ashwarao peta
-
తెలంగాణాలో కాంగ్రెస్ బోణీ, సంబరాల్లో కాంగ్రెస్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ కొట్టింది. ఎన్నికల కౌంటింగ్‌లో ఆదినుంచీ కాంగ్రెస్ దూసుకుపోతోంది. తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కాంగ్రెస్ నేత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం వద్ద కూడా బాణా సంచాపేల్చి కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జరే ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై 23వేల ఓట్ల మెజార్టీలో గెలుపొందారు. అటు ఇల్లందులో కోరం కనకయ్య 18 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,290 అభ్యర్థులు పోటీ పడ్డారు. తాజా ట్రెండ్ ప్రకారం బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలు గల్లంతు అయినట్టే కనిపిస్తోంది. దీంత తుది ఫలితాలపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. TRS = BRS = VRS #TelanganaElectionResults — Danasari Seethakka (@seethakkaMLA) December 3, 2023 -
పినపాక నుంచి పాయం.. కొత్తగూడెంపై కొనసాగుతున్న సస్పెన్స్!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన రెండో జాబితాలో జిల్లాలోని పినపాక అసెంబ్లీ నియోకవర్గానికి చోటు దక్కింది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అభ్యర్థిత్వం ఖరారు చేసింది. పినపాక నుంచి పోటీ చేసేందుకు మొత్తం 17 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరి పేర్లను వడబోసి, వివిధ రాజకీయ సమీకరణాలను పరిశీలించిన కాంగ్రెస్ పెద్దలు చివరకు పాయం వైపు మొగ్గు చూపారు. దీంతో టికెట్ కోసం చివరి నిమిషం వరకు తీవ్రంగా ప్రయత్నించిన పోలెబోయిన శ్రీవాణి, విజయ్గాంధీలకు చివరకు నిరాశే మిగిలింది. పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌గా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కొన్నేళ్లుగా పాయం రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. పొంగులేటితో పాటుగా బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మలిజాబితాలో పాయంతోపాటు పాలేరు టికెట్‌ను పొంగులేటికి కేటాయించారు. పేట కోసం ముగ్గురి ప్రయత్నం.. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలు ఉండగా ఇప్పటికే 100 చోట్ల అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. ఇంకా 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో జిల్లాకు సంబంధించి ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం స్థానాలు ఉన్నాయి. ఇల్లెందు, అశ్వారావుపేటలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. అశ్వారావుపేట నుంచి పది మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో పాటు జారె ఆదినారాయణ, సున్నం నాగమణిలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండో జాబితాలోనూ ఈ నియోజకవర్గానికి చోటు దక్కకపోవడంతో ఇక్కడి నేతలు లాబీయింగ్‌ను మరింత పదునెక్కించనున్నారు. ఇల్లెందుపై ఉత్కంఠ.. ఇల్లెందు నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య కాంగ్రెస్ సీటును ఆశిస్తున్నారు. కాగా ఇక్కడ బంజారాలకు అవకాశం ఇవ్వాలంటూ మరోవర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇల్లెందు సీటు ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఇల్లెందును పెండింగ్‌లో పెట్టడంతో ఇక్కడ హస్తం పార్టీలో రాజకీయం మరింత ముదురు పాకన పడుతోంది. ఇల్లెందు టికెట్ కోసం చీమల వెంకటేశ్వర్లు, ప్రవీణ్ నాయక్, శంకర్‌నాయక్, గుగులోత్ రవి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల పొత్తు కారణంగా కమ్యూనిస్టులకు కొత్తగూడెం సీటు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. -
TS Election 2023: ఎన్నికలపై ఓటర్ల ఆధిపత్య పోరు!
ఖమ్మం: అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసేది కేవలం డబ్బు, మందు ఇంకా అభ్యర్థి స్థానికత. నియోజకవర్గంలో అశ్వారావుపేట, దమ్మపేట మండలాలు అంధ్రా సరిహద్దుల్లో ఉండటంతో ఇక్కడ తెలంగాణా వాదం చాలా తక్కువ. కోయ, లంబాడీల మధ్య ఆధిపత్యపోరు కూడా ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది. నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. ఆంధ్ర అల్లుళ్ళు, ఆంధ్ర కోడళ్ళు వెరసి ఆంధ్ర సాంప్రదాయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రికార్డులు పరంగా తప్ప తెలంగాణ వాదం ఎక్కడ మచ్చుకైనా కనిపించదు. నియోజకవర్గం ఏర్పడిన తరువాత జరిగిన మూడు ఎన్నికలలోనూ అంటే 2009, 2014, 2018 ఈ మూడు సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు. 2009లో వగ్గేల మిత్ర సేన కాంగ్రెస్ నుంచి గెలవగా 2014లో తాటి వెంకటేశ్వర్లు వైయస్సార్ కాంగ్రెస్ నుంచి గెలవగా, 2018లో మెచ్చా నాగేశ్వరరావు మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం నుండి పోటీ చేసి గెలిచారు. ఈ గెలుపులో కాంగ్రెస్ కీలక భూమిక పోషించింది. పార్టీల బలాలు.. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీల బలాబలాల పరంగా BRS గుర్చి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ గడిచిన మూడు సార్వత్రిక ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలయ్యింది. నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్లో చేరడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం కాస్త పెరిగింది. ప్రస్తుత ఎమ్మెల్యే వివాద రహితుడు కావడం, ఇటీవల 100 కోట్ల పైన నియోజకవర్గానికి నిధులు తేవటం కారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ.. నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకత్వంలో 90 శాతం మంది తుమ్మలతో కలిసి అధికార పార్టీలో చేరిపోవడంతో నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభావం నామ మాత్రమే. కాంగ్రెస్ పొత్తు కుదిరి టిడిపి అభ్యర్థి బరిలో దిగే అవకాశం ఉంది. పొత్తుల్లో గనుక అశ్వరావుపేట సీటు టిడిపికి కేటాయిస్తే గెలిచే అవకాశాలు తక్కువ. కాంగ్రెస్.. కాంగ్రెస్‌కు ప్రతి మండలంలోనూ బలమైన కేడర్ ఉంది. కాకపోతే ఈ క్యాడర్ మొత్తం కూడా గ్రూపు తగాదాలతో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలో ముగ్గురు ప్రధాన నాయకుల అభ్యర్థులు ఇక్కడ ఉండటంతో వర్గ పోరు ఇబ్బంది పెట్టవచ్చు. కానీ రాబోయే ఎన్నికల్లో తెరాసకు ప్రత్యామ్నాయంగా కనబడుతుంది. అంతర్గత వర్గపోరు.. సిపిఎంకు బలమైన క్యాడర్ ఉన్న ఓట్లుగా మలుచుకునే సమర్థతను చూపించలేక పోతుంది. దీనికి తోడు అంతర్గత వర్గపోరు కూడా వెంటాడుతుంది. పార్టీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారన్న విమర్శలు సైతం వినబడుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో సీపీఎం పార్టీకి ఆరు వేల ఓట్లు మించకపోవచ్చు. బీజేపీ వర్గంలో.. కేంద్రంలో అధికారం ఉన్నప్పటికీ నియోజిక వర్గంలో ఒక్క వార్డ్ మెంబర్ కూడా ఎక్కడా గెలువలేదు. ప్రధానంగా అశ్వారావుపేట మండల కేంద్రంలో ఓ మోస్తారు కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. 2018 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అశ్వరావుపేట నుంచి పోటీ చేసిన బిజెపి అభ్యర్థి కంటే నోటా కే ఓట్లు అధికంగా పడటం గమనార్హం. -
ఆ ఒక్కటీ పాయె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రస్తుత శాసనసభలో తెలుగుదేశం ప్రాతినిధ్యానికి ముగింపు పలుకుతూ ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గతంలోనే టీఆర్ఎస్లో చేరిన మరో టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి మెచ్చా బుధవారం సాయంత్రం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. తొలుత శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో మెచ్చా నాగేశ్వర్రావు, సండ్ర వెంకట వీరయ్యలు భేటీ అయ్యారు. అనంతరం ముగ్గురూ కలిసి మంత్రుల నివాస సముదాయంలోని స్పీకర్ నివాసానికి వెళ్లారు. టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో టీడీపీని విలీనం చేయాల్సిందిగా కోరుతూ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖను అందజేశారు. టీడీపీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు తమ పార్టీలో చేరినట్లు టీఆర్ఎస్ పక్షాన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా స్పీకర్‌కు లేఖను అందజేశారు. టీఆర్ఎస్లో టీడీపీ శాసనసభా పక్షాన్ని విలీనం చేయాలని ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖను పరిశీలించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులోని నాలుగో పేరాను అనుసరించి విలీనాన్ని ఆమోదిస్తూ, శాసనసభలో టీఆర్ఎస్ సభ్యులతో పాటు వారికి స్థానాలు కేటాయిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు. తమ విలీన నిర్ణయాన్ని ఆమోదించాల్సిందిగా ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర్రావు బుధవారం ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు కూడా లేఖను అందజేశారు. వీరి వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఉన్నారు. 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం టీడీపీ శాసనసభా పక్షం విలీనంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంఖ్యా బలం 104కు చేరింది. ఎంఐఎంకు ఏడుగురు, కాంగ్రెస్‌కు ఆరుగురు, బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎంతో మెచ్చా భేటీ.. సండ్ర మధ్యవర్తిత్వం 2019 సాధారణ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా, తెలంగాణలో టీడీపీ కార్యకలాపాలు నామమాత్రంగా తయారయ్యాయి. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా ఉనికిని చాటుకోలేక పోయింది. ఇటీవల జరిగిన శాసన మండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో పోటీ చేసిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నామమాత్ర ఓట్లు సాధించి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని నిర్ణయానికి వచ్చిన మెచ్చా నాగేశ్వర్రావు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మెచ్చా పలుమార్లు కలిశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్లో చేరాలనే ఆకాంక్షను వెలిబుచ్చినట్లు తెలిసింది. కాగా ఇప్పటికే టీఆర్ఎస్లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా మెచ్చా చేరికలో క్రియాశీలంగా వ్యవహరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మెచ్చా రెండు రోజుల క్రితం భేటీ అయినట్లు సమాచారం. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్లో మెచ్చా చేరిక, టీడీపీ శాసనసభా పక్షం విలీనానికి ప్రాధాన్యత ఏర్పడింది. గత శాసనసభలోనూ టీడీఎల్పీ విలీనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో ఏర్పాటైన తొలి శాసనసభకు టీడీపీ నుంచి 15 మంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు. తర్వాతి కాలంలో 12 మంది ఎమ్మెల్యేలు వివిధ సందర్భాల్లో తెలుగుదేశంను వీడి టీఆర్ఎస్లో చేరారు. నాటి టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలని కోరుతూ అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి లేఖ అందజేయగా ఆమోదిస్తూ బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండో పర్యాయం కూడా టీడీపీ శాసనసభా పక్షం టీఆర్ఎస్లో విలీనం కావడం గమనార్హం. శాసనసభలో ఉనికి కోల్పోయిన టీడీపీ కాగా 2018 సాధారణ ఎన్నికల్లో టీడీపీ పక్షాన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట) మాత్రమే శాసనసభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది నెలలకే 2019 మార్చిలో సండ్ర టీఆర్ఎస్లో చేరినా సాంకేతికంగా అసెంబ్లీలో టీడీపీ సభ్యుడిగానే కొనసాగుతున్నారు. టీడీపీకి చెందిన మరో శాసనసభ్యుడు మెచ్చా నాగేశ్వర్రావు కూడా టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలు నాలుగో పేరా నిబంధన ప్రకారం... ఏదైనా ఒక పార్టీలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు తాము వేరే ఏదైనా పార్టీలో విలీనం కావాలనుకుంటే అందుకు స్పీకర్ అనుమతించాల్సి వుంటుంది. అలాంటప్పుడు వీరికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. కాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు టిఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనం కావాలని నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ విలీనం సంపూర్ణమైంది. దీంతో రాష్ట్ర శాసనసభలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. చదవండి: మిస్టర్ కేసీఆర్! డబ్బు సంచులతో ప్రజాస్వామ్యాన్ని కొనలేరు -
'తుమ్మలని తప్పించుకొని తిరిగేవాన్ని'
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : ‘ఇప్పటివరకు ఏ విషయంలోనూ ఎక్కడా రాజీపడ్డది లేదు.. ఇకపై పడేదీ లేదు. నాన్న నాకు ఇచ్చిన పొలం అమ్ముకుని మరీ రాజకీయాలు చేస్తున్నా. ఎక్కడా చేయి చాచింది లేదు.. నా నిజాయితీ, విశ్వసనీయతే ప్రజలు నా వెంట ఉండేలా చేశాయి. మా మేనమామ కూతురు శ్యామల, నేను ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. అవేర్ సంస్థ ద్వారా ప్రజలకు దగ్గరయ్యా. రాజకీయాల్లోకి వచ్చి రెండెకరాల భూమి అమ్ముకున్నా తప్ప సంపాదించింది లేదు. నలుగురికి మంచి చేయడం కోసం నేను నష్టపోయినా బాధపడను’ అంటున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో ‘సాక్షి’ పర్సనల్ టైమ్. మాది దమ్మపేట మండల పరిధిలోని మొద్దులగూడెం పంచాయతీలో గల తాటి సుబ్బన్నగూడెం అనే మారుమూల గిరిజన గ్రామం. మా తల్లిదండ్రులకు ఆరుగురం సంతానం. మా నాన్న రాములుకు వ్యవసాయమే జీవనాధారం. నాకు పదేళ్ల వయసప్పుడే ఆయన మృతిచెందారు. అప్పటి నుంచి అమ్మ ఆదెమ్మే మాకు అన్నీ తానై పెంచింది. మేం పెద్దయ్యేంత వరకు మా మేనత్త భర్త నర్సింహులు మా పొలాలు సాగు చేసి, మాకు సంరక్షకుడిగా నిలిచారు. నాకు ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. ముగ్గురు అక్కలను అంతగా చదివించలేదు. నేను మూడో తరగతి వరకు మా ఊరికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న తొట్టిపంపు గ్రామానికి కాలి నడకనే వెళ్లి చదువుకున్నాను. నాలుగో తరగతి నాయుడుపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. అప్పట్లో ఇలా తారురోడ్లు లేవు. పొలాల నుంచి అడ్డదారుల్లో దుగాల మీద నడుచుకుంటూ వెళ్లేది. 5 నుంచి 10 వరకు అశ్వారావుపేట ఎస్టీ హాస్టల్లో ఉండి జమీందారు గారి దివాణం బడిలో చదువుకున్నాను. అప్పట్లో అశ్వారావుపేటలో ఐటీఐ కాలేజీ స్థాపించిన పీకేఎస్.మాధవన్ గిరిజనులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. లోన్లు ఇవ్వడం, పొదుపు చేయించడంతోపాటు విద్యారంగంలో ప్రోత్సహిస్తుండే వారు. ఆయన దగ్గర గిరిజనులను చైతన్యవంతులను చేసేందుకు నేను ఆర్గనైజర్‌గా పనిచేసే వాడిని. అప్పట్లో నా రాజ్‌దూత్ వాహనంతోనే అశ్వారావుపేట, దమ్మపేట, ముల్కలపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తిరుగుతూ గిరిజనులను చైతన్యం చేస్తూ అవేర్ సంస్థ పథకాలను వారికి చేరవేసేవాడిని. రాజ్‌దూత్‌పై మారుమూల గ్రామాల్లో తిరిగిన రోజులు, నా రాజ్‌దూత్ నంబర్ ఏటీడబ్ల్యూ 5370 ఇప్పటికీ గుర్తుంది. ఆనాటి నుంచి ప్రజలతో నాకున్న సంబంధాలే నన్ను ఎమ్మెల్యేను చేశాయి. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నాం.. నా భార్య శ్యామల మా ఊర్లోనే ఉండే మా మేనమామ కూతురు. తాటి వారి ఆడపడుచు. వరసకు మరదలే అయినా అప్పట్లో ఇద్దరం ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మాకు పిల్లలు లేనందున సోదరుడి కుమారుడిని దత్తత తీసుకున్నాం. బాబు రాము అనంతపురంలో ఫిజికల్ డైరెక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇక నా మేనల్లుడు తాటి ప్రదీప్‌చంద్ర నా వ్యక్తిగత వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. నా భార్య మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా మాటకు అడ్డు చెప్పలేదు. ఆమెకు తెలిసిందల్లా నా నిర్ణయానికి కట్టుబడి ఉండడమే. రాజకీయాల్లో తిరగడం వల్ల మానాన్న నుంచి నాకు సంక్రమించిన 14 ఎకరాల్లో రెండెకరాలు అమ్మేశా. భూమి అమ్మినప్పుడు కూడా శ్యామల పల్లెత్తు మాటనలేదు. నాపై ఆమెకున్న నమ్మకం.. ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ఆ సమయంలో శ్యామల మాట్లాడుతూ.. ‘ఆయనకు ఏది నచ్చితే అదే చేస్తారు.. నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు.. నలుగురికి మంచి చేయడం కోసం నష్టపోయినా తప్పు లేదనే వ్యక్తిత్వం ఆయనది. ఇంటి పేరు మెచ్చా.. ఆయనకు లేదు మచ్చ.. అని అందరూ మెచ్చుకుంటుంటే గర్వంగా ఉంటుంది’ అన్నారు. ఇల్లూ.. పొలమే లోకం.. మొద్దులగూడెం గ్రామ పంచాయతీకి వరుసగా రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యా. ఎమ్మెల్యే అయ్యాక కూడా ఉంటే ఇంట్లో, లేకుంటే పొలంలో.. ఈ రెండూ కాకుంటే పార్టీ ఆఫీస్‌లో ఉంటానని ప్రజలందరికీ తెలుసు. అందుకే అశ్వారావుపేటలో క్యాంపు కార్యాలయంలో ఒంటరిగా కూర్చోలేక మారుమూల గ్రామమైనా మా ఊర్లోనే ఉంటాను. నియోజకవర్గం దాటితే.. అసెంబ్లీకే. నాకు కాంట్రాక్టులు లేవు.. టెండర్లకు వెళ్లేదీ లేదు. మా ఇంట్లో నాకొక్కడికే రాజకీయాలపై ఆసక్తి. మా తమ్ముడికి ఆ ఊసే ఉండదు. జలగం వెంగళరావు హయాంలో కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేశాను. ఏడో తరగతి పూర్తికాగానే ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం వచ్చినా.. రాజకీయాలపై ఉన్న మక్కువతో అందులో చేరలేదు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నప్పుడు మా పంచాయతీ ఎన్నికల్లో వాళ్లకు పది ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇది నా వల్లే అని తెలుసుకుని ఓ రోజు అర్ధరాత్రి బుల్లెట్ వేసుకుని మా ఇంటికొచ్చి నన్ను టీడీపీలో చేర్పించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అదే పది ఓట్లు వచ్చాయి. అంతే అప్పటి నుంచి నన్ను తుమ్మల వదలిపెట్టలేదు. జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావుతో మంచి సంబంధాలున్నాయి. 2009లో అశ్వారావుపేట ఎస్టీ నియోజకవర్గంగా ఏర్పడింది. టీడీపీ నుంచి నేను.. మా బావ తాటి వెంకటేశ్వర్లు టికెట్ కోసం పోటీపడ్డాం. ఈ పంచాయితీ తేల్చలేక అప్పట్లో అధిష్టానం గెలిచే సీటును సీపీఎంకు ఇచ్చి చేజార్చుకుంది. ఆ తర్వాతా మా ఇద్దరికే పోటీ. 2014లో తాటి నన్ను ఓడించాడు. 2019లో నేను ఆయనను ఓడించి బాకీ తీర్చుకున్నా. నేను ఓడిపోయి ఇంట్లో ఉన్నప్పుడే తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటూ.. నన్ను కూడా రావాలని ఒత్తిడి తెచ్చారు. అయితే వారం రోజులు ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ, తిరుపతి, బెంగళూరు వెళ్లి ఆయనకు దొరక్కుండా తప్పించుకున్నాను. మళ్లీ నేను గెలిచి.. ఆయన ఓడాక కూడా ఒత్తిడి మొదలెట్టారు. చివరకు సీఎం కూడా నాకేం కావాలన్నా సరే అన్నారు. కానీ.. నా వ్యక్తిత్వాన్ని అమ్ముకునేది లేదని తేల్చి చెప్పేశాను. నేను మట్టిని నమ్ముకున్న రైతును.. ఆ మట్టికున్న నిజాయితీ మనకుంటేనే ప్రజలు విశ్వసిస్తారనేది నా నమ్మకం. నాకు ఆ దేవుడు.. ఈ దేవుడనే తేడా లేదు. కాకుంటే సాయిబాబా గుడికి ఎక్కవగా వెళుతుంటా. సాధ్యమైనంత వరకు కుటుంబంతో.. చిన్ననాటి స్నేహితులతో గడుపుతుంటాను. -
మత మార్పిడి చేసిన మదర్సా నిర్వాహకుల అరెస్ట్
అశ్వారావుపేట: మతమార్పిడి, లైంగిక దాడులకు పాల్పడుతున్న ముగ్గరు వ్యక్తులను పాల్వంచ డీఎస్పీ మధుసూదన్‌రావు బుధవారం అరెస్టు చేసి సత్తుపల్లి కోర్టుకు రిమాండ్ చేశారు. స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఏపీ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఎస్కే వలీఅహ్మద్ అశ్వారావుపేటలోని ఏఎస్‌ఆర్‌నగర్‌లో మదర్సా నిర్వహిస్తున్నాడు. దీనిని ‘ద రియల్ మెస్సేజ్ సెంటర్ మదర్సా ఈ దావత్ హక్’ పేరుతో 2010లో మేడిపల్లిలో ప్రారంభించారు. ఆ తర్వాత 2011లో అశ్వారావుపేటకు మార్చారు. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా నడిపి 2018లో ఖమ్మంలోని రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ నుంచి 116 నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించారు. నిరుపేద దూదేకుల కులానికి చెందిన పిల్లలకు ఉర్దూ, అరబిక్ నేర్పడం, చెడు అలవాట్లకు బానిసలైన వారిని మార్చడం, అన్ని మతాలసారం ఒక్కటేనని చెప్పి దేశ సమైక్యతను పెంపొందించడం ఈ మదర్సా స్థాపన లక్ష్యమని రిజిస్ట్రేషన్ కోసం పొందు పర్చిన పత్రాల్లో పేర్కొన్నారు. కానీ, ఈ మదర్సా నిర్వాహకుడు ఎస్కే వలీ.. తన పెద్దకొడుకు ఎస్కే అబ్దుల్ రజాక్, తన బావమరిది ఎస్కే జానీతో కలిసి సాయం కోసం వచ్చే గిరిజన మహిళలతో మతమార్పిడి చేయించడం, వారిపై లైంగికదాడి చేయడం, మదర్సాలో చదివే పిల్లలకు బాల్య వివాహాలు చేయడం, మతమార్పిడి చేసిన వారి ఫొటోలను ఉపయోగించి ఇతర గ్రామాల్లోని మసీదుల వద్ద పెద్దమొత్తంలో చందాలు వసూలు చేయడం లాంటి పనులు చేశారు. ఈ చందాలతో ఆస్తులను కూడబెట్టుకున్నారు. ఇప్పటి వరకు 13 మంది హిందువులను ముస్లింలుగా మార్చాడు. వారిలో 8 మంది గిరిజనులు. గోదావరిఖని గ్రామానికి చెందిన ఎండీ మున్నా కుమార్తె (మైనర్)కు ఎస్కే వలీ బలవంతంగా వివాహం చేశాడని, అతడి కొడుకు అబ్దుల్ రజాక్ లైంగికదాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయగా దర్యాప్తులో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో సీఐ ఎం.అబ్బయ్య, ఎస్ఐలు వేల్పల వెంకటేశ్వరావు, మధుప్రసాద్ ఉన్నారు. -
మదర్సా ముసుగులో మత మార్పిడులు
అశ్వారావుపేట: అశ్వారావుపేటలో మదర్సా పేరుతో నిర్వహిస్తున్న బాల్యవివాహాలు, మతమార్పిడుల గుట్టు గురువారం రట్టయింది. అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం గ్రామపంచాయతీ అల్లూరి సీతారామరాజు నగర్లో పన్నెండేళ్ల క్రితం మదర్సా పేరుతో వేంసూరుకు చెందిన ఓ కుటుంబం ఓ సంస్థను స్థాపించారు. మొదట్లో సర్వశిక్షా అభయాన్ నుంచి పాఠ్యపుస్తకాలు, ఇద్దరు విద్యావలంటీర్లను సమకూర్చారు. ఆ తర్వాత పాఠ్యపుస్తకాలు, విద్యావలంటీర్లను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆతర్వాత అక్కడేం జరుగుతోందో ఎవరికీ పట్టని విషయమైంది. కాగా అక్కడ ఇస్లాం పాఠాలో బోధిస్తున్నామని.. ప్రభుత్వ విద్యతో తమకు సంబంధం లేదని.. పేద ముస్లిం పిల్లలను దూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి నమాజ్, తదితర ఆధ్యాత్మిక బోధన చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పుతున్నారు. ఈక్రమంలో పలువురు దాతలు వారికి విరాళాలు ఇచ్చేవారు. ఈ విరాళాలతో సంస్థను నిర్వహిస్తున్నారు. ఇంత వరకు సజావుగా ఉన్నా.. బుధవారం సాయంత్రం ఆయేషా అనే ఓ మైనర్ బాలిక తనకు బలవంతంగా నిర్వాహక బృందంలో ఓ వివాహితుడితో వివాహం జరిపించారని ఆరోపించడంతో వివాదం మొదలైంది. కాలనీ వాసులు సైతం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గురువారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై బైఠాయించారు. రాత్రి వేళల్లో మదర్సాగా చెప్పుకునే ప్రాంతానికి ఎవరెవరో కార్లపై వస్తుంటారని.. తెల్లారకుండానే వెళ్లిపోతుంటారని ఆరోపిస్తున్నారు. చిన్నపిల్లలకు సరిగా తిండి పెట్టకుండా చిత్రహింసలు పెడుతుంటారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా కాలనీ వాసులే మమ్మల్ని కొట్టి బూతులు తిడుతున్నారని అక్కడ ఆశ్రయం పొందే చిన్నారులు, మహిళలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న అశ్వారావుపేట సీఐ ఎం అబ్బయ్య సంఘటనా స్థలానికి వచ్చి విచారణ జరిపారు. హాజరు పట్టిక, దాతల రశీదులు, అడ్మిషన్ ఫారాలు, గత పన్నెండేళ్లుగా చదువుకున్న విద్యార్థులు, వారి తల్లితండ్రుల వివరాలు తెలపాలని కోరగా సమాధానం చెప్పలేకపోయారు. ఇంటర్మీడియట్ చదువుకున్న ఓ యువతి అక్కడ పాఠ్యాంశాలు, ఆధ్యాత్మిక బోధన చేస్తున్నట్లు చెబుతున్నారు. నలుగురి మతమార్పిడి..? మదర్సా ముసుగులో మత మార్పుడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నలుగురు బాలికలను మత మార్పిడి చేసినట్లు సమాచారం. అశ్వారావుపేటకు చెందిన రమాదేవిని, అనంతారం తండాకు చెందిన సరితను మతం మార్పించి, సాజిద, ఫాతిమాగా పేర్లు మార్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బాధితులు పోలీసుల విచారణలో కూడా చెప్పినట్లు సమాచారం. బలవంతంగా పెళ్లిచేసి చిత్రహింసలు పెట్టారు ఈ మదర్సా మా మామయ్య వలీది. నేను కొత్తగూడెంలో చదువుకుంటుండగా మదర్సా చూడ్డానికి వచ్చాను. నాకు పద్నాలుగోయేటనే బలవంతంగా ఇక్కడ భార్య చనిపోయిన వ్యక్తితో వివాహం చేశారు. మాతల్లి మతిస్థిమితం సరిగ్గా ఉండదు. మా అక్కను హైదరాబాదు వాళ్లకు ఇచ్చి పెళ్లి చేశారు. చిత్రహింసలు పెట్టి అతనితో కాపురం చేయించారు. కొన్ని రోజుల తర్వాత మదర్సాలో ముసలి వాళ్లను రానీయడం లేదు. మామామయ్య నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. సుమారు అరవై పెళ్లిళ్లు చేశాడు. నాతల్లికే మూడు పెళ్లిళ్లు చేశాడు. మూడేళ్ల క్రితం బెల్లంపల్లికి చెందిన బాలిక ఇక్కడకు వచ్చి మిషన్కుట్టుకునేది. వలీ కుమారుడు ఆబాలికను శారీరకంగా వాడుకున్నాడు. నాకు ఇక్కడ జరిగిన అన్యాయమే తిరిగి ఇతర బాలికలకూ జరుగుతోంది. వీరిని కఠినంగా శిక్షించాలి. –ఎస్కే ఆయేషా, బాధితురాలు మదర్సా పేరుతో అన్ని పనులు చేయిస్తున్నారు.. మదర్సా పేరుతో చిన్న పిల్లలతో పనులు చేయిస్తున్నారు. సిమెంట్ పనులు చేయిస్తుంటారు. రాత్రివేళల్లో కార్లపై స్త్రీ పురుషులు వస్తుంటారు. ఇక్కడేం జరుగుతోందో అర్థమవుతున్నా.. ఏమీ మాట్లాడలేని పరిస్థితి. రోడ్డును ఆక్రమించారు, చిన్నపిల్లలకు సేవ చేస్తున్నామని అంటూ వారిని ఇబ్బందులు పెడుతున్నారు. –సంపంగి సులోచన, స్థానికురాలు ఎందుకిలా చేస్తున్నారు..? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ గురుకులాలు, ముస్లిం మదర్సాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుస్తుండగా అశ్వారావుపేటలో ప్రభుత్వం, స్థానిక ముస్లిం కమిటీ, ఏ ఇతర ఇస్లాం సంస్థతో అనుబంధం లేకుండా బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా ఇక్కడ ఓ సంస్థను ఎందుకు నిర్వాహిస్తున్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తును ప్రారంభించారు. పోలీస్, పోలీస్ నిఘా విభాగాల సిబ్బంది వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. అక్కడున్న నిర్వాహక బృందంలో పెద్దవ్యక్తి, ఆయన కుమారుడు, ఆయన బావమరిది అక్కడున్న మహిళలు, యుక్త వయస్కులయిన యువతులను బలవంతంగా వివాహమాడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. వారికి కలిగిన సంతానమే ఇక్కడ ఆధ్యాత్మిక విద్యనభ్యసిస్తున్నట్లుగా చూపుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రతి ఒక్కరి భర్త, పిల్లలు, తల్లితండ్రుల పేర్లు విడివిడిగా నమోదు చేసుకుంటున్నారు. గతేడాది 23 మంది చిన్నారుల విద్యాబోధనకు, భోజన వసతి నిర్వాహణకు రూ.922174 ఖర్చు అయినట్లు వార్షిక నివేదికలో పొందుపరచడం గమనార్హం. నిధుల సమీకరణ కోసమా లేక ఇంకేమైనా భద్రతాపరమైన ముప్పు వాటిల్లే ప్రమాదముందా అనే కోణంలో పోలీసులు గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. సీఐ అబ్బయ్య స్పందిస్తూ ప్రాథమిక సమాచారం సేకరించే పనిలో ఉన్నామన్నారు. పదిమంది చిన్నారులను సంరక్షించిన డీసీపీఓ చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలకు స్పందించిన డీసీపీవో హరికుమారి గురువారం రాత్రి మదర్సాకు చేరుకున్నారు. అక్కడున్న చిన్నారుల ఆధార్‌కార్డులు ఇతర వివరాలను పరిశీలించారు. ఆ«ధారాలు, ధ్రువీకరణ పత్రాలు సరిగా లేని పదిమంది చిన్నారులను కొత్తగూడెం హోం కు తరలించారు. ఆమె వెంట అశ్వారావుపేట సీడీపీవో అన్నపూర్ణ ఉన్నారు. -
ఇళ్లు పోయాయ్.. కన్నీళ్లూ ఇంకిపోయాయ్!
ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లోనే చలి తీవ్రంగా ఉంది. జనాన్ని వణికించేస్తోంది. ఇక ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ఇంకెలా ఉంటుంది? ఊహించడానికే కష్టం. ఎముకలు కొరికే చలి చంపేస్తోంది. ఈ చలిలో కనీసం ఉండడానికి గూడు లేక ఆ రెండు గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఆ గ్రామాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం.. వసతుల కల్పనపై నోరుమెదపడం లేదు. ఫలితంగా అక్కడి గిరిజనం పిల్లాపాపలతో అష్టకష్టాలు పడుతున్నారు. వేలేరుపాడు: పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో పెదవాగు వెంట ఉన్న కమ్మరిగూడెం, అల్లూరినగర్ గ్రామాల్లో మొత్తం 335 గిరిజన కుటుంబాలున్నాయి. గత ఏడాది ఆగస్టు 18న తెలంగాణలోని అశ్వారావుపేట మండలంలో పెదవాగు మూడుగేట్లు ఎత్తడంతో భారీగా వచ్చిన నీటి ప్రవాహానికి ఈ గ్రామాల్లో పక్కా భవనాలు మినహా 137 పూరిళ్లు కొట్టుకుపోయాయి. కమ్మరిగూడెంలో 120, అల్లూరి నగర్లో 17 ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ గ్రామాలు పెదవాగుకు అత్యంత చేరువలో ఉన్నందున వరద పోటెత్తిన సమయంలో వంట సామగ్రి, బట్టలు కూడా బయటికి తీయలేకపోయారు. ప్రాణ భయంతో కమ్మరిగూడెం వాసులు గ్రామానికి చేరువలో గుట్ట వైపు పరుగులు తీయగా.. అల్లూరినగర్ గ్రామస్తులు ఓ పక్కా భవనం పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. నిత్యావసర వస్తువులతోపాటు, ధాన్యం, బియ్యం, ఇతర వస్తువులన్నీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో ఈ గ్రామస్తుల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఈ సంఘటన జరిగి ఐదు నెలలు దాటుతోంది. నేటివరకు ఈ గ్రామాల గిరిజనులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించలేదు. ఈ గ్రామాలు పోలవరం ప్రాజెక్ట్ ముంపు పరిధిలో లేకపోయినప్పటికీ పరిహారం చెల్లించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇళ్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయినా, వరదల్లో కొట్టుకుపోయినా తక్షణమే నష్ట పరిహారం అందించాల్సి ఉంది. కానీ నేటికీ ఆ రెండు గ్రామాల గిరిజనులకు నష్టపరిహారం ఇవ్వలేదు. మొదట్లో అరకొర సాయంతో వదిలేశారు ఈ గ్రామ గిరిజనులకు వరదల సమయంలో అరకొరగా సాయం అందింది. కుటుంబానికి 20 కేజీల బియ్యం, కిరోసిన్, కందిపప్పు, మంచినూనె, రెండు దుప్పట్లు అందించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఇళ్లు కొట్టుకుపోయి నిలువ నీడలేక రహదారిపై ఉంటున్న గిరిజనులకు పూర్తి స్థాయిలో టార్పాలిన్ పట్టాలు కూడా ఇవ్వలేదు. కమ్మరిగూడెంలో 120 ఇళ్లు కొట్టుకుపోగా, కేవలం 35 టార్పాలిన్ పట్టాలు పంపిణీ చేసారు. అల్లూరినగర్‌లో 17 ఇళ్లకుగాను 8 పట్టాలు ఇచ్చారు. ఇంకా అనేక మందికి ఇవ్వకపోవడంతో ఒకే టార్పాలిన్ కవర్‌తో నిర్మించిన తాత్కాలిక పాకల్లో రెండు కుటుంబాల చొప్పున నివాసముంటున్నాయి. ఇళ్ల పరిహారం అందేది ఎప్పటికో? పూర్తిగా కొట్టుకుపోయిన ఇళ్లకు తక్షణమే రూ.5 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.3,200 చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెవెన్యూ అధికారులు బాధితుల బ్యాంకు ఖాతా నెంబర్లు సేకరించారు. ఆన్లైన్లో డబ్బులు పడతాయని అధికారులు తమకు చెప్పారని, కానీ నేటివరకు పరిహారం రాలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామాల్లో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 300 ఎకరాల్లో వరి పూర్తిగా నాశనమైంది. పొలాలు రాళ్లు తేలి, ఇసుక మేటలతో మళ్లీ సాగుకు పనికిరాకుండా పోయాయి. పంట నష్టం సర్వే పూర్తయి ఐదు నెలలైనప్పటికీ, పంట నష్టం పరిహారం నేటికీ అందలేదు. ప్రభుత్వానికి నివేదించాం ఇళ్ల పరిహారానికి సంబంధించి అన్ని వివరాలు ప్రభుత్వానికి నివేదించాం. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.3,200 ఇస్తాం. సాంకేతిక లోపం తలెత్తడం వల్ల నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కావడంలేదు. నిధులు వస్తే బాధితులకు పంపిణీ చేస్తాం. – రవికుమార్, తహసీల్దార్ వేలేరుపాడు చలిలోనే పిల్లాపాపలతో.. చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు సోయం కుమారి. గత ఏడాది ఆగస్టులో పెదవాగు వరద ప్రవాహానికి కమ్మరిగూడెంలోని వీరి రెండిళ్లు కొట్టుకుపోయాయి. ఆమె తండ్రి జక్కులు ఇంటితో పాటు ఈమె సొంత ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. సొంతంగా ఇల్లు నిర్మించుకునే స్థోమత లేదు. ప్రభుత్వం రెండిళ్లకు కలిపి ఒక టార్పాలిన్ కవర్ ఇచ్చింది. దాంతో వేసిన చిన్న పాకలోనే æచిన్న పిల్లలతో ఆమె కుటుంబం చలిగాలికి వణుకుతూ నివాసముంటోంది. ఇళ్లు కోల్పోయినందున నష్ట పరిహారం అందించాలని వేడుకుంటోంది. కట్టుబట్టలే మిగిలాయి.. ఈమె పేరు వేటగిరి అంజమ్మ. కమ్మరిగూడెం గ్రామం. ఈమె ఇల్లు గతంలో వచ్చిన వరదకు అరమైలు దూరం కొట్టుకుపోయింది. సామాన్లు బయటికి తీయలేకపోయింది. ఒంటిమీద బట్టలే మిగిలాయి. ఇళ్లకు పరిహారం ఇవ్వక పోవడంలో ఇల్లు నిర్మించుకోలేక, టార్పాలిన్ కవర్‌తో నిర్మించిన తాత్కాలిక ఇంట్లో ఉంటూ అగచాట్లు పడుతోంది. నివాస గృహం కూలినా దిక్కులేదు ఈమె పేరు ఎన్.రమాదేవి. అల్లూరినగర్ గ్రామం. కూలికెళితే గానీ ఇల్లు గడవని నిరుపేద గిరిజన కుటుంబం. కూలికెళ్లి పైసా పైసా జమచేసి, ఇందిరమ్మ ఇంటి పథకంలో భాగంగా నిర్మించుకోగా, పెదవాగు ప్రవాహానికి అది కుప్పకూలిపోయింది. దీంతో ఐదునెలలుగా టార్పాలిన్ కవర్‌తో నిర్మించిన తాత్కాలిక ఇంట్లో నివాసముంటూ బతుకీడుస్తోంది. చీకటి కోరల్లో కాలం వెళ్లదీస్తున్న మిరియం బజారు ఈ వృద్ధురాలి పేరు మిరియం బజారు. కమ్మరిగూడెం గ్రామం. పెదవాగు వరద ప్రవాహానికి ఈమె పూరింటి పైకప్పు కూలిపోయింది. ప్రభుత్వమిచ్చిన టార్పాలిన్ కవర్నే ఇంటిపైన కప్పుకుంది. ఇంటికి కరెంట్ లేదు. ఇచ్చిన కిరోసిన్ ఎప్పుడో అయిపోయింది. దీంతో ఆమె చీకట్లో మగ్గుతూ నానా ఇబ్బందులు పడుతోంది. -
కుట్రల వల్లే ఓటమి: మాజీ మంత్రి
అశ్వారావుపేటరూరల్: స్వార్థ రాజకీయాలు, కొన్ని కుట్రల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిందని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఈ రెండింటినీ సమానంగా చూడాలని, ఉభయ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి తానే బాధ్యత వహిస్తానని, వేరే వాళ్లను నిందించవద్దని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వినాయకపురం గ్రామంలో ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గ విసృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో నష్టపోవడంపై తమతోపాటు సీఎం కేసీఆర్ గుండెల్లో కుడా బాధ నెలకొందన్నారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన సత్తుపల్లి నియోజకవర్గంలో గెలుస్తామని ఆశపడ్డానని, అలాగే అశ్వారావుపేట అసెంబ్లీ సీటు మొదట గెలవాల్సిన స్థానమని, ఇలాంటి చోట స్వార్థ రాజకీయాల కోసం బలి పెట్టుకున్నారని, ఓడిపోయినందుకు చాలా బాధగా ఉందని చెప్పారు. ఈ స్థానాన్ని చేజేతులారా పొగట్టుకున్నామని, ఇప్పుడు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదని, జరిగింది మనస్సులో పెట్టుకోవద్దని, జరగాల్సినది చూడాలని సూచించారు. జిల్లాలో అభివృద్ధి కొనసాగే బాధ్యత తనదేనని, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి గడిచిన నాలుగేళ్లలో మిగిలిన జిల్లాల కంటే అధిక ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు. జిల్లాలో ఇప్పటికే 800 మెగావాట్లతో కేటీపీఎస్‌ను, 12వందల మెగావాట్లతో భద్రాద్రి పవర్ ప్లాంట్లను పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో కలిసి పని చేయాలని, కొట్లాడుకొని వేరే పార్టీల వద్ద చులకన కావద్దని కోరారు. త్వరలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ అంతా సిద్ధం కావాలని, సర్పంచ్ టికెట్ల కోసం పొట్లాడుకోవద్దన్నారు. గ్రామ నాయకులు ఏకతాటిపైకి వచ్చి అభ్యర్థులను ఎంపిక చేసుకొని గెలిపించుకోవాలని కోరారు. అన్ని సర్పంచ్ స్థానాలనూ గెలిపించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పును సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ నూకల నరేష్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ రవీందర్, మండలాధ్యక్షుడు బండి పుల్లారావు, నాగమణి, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, రైతు సమన్వయ కమిటీ బాధ్యులు జూపల్లి రమేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తుమ్మలకు మళ్లీ మంత్రి పదవి రావాలి: తాటి నియోజకవర్గస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మె ల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల పార్టీకి నష్టం జరిగిందన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మరోసారి అవకాశం ఇవ్వాలని, ఆయనకు మంత్రి పదవి వస్తేనే జిల్లా లో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. సస్పెండ్ డిమాండ్‌తో రసాభాస టీఆర్ఎస్ అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి సమావేశంలో పార్టీ ఇన్చార్జ్ రవీందర్ ప్రసంగిస్తున్న క్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే వర్గీయులు, ఖమ్మం ఎంపీ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీకి ద్రోహం చేసిన వారిని సస్పెంచ్ చేయాలంటూ.. ఎమ్మెల్యే వర్గీయులు డిమాండ్ చేశారు. ఒకరినొకరు నెట్టుకుంటున్న క్రమంలో స్థానిక నేత జూపల్లి రమేష్ ఇరువర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించినా వినలేదు. 10 నిమిషాలపాటు సభలో గందరగోళం నెలకొంది. తోపులాట, మాటల యుద్ధం సాగింది. పార్టీ ఇన్చార్జ్ హెచ్చరించడంతో వారంతా శాంతించారు. -
ఇవి రైతు వ్యతిరేక ప్రభుత్వాలు: చంద్రబాబునాయుడు
సాక్షి, అశ్వారావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. మిరపరైతులు గిట్టుబాటు ధర అడిగితే బేడీలు వేసి జైల్లో పెట్టాయని ఆరోపించారు. బుధవారం దమ్మపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అశ్వారావుపేట ప్రజాకూటమి అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు మచ్చలేని వ్యక్తి అని, ఆయన్ను గెలిపించాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను, సోనియా గాంధీని విమర్శిస్తున్నారని, ఆయన కేసీఆర్ పచ్చి అబద్ధాలకోరు అని అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అభివృద్ధి అవసరం లేదని, తెలంగాణ ధనిక రాష్ట్ర ఆదాయం కేసీఆర్ కుటుంబానికి తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. తమది పేద రాష్ట్రమైనా అక్కడ, ఇక్కడ పతకాల అమలెలా ఉందో బేరీజు వేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సమస్య కేసీఆర్ మాత్రమేనన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయి ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందన్నారు. ఇక్కడుండే ఎమ్మెల్యే అభ్యర్థిని వేదికపైకి రానీయలేదని, మరి ఆరోజు ఎందుకు సీటిచ్చారని ప్రశ్నించారు. బస్సు ప్రమాదం జరిగినా రాని సీఎం ఎన్నికలు వచ్చేసరికి హెలికాప్టర్లో తిరుగుతున్నార ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఒక్క ఇల్లయినా కట్టారా అని ప్రశ్నించారు. ఏపీలో ఆదాయం లేకపోయినా 8 5లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. మిషన్ భగీరధలో మీకు పైపులొచ్చాయా.. నీళ్లొచ్చాయా.. రెండూ రాలేదా ప్రశ్నించారు. ఇక్కడ ప్రజాకూటమి గెలిస్తే రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలొస్తాయన్నారు. పేదలకు6 గ్యాస్ సిలిండర్లు, పింఛన్ల పెంపు, రూ.3వేల నిరుద్యోగ భృతి సాధ్యమన్నారు. హైదరాబాదు బంగారు గుడ్డుపెట్టే ప్రాంతమని, సంపద సృష్టించే తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ఏపీలో పోడు భూములకు పట్టాలిస్తుంటే ఇక్కడ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మీ ఎమ్మెల్యే ఎటు పరుగెడతాడో.. ఎటు వస్తాడో తెలియదని అన్నారు. బీజేపీకి ఓట్లు లేవు కానీ ముగ్గురు ముఖ్యమంత్రులు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. గోదావరిలో నీళ్లు ఉపయోగించుకోవడానికి అథారిటీ ఏర్పాటు చేశామన్నారు. 2500టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని.. వీటిని సద్వినియోగం చేసుకుందామంటే సహకరించకుండా నేను అడ్డుపడుతున్నానని అంటున్నారన్నారు. మాటల గారడీలో కేసీఆర్, మోడీ ఇద్దరూ ఒకటే అన్నారు. కేసీఆర్ జూనియర్ మోదీ అని, ఇద్దరూ నాటకాలాడుతున్నారని అన్నారు. మరోపక్క ఎంఐఎం కూడా వీళ్లకు మద్దతిస్తున్నారన్నారు. అశ్వారావుపేట కూటమి(టీడీపీ)అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రజలకు పాలేరుతనం చేస్తానన్నారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మా ట్లాడుతూ చంద్రబాబును చూసినా.. సమ్మె చేసే కార్మికుడిని చూసినా చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. ఆఖరకు బాత్రూంలోకి వెళ్లాల న్నా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలోకి వెళుతున్నారన్నారు. ఇలా భయపడే ముఖ్యమంత్రి మనకు అవసరమా అన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్నే వీరాంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నారాయణ్ ప్రసాద్ తివారీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. -
ఖమ్మం: ‘పేట’లో పెరిగిన ఓటర్లు
సాక్షి, అశ్వారావుపేటరూరల్: ఎన్నికల ప్రక్రియలో ఓటు ఎంతో కీలకం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం. దీనిని దృష్టిలో పెట్టుకొని ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే, ఎన్నికలో సంఘం ఓటు ప్రాధాన్యత, ఓటు హక్కు పొందే విధానం, దరఖాస్తు చేసుకునే అవకాశం పలు దఫాలుగా కల్పించిన సంగతి తెలిసిందే. ఈసారి ఆన్లైన్ విధానంలో తమ ఓటు ఉందో లేదో కుడా చూసుకునే వెసులుబాటు కుడా కల్పించింది. దాదాపు నెల రోజులపాటు జాబితాపె ఎన్నికల సంఘం, అధికారులు దృష్టి పెట్టడంతో ఎంతో వేలాది మంది తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో వేలమంది ఓటర్లు ఓటు హక్కు పొందారు.నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల్లో గడిచిన నెల రోజులుగా పెరిగిన ఓటర్లు, తుది జాబిథౠను సైతం జిల్లా అధికారులు విడుదల చేశారు. దానిని పరిశీలిద్దాం. నియోజకవర్గంలో 2009 అసెంబ్లీ ఎన్నికల నాటికి 1,55,376 మంది ఓటర్లు, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 1,64,419 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో నియోజకవర్గం పరిధిలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు ఏపీలో విలీనమయ్యాయి. దీంతో, దాదాపు 40వేల మంది ఓటర్లు తగ్గారు. మొత్తం ఓటర్ల సంఖ్య 1,24,419కి పడిపోయింది. ఆ తర్వాత పలుమార్లు జరిగిన ఓటర్ల నమోదు కార్యక్రమంలో క్రమంగా ఓటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది.అసెంబ్లీ రద్దు తర్వాత గడిచిన రెండు నెలల్లో నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 1,42,571కి చేరింది. తాజాగా ప్రకటించిన తుది జాబితా ప్రకారంగా ఈ సంఖ్య 1,43,960గా నమోదైంది. అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే 1389 మంది కొత్త ఓటర్లు పెరిగారు. -
అశ్వారావుపేట:‘తమ్ముళ్ల’ తంటాలు !
సాక్షి, అశ్వారావుపేట: అశ్వారావుపేటలో టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలుపును ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాబు ఆదేశాలతో ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు నిత్యం ఇక్కడే తిష్ట వేస్తున్నారు. ఎలాగైనా గెలిపించాలని ఏపీ తెలుగు తమ్ముళ్లు సర్వశక్తులొడ్డుతున్నారు. అక్కడి నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. తాజాగా శనివారం సాయంత్రం ఏలూరు జెడ్పీ చైర్మన్ నగదుతో అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్ద దొరికిన విషయం తెలిసిందే. తెలంగాణ పోలీసులు ఆయన వాహనాన్ని ఆపగా.. వెంటనే ఏపీ పోలీసులను చెక్‌పోస్టు వద్దకు పిలిపించుకుని తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చెక్‌పోస్టు వద్దకు పొరుగు రాష్ట్రం పోలీసులు అనాలోచితంగా రావడం, కనీసం ఉద్యోగ భద్రత గురించి కూడా ఆలోచించకుండా రావడం ఏంటనే చర్చ జరుగుతోంది. అయితే జెడ్పీ చైర్మన్ ఎంట్రీ ట్రయల్ మాత్రమేనని, ఆయన ప్రయత్నం ఫలిస్తే నేరుగా హైవే మీదుగానే డబ్బు రవాణా చేయొచ్చని భావించినట్లు సమాచారం. ‘తెలుగుదేశం పార్టీ మీకు ఈ స్థానాన్నిచ్చింది.. అశ్వారావుపేట స్థానాన్ని గెలిపించి మీ విశ్వాసాన్ని చూపించండి..’ అని బాస్ ఆదేశించడంతో ఇసుక ర్యాంపులు, బాక్సైట్ గనులు, చేపల చెరువులు, కొల్లేరు ఆక్రమణలు.. ఇలా ప్రభుత్వ అండతో కోట్లకు పడగలెత్తిన ప్రబుద్ధులు అవసరమైన ఇం‘ధనాన్ని’ సమకూర్చుతున్నట్లు తెలుస్తోంది. రవాణాకు ఎన్ని మార్గాలో.. నియోజకవర్గంలో అశ్వారావుపేట, దమ్మపేట మండలం మందలపల్లి వద్ద మాత్రమే చెక్‌పోస్టులున్నాయి. అయితే అశ్వారావుపేట నుంచి ఏపీకి బదలాయించిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నుంచి సులభంగా డబ్బు సంచులు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు మండలాలను చేరుకోవాలంటే ఉన్న పలు మార్గాలను చెక్‌పోస్టులతో నియంత్రించాలంటే ప్రస్తుతం ఉన్న పోలీసు బలగాలు సరిపోవు. ఇదే అదనుగా ఇప్పటికే సంచులు సరిహద్దు దాటించారనే ప్రచారం జరుగుతోంది. అదేబాటలో మద్యం .. నగదు తరలించినట్లుగానే మద్యం బాటిళ్లను కూడా తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులకు ప్రభుత్వ మద్యం రవాణా కావాలంటే ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలో మద్యం డిపో నుంచి అశ్వారావుపేట మీదుగా మాత్రమే వెళ్లాలి. అలాగే ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా దమ్మపేట, అంకంపాలెం, తిరుమలకుంట, వినాయకపురం వచ్చి.. అక్కడ నుంచి ఏపీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వెళ్లొచ్చు. ఈ రెండు మార్గాల్లో ఎన్నికల సంఘం, పోలీసులు, ఎక్సైజ్ ఏ ఇతర శాఖాధికారులు తనిఖీ చేసినా.. ప్రభుత్వ బిల్లుతో ఆ రాష్ట్రానికి తెలంగాణ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇదంతా అక్కడికి వెళ్లకుండా అవసరమైన మేరకు తెలంగాణలోనే ఆగుతోందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏపీకి సరిహద్దులో ఉండడం.. అశ్వారావుపేట మండలానికి మూడు వైపులా ఏపీ ఉండడం ఈసారి బాగా కలిసొచ్చినట్లు చెప్పుకుంటున్నారు. తనిఖీలు చేస్తూనే ఉన్నాం.. రవాణా మార్గాలు అధికంగా ఉన్న అశ్వారావుపేటకు ఒక చెక్‌పోస్టు నిర్వహిస్తున్నాం. బీటీ రహదారులు రద్దీగా ఉండే చోట చెక్‌పోస్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. సిబ్బంది, అనుమతి రావాల్సి ఉంది. ప్రత్యేక భద్రతా దళాలను విడివిడిగా వాడలేం. కేంద్ర ప్రభుత్వ దళాలు కావడంతో పూర్తిగా మన ఆధీనంలోకి తీసుకోలేం. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక పోలీసు బలగాలు రానున్నాయి. తనిఖీలు ముమ్మరం చేస్తాం. ఇప్పటికే మొబైల్ టీంల ద్వారా నిఘా ఏర్పాటుచేశాం.–ఎం.అబ్బయ్య, సీఐ, అశ్వారావుపేట -
మీ కోపాన్ని చూపించొద్దు..! : తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, అశ్వారావుపేటరూరల్: ‘‘నాపై, ఎంపీపై, తాటిపై మీకు కోపమున్నా, దానిని ఇప్పుడు చూపించొద్దు. ఆ కోపతాపాలేవైనా ఉంటే.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం’’ అని, టీఆర్ఎస్ శ్రేణులను ఆ పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నింటా అభివృద్ది చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు దేశంలోని పార్టీలన్నీ ఏకమయ్యాయని, అయినప్పటికీ టీఆర్ఎస్ గెలుపును అవి అడ్డుకోలేవని అన్నారు. మండలంలోని వినాయకపురం గ్రామంలో ఆదివారం పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గడిచిన పదేళ్లుగా మీ మొహాలు చూడని వారిని ఈ ఎన్నికల్లో ఓడించండి. మీ కోసం నేను 32 ఏళ్లు త్యాగం చేశా. నా కోసం మీరంతా తాటి వెంకటేశ్వర్లును ఐదువేల నుంచి పదివేల మెజార్టీతో గెలిపించాలి’’ అని కోరారు. ఎవరెన్ని రాజకీయాలు చేసినప్పటికీ పోడు పట్టాలు ఇప్పించే బాధ్యత తనదేనని అన్నారు. రాష్ట్రంలో కళింగుల జనాభా దాదాపుగా నాలుగులక్షలు ఉందని, అశ్వారావుపేటలోనూ ఉన్నారని అన్నారు. వీరికి సంబంధించిన రిజర్వేషన్ సమస్యను పరిష్కారిస్తామని, ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి, మొట్టమొదటిగా అశ్వారావుపేటలోని వెంకమ్మ చెరువును గోదావరి నీళ్లతో నింపుతామని అన్నారు. దబ్బతోగు, పెదవాగు ప్రాజెక్టులకు నీళ్లు అందిస్తామన్నారు. దురదపాడు ప్రాజెక్టు నిర్మాణం తన బాధ్యతనేనని అన్నారు. అశ్వారావుపేట మీదుగా రావాల్సిన జాతీయ రహదారి రద్దయినట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నేషనల్ హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. భద్రాచలం నుంచి దమ్మపేట, అశ్వారావుపేట మీదుగా దేవరపల్లి వరకు నేషనల్ హైవే నిర్మాణ బాధ్యత కూడా తనదేనన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. టీఆర్ఎస్ పార్టీని గెలలిపించాలని కోరారు. ముందుగా, టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నియోజకవర్గానికి ఎంతో చేశానని అన్నారు. తనను మరోసారి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, ఎంపీపీ బరగడ కృష్ణారావు, జడ్పీటీసీ సభ్యుడు మల్లికార్జున్‌రావు పాల్గొన్నారు. రైతులకు మంచి రోజులు .. దమ్మపేట: టీఆర్ఎస్ పాలనలో రైతులకు మంచి రోజులొచ్చాయని, పంటల సాగు సక్రమంగా సాగిందని తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. మండలంలోని మందలపల్లి సాయికృష్ణ నర్సరీలో ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన పార్టీ సమావేశం జరిగింది. తుమ్మల, పొంగులేటి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నిస్తున్న పార్టీ అభ్యర్థిని ఓడించాలని, టీ ఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లును గెలిపిం చా లని కోరారు. కూటమికి అధికారమిస్తే.. మన కం టిని మనం పొడుచుకున్నట్టే అవుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పానుగంటి సత్యం, డీసీసీబీ డైరెక్టర్ ఆలపాటి రామచంద్రప్రసాద్, పార్టీ నాయకులు తూతా నా గమణి, పైడి వెంకటేశ్వరరావు, దారా యుగంధర్, కోటగిరి పుల్లయ్యబాబు, రావు గంగాధరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, కేవీ సత్యన్నారాయణ, అల్లం వెంకమ్మ, సరోజని, అడపా రాంబాబు, కొయ్యల అచ్యుతరావు, రెడ్డిమళ్ల చిట్టినాయన, దొడ్డా రమేష్, వెంపాటి భరత్ పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
బెట్టింగ్ బంగార్రాజులు
సాక్షి, అశ్వారావుపేట: తెలంగాణ ఎన్నికలనూ బెట్టింగ్ మాఫియా వదల్లేదు. పోలింగ్‌కు ముందే పందేలు కాయడం మొదలు పెట్టారు. సాధారణంగా ఎన్నికల పందేలు పోలింగ్ తర్వాత మొదలవుతాయి. ఈసారి ప్రచారంతోటే ప్రారంభమయ్యాయి. క్రికెట్ బెట్టింగ్, పేకాట, కోడిపందేలు, ప్రో కబడ్డీ బెట్టింగ్‌కు పాల్పడే వారే ఈ దందాలో అధిక శాతం ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏపీలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆనుకుని ఉంది. అక్కడి జూదరులకు ఈ ప్రాంతంతో సంబంధాలు, చుట్టరికాలు, వ్యవసాయ, వ్యాపారాలున్నాయి. దీంతో బెట్టింగ్ వ్యవహారం కూడా పాకింది. ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోకుంటే రేపటి రోజున పందెం దొరకదన్నట్లుగా చెప్పుకుంటున్నారు. పందెం.. పలు రకాలు.. కోడిపందేలు, క్రికెట్ బెట్టింగ్, పేకాట, ప్రో కబడ్డీ మాదిరిగా ఎన్నికల బెట్టింగ్‌లో కూడా పలు రకాలున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ నిర్వాహకుడు, జూదగాళ్ల పరిజ్ఞానాన్ని బట్టి పందేలు కాస్తుంటారు. ఇందుకు ముందస్తు డిపాజిట్‌పై డిస్కౌంట్, స్పాట్ క్యాష్‌పై అడ్వాన్స్ బుకింగ్, క్రెడిట్ బుకింగ్ పై వడ్డీ వంటి సదుపాయాలున్నట్లు సమాచారం. క్రికెట్ బెట్టింగ్ ముఠానే ఈ తంతు నడిపిస్తుండగా.. వారి కస్టమర్లే ఇక్కడా రిపీట్ కావడంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా సాగిపోతోంది. ఓ జూదగాడు రూ.5లక్షలు ముందుగా డిపాజిట్ చేస్తే అతనికి కోరుకున్నట్లుగా పందేలను అవసరమైతే తక్కువ కాన్సిలేషన్ చార్జీతో మార్చుకోవచ్చు. ముందుగా డబ్బులు కట్టలేనోళ్లు వారి పేర్లు నమోదు చేయించుకుంటే(నమ్మకస్తులు మాత్రమేనండోయ్) అప్పటికపుడు డబ్బు చెల్లించి పందెంలో పాల్గొనచ్చు. ఇది ఫలితాల రోజున జాతరలా ఉంటుందని సమాచారం. ఆడి చెడ్డోళ్లుంటారు.. మొదట్లో కారు.. ఓ డ్రైవర్.. క్యాష్ బ్యాగు మోయడానికి, గ్లాసులో మద్యం పోయడానికి ఓ అసిస్టెంట్‌తో బెట్టింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి... సర్వ నాశమయి.. ఎప్పటికైనా తిరిగి మొదటి స్థానానికి చేరుకోలేనా..? అనుకుంటూ అక్కడే ఓకొత్త జూదగాడికి అసిస్టెంట్‌గా పనిచేసే ఆడిచెడ్డోళ్లు. వీరికి మాత్రం డబ్బు కట్టకున్నా.. పరిమితంగా ఆడుకునే అవకాశమిస్తారు. కాకుంటే కాస్త(నూటికి 20శాతం మాత్రమే) వడ్డీ పడుద్ది అంతే. ఫేవరేట్.. తరుగు ఎన్నికల పందేల్లో ఒకరు ఫేవరేట్(గెలిచే అభ్యర్థి).. ఇంకొకరు తరుగు(ఓడే అభ్యర్థి) అని కోడ్ ఉంటుంది. బెట్టింగ్ మాఫియాలో రెండు వర్గాలుగా చీలిపోతారు. ఒకరు ఒకరిని ఫేవరేట్ అంటే మరో వర్గం మరొకరిని ఫేవరేట్ అంటారు. ఫేవరేట్పై పందె కాయాలంటే 30శాతం అదనంగా డిపాజిట్ చేయాలి. ఉదాహరణకు.. అశ్వారావుపేటలో ఎక్స్ అనే అభ్యర్థి ఫేవరేట్ ఉన్నచోట రూ.లక్ష పందెం కాయాలంటే రూ.1.30లక్షలు డిపాజిట్ చేయాలి. ఎక్స్.. గెలిస్తే రూ.లక్ష తిరిగొస్తుంది. రూ.5వేలు కమిషన్ కట్ అవుతుంది. ఓడితే చేతికి పైసా కూడా రాదు. ఇదే మీడియేటర్ దగ్గర ఎక్స్ ప్రత్యర్థిపై పందెం కట్టి, రూ. లక్ష డిపాజిట్ చేస్తే... రూ.1.30లక్షలకు 5శాతం కమీషన్ పోను మిగిలినవి వస్తాయి. ఎక్స్ గెలిస్తే.. ఏమీ రావు. ఫేవరేట్పై సాహసించి పందెం కట్టడమే. తరుగుపైనే పందెం ఎక్కువగా కడతారు. ప్రస్తుతం అశ్వారావుపేటలో ఫేవరేట్.. తరుగు పందాలే ఎక్కువగా సాగుతున్నాయి. మెజారిటీపై కూడా.. గెలుపోటముల సంగతి పక్కన పెడితే ఏ నియోజకవర్గంలో ఏఅభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుందనే పందేలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ గెలుపుతో సంబంధం ఏమాత్రముండదు. కేవలం మెజారిటీదే పాత్ర. వెయ్యి మెజారిటీ దాటదు... పదివేలకు తక్కువ రాదు.. పదీ పదిహేనువేల మధ్యలో వస్తుంది. నాలుగువేలు వస్తుంది కానీ మెజారిటీ ఐదు వేలకు చేరదు(నాలుగుంది గానీ.. ఐదు లేదు..) ఇలా రకరకాల పందేలు కాస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి టీఆర్ఎస్కు ఇన్నొస్తాయి.. ఇన్ని రావు.. కూటమికి ఇన్నొస్తాయి.. ఇన్నిరావు.. ప్రభుత్వం ఈపార్టీ ఏర్పాటు చేస్తుందనీ.. చేయదని.. రాష్ట్ర వ్యాప్తంగా ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు మాత్రమే వస్తాయని.. రావని.. ఫలానా ఫిగర్ దాటుతుందని.. దాటదని.. హంగు ఏర్పాటవుతుందని.. ఏర్పాటు కాదని.. కర్ణాటక లా సీన్ ఏర్పాటయితే ఎవరెవరు పార్టీలు మారతారు..? ఇలా రకరకాలుగా ఆఫర్లున్నాయి. సరిహద్దులో హద్దుమీరిన పందేలు జోరుగా సాగుతున్నాయి. కొందరు ఫేస్ టూ ఫేస్ పందేలు కాసుకుంటుంటే, కొందరు సెల్ఫోన్లో సంభాషిస్తూ బెట్టింగ్‌లు కడుతున్నట్లు తెలుస్తోంది. తక్కువ పందేలు.. రెండు తక్కువ, , మూడు తక్కువ, నాలుగు తక్కువ, ఐదు తక్కువ, ఆరు తక్కువ అంటూ కోడిపందేల్లో బిర్రి బయట అరుస్తుంటారు. ఇదే విధంగా ఎన్నికల్లో కూడా తక్కువ పందేలుంటాయి. రెండు తక్కువ అంటే పందెం కాసిన సొమ్మును రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని తగ్గిస్తారు. ఇలాగే ఏ అంకె పక్కన తక్కువ ఉంటే అన్ని భాగాలు చేసి ఒక భాగాన్ని మినహాయించుకుంటారు. ఈ పద్ధతి ప్రకారం ఉదాహరణకు సత్తుపల్లిలో ఎస్ అనే అభ్యర్థిపై రెండు తక్కువ పందెం ఎక్కువగా ఆఫర్ చేస్తున్నారు. ఎస్పై రూ.లక్ష డిపాజిట్ చేస్తే.. ఆయన గెలిస్తే ఏమీలేదు. ఓడిపోతే రెండు లక్షలకు 5శాతం కమీషన్ కట్ చేసుకుని తిరిగిస్తారు. ఈతరహా పందేలు పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాలపై నడుస్తున్నాయి. మిగిలినవన్నీ ఫేవరేట్.. తరుగు పందాలే నడుస్తున్నట్లు తెలుస్తోంది. సంభాషణ ఇలా ఉంటుంది జూదగాడు.: ఏమండీ.. ఖమ్మం ఫేవరేట్ మీద ఓ లక్ష కట్టండి.. ఫంటర్(నిర్వాహకుడి ఏజెంట్): సరే సార్ మీ డిపాజిట్లో రూ.లక్ష పోగా ఇంకా నాలుగు లక్షలున్నాయి.. గెలుపోటముల తర్వాత.. జూదగాడు: ఏంటి మరి సంగతీ..? ఫంటర్: మీరు ఐదు పందేలు కట్టారు. రెండు పోయాయి. మూడు గెలిచారు. మూడుకు మూడు.. కమీషన్ పోను రెండున్నర లక్షలుంటాయ్. ఆడుకుంటారా.. పంపించాలా..? జూదగాడు: పంపించండి ఫంటర్: మావాడు వచ్చి మీకు ఫోన్ చేస్తాడు. జూదగాడు: సరే ‘ఎమ్’ అందింది. రెండున్నర లక్షలు. ఓకే ఇప్పటికి ఇద్దరి మధ్యా ఏమీ బ్యాలెన్స్ లేదు. ఇలా సంభాషణలే లెక్కలు చెప్పేస్తాయి. ఇలాంటి సంభాషణలకు మాత్రమే ప్రత్యేక ఫోన్లు, సిమ్‌లు మెమరీ కార్డులు వాడుతారు. ఇదీ ఎన్నికల పందేల తంతు. -
ముగ్గురూ పాత ప్రత్యర్థులే..!
సాక్షి, దమ్మపేట: నియోజకవర్గంలో ప్రధాన పక్షాల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటర్లను తమవైపు ఎలా తిప్పుకోవాలి.. వారి నుంచి ఓట్లు ఎలా రాబట్టుకోవాలి.. అని, ఆయా అభ్యర్థులు, నాయకులు వ్యూహ ప్రతివ్యూహాలను పన్నుతున్నారు. ఎలాగైనా అవకాశాన్ని జారవిడుచుకోవద్దనే ధోరణితో విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మహాకూటమి నుంచి టీడీపీ నాయకుడు మెచ్చా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి డాక్టర్ భూక్యా ప్రసాదరావు, సీపీఎం నుంచి తానం రవీందర్ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో శుక్రవారం నుంచి గ్రామాల్లో ప్రచారం వేడి–వేగం పెరిగింది. 2009లో ఏర్పడ్డ అశ్వారావుపేట గిరిజన శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వగ్గెల మిత్రసేన, సీపీఎం అభ్యర్థి పాయం వెంకయ్యపై గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై వైఎస్ఆర్ కాం గ్రెస్ నుంచి తాటి వెంకటేశ్వర్లు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థ్ధిగా పోటీలో ఉన్న డాక్టర్ భూక్యా ప్రసాదరావు ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.ప్రస్తుత ఎన్నికల బరిలో మూడు ప్రధాన పార్టీల నుంచి పాత ప్రత్యర్థులే (మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ భూక్యా ప్రసాదరావు) తలపడుతున్నారు. పోటీ తీవ్రంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మళ్లీ మేమే అంటున్న టీఆర్ఎస్.. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి గెలుపొందిన తాటి వెంకటేశ్వర్లు, ఏడాది లోపే టీఆర్ఎస్లోకి వలస వెళ్లారు. ఈ ఎన్నికల్లోనూ ఆయనే గెలుస్తారని టీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మార్పు తప్పదంటున్న కూటమి కాంగ్రెస్ సీనియర్లను కాదని మహాకూటమి పొత్తుల్లో అనూహ్యంగా టీడీపీ నుంచి మెచ్చా నాగేశ్వరరావు టికెట్ దక్కించుకున్నారు. గత ఎన్ని కల్లో స్వల్ప ఓట్లతో ఓడిన టీడీపీ ఈసారి ఇక్కడ నుంచి గెలుస్తామనే ధీమాతో ఉంది. ఈసారి ప్రజ లు సైతం మార్పును కోరుకుంటున్నారని టీడీపీతోపాటు మహాకూటమి నాయకత్వం భావిస్తోంది. దీనికి తోడు ఇటీవల నియోజకవర్గంలోని నా లుగు మండలాల్లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, టీడీపీల్లోకి వలసలు పెరిగాయని, మహాకూటమి కి ఆదరణ వచ్చిందని, ఈసారి విజయం తమదేనని కూటమి నాయకత్వం ధీమాతో ఉంది. బీజేపీ గాలం.. బీజేపీ వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తోంది. టీఆర్ఎస్, టీడీపీ అభ్యర్థులది ఒకే గిరిజన సామాజిక వర్గం. బీజేపీ అభ్యర్థి భూక్యా ప్రసాదరావుది వేరొక సామాజిక వర్గం. టీఆర్ఎస్, టీడీపీ/కూ టమిలోని తన సామాజిక వర్గం వారంతా తనకే ఓటు వేస్తారని భూక్యా ప్రసాద్ భావిస్తున్నారు. ఆ ఓట్లకు గాలం వేస్తున్నారు. -
ఎస్బీఐ ఖాతా నుంచి రూ.83వేలు స్వాహా
అశ్వారావుపేటరూరల్ : ఎస్బీఐ ఖాతాదారుడి ఖాతా నుంచి 83వేల రూపాయలు అతనికి తెలియకుండానే ఎవరో స్వాహా చేశారు. ఇది మంగళవారం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ సిబ్బందిపై బాధితుడు అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు... పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామానికి చెందిన ఎస్కె.అఫ్జల్, తన భార్య షాహెదాబేగం పేరు మీద అశ్వారావుపేటలోని ఎస్బీఐ బ్రాంచిలో 2012లో సేవింగ్స్ అకౌంట్ తెరిచాడు. అందులో 1.80లక్షల రూపాయల వరకు జమ చేశాడు. తమకు ఏటీఎం అవసరం లేదని అనుకున్నారు. ఏటీఎం కోసం దరఖాస్తు కూడా చేయలేదు. అప్పట్లో పనిచేసిన సిబ్బంది, మరొక ప్రైవేట్ ఉద్యోగి కలిసి, షాహెదాబేగం పేరు మీద ఏటీఎం కార్డు కోసం ఫోర్జరీ సంతకంతో దరఖాస్తు చేశారు. బ్యాంకుకు వచ్చిన ఆ కార్డు ద్వారా అశ్వారావుపేట, కొత్తగూడెంలోని ఎస్బీహెచ్, ఎస్బీఐ ఏటీఎంల ద్వారా 83వేల రూపాయలు స్వాహా చేశారు. రెండు రోజుల క్రితం నగదును డ్రా చేసేందుకు స్థానిక ఎస్బీఐకి వెళ్లిన అఫ్జల్, షాహెదాబేగానికి.. ఖాతా నుంచి 83వేల రూపాయలు డ్రా అయినట్టు తెలిసింది. దీనిపై బ్యాంక్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. కొంత సమయమిస్తే దీనిని పరిష్కరిస్తామని మేనేజర్ చెప్పారు. అప్పట్లో పనిచేసిన మేనేజర్‌కు, సిబ్బందికి ప్రస్తుత మేనేజర్ సమాచారమిచ్చి, ఖాతాదారురాలితో రాజీకి ప్రయత్నించారు. స్వాహా చేసిన నగదుతోపాటు మరికొంత కలిపి ఇస్తామని బేరసారాలకు ప్రయత్నించారు. దీనికి ఖాతాదారురాలు, ఆమె భర్త ఒప్పుకోలేదు. తమ ఖాతా నుంచి డబ్బు ఎలా, ఎవరు డ్రా చేశారో చెప్పాలని నిలదీశారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కార్డును ఇలా పొందారా...! ఎస్బీఐలో ఖాతా తెరిచిన తర్వాత, నిబంధనల ప్రకారంగా ఏటీఎం కోసం ఖాతాదారు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసిన దాదాపు ఇరవై రోజుల్లో పోస్టల్ ద్వారా ఖాతాదారు ఇంటి చిరునామాకు కార్డు వస్తుంది. కానీ, ఈ ఖాతాదారురాలికి ఏటీఎం కార్డు రాలేదు (అసలు వారు దరఖాస్తే చేయలేదు). ఏటీఎం కార్డు వ్యక్తిగత గుర్తింపు సంఖ్య (పిన్).. ఖాతా ఉన్న బ్యాంకుకే వస్తుంది. దీనిని నేరుగా ఖాతాదారుకే బ్యాంక్ సిబ్బంది ఇవ్వాలి. అప్పటి బ్యాంక్ అధికారులు, సిబ్బంది కలిసి ఖాతాదారు ఏటీఎం కార్డును తప్పుడు చిరునామాతో అందుకున్నారు. ఈ వ్యవహారంలో అప్పటి బ్యాంక్ అధికారి, సిబ్బంది హస్తం ఉందన్నది ఆరోపణ. మీడియా ఎదుటే చీటింగ్‌కు యత్నం ఖాతా నుంచి నగదు స్వాహాపై బాధితులు స్థానిక మీడియాను ఆశ్రయించారు. కొందరు పాత్రికేయులు కలిసి ఎస్బీఐ స్థానిక బ్రాంచ్ మేనేజర్‌ను వివరణ కోరారు. ఖాతాదారు అకౌంట్ స్టేట్మెం ట్ ఇవ్వాలని కోరారు. దీనికి ఆయన... ‘‘స్టేట్మెం ట్ ఇవ్వాలంటే దరఖాస్తుపై ఖాతాదారు సంతకం పెట్టాలి’’ అంటూ, ఏటీఎం కార్డు దర ఖాస్తు ఫారం ఇచ్చారు. ‘‘ఇది ఏటీఎం దరఖాస్తు ఫారం కదా..! స్టేట్‌మెంట్‌కూ, దీనికీ సంబంధం ఏమిటి..?’’ అని, ప్రశ్నిస్తే ఆ మేనేజర్ మౌనంగా ఉన్నారు. ‘‘మమ్మల్ని మళ్లీ మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారా..?’’ అంటూ, మేనేజర్‌ను ఖాతాదారురాలు, ఆమె భర్త నిలదీశారు. -
భార్య కాపురానికి రావట్లేదని..
అశ్వరావుపేట(కొత్తగూడెం): భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావట్లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శివరాత్రి నాగరాజు(23)కు ఏడాది క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరగుతుండటంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఎన్ని రోజులైన భార్య కాపురానికి రావట్లేదని మనస్తాపానికి గురైన నాగరాజు కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.