతులపై వాతలు పెట్టించింది. ఈ ఘటన శుక్రవారం ప్రకాశం జిల్లా కనిగిరిలో వెలుగులోకి వచ్చింది. కనిగిరి పట్టణం దొరువు బజారులో ఉన్న మదర్సాలో 120 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో సుమారు 60 మంది హాస్టల్లో ఉంటున్నారు. ఓ విద్యార్థిని మోటారు పైపులు పగులగొట్టిందన్న కోపంతో హెడ్ టీచర్ మరో విద్యార్థినితో కర్రతో కొట్టించి అట్లకాడతో చేతిపై వాతలు పెట్టించింది. కళ్లలో కారం, వెల్లుల్లి రసం పోయించింది. మరో ఇద్దరు విద్యార్థినుల ముఖం, కాళ్లు, చేతులపై వాతలు పెట్టించింది. మదర్సాకు ప్రతి శుక్రవారం సెలవు కావడంతో ఆ రోజు తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని చూసి వెళ్తుంటారు. ఈ క్రమంలో గాయాలతో ఉన్న పిల్లల్ని చూసిన తల్లిదండ్రులు హెడ్ టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిల్లలకు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇళ్లకు తీసుకెళ్లారు. -
మద్రసాలలో పాఠ్యాంశాల బోధనకు కృషి
ఇన్చార్జి డీఈఓ విజయలక్ష్మి నెల్లూరు (టౌన్) మద్రసాలల్లో ఖురాన్ ఇతర మత గ్రంథాలతో పాటు ఇంగ్లిష్, తెలుగు, గణితం, సైన్స్ తదితర సాధారణ పాఠ్యాంశాలను బోధించి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి డీఈఓ విజయలక్ష్మి తెలిపారు. గురువారం సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో మద్రసాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్రసాలలో 2016–17 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం నుంచి సాధారణ విద్యను బోధించేందుకు ఆసక్తి గల వారినుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. మండలాల వారిగా మద్రాసాలను తప్పకుండా తనిఖీలు చేస్తామన్నారు. ఆ సమయంలో ఎలాంటి లోపాలు కనిపించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఎల్ఎస్ కో–ఆర్డినేటర్ మేరీరాణి మాట్లాడుతూ శుక్రవారం నుంచి జిల్లా కార్యాలయంలో దరఖాస్తులో అందుబాటులో ఉంటాయన్నారు. వాటిని పూర్తిచేసి ఈనెల 30వ తేదీలోపు కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలు కోసం 9440373616, 7093900557లో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో సర్వశిక్ష అభియాన్ ఏఏఎంఓ ఖాదర్‌బాషా, ఏఎంఓ హమీద్, సీఎంఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
మదర్సాలో జాతీయగీతం పాడాలన్నందుకు..
కోల్‌కతా: కాజీ మసూం అఖ్తర్.. కోల్‌కతాలోని తల్పుకుర్ ఆరా ఉన్నత మదర్సాలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని పాడాలని విద్యార్థులకు బోధించినందుకు ఆయనపై మౌలానాలు, వారి అనుచరులు దాడి చేశారు. దాడికి పాల్పడిన మౌలానాలకు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులన్న ముద్ర ఉంది. తనపై దాడి గురించి అఖ్తర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్‌ను ఆరుసార్లు కలిసినా ఆయనకు ఎలాంటి మద్దతుగానీ, హామీగానీ లభించలేదు. ఇప్పటికే మౌలానాలు అఖ్తర్‌కు వ్యతిరేకంగా ఫత్వా జారీచేశారు. అంతేకాకుండా జాతీయ గీతం దైవదూషణేనని, అది హిందూత్వ గీతమని వారు పేర్కొన్నారు. గత ఏడాది మార్చ్‌లో అఖ్తర్‌పై కొందరు దుండగులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. దీంతో తలకు తీవ్ర గాయమైన ఆయన కొన్ని నెలలపాటు ఆస్పత్రి మంచానికే పరిమితమయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుడైనప్పటికీ అఖ్తర్ మదర్సాలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ ఫత్వా జారీచేశారు. ముస్లిం వస్త్రాలైన కుర్తా, పైజామా ధరించి.. గడ్డాన్ని పెంచితేనే ఆయనను మదర్సాలోకి అనుమతిస్తామని, గడ్డం ఎంతవరకు పెంచాలనేది కూడా మౌలానాలే నిర్ణయిస్తారని ఫత్వాలో పేర్కొన్నారు. గడ్డం పెరుగుదల గురించి ప్రతివారం ఫొటోలు పంపుతూ తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇంత జరుగుతున్నా.. మత ఉద్రిక్తతల కారణంగా అఖ్తర్‌కు భద్రత కల్పించలేమంటూ కోల్‌కతా పోలీసు కమిషనర్ మైనారిటీ కమిషన్ చైర్మన్‌కు లేఖ రాయడం గమనార్హం. -
జెండా ఎగురవేయాల్సిందే
అలహాబాద్: జాతీయ జెండా విషయంలో అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మదర్సాల్లో సైతం రిపబ్లిక్ డే, ఆగస్టు 15న త్రివర్ణ పతాకం ఎగుర వేయాల్సిందేనని స్పష్టం చేసింది. అంతకుముందు రోజు ఇదే అంశంలో అలహాబాద్ కోర్టు స్పందించింది. ఆగస్టు 15, జనవరి 26న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు విద్యా సంస్థల్లోనూ జాతీయ జెండాను ఎగరవేయాలనే నిబంధన దృష్ట్యా.. రాష్ట్రంలోని అన్ని మదర్సాల్లో జాతీయ జెండా ఎగరవేశారనే విషయాన్ని నిర్ధారించాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ ఖచ్చితంగా అన్ని మదర్సాల్లో జాతీయ జెండా ఎగురవేయాల్సిందేనని చెప్పింది. -
8 ఏళ్ల బాలికపై అత్యాచారం
జైపూర్: మదర్సాలో 8 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లోని సంగనేర్ ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది. మదర్సాకు వెళ్లిన బాలికను భవనంపైకి (రూప్ టాప్) తీసుకెళ్లి దుండగుడు ఈ ఆఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు ఇంటికి తిరిగొచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితురాలిని జేకే లోన్ ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. -
'తీవ్రవాదులను తయారు చేస్తున్నారు'
పనాజీ: మదర్సాల్లో నేర్పేది తీవ్రవాద విద్య అంటూ యూపీకి చెందిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీ మైనారిటీ నాయకులు మౌనం పాటించడాన్ని గోవా ఉర్దూ అకాడమి ఉన్నతాధికారి ఉర్ఫాన్ ముల్లా తప్పుబట్టారు. ముక్తార్ అబ్బాస్ నఖ్వి, నజ్మా హెప్తుల్లా ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. తమ ఎంపీలు వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీపై ఉందని అన్నారు. మదర్సాల్లో ఖురాన్ పఠనంతో పాటు దేశం గురించి కూడా బోధిస్తున్నామని తెలిపారు. మదర్సాల్లో చదువునే వారిని తీవ్రవాదులు, జిహాదీలుగా తయారు చేస్తున్నారని సాక్షి మహారాజ్ ఆరోపించారు. జాతీయవాదంతో సంబంధంలేని మదర్సాలకు ప్రభుత్వం సాయం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. -
మదర్సా ఉదంతంపై కదిలిన యంత్రాంగం
సాక్షి, ఏలూరు : దెందులూరు మండలం గంగన్నగూడెంలోని మౌలానా అబ్దుల్‌కలాం ఆజాద్ యూపీ స్కూల్(మదర్సా)లో నాలుగో తరగతి విద్యార్థిని కరస్పాండెంట్ చితకబాదిన ఉదంతాన్ని ‘సాక్షి’ కథనం ఆధారంగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఈ నెల 30 లోగా విచారణచేసి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి, విద్యాశాఖ అధికారులను ఆదేశించడంతో యంత్రాంగం కదిలింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు.కరస్పాండెంట్ వసీవుల్లా కొట్టడంతో విద్యార్థి వజీర్ వీపుపై తేలిన వాతలను ప్రభుత్వాసుపత్రి డాక్టర్ సీహెచ్ ప్రవీణ్ పరీక్షించారు. చికిత్స చేస్తున్నారు. కరస్పాండెంట్‌పై బాలల చట్టం ప్రకారం కేసు విద్యార్థి వజీర్‌ను విచక్షణారహితంగా కొట్టిన స్కూల్ కరస్పాండెంట్ వసీవుల్లాపై బాలల న్యాయ చట్టం సెక్షన్ 23, బాలల విద్యాహక్కు చట్టం సెక్షన్-17, భారత శిక్షాస్మృతి సెక్షన్-14 కింద కేసు నమోదు చేయించనున్నట్టు బాలల సంక్షేమ న్యాయమూర్తుల కోర్టు చైర్మన్ టి.స్నేహన్ ఆదివారం తెలిపారు.వ జీర్ నుంచి వివరాలు సేకరించాల్సిందిగా జిల్లా బాలల సంరక్షణాధికారిణి సీహెచ్ సూర్యచక్రవేణిని న్యాయమూర్తుల పీఠం ఆదేశించటంతో ఆమె ఆదివారం బాలుడితో పాటు అతని తల్లి నజీమున్నీసా, అమ్మమ్మ బషీర్ఉన్నీసాల నుంచి వివరాలు సేకరించారు. ఎస్సై విచారణ గంగన్నగూడెం (దెందులూరు) : గంగన్నగూడెంలోని మదర్సాలో విద్యార్థిని కరస్పాండెంట్ కొట్టిన ఘటనపై ఎస్పీ ఆదేశాల మేరకు దెందులూరు ఎస్సై కె.వెంకటరమణ ఆదివారం సాయంత్రం పాఠశాలలో విచారణ నిర్వహించారు. ఘటన ఎప్పుడు, ఎలా జరిగింది, విద్యార్థి, కరస్పాండెంట్ ప్రవర్తనపై ఆరా తీశారు. విచారణలో ఉపాధ్యాయులు మౌలానా జాఫర్‌సాబ్, అబ్దుల్ రెహమాన్, అఫీజుల్లాఖాన్ మాట్లాడుతూ పాఠశాలలో బాలురు 178 మంది, బాలికలు 261 మంది మొత్తం 439 మంది ఉన్నారన్నారు. యూపీ పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు, ముగ్గురు ఉపాధ్యాయినులు పనిచేస్తున్నారని చెప్పారు. పాఠశాల ప్రారంభించి 13 ఏళ్లు అయిందని, ఇప్పటివరకు ఏ రిమార్కు లేదన్నారు. వజీర్ ఈ నెల 11న తరగతి గదిలో పాస్ పోశాడని, అతడిని కరస్పాండెంట్ రూమ్‌కు తీసుకువెళితే అక్కడ కూడా పాస్ పోశాడన్నారు. గతంలో ఎప్పుడూ ఈ విధంగా చేసిన ఘటనలు లేవన్నారు. ఈ విషయాన్ని కరస్పాండెంట్ వజీర్ తల్లిదండ్రులకు చెప్పడంతో చింతలపూడి రావడానికి ప్రయత్నిస్తున్నాడని, ఒకటి తగిలించి మందలించాలని వారు చెప్పారన్నారు. పాస్ పోసిన అనంతరం కరస్పాండెంట్ విద్యార్థిని కొట్టడం వాస్తవమేనన్నారు. కరస్పాండెంట్ విధి నిర్వహణలో విద్యార్థులతో వ్యవహరించే తీరులో ఇప్పటివరకు ఎవరి నుంచీ ఫిర్యాదు లేదని, భోజనం, మౌలిక వసతులు కల్పించడంతోపాటు అందరినీ బాగా చూస్తారని ఎస్సైకి వివరించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తానని ఎస్సై కె.వెంకటరమణ తెలిపారు. మదర్సాపై దుష్ర్పచారం తగదు గంగన్నగూడెం (దెందులూరు) : గంగన్నగూడెంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ మదర్సా(ఉర్దూ పాఠశాల)పై అనవసరంగా దుష్ర్పచారం చేస్తున్నారని ఉర్దూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్ అలీ పేర్కొన్నారు. మదర్సాలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మదర్సా విద్యార్థి వజీర్‌ను కరస్పాండెంట్ వసీవుల్లా కొట్టిన సంగతి వాస్తవమేనన్నారు. ఈ ఘటనతో మదర్సాపై దుష్ర్పచారం చేయటంలో కొందరి హస్తం ఉందని ఆరోపించారు. ఆరుగురు విద్యార్థులను కొట్టడంతో ఇద్దరు కోమాలోకి వెళ్లారని టీవీ చానల్స్‌లో రావడం తమను బాధించిందన్నారు. పాఠశాల ప్రారంభించి పదమూడేళ్లుకాగా ఇప్పటి వరకు ఉపాధ్యాయులు, కరస్పాండెంట్‌పై ఎటువంటి రిమార్కు లేదన్నారు. ఈ నెల 11న ఈ ఘటన జరిగితే విద్యార్థి తండ్రి ఈ నెల 22న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఆ విద్యార్థికి ముందు నుంచే మానసిక ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేనందున ఏలూరులోని మానసిక వైద్య నిపుణులు స్వరూప్ వద్ద చికిత్స పొందుతున్నాడని, ఈ విషయం నిర్ధారించుకోవటానికి అధికారులు విచారణ చేపట్టవచ్చని సూచించారు. విద్యార్థి తండ్రితో కొందరు మదర్సాపై దుష్ర్పచారం చేయిస్తున్నారని ఆరోపించారు. మదర్సా ఉపాధ్యాయులు మహ్మద్ అబ్దుల్‌రెహమాన్, అఫీజుల్లా, మౌలానా జాఫర్‌ఖాన్, నుజ్జమిల్ పాల్గొన్నారు. -
మదర్సాల నిధులు స్వాహా
సిబ్బంది విద్యార్హతలపై గందరగోళం మార్గదర్శకాల్లో అస్పష్టత ఆసరాగా నిధుల దుర్వినియోగం నిలిచిన జీతాలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నిబంధనల్లో ఉన్న అస్పష్టతను అడ్డం పెట్టుకుని రాజీవ్ విద్యామిషన్ కింద వచ్చిన నిధులను దిగమింగారు. మైనారిటీలకు ఉర్దూలో విద్యాబోధన కోసం ఏర్పాటు చేసిన మదర్సాల పేరుతో భారీగా డబ్బులు స్వాహా చేశారు. విద్యాశాఖకు, రాజీవ్ విద్యామిషన్‌లోని ఉద్యోగులకు మధ్య డబ్బు పంపిణీలో వచ్చిన విభేదాల కారణంగా నాలుగు నెలల క్రితం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డెరైక్టర్‌గా వచ్చిన వల్లభనేని శ్రీనివాస్ మార్చి నెల నుంచి మొత్తం అన్ని మదర్సాలకు చెల్లించే నిధులను నిలిపేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఒక అదనపు కార్యదర్శిని విచారణకు ఆదేశించారు. ఆయన త్వరలో జిల్లాకు వచ్చి విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే శుక్రవారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ వీ ఉషారాణి దీనిపై పీడీ శ్రీనివాస్‌ను విచారణ చేసి పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే... 2012-13కు జిల్లా వ్యాప్తంగా 86 మదర్సాలుండగా, 2013-14కి వచ్చేసరికి వాటి సంఖ్య 45కి పడిపోయింది. అందులో ఒకటి రద్దు చేయగా 44 నడుస్తున్నాయి. మదర్సాల పనితీరుకు, విద్యార్హతలకు సంబంధించిన నిబంధనల్లో స్పష్టత లేకపోవడం, ఒక్కోసారి ఒక్కో నిబంధన అమలు చేయడం వల్ల దీన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు. అసలు మదర్సా లేకుండానే అది నడుపుతున్నట్లు ఎంఈవోతో సర్టిఫికెట్ తెచ్చుకుని ప్రతినెలా డబ్బులు డ్రా చేసుకున్నారు. ఒక్కో మదర్సాకు ఒక నజీమ్, మరో విద్యావలంటీర్‌ను కేటాయించారు. విద్యార్హతలు బీఈడీ గానీ, డీఈడీగానీ ఉండాలి. అయితే నాలుగేళ్లుగా వాటికి మినహాయింపు ఇస్తున్నారు. దీంతో అసలు ఉర్దూ రానివారు కూడా మదర్సాల పేరుతో డబ్బులు దిగమింగేశారు. దీనిపై ఒంగోలు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్(ఉర్దూ రేంజ్) తనిఖీలు నిర్వహించి రాజీవ్ విద్యా మిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్‌కు ఒక నివేదిక పంపారు. అందులో కొన్ని చోట్ల కనీసం మదర్సా బోర్డులు కూడా లేవని, విద్యార్థులు లేరని పేర్కొన్నారు. కొత్తపట్నం, సంతమాగులూరు, కందుకూరు, వేటపాలెం, రాచర్ల, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, పొదిలితో సహా పలు మదర్సాలు కాగితాల మీదే పని చేస్తున్నాయని నివేదిక ఇచ్చారు. వారి విద్యార్హతలు కూడా బోగస్ అని, అర్హత లేనివారు పనిచేస్తున్నారని తేల్చారు. అసలు పనిచేయని మదర్సాల పేరుతో డబ్బులను కొందరు అధికారులే తినేస్తున్నారని నివేదిక ఇచ్చారు. ప్రత్యామ్నాయ స్కూల్స్ కో-ఆర్డినేటర్ (ఏఎల్ఎస్) 40 బోగస్ మదర్సాల్లో వందమందికి పైగా వలంటీర్లను నిబంధనలకు వ్యతిరేకంగా తీసుకున్నట్లు చూపించారని పేర్కొన్నారు. నిజంగా పనిచేస్తున్న మదర్సాల నుంచి ఐదు వేల రూపాయలు, బోగస్ మదర్సాల నుంచి 50 వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. బోగస్ మదర్సాల్లో ఇద్దరు వలంటీర్లు ఉన్నట్లు చూపించి ఒకరి వేతనం నజీమ్, మరో వేతనం ఏఎల్ఎస్ తీసుకున్నట్లు తేలిందని డీఐ తన నివేదికలో పేర్కొన్నారు. అయితే రాజీవ్ విద్యామిషన్ ప్రత్యామ్నాయ స్కూల్స్ కో-ఆర్డినేటర్ మాత్రం నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని, దానికి సంబంధించిన గైడ్‌లైన్స్‌పై అవగాహన లేక డీఐ తన నివేదిక ఇచ్చారని చెబుతున్నారు. దీనిపై ఆరోపణలు వచ్చిన వెంటనే మొత్తం మదర్సాల వేతనాలు నిలిపేసినట్లు ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాస్ సాక్షికి తెలిపారు. రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ ఉషారాణి ఆదేశాల మేరకు పదిరోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తానని ఆయన పేర్కొన్నారు.