ఖమ్మం: అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసేది కేవలం డబ్బు, మందు ఇంకా అభ్యర్థి స్థానికత. నియోజకవర్గంలో అశ్వారావుపేట, దమ్మపేట మండలాలు అంధ్రా సరిహద్దుల్లో ఉండటంతో ఇక్కడ తెలంగాణా వాదం చాలా తక్కువ. కోయ, లంబాడీల మధ్య ఆధిపత్యపోరు కూడా ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది. నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. ఆంధ్ర అల్లుళ్ళు, ఆంధ్ర కోడళ్ళు వెరసి ఆంధ్ర సాంప్రదాయాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
రికార్డులు పరంగా తప్ప తెలంగాణ వాదం ఎక్కడ మచ్చుకైనా కనిపించదు. నియోజకవర్గం ఏర్పడిన తరువాత జరిగిన మూడు ఎన్నికలలోనూ అంటే 2009, 2014, 2018 ఈ మూడు సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు. 2009లో వగ్గేల మిత్ర సేన కాంగ్రెస్ నుంచి గెలవగా 2014లో తాటి వెంకటేశ్వర్లు వైయస్సార్ కాంగ్రెస్ నుంచి గెలవగా, 2018లో మెచ్చా నాగేశ్వరరావు మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం నుండి పోటీ చేసి గెలిచారు. ఈ గెలుపులో కాంగ్రెస్ కీలక భూమిక పోషించింది.
పార్టీల బలాలు..
నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీల బలాబలాల పరంగా BRS గుర్చి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ గడిచిన మూడు సార్వత్రిక ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలయ్యింది. నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బీఆర్‌ఎస్‌లో చేరడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం కాస్త పెరిగింది. ప్రస్తుత ఎమ్మెల్యే వివాద రహితుడు కావడం, ఇటీవల 100 కోట్ల పైన నియోజకవర్గానికి నిధులు తేవటం కారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఉన్నాయి.
టీడీపీ..
నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకత్వంలో 90 శాతం మంది తుమ్మలతో కలిసి అధికార పార్టీలో చేరిపోవడంతో నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభావం నామ మాత్రమే. కాంగ్రెస్ పొత్తు కుదిరి టిడిపి అభ్యర్థి బరిలో దిగే అవకాశం ఉంది. పొత్తుల్లో గనుక అశ్వరావుపేట సీటు టిడిపికి కేటాయిస్తే గెలిచే అవకాశాలు తక్కువ.
కాంగ్రెస్..
కాంగ్రెస్‌కు ప్రతి మండలంలోనూ బలమైన కేడర్ ఉంది. కాకపోతే ఈ క్యాడర్ మొత్తం కూడా గ్రూపు తగాదాలతో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలో ముగ్గురు ప్రధాన నాయకుల అభ్యర్థులు ఇక్కడ ఉండటంతో వర్గ పోరు ఇబ్బంది పెట్టవచ్చు. కానీ రాబోయే ఎన్నికల్లో తెరాసకు ప్రత్యామ్నాయంగా కనబడుతుంది.
అంతర్గత వర్గపోరు..
సిపిఎంకు బలమైన క్యాడర్ ఉన్న ఓట్లుగా మలుచుకునే సమర్థతను చూపించలేక పోతుంది. దీనికి తోడు అంతర్గత వర్గపోరు కూడా వెంటాడుతుంది. పార్టీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారన్న విమర్శలు సైతం వినబడుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో సీపీఎం పార్టీకి ఆరు వేల ఓట్లు మించకపోవచ్చు.
బీజేపీ వర్గంలో..
కేంద్రంలో అధికారం ఉన్నప్పటికీ నియోజిక వర్గంలో ఒక్క వార్డ్ మెంబర్ కూడా ఎక్కడా గెలువలేదు. ప్రధానంగా అశ్వారావుపేట మండల కేంద్రంలో ఓ మోస్తారు కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. 2018 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అశ్వరావుపేట నుంచి పోటీ చేసిన బిజెపి అభ్యర్థి కంటే నోటా కే ఓట్లు అధికంగా పడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment