అశ్వారావుపేట: అశ్వారావుపేటలో మదర్సా పేరుతో నిర్వహిస్తున్న బాల్యవివాహాలు, మతమార్పిడుల గుట్టు గురువారం రట్టయింది. అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం గ్రామపంచాయతీ అల్లూరి సీతారామరాజు నగర్‌లో పన్నెండేళ్ల క్రితం మదర్సా పేరుతో వేంసూరుకు చెందిన ఓ కుటుంబం ఓ సంస్థను స్థాపించారు. మొదట్లో సర్వశిక్షా అభయాన్ నుంచి పాఠ్యపుస్తకాలు, ఇద్దరు విద్యావలంటీర్లను సమకూర్చారు. ఆ తర్వాత పాఠ్యపుస్తకాలు, విద్యావలంటీర్లను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆతర్వాత అక్కడేం జరుగుతోందో ఎవరికీ పట్టని విషయమైంది. కాగా అక్కడ ఇస్లాం పాఠాలో బోధిస్తున్నామని.. ప్రభుత్వ విద్యతో తమకు సంబంధం లేదని.. పేద ముస్లిం పిల్లలను దూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి నమాజ్, తదితర ఆధ్యాత్మిక బోధన చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పుతున్నారు. ఈక్రమంలో పలువురు దాతలు వారికి విరాళాలు ఇచ్చేవారు. ఈ విరాళాలతో సంస్థను నిర్వహిస్తున్నారు. ఇంత వరకు సజావుగా ఉన్నా.. బుధవారం సాయంత్రం ఆయేషా అనే ఓ మైనర్ బాలిక తనకు బలవంతంగా నిర్వాహక బృందంలో ఓ వివాహితుడితో వివాహం జరిపించారని ఆరోపించడంతో వివాదం మొదలైంది.
కాలనీ వాసులు సైతం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గురువారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై బైఠాయించారు. రాత్రి వేళల్లో మదర్సాగా చెప్పుకునే ప్రాంతానికి ఎవరెవరో కార్లపై వస్తుంటారని.. తెల్లారకుండానే వెళ్లిపోతుంటారని ఆరోపిస్తున్నారు. చిన్నపిల్లలకు సరిగా తిండి పెట్టకుండా చిత్రహింసలు పెడుతుంటారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా కాలనీ వాసులే మమ్మల్ని కొట్టి బూతులు తిడుతున్నారని అక్కడ ఆశ్రయం పొందే చిన్నారులు, మహిళలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న అశ్వారావుపేట సీఐ ఎం అబ్బయ్య సంఘటనా స్థలానికి వచ్చి విచారణ జరిపారు. హాజరు పట్టిక, దాతల రశీదులు, అడ్మిషన్ ఫారాలు, గత పన్నెండేళ్లుగా చదువుకున్న విద్యార్థులు, వారి తల్లితండ్రుల వివరాలు తెలపాలని కోరగా సమాధానం చెప్పలేకపోయారు. ఇంటర్మీడియట్ చదువుకున్న ఓ యువతి అక్కడ పాఠ్యాంశాలు, ఆధ్యాత్మిక బోధన చేస్తున్నట్లు చెబుతున్నారు.
నలుగురి మతమార్పిడి..?
మదర్సా ముసుగులో మత మార్పుడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నలుగురు బాలికలను మత మార్పిడి చేసినట్లు సమాచారం. అశ్వారావుపేటకు చెందిన రమాదేవిని, అనంతారం తండాకు చెందిన సరితను మతం మార్పించి, సాజిద, ఫాతిమాగా పేర్లు మార్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బాధితులు పోలీసుల విచారణలో కూడా చెప్పినట్లు సమాచారం.
బలవంతంగా పెళ్లిచేసి చిత్రహింసలు పెట్టారు
ఈ మదర్సా మా మామయ్య వలీది. నేను కొత్తగూడెంలో చదువుకుంటుండగా మదర్సా చూడ్డానికి వచ్చాను. నాకు పద్నాలుగోయేటనే బలవంతంగా ఇక్కడ భార్య చనిపోయిన వ్యక్తితో వివాహం చేశారు. మాతల్లి మతిస్థిమితం సరిగ్గా ఉండదు. మా అక్కను హైదరాబాదు వాళ్లకు ఇచ్చి పెళ్లి చేశారు. చిత్రహింసలు పెట్టి అతనితో కాపురం చేయించారు. కొన్ని రోజుల తర్వాత మదర్సాలో ముసలి వాళ్లను రానీయడం లేదు. మామామయ్య నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. సుమారు అరవై పెళ్లిళ్లు చేశాడు. నాతల్లికే మూడు పెళ్లిళ్లు చేశాడు. మూడేళ్ల క్రితం బెల్లంపల్లికి చెందిన బాలిక ఇక్కడకు వచ్చి మిషన్‌కుట్టుకునేది. వలీ కుమారుడు ఆబాలికను శారీరకంగా వాడుకున్నాడు. నాకు ఇక్కడ జరిగిన అన్యాయమే తిరిగి ఇతర బాలికలకూ జరుగుతోంది. వీరిని కఠినంగా శిక్షించాలి. –ఎస్‌కే ఆయేషా, బాధితురాలు
మదర్సా పేరుతో అన్ని పనులు చేయిస్తున్నారు..
మదర్సా పేరుతో చిన్న పిల్లలతో పనులు చేయిస్తున్నారు. సిమెంట్ పనులు చేయిస్తుంటారు. రాత్రివేళల్లో కార్లపై స్త్రీ పురుషులు వస్తుంటారు. ఇక్కడేం జరుగుతోందో అర్థమవుతున్నా.. ఏమీ మాట్లాడలేని పరిస్థితి. రోడ్డును ఆక్రమించారు, చిన్నపిల్లలకు సేవ చేస్తున్నామని అంటూ వారిని ఇబ్బందులు పెడుతున్నారు. –సంపంగి సులోచన, స్థానికురాలు
ఎందుకిలా చేస్తున్నారు..?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ గురుకులాలు, ముస్లిం మదర్సాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుస్తుండగా అశ్వారావుపేటలో ప్రభుత్వం, స్థానిక ముస్లిం కమిటీ, ఏ ఇతర ఇస్లాం సంస్థతో అనుబంధం లేకుండా బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా ఇక్కడ ఓ సంస్థను ఎందుకు నిర్వాహిస్తున్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తును ప్రారంభించారు. పోలీస్, పోలీస్ నిఘా విభాగాల సిబ్బంది వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. అక్కడున్న నిర్వాహక బృందంలో పెద్దవ్యక్తి, ఆయన కుమారుడు, ఆయన బావమరిది అక్కడున్న మహిళలు, యుక్త వయస్కులయిన యువతులను బలవంతంగా వివాహమాడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.
వారికి కలిగిన సంతానమే ఇక్కడ ఆధ్యాత్మిక విద్యనభ్యసిస్తున్నట్లుగా చూపుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రతి ఒక్కరి భర్త, పిల్లలు, తల్లితండ్రుల పేర్లు విడివిడిగా నమోదు చేసుకుంటున్నారు. గతేడాది 23 మంది చిన్నారుల విద్యాబోధనకు, భోజన వసతి నిర్వాహణకు రూ.922174 ఖర్చు అయినట్లు వార్షిక నివేదికలో పొందుపరచడం గమనార్హం. నిధుల సమీకరణ కోసమా లేక ఇంకేమైనా భద్రతాపరమైన ముప్పు వాటిల్లే ప్రమాదముందా అనే కోణంలో పోలీసులు గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. సీఐ అబ్బయ్య స్పందిస్తూ ప్రాథమిక సమాచారం సేకరించే పనిలో ఉన్నామన్నారు.
పదిమంది చిన్నారులను సంరక్షించిన డీసీపీఓ
చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలకు స్పందించిన డీసీపీవో హరికుమారి గురువారం రాత్రి మదర్సాకు చేరుకున్నారు. అక్కడున్న చిన్నారుల ఆధార్‌కార్డులు ఇతర వివరాలను పరిశీలించారు. ఆ«ధారాలు, ధ్రువీకరణ పత్రాలు సరిగా లేని పదిమంది చిన్నారులను కొత్తగూడెం హోం కు తరలించారు. ఆమె వెంట అశ్వారావుపేట సీడీపీవో అన్నపూర్ణ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment