సంగారెడ్డి: జిల్లాలో నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ చేరికలపై దృష్టిసారించింది. ఒకవైపు అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగిస్తోంది. మరో వైపు ఆయా నియోజకవర్గాల్లోని ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. సంగారెడ్డి, నారాయణఖేడ్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లోని ముఖ్యమైన నాయకులను చేర్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన పులిమామిడి రాజు.. ఈటల రాజేందర్ సమక్షంలో కమలం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
అలాగే నారాయణఖేడ్ నియోజకవర్గంలోనూ ఓ స్వామిజీని చేర్చుకో వాలని భావిస్తోంది. ఆయనకు ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో భక్తులు ఉన్నారు. బీజేపీలో చేర్చుకోవడం ద్వారా రాజకీయంగా కలిసి వస్తుందనే రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పటాన్‌చెరు నియోజక వర్గానికి చెందిన ఓ కీలక నాయకుడు కూడా చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీ బాగారెడ్డి కుమారుడు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న జైపాల్‌రెడ్డి కొన్ని రోజుల క్రితం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి పార్టీలో చేరారు. ఇటీవల హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి సమక్షంలో జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు మండలస్థాయి నాయకులూ చేరారు.
మురళీయాదవ్ చేరిక తర్వాత మళ్లీ ఇప్పుడు..
రాష్ట్రంలో అధికారమే లక్ష్యమంటున్న కమలం పార్టీ ఆరు నెలల క్రితం నుంచే చేరికలపై దృష్టి సారించింది. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్‌ను చేర్చుకుంది. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలో పెద్దగా చేరికలేవీ జరగలేదు. బీజేపీ ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్ వీటిపై దృష్టి సారించినప్పటికీ, చెప్పుకోదగిన నేతలెవరూ ముందుకురాలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు పార్టీ చేరికలపై నజర్ పెట్టింది. బీఆర్‌ఎస్‌లో టికెట్ ఆశించి భంగపడిన నాయకులను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
చంద్రశేఖర్ వీడాక..
మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారైనట్లు సమాచారం. ఇలా బలమైన ఒకరిద్దరు నాయకులు పార్టీని వీడటంతో నిస్తేజంలో ఉన్న శ్రేణుల్లో.. నూతన చేరికలు కొంత మేరకు ఉత్సాహాన్ని నింపుతాయని అధిష్టానం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment