సాక్షి, హైదరాబాద్: హైటెక్ సిటీ, టీ–హబ్ భవనాల తర్వాత ఐటీ రంగానికి సంబంధించి హైదరాబాద్ నగరంలో మరో ప్రతిష్టాత్మక భవన నిర్మాణానికి నేడు బీజం పడనుంది. రాష్ట్రంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తలపెట్టిన ఇమేజ్ టవర్‌కు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని 16 ఎకరాల స్థలంలో 16 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. పీపీపీ విధానంలో రూ.945 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితం కానుంది. ఈ మేరకు రహేజా మైండ్ స్పేస్ నుంచి ఇనార్బిట్ మాల్‌కు వెళ్లే దారిలో ప్రభుత్వం స్థలాన్ని సమీకరించింది. ఐటీ, గ్రాఫిక్స్ అనుబంధ రంగాల సంస్థలకు స్థలాలు కేటాయించేలా ఇమేజ్ టవర్ డిజైన్‌ను టీఎస్‌ఐఐసీ రూపొందించింది. ఎటు వైపు నుంచి చూసినా ‘టీ’ ఆకారంలో కనిపించేలా భవన డిజైన్‌ను తయారు చేయించింది.
అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేలా..: యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్ సెక్టార్ (ఏవీజీసీ)కి భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండనుంది. ఈ క్రమంలో ఏవీజీసీ రంగానికి చెందిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేలా ప్రభుత్వం ఇమేజ్ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇలా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్ సెక్టార్‌కు ఒకేచోట ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పించనుంది. ఏవీజీసీతోపాటు ఐటీ, గ్రాఫిక్స్, ఐటీఈఎస్ రంగాల సంస్థల కార్యాలయాలకు స్థలాలు కేటాయించనుంది. 1.76 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టూడియోలు, క్యాప్చర్ స్టూడియోలు, గ్రీన్ మ్యాట్ స్టూడియోలు, డీఐ సూట్, ఎడిటింగ్ ల్యాబ్స్, డేటా మేనేజ్‌మెంట్ ల్యాబ్స్, డబ్బింగ్ సూట్, డేటా సెంటర్, ఆడిటోరియం, స్క్రీన్ థియేటర్లు నిర్మించనున్నారు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఏవీజీసీ ఆఫీసుల కోసం 6.25 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయిస్తారు. 18 వేల చదరపు అడుగుల స్థలంలో బిజినెస్ సెంటర్‌ను నిర్మిస్తారు. ఐటీ, ఐటీఈఎస్ కార్యాలయాల కోసం 7 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని, రెస్టారెంట్లు, ఇతర అవసరాలు, సదుపాయాల కోసం 80 వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించనున్నారు.
ఇమేజ్ టవర్ ప్రయోజనాలివీ..
- యానిమేషన్ చిత్రాలు, గేమింగ్ రంగాలకు సంబంధించి ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, మీడియా కంటెంట్ మేనేజ్‌మెంట్ అండ్ ప్రొవైడర్స్, ఫిల్మ్ కంటెంట్ రైట్స్ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ప్రక్రియలకు అవసరమైన సదుపాయాలు ఇమేజ్ టవర్లో ఉండనున్నాయి.
- ఏవీజీసీ రంగంలో స్టార్టప్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇమేజ్ టవర్‌లో ఇన్‌క్యూబేటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్ ‘ఇమేజ్’ పెంచేలా..
Published Sun, Nov 5 2017 1:48 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement