సంగారెడ్డి: ‘అభ్యర్థిత్వాల విషయంలో పార్టీ నిర్ణయం మారదు. ఈ విషయమై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండవు. అధినేత ప్రకటించిన అభ్యర్థులందరీ గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా కృషి చేయాలి’ అని హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఇటీవల జరిగిన జహీరాబాద్ ముఖ్యనేతల సమావేశంలో గులాబీ పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. ఇందులో ఆయన వ్యాఖ్యలు ఆయా నియోజకవర్గాల్లోని అసంతృప్త నేతలకు కీలక సంకేతాలిచ్చినట్లయింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థిత్వాలు మారవని స్పష్టం చేసినట్లయింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థులను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గత నెల 21న ప్రకటించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం ఉమ్మడి మెదక్ జిల్లాలో సిట్టింగ్‌లందరికీ టికెట్ కేటాయించారు. ఒక్క నర్సాపూర్ నియోజకవర్గానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ ప్రకటనతో జిల్లాలో కొన్ని చోట్ల అసంతృప్తులు బయటపడ్డారు.
పటాన్‌చెరువులో నీలం మధు, సంగారెడ్డిలో పులిమామిడి రాజు, పట్నం మాణిక్యం, జహీరాబాద్‌లో ఢిల్లీ వసంత్ తమ అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. అలాగే నర్సాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అనుచరులు కాస్త హడావుడి చేశారు. ఈ అసంతృప్త నేతల తీరును పార్టీ అధినాయకత్వం నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది. మరోవైపు మంత్రి హరీశ్‌రావు వారిని ఎప్పటికప్పుడూ సముదాయించారు.
ఈ నేపథ్యంలో ఇటీవల జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన అభ్యర్థిత్వాల విషయంలో ఎలాంటి మార్పులుండవని స్పష్టం చేశారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన నాయకులందరినీ రానున్న రోజుల్లో తగిన ప్రాధాన్యం ఉంటుందని, ఆయా నియోజకవర్గాల్లో ఆయా నాయకులకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులతో గౌరవించుకున్న విషయాన్ని గుర్తుచేశారు.
చల్లారుతున్న అసంతృప్తి సెగలు..
అభ్యర్థిత్వాల ప్రకటనతో అక్కడక్కడ బయటపడ్డ అసంతృప్తి సెగలు క్రమంగా చల్లారుతున్నాయి. అభ్యర్థిత్వాలు ప్రకటించిన వెంటనే నాలుగైదు రోజులు తమ అనుచరులతో హడావుడి చేసిన నేతలు కాస్త వెనక్కి తగ్గుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా వీరిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవి ఏ మేరకు ఫలితాలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment