jahirabad
-
TS Elections 2023: అభ్యర్థిత్వాల విషయంలో పార్టీ నిర్ణయం మారదు..!
సంగారెడ్డి: ‘అభ్యర్థిత్వాల విషయంలో పార్టీ నిర్ణయం మారదు. ఈ విషయమై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండవు. అధినేత ప్రకటించిన అభ్యర్థులందరీ గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా కృషి చేయాలి’ అని హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఇటీవల జరిగిన జహీరాబాద్ ముఖ్యనేతల సమావేశంలో గులాబీ పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. ఇందులో ఆయన వ్యాఖ్యలు ఆయా నియోజకవర్గాల్లోని అసంతృప్త నేతలకు కీలక సంకేతాలిచ్చినట్లయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థిత్వాలు మారవని స్పష్టం చేసినట్లయింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత నెల 21న ప్రకటించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం ఉమ్మడి మెదక్ జిల్లాలో సిట్టింగ్‌లందరికీ టికెట్ కేటాయించారు. ఒక్క నర్సాపూర్ నియోజకవర్గానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ ప్రకటనతో జిల్లాలో కొన్ని చోట్ల అసంతృప్తులు బయటపడ్డారు. పటాన్‌చెరువులో నీలం మధు, సంగారెడ్డిలో పులిమామిడి రాజు, పట్నం మాణిక్యం, జహీరాబాద్‌లో ఢిల్లీ వసంత్ తమ అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. అలాగే నర్సాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అనుచరులు కాస్త హడావుడి చేశారు. ఈ అసంతృప్త నేతల తీరును పార్టీ అధినాయకత్వం నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది. మరోవైపు మంత్రి హరీశ్‌రావు వారిని ఎప్పటికప్పుడూ సముదాయించారు. ఈ నేపథ్యంలో ఇటీవల జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన అభ్యర్థిత్వాల విషయంలో ఎలాంటి మార్పులుండవని స్పష్టం చేశారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన నాయకులందరినీ రానున్న రోజుల్లో తగిన ప్రాధాన్యం ఉంటుందని, ఆయా నియోజకవర్గాల్లో ఆయా నాయకులకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులతో గౌరవించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. చల్లారుతున్న అసంతృప్తి సెగలు.. అభ్యర్థిత్వాల ప్రకటనతో అక్కడక్కడ బయటపడ్డ అసంతృప్తి సెగలు క్రమంగా చల్లారుతున్నాయి. అభ్యర్థిత్వాలు ప్రకటించిన వెంటనే నాలుగైదు రోజులు తమ అనుచరులతో హడావుడి చేసిన నేతలు కాస్త వెనక్కి తగ్గుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా వీరిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవి ఏ మేరకు ఫలితాలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. -
ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకున్న 'తెలుగు మహిళ'
ఆమె చదువుకోలేదు. కానీ నేల గొప్పతనం తెలుసు. విత్తనం విలువ తెలుసు. ప్రకృతిని కాపాడాలంటే ఏ పద్ధతిలో సాగు చెయ్యాలో తెలుసు. ఆమె మారుమూల పల్లెకు చెందిన సామాన్యురాలు. కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా.... 30 రకాల చిరుధాన్యాల పంటలు పండించి 'విత్తన సంరక్షణ' నిధిని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రశంసలు పొందిన ఆమె మన తెలుగు మహిళ....నడిమిదొడ్డి అంజమ్మ. జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా విత్తనాల విప్లవంలో ఆమె చేసిన కృషిపై సాక్షి ప్రత్యేక కథనం. అంజమ్మ సొంత ఊరు సంగారెడ్డి జిల్లా గంగ్వార్, అది తెలంగాణ , కర్ణాటకలోని ఒక సరిహద్దు ప్రాంతం. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఆమె బడి ముఖమైనా చూడలేదు. పదేళ్ళ వయసులోనే.. సమీపంలోని గంగ్వార్ కు చెందిన సంగప్పతో వివాహం జరిగింది. ''అప్పట్లో మాకు రెండు పూటలా భోజనం చేసే పరిస్థితి కూడా లేదు. వ్యవసాయ కూలీగా. జీవితాన్ని మొదలుపెట్టాను" అంటూ నాటి రోజులను గుర్తు చేసుకుంటు, క్రమ క్రమంగా ఒక అర ఎకరం భూమిని ఆ దంపతులు సమకూర్చుకున్నారు. సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం ప్రారంభించారు. అదే సమయంలో... ఆ ప్రాంతంలో సేంద్రియ విధానంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి జహీరాబాద్ ప్రాంతంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) కార్యక్రమాలు చేపట్టింది. అ సొసైటీలో అంజమ్మ సభ్యురాలుగా చేరింది. డీడీఎస్ సహకారంతో తన పొలంలో చిరుదాన్యాలు సాగు చేసింది. అర ఎకరం నుంచి పది ఎకరాల భూమికి.. కొత్త మెళకువలను తెలుసుకుంటూ, వివిధ రకాల పంటలు వేసింది. ఆమె శ్రమ మంచి ఫలితాలను ఇచ్చింది. ముప్పై ఏళ్ళ కాలంలో అర ఎకరం నుంచి పది ఎకరాల భూమికి యజమానురాలుగా చేరుకున్నారు. వాయిస్ ఓవర్ : నూనె గింజలు, పప్పు దినుసులు, రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు. తదితర చిరుధాన్యాలు పండించారు. ఇప్పటి వరకూ 80 రకాల చిరుధాన్యాలతో విత్తన సంపదను సృష్టించారు. ఈ విత్తన సంరక్షణ నిధిలోని విత్తనాలను ఆమె ఎవరికి విక్రయించరు. అవసరమయ్యే రైతులకు ఉచితంగా ఇస్తారు, వారికి దిగుబడి వచ్చాక రెట్టింపు విత్తనాలు తీసుకొని మళ్ళీ భద్రపరుస్తారు. స్థానిక వాతావరణానికి అనుగుణంగా వివిధ రకాలను పండిస్తున్న అంజమ్మను మొక్కల జీవ వైవిధ్యం. పరిరక్షకురాలుగా 2019లో కేంద్ర ప్రభుత్వం అవార్డు తో సత్కరించింది. ఆమెకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. విత్తన సంరక్షకురాలుగా ఖ్యాతి పొందిన అంజమ్మ నాగాలాండ్, బీహార్, మేఘాలయ, ఒడిశా, అసోంతో సహా 22 రాష్ట్రాల్లో పర్యటిం చారు. విత్తన సంరక్షణ, సేంద్రియ ఎరువులు తయారీ, మహిళా సంఘాల నిర్వహణ తదితర అంశాల్లో తన అనుభవాలను అక్కడివారితో పంచుకున్నారు. అంజమ్మ విత్తన సంరక్షకురాలు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆహార, వ్యవసాయ విభాగం ప్రపంచస్థాయిలో చిరుధాన్యాల రైతులపై అధ్యయనం చేపట్టింది. చిరుధాన్యాలు పండించడం, విత్తనాలను అందజేయడం ద్వారా వాటి సాగును ప్రోత్సహించడంలో అంజమ్మ కృషిని ఆ విభాగం గుర్తించి, ప్రశంసలు అందించింది. ఒక సాధారణ మహిళ అంతర్జాతీయ స్థాయిలో పొందిన ఈ గుర్తింపు జాయిరాబాద్ ప్రాంతానికి గర్వకారణమని పలువురు ప్రముఖులు ఆమెను అభినందిస్తున్నారు. డీడీఎస్ డైరెక్టర్‌గా ఈ మధ్య వరకూ పనిచేసిన.. దివంగతులైన సతీష్ గారి సలహాలు, సూచనలు నన్ను ముందుకు నడిపించాయి. చిరుదాన్యాలను పండిస్తే మనకు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. పశువులకు, పక్షులకూ కూడా ఇవి మేలు చేస్తాయి అని చెబుతోంది 63 ఏళ్ళ అంజమ్మ . ఇక అంజమ్మ అటు విత్తన సంరక్షణ చేస్తూనే .. రాజకీయాల్లో కూడా రాణిస్తోంది . స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలుపొంది, ప్రస్తుతం న్యాలకల్ మండల పరిషత్ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. (చదవండి: సంక్షోభం నేర్పిన పాఠం! నగరాల్లోకి 'పెరటి తోటలొచ్చాయ్'!) -
రక్షణ రంగ హబ్‌గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: డజనుకు పైగా డీఆర్డీవో పరిశోధన సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలతో హైదరాబాద్ రక్షణ రంగ హబ్‌గా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. దేశంలోనే తొలి ‘సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రం’ఏర్పాటుకు సంబంధించి వీఈఎం(వెమ్) టెక్నాలజీస్ కంపెనీకి, తెలంగాణ ప్రభుత్వానికీ మధ్య ఆదివారం ఒప్పందం కుదిరింది. జహీరాబాద్ సమీపంలోని ఎల్గోయి వద్ద దాదాపు 511 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్ వంటి విమాన, రక్షణ రంగ విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో వేయికి పైగా లఘు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు (ఎస్ఎంఎస్ఈ) ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మౌళిక వసతులతో పలు ఎంఎస్ఎంఈలు పెద్ద కంపెనీలుగా ఎదిగిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్ని సైద్ధాంతిక విభేదాలున్నా రక్షణ రంగం లేదా పెట్టుబడులకు సంబంధించిన అంశాల్లో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలని, దేశాభివృద్ధికి ఇది కీలకమని స్పష్టం చేశారు. రక్షణ రంగంలో అతి కీలకమైన ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మెగాప్రాజెక్టు హోదా కల్పించడమే కాకుండా, అన్ని రకాల సహకారం అందిస్తోందని అన్నారు. క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసేందుకు అనువుగా ఉన్న ఈ కేంద్రం కోసం వెమ్ టెక్నాలజీస్ రూ.వెయ్యికోట్ల పెట్టుబడి పెట్టనుందని, రెండు వేల కంటే ఎక్కుమందికి ఉపాధి అవకాశం కల్పించనుందని తెలిపారు. వెమ్ టెక్నాలజీస్ కంపెనీ భారతదేశ లాక్‌హీడ్ మార్టిన్ (అమెరికాలో అతిపెద్ద రక్షణ రంగ తయారీ సంస్థ) అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదని మంత్రి కొనియాడారు. లక్ష కోట్ల రూపాయలకుపైబడే: సతీశ్ రెడ్డి రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్ చాలాకాలం కేంద్రంగా ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా వీటికి మరింత ఊతం లభించిందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. ఆకాశ్, ఎంఆర్ సామ్ వంటి అనేక క్షిపణులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని వేర్వేరు కేంద్రాల్లో తయారవుతున్నాయని, వీటన్నింటి విలువ లక్ష కోట్ల రూపాయలకుపైబడే ఉంటుందని తెలిపారు. వెమ్ టెక్నాలజీస్ కొత్తగా ఏర్పాటు చేయనున్న సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రంలో ఎగుమతుల కోసం ప్రత్యేక విభాగం ఉండటం హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ వీకే సారస్వత్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధవిమానం తయారు చేయడమే లక్ష్యం: వెంకట్ రాజు కూకట్‌పల్లిలోని ఓ చిన్న ఇంటిలో 1988లో మొదలైన వెమ్ టెక్నాలజీస్ ఈ 33 ఏళ్లలో ‘‘అసిబల్’’పేరుతో సొంతంగా ఓ క్షిపణిని తయారు చేసే స్థాయికి ఎదిగిందని వెమ్ టెక్నాలజీస్ అధ్యక్షుడు వెంకట్ రాజు అన్నారు. భారత్‌లో 2029 కల్లా ఒక యుద్ధ విమానాన్ని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. వాషింగ్ మెషీన్ల టైమర్లతో మొదలుపెట్టి.. ఒక క్రమపద్ధతిలో రక్షణ రంగంలోని వేర్వేరు విభాగాలకు చెందిన విడిభాగాలను తయారు చేయడం మొదలుపెట్టామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు ఉండగా.. జహీరాబాద్ సమీపంలోని యల్గోయి వద్ద సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. యుద్ధవిమానం తయారీ కోసం ప్రత్యేకంగా ఒక ఇంజనీరింగ్ కేంద్రం అవసరమని, ఐదువేల మంది ఇంజనీర్లతో దీన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టామని ఆయన ‘‘సాక్షి’’కి వివరించారు. -
దేవుడే డాక్టరై వచ్చాడు..
జహీరాబాద్: ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం పీహెచ్‌సీకి వచ్చింది. అక్కడ డాక్టర్ లేకపోవడంతో ఏరియా ఆస్పత్రికి తరలించమని సిబ్బంది సలహా ఇచ్చారు. ఈలోగానే ఆ మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆ దారిన వెళ్తున్న ఓ వైద్యుడు పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేకాపూర్ తండాకు చెందిన మంజూబాయి ప్రసవం కోసం ఆదివారం మధ్యాహ్నం మల్చల్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఆస్పత్రిలో వైద్యుడి పోస్టు ఖాళీగా ఉంది. అక్కడ ఉన్న ఏఎన్ఎంలు వివరాలు తెలుసుకుని జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆటో మాట్లాడి ఆమెను తీసుకెళ్లే క్రమంలోనే పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో అందరూ ఆందోళన చెందారు. అయితే అదే సమయంలో, ప్రస్తుతం వరంగల్ జోనల్ మలేరియా ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సునీల్ వ్యక్తిగత పనిపై అటు వైపు వచ్చారు. అందరూ గుమిగూడటం చూసి విషయం ఆరా తీశారు. వెంటనే ఆస్పత్రి ఆవరణలో ఏఎన్ఎంలతో కలిసి పురుడు పోశారు. అనంతరం తల్లీ బిడ్డలకు పీహెచ్సీలో వైద్యం అందించారు. మాతృదినోత్సవం రోజున మంజూబాయి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డకు ప్రాణం పోసిన వైద్యుడు సునీల్‌ని పలువురు ప్రశంసించారు. చదవండి: మీ సేవకు సలాం: కరోనా బాధితులకు కొండంత భరోసా -
ఇది 1950లో వచ్చిన చార్ అణా!
జహీరాబాద్: 1950లో 1/4 నాణెం (చార్ అణా) మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నాణేన్ని మార్కెట్లోకి విడుదల చేశారని, ప్రస్తుతం ఈ నాణేనికి 70 ఏళ్లు నిండాయని దీన్ని సేకరించిన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన సంతోష్ కైలాశ్ చెబుతున్నాడు. ఇదే తరువాత కాలంలో పావలా (25 పైసలు)గా రూపాంతరం చెందిందట. ఈయనకు అరుదైన నోట్లు, నాణేలు సేకరించడం హాబీ. చదవండి: సికింద్రాబాద్ ఓ మంచి జ్ఞాపకం.. -
దక్షిణ మధ్య రైల్వే: జహీరాబాద్ టు త్రిపుర!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే తొలిసారి 3,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈశాన్య రాష్ట్రానికి వాణిజ్య రవాణా వాహనాలను తరలించి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు అంతదూరంలోని ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణా చేయలేదు. దేశవ్యాప్తంగా సరుకు రవాణాను మరింత పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యేకంగా బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్లను ప్రారంభించి కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే జహీరాబాద్‌లో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమల నుంచి తాజాగా మినీ ట్రక్కులు, గూడ్స్ ఆటోలతో కూడిన లోడ్‌ను ఓ ఫ్రైట్ రేక్ ఈశాన్య రాష్ట్రంలోని త్రిపురకు రవాణా చేసింది. రోడ్ ట్రాన్స్‌పోర్టుపై భారం తగ్గింపు దూర ప్రాంతాలకు ఇప్పటివరకు వాణిజ్యపరంగా సరుకు రవాణా రోడ్డు మార్గం ద్వారానే ఎక్కువగా సాగుతోంది. దీన్ని నియంత్రించటం ద్వారా రోడ్డు రవాణాపై భారాన్ని తగ్గించటంతో పాటు రైలు రవాణాకు లాభాలు పెంచే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రైల్వేకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ల (బీడీయూ)ను ఏర్పాటు చేసుకుంది. ఆ యూనిట్లు పరిశ్రమలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ బిజినెస్ ఆర్డర్లు తెస్తున్నాయి. తాజాగా జహీరాబాద్‌లో ఉన్న ఆటోమొబైల్ యూనిట్లపై దృష్టి సారించాయి. ఇక్కడ పెద్ద ఎత్తున వాణిజ్య వాహనాలు ఉత్పత్తవుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలుతున్నాయి. వాటిని దేశంలో ఏ ప్రాంతానికైనా తరలించేందుకు ప్రత్యేక రేక్స్ ఏర్పాటు చేస్తామన్న హామీతో ఆయా యూనిట్లు రైల్వేకు ఆర్డర్లు ఇస్తున్నాయి. వసతులు కల్పించడంతో.. జహీరాబాద్‌లోని గూడ్స్ స్టేషన్‌ను ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి చేసింది. ఇక్కడ సరైన వసతులు లేక గతేడాది అతికష్టం మీద ఒకే ఒక రేక్ (ఒక గూడ్స్ రైలు) మాత్రమే లోడైంది. ఇటీవల వసతులు కల్పించటంతో గత ఏప్రిల్ నుంచి ఏకంగా 9 రేక్స్‌ల ద్వారా జహీరాబాద్ నుంచి 2,500 కి.మీ. దూరంలో ఉన్న అస్సాంలోని ఛాంగ్సరీకి వాణిజ్య వాహనాలను తరలించింది. అయితే అంతకంటే 1,100 కి.మీ. దూరంలో ఉన్న త్రిపురలోని జిరానియాకు వాహనాలు తరలించాలని ఆ కంపెనీ కోరింది. అంతదూరం తరలించే అనుమతి లేకపోవటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా అనుమతి తీసుకుని తాజాగా ఓ రేక్ ద్వారా వాణిజ్య వాహనాలను తరలించటం విశేషం. ఇందులో త్రిపురలోని జిరానియా స్టేషన్‌కు 69 మినీ ట్రక్కులు, గూడ్సు ఆటోలతో కూడిన 15 వ్యాగన్లు, అస్సాంలోని ఛాంగ్సరీకి 42 వాహనాలతో కూడిన 10 వ్యాగన్లు కలిపి ఓ రేక్‌ను దక్షిణ మధ్య రైల్వే తరలించింది. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో తొలిసారి 3,600 కి.మీ. దూరంలో ఉన్న స్టేషన్‌కు వాహనాలను తరలించి రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన సికింద్రాబాద్ డివిజన్ అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఆర్డర్లు అధికంగా పొందాలని సూచించారు. -
జహీరాబాద్‌లో 19 మందికి కరోనా
-
కాంగ్రెస్ తరపు నుంచి ఆ ఇద్దరే..
అందరూ అనుకున్నట్లుగానే ఆ ఇద్దరినే కాంగ్రెస్ అధిష్టానం మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులుగా ఖరారు చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం అర్థరాత్రి వరకు మంతనాలు జరిపి విడుదల చేసిన ఎనిమిది మందితో కూడిన మొదటి జాబితాలో ఉమ్మడి జిల్లాలోని మెదక్ లోక్‌సభ స్థానానికి గాలి అనిల్‌కుమార్, జహీరాబాద్ నుంచి మదన్మోహన్రావు స్థానం దక్కించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సీనియర్ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి, వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు నామినేషన్ వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. సాక్షి, సిద్దిపేట: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు గాలి అనిల్‌కుమార్‌కు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మెదక్ లోక్‌సభ టికెట్ ఇస్తామని చెప్పినట్లుగానే ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ గ్రామానికి చెందిన గాలి అనిల్‌కుమార్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆపార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేశారు. 2014, 2018 సార్వత్రిక ఎన్నికల్లో పటాన్చెరు నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనకు అప్పటికప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేమని, లోక్‌సభ టికెట్ ఇస్తామని టీపీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్ ఇతర కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. మెదక్ లోక్‌సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ విజయశాంతి, గతంలో పోటీ చేసిన శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి పోటీలో ఉంటారని భావించినా వారు సుముఖత చూపలేదు. చివరకు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి భార్య నిర్మలారెడ్డి, గాలి అనిల్‌కుమార్ మాత్రమే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గాలి అనిల్‌కుమార్‌కే టికెట్ ఇవ్వాలని విజయశాంతితోపాటు, ఇతర నాయకులు ఏఐసీసీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. దీనికి తోడు జగ్గారెడ్డి కూడా అనిల్‌కు టికెట్ ఇస్తే తాము పోటీ నుంచి తప్పుకుంటామని అంగీకరించినట్లు సమాచారం. ఎట్టకేలకు జహీరాబాద్‌లో.. జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్మోహన్రావును ప్రకటించారు. కామారెడ్డికి చెందిన ఆయన ప్రవాస భారతీ యుడు. ఎమ్మెస్సీ చదివి, విదేశాల్లో 17 ఏళ్లు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. 2008లో స్వదేశానికి తిరిగి వచ్చిన మదన్మోహన్రావు అప్పటి నుంచి టీడీపీలో కీలక నాయకుడిగా పనిచేశారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు సమీప బంధువైన ఈయన పలుమార్లు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశించారు. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా 2009లో జహీరాబాద్ లోక్‌సభ నుంచి టీడీపీని టికెట్ ఇవ్వమని కోరారు. అప్పుడు సయ్యద్ యూసూఫ్ అలీకి పొత్తులో భాగంగా సీటు కేటాయించారు. అనంతరం 2014లో జరిగి ఎన్నికల్లో పోటీ చేసిన మదన్మోహన్రావు 1,57,497 ఓట్లు తెచ్చుకున్నారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరిన ఈయన తిరిగి జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం ఈసారి ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది. నియోజకవర్గ పెద్దలతో సమావేశం టికెట్లు కేటాయించిన నేపథ్యంలో మెదక్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, జహీరాబాద్ అభ్యర్థి మదన్మోహన్రావు శనివారం నుంచే తమ కార్యకలాపాలను మొదలు పెట్టారు. ఈ ఇద్దరు తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్న శాసనసభా నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, ఇంతకు ముందు పోటీ చేసిన వారు, సీనియర్ నాయకులకు ఫోన్‌చేసి తమకు సహకరించాలని కోరినట్లు సమాచారం. అదేవిధంగా టికెట్ వచ్చిందని తెలియగానే ఇరువురి కార్యాలయాల వద్దకు కార్యకర్తలు రావడంతో అంతా బిజీబిజీగా మారారు. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను కలుపుకొని సీనియర్ నాయకులు, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు నామినేషన్లు వేస్తామని, ఇందుకుగాను అందరిని సమీకరించే పనిలో నాయకులు నిమగ్నమయ్యారని తెలుస్తోంది. -
‘పుట్టగతులుండవనే భయం వారిది’
సాక్షి, జహీరాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, సంక్షేమ కార్యక్రమాలతో ప్రతిపక్షాల్లో పుట్టగతులుండవనే భయం ఏర్పడిందని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం జహీరాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఒక దద్దమ్మ అంటూ విమర్శించారు. బాధ్యతతోనే తాను విమర్శిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు కాగితాలమీద ప్రాజెక్టులు రూపొందించారని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న నీటిని వాడుకోవాలన్న ప్రయత్నం జరగలేదన్నారు. తాము జల నిపుణులతో పూర్తి స్థాయి పథకాలు రూపొందించామని తెలిపారు. నీళ్ల మీద చర్చ జరగకుండానే అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాలు పారిపోయాయని, ఉద్యమం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి పదవుల్లో హాయిగా సేద తీరారని మండిపడ్డారు. ఉద్యమం జరుగుతున్న సమయంలో 400 మందిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల హెలిప్యాడ్ల వద్ద ఉన్న జనాలు వారి సభలో లేరని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ల విషయం ఇతర పథకాల గురించి ఎన్ని సార్లు కేంద్రానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. 19 రాష్ట్రాల్లో 1000 రూపాయల పింఛన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీకి అది కనపడటం లేదా?.. కంటి వెలుగులో మోదీ పరీక్షలు చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. అన్ని పార్టీల చరిత్ర మీకు తెలుసు : కేసీఆర్ నారాయణఖేడ్ : ఓటర్లు కన్ఫూజన్లో లేరని, క్లారిటీతో ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల చరిత్ర వారికి తెలుసునని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం నారాయణఖేడ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. నారాయణఖేడ్‌లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత మంచి అభివృద్ధి జరిగిందన్నారు. ఎవరి ప్రభుత్వంలో కరెంట్ సమస్యలు లేవో ప్రజలు ఆలోచన చేయాలని, లేకపోతే చీకట్లో ఉండిపోతామని హెచ్చరించారు. నేడు 24 గంటల కరెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్ తానే కట్టానంటాడు.. మరి అప్పట్లో విద్యుత్ నిరంతరం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కబ్జాలు, గూండాయిజం తమ హయాంలో లేవని స్పష్టం చేశారు. పరిణితి గల ప్రజాస్వామ్య ఎన్నికల్లో అంతిమంగా ప్రజలే గెలవాలని కోరారు. మా బాసులు ఢిల్లీలో లేరు : కేసీఆర్ అంధోల్ : తెలంగాణ ప్రజలే తమకు బాసులని, తమ బాసులు ఢిల్లీలో లేరని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం అంధోల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. పనులు చేసేవాళ్లకే ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. అవినీతిని అరికట్టి.. పెంచిన సంపదను ప్రజలకు పంచిపెడుతున్నామని తెలిపారు. నాణ్యమైన విద్య అందే ఏర్పాట్లు చేశామన్నారు. అంధోల్‌లో లక్ష ఎకరాలకు నీరందిస్తామని చెప్పారు. సంపదను పెంచుకుంటున్న తెలంగాణ మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంధోల్ టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ లక్ష మెజార్టీతో గెలవటం ఖాయమని.. లక్ష ఓట్ల మెజార్టీ భారం కూడా భుజాలపై పడుతుందన్నారు. క్రాంతి అన్నింటికి సిద్దంగా ఉండాలని సూచించారు. తొలిసారి ఈ గడ్డ బిడ్డ ఎమ్మెల్యే అవుతున్నాడని అన్నారు . -
కేసీఆర్ లాగు తొడగక ముందే..
సాక్షి, సంగారెడ్డి : కేసీఆర్ లాగు తొడగక ముందే గీతారెడ్డి తల్లి ఈశ్వరీ బాయి తెలంగాణ కోసం కంకణం కట్టుకుని పోరాటం చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గీతారెడ్డికి మద్దతుగా శనివారం జహీరాబాద్‌లో జరిగిన బైక్‌ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని అన్నారు. ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా మరోసారి ఎగరాలని.. గీతారెడ్డి గెలిస్తే రాష్ట్రంలో కీలక పదవిలో ఉంటారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు కాపల కుక్కల ఉంటూ.. దళితున్ని సీఎం చేస్తానన్న దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడని మండిపడ్డారు. త్యాగమంటే ఎంటో సోనియా గాంధీని చూసి నేర్చుకోవాలని హితవుపలికారు. అక్కడ మోదీ, ఇక్కడ కేడీలు ప్రజలను దోచుకుంటున్నారని రేవంత్ విమర్శించారు. మోదీ మెడలు వంచి జోనల్ వ్యవస్థను తీసుకువచ్చానని చెప్పున కేసీఆర్.. రిజర్వేషన్లు ఎందుకు తీసుకురాలేకపోయ్యారని ప్రశ్నించారు. -
జీవితంపై విరక్తి చెంది..
కోహీర్(జహీరాబాద్) : ఉరి వేసుకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మద్రి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకొంది. ఏఎస్ఐ సంగమేశ్వర్ అందించిన సమాచారం ప్రకారం మద్రి గ్రామ నివాసి గంగపురం శివాజీ (25) ఇంట్లో ఎవరూలేని సమయంలో దూలానికి ఉరివేసుకొని మృతిచెందాడు. శివాజీ అనారోగ్యంతో బాధ పడుతున్నాడని దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి తల్లి తుక్కమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ సంగమేశ్వర్ వివరించారు. -
వందశాతం సాధించాలి
జహీరాబాద్ : మరుగుదొడ్ల నిర్మాణంలో లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం సాయంత్రం స్థానిక షెట్కార్ ఫంక్షన్ హాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఇతర జిల్లాలతో పోల్చితే మన జిల్లా వెనుకబడి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చొరవ తీసుకుని లక్ష్యాలను సాధించేలా శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకునేలా చూడాలన్నారు. మరుగుదొడ్లు లేని మహిళలు బహిర్భూమికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిని చైతన్య పర్చి మరుగుదొడ్లను నిర్మించుకునేలా చూడాలని అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్నారు. మరుగుదొడ్లకు సంబంధించి నిర్మించుకున్న వారికి వెంటనే బిల్లులను చెల్లించడం జరుగుతుందన్నారు. ఇందుకు అవసరమైన నిధులు ఉన్నాయన్నారు. లక్ష్యాన్ని పూర్తి చేయించడంకోసం సర్పంచ్‌లు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఇతర మండలాలతో పోల్చితే జహీరాబాద్ మండలం మరుగుదొడ్ల నిర్మాణంలో వెనుకబడి ఉందన్నారు. వందశాతం మరుగుదొడ్లను సాధించి జిల్లాను అగ్రగామిగా నిలిపేలా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకుని లక్ష్యం పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఇందుకు సినీ నిర్మాత ఎం.శివకుమార్ ముందుకు వచ్చి ఈదులపల్లి, మేదపల్లి గ్రామాలను దత్తత తీసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎం.డీ.ఫరీదుద్దీన్, ఆర్డీఓ అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ ఎం.వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ డి.లక్ష్మారెడ్డి, ఆత్మ చైర్మన్ పి.రామకృష్ణారెడ్డి, ఎంపీపీలు చిరంజీవి ప్రసాద్, అనిత, పీఏసీఎస్ చైర్మన్ పి.సంజీవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎం.శివకుమార్, కె.మాణిక్‌రావు, ఎంపీడీఓలు రాములు, లక్ష్మీబాయి, ఎల్లయ్య, ఈఓపీఆర్డీలు శ్రీనివాస్‌రెడ్డి, సుమతి, సాయిబాబా, యాదయ్య, మహిళా సంఘాల సభ్యులు, ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. గ్రామాలను దత్తత తీసుకోవాలి : ఎమ్మెల్సీ ఫరీదుద్ధీన్ వందశాతం మరుగుదొడ్ల లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రజా ప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకోవాలని ఎమ్మెల్సీ ఎం.డీ.ఫరీదుద్ధీన్ కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వీలుగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కూడా పాటు పడాలన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ సమావేశాలను నిర్వహించినట్లయితే లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో అందుకోవచ్చన్నారు. అభివృద్ధి పనులపై సమీక్ష... జహీరాబాద్ : జహీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎం.డీ.ఫరీదుద్దీన్‌తో కలిసి మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, విద్యుత్ శాఖ పనుల ప్రగతిని గురించి ఆయా శాఖల అధికారులతో సమావేశమై చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎం.డీ.ఫరీదుద్ధీన్, ఆర్డీఓ అబ్దుల్ హమీద్, మార్కెట్ చైర్మన్ డి.లక్ష్మారెడ్డి, ఆత్మ చైర్మన్ పి.రామకృష్ణారెడ్డి, ఎంపీపీ చిరంజీవి ప్రసాద్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నిమ్జ్‌లో ‘మౌలిక వసతుల పరికరాల’ పార్కు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ‘మౌలిక సదుపాయాల యంత్ర పరికరాల తయారీ పార్కు (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్ మెంట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పార్క్)’ ఏర్పాటు కానుంది. జహీరాబాద్‌లోని ‘నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)’లో 500 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, గనుల తవ్వకాల్లో ఉపయోగించే యంత్ర పరికరాలు తయారుకానున్నాయి. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బుధవారం బెంగళూరులో శ్రేయీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫైనాన్స్ లిమిటెడ్ అనుబంధ కంపెనీ అట్టివో ఎకనామిక్ జోన్స్ ప్రైవేటు లిమిటెడ్–ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. 10 వేల మందికి ఉద్యోగాలు.. మౌలిక సదుపాయాల యంత్ర పరికరాల రంగంలో పేరొందిన సంస్థలు ఈ పార్కులో యూనిట్లు ఏర్పాటు చేస్తాయని ఒప్పందం సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. భూసేకరణ పూర్తయిందని, త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పార్కు ద్వారా వచ్చే పదేళ్లలో 10 వేల ఉద్యోగాలు లభిస్తాయ ని తెలిపారు. ఈ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని, మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి తరలివస్తాయని అన్నారు. రెండున్నర దశాబ్దాలుగా తమ కంపెనీ మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెడుతోందని శ్రేయీ ఇన్ఫ్రాస్టక్చర్ సంస్థ ఉపాధ్యక్షుడు సునీల్ కనోరియా చెప్పారు. మౌలిక రంగంలో కీలక సంస్థ ‘శ్రేయీ’: దేశంలోని అతిపెద్ద సమగ్ర మౌలిక సదుపాయాల రంగ సంస్థల్లో శ్రేయీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ ఒకటి. 1989లో ఈ కంపెనీ ప్రారంభమైంది. మౌలి క సదుపాయాల రంగంలో పెట్టుబ డులకు అవకాశాలు లేని పరిస్థితిలో.. వినూత్న పరిష్కారాలతో మార్కెట్లో సుస్థిర స్థానాన్ని సాధించింది. ప్రస్తుతం వేల కోట్ల రూపాయల సంస్థగా ఎదిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్, అడ్వైజరీ అండ్ డెవలప్ మెంట్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సేవలను ఈ సంస్థ అందిస్తోంది. పరిశ్రమల స్థాపనకు ఎంతో అనుకూలం విప్లవాత్మక సంస్కరణలు, పారిశ్రామిక విధానాలతో తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోందని.. పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం ఎంతో అనుకూలమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం బెంగళూరులో మౌలిక వసతుల యంత్ర పరికరాల ఉత్పత్తిదారులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం జరిగిన ఎక్స్‌కాన్ ఎక్స్‌పోలో ‘నెక్ట్స్‌జెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’అంశంపై ప్రసంగించారు. మౌలిక వసతుల కల్పన ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, మిషన్ భగీరథ ప్రారంభించారన్నారు. తెలంగాణలో మౌలిక వసతుల యంత్రాల తయారీ చేపట్టాలని కోరారు. పెట్టుబడులు పెట్టండి: కేటీఆర్ సాక్షి, న్యూఢిల్లీ: వృద్ధి రేటులో దేశంలోనే మెరుగైన స్థానంలో ఉన్న తెలంగాణలో పెట్టుబడుల స్థాపనకు ముందుకురావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ఢిల్లీలో జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ చైర్మన్, సీఈవో జాన్ ప్లానరీ, వాన్చూ సంస్థ అధ్యక్షుడు, సీఈవో విశాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడుల స్థాపనకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వారికి వివరించారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలపై వారు హర్షం వ్యక్తం చేశారని.. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారని అనంతరం కేటీఆర్ తెలిపారు. -
జహీరాబాద్ ఎంపీకి తప్పిన ప్రమాదం
మెదక్: మెదక్ జిల్లా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆదివారం మధ్యాహ్నం మెదక్ జిల్లా కల్హేర్ మండలం చందర్‌నాయక్ తాండా వద్ద బీబీ పాటిల్ ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పాటిల్ స్వల్పంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.