కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్న శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ‘మౌలిక సదుపాయాల యంత్ర పరికరాల తయారీ పార్కు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్ మెంట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పార్క్)’ ఏర్పాటు కానుంది. జహీరాబాద్‌లోని ‘నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)’లో 500 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, గనుల తవ్వకాల్లో ఉపయోగించే యంత్ర పరికరాలు తయారుకానున్నాయి. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బుధవారం బెంగళూరులో శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఫైనాన్స్ లిమిటెడ్ అనుబంధ కంపెనీ అట్టివో ఎకనామిక్ జోన్స్ ప్రైవేటు లిమిటెడ్–ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.
10 వేల మందికి ఉద్యోగాలు..
మౌలిక సదుపాయాల యంత్ర పరికరాల రంగంలో పేరొందిన సంస్థలు ఈ పార్కులో యూనిట్లు ఏర్పాటు చేస్తాయని ఒప్పందం సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. భూసేకరణ పూర్తయిందని, త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పార్కు ద్వారా వచ్చే పదేళ్లలో 10 వేల ఉద్యోగాలు లభిస్తాయ ని తెలిపారు. ఈ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని, మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి తరలివస్తాయని అన్నారు. రెండున్నర దశాబ్దాలుగా తమ కంపెనీ మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెడుతోందని శ్రేయీ ఇన్‌ఫ్రాస్టక్చర్ సంస్థ ఉపాధ్యక్షుడు సునీల్ కనోరియా చెప్పారు.
మౌలిక రంగంలో కీలక సంస్థ ‘శ్రేయీ’: దేశంలోని అతిపెద్ద సమగ్ర మౌలిక సదుపాయాల రంగ సంస్థల్లో శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ ఒకటి. 1989లో ఈ కంపెనీ ప్రారంభమైంది. మౌలి క సదుపాయాల రంగంలో పెట్టుబ డులకు అవకాశాలు లేని పరిస్థితిలో.. వినూత్న పరిష్కారాలతో మార్కెట్లో సుస్థిర స్థానాన్ని సాధించింది. ప్రస్తుతం వేల కోట్ల రూపాయల సంస్థగా ఎదిగింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్, అడ్వైజరీ అండ్ డెవలప్ మెంట్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సేవలను ఈ సంస్థ అందిస్తోంది.
పరిశ్రమల స్థాపనకు ఎంతో అనుకూలం
విప్లవాత్మక సంస్కరణలు, పారిశ్రామిక విధానాలతో తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోందని.. పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం ఎంతో అనుకూలమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం బెంగళూరులో మౌలిక వసతుల యంత్ర పరికరాల ఉత్పత్తిదారులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం జరిగిన ఎక్స్‌కాన్ ఎక్స్‌పోలో ‘నెక్ట్స్‌జెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’అంశంపై ప్రసంగించారు. మౌలిక వసతుల కల్పన ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, మిషన్ భగీరథ ప్రారంభించారన్నారు. తెలంగాణలో మౌలిక వసతుల యంత్రాల తయారీ చేపట్టాలని కోరారు.
పెట్టుబడులు పెట్టండి: కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: వృద్ధి రేటులో దేశంలోనే మెరుగైన స్థానంలో ఉన్న తెలంగాణలో పెట్టుబడుల స్థాపనకు ముందుకురావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ఢిల్లీలో జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ చైర్మన్, సీఈవో జాన్ ప్లానరీ, వాన్చూ సంస్థ అధ్యక్షుడు, సీఈవో విశాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడుల స్థాపనకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వారికి వివరించారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలపై వారు హర్షం వ్యక్తం చేశారని.. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారని అనంతరం కేటీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment