బుధవారం జపాన్‌లో భారత రాయబారి సుజయ్ చినోయ్‌ను కలసిన మంత్రి కేటీఆర్. చిత్రంలో వివేక్, జయేశ్ రంజన్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దాదాపు సగం పట్టణ ప్రాంతమేనని, నగరీకరణ, పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో వ్యర్థాల నిర్వహణ రంగానికి ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట్ర మునిసిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాల నిర్వహణ పరిష్కారాల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో జపాన్‌కు చెందిన టకుమ కంపెనీతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. విదేశీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ మంగళవారం దక్షిణ కొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. బుధవారం జపాన్ రాజధాని టోక్యోలో పర్యటించిన ఆయన.. అక్కడి 12 కంపెనీల ప్రతినిధులతో విస్తృత చర్చలు జరిపారు. ఈ క్రమంలో టకుమ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై వ్యర్థాల నిర్వహణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ
ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ జేఎఫ్‌ఈ ప్రతినిధి ఇజుమి సుగిబయాషి, మరో ఇంజనీరింగ్ కంపెనీ మినెబీయా ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రపంచంలోని 59 ప్రాంతాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మినెబీయా కంపెనీ విస్తరణ కోసం తెలంగాణను పరిశీలించాలని ఆహ్వానించారు. ఈఎస్‌ఈ ఫుడ్స్ చైర్మన్ హికోనోబు ఐసెతో సమావేశమై రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారానికి ఉన్న విస్తృత అవకాశాలను వివరించారు. మేయిజి షియికా ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశమై వ్యవసాయం, వెటర్నరీ మందుల ఉత్పత్తి రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సుమిటోమో ఫారెస్ట్రీ కంపెనీ, టోరే ఇండస్ట్రీస్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. జపనీస్ కంపెనీలు, ప్రపంచ ఇన్నోవేషన్ కమ్యూనిటీలకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్న జపాన్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ బృందంతో కేటీఆర్ సమావేశమై రాష్ట్రంలో ఇన్నోవేషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలిపారు. టీ హబ్, టీ ఫైబర్ తదితర ప్రాజెక్టులపై చర్చించారు. పర్యటనలో కేటీఆర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఉన్నారు.
భారత రాయబారితో సమావేశం
జపాన్ పర్యటనలో భాగంగా కేటీఆర్ బృందం తొలుత అక్కడి భారత రాయబారి సుజయ్ చినోయ్‌తో సమావేశమై ఈ పర్యటన ఉద్దేశాలను వివరించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో పర్యటన చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. సాంకేతిక ప్రగతి, పారిశ్రామిక రంగం, వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో జపాన్ అనుసరిస్తున్న పద్ధతులను ఆదర్శంగా తీసుకుంటామని తెలిపారు. జపాన్, తెలంగాణల మధ్య మరింత బలమైన ఆర్థిక, వ్యాపార భాగస్వామ్యాలను నెలకొల్పేందుకు సహకారం అందించాలని చినోయ్‌ను కోరారు. జైకా వంటి జపాన్ సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు రుణ సహాయం అందించాయని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మరిన్ని ప్రాజెక్టులకు ఈ ఆర్థిక భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి యూజిముటోతో సమావేశమై.. వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment