శంషాబాద్ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో కేటీఆర్, గ్రంథి మల్లికార్జునరావు తదితరులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి ప్రమాణాలతో భాగ్యనగరానికి కీర్తి కిరీటంగా భాసిల్లుతున్న శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరింత సమున్నతంగా మారబోతోంది. విమానాశ్రయం ప్రారంభమై పదేళ్లయిన సందర్భంగా.. ప్రయాణికుల సామర్థ్యాన్ని భారీగా పెంచి, మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం కోసం యాజమాన్య సంస్థ విమానాశ్రయ విస్తరణ పనులు చేపట్టింది. ఏకంగా సంవత్సరానికి 4 కోట్ల మంది ప్రయాణించగలిగేలా సామర్థ్యాన్ని సమకూర్చనుంది. ఈ పనులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. విమానాశ్రయం దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. విస్తరణ పనులతో పాటు ఎయిర్‌పోర్టు సిటీ, 12 వేల మందికి ఒకేసారి ఆతిథ్యం ఇవ్వగలిగే కన్వెన్షన్, ఎగ్జిబిషన్ కేంద్రాలకు శ్రీకారం చుట్టారు. అయితే రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కేసీఆర్ ఏమీ ప్రసంగించకుండా వెంటనే వెళ్లిపోయారు. దీంతో పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు కీలకోపన్యాసం చేశారు.
విశ్వనగర స్థాయికి తగినట్టుగా..
విశ్వనగరంగా అవతరిస్తున్న హైదరాబాద్‌లో విమానాల ట్రాఫిక్ బాగా పెరుగుతోందని.. దానికి తగినట్టుగా శంషాబాద్ విమానాశ్రయ విస్తరణను చేపట్టారని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. విశ్వనగర స్థాయిలో విమానాశ్రయాన్ని విస్తరించేందుకు జీఎంఆర్ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. ప్రస్తుతం ఏటా కోటిన్నర మంది వరకు ప్రయాణించగల సామర్థ్యం ఉండగా.. దానిని నాలుగు కోట్ల ప్రయాణికుల సామర్థ్యానికి విస్తరిస్తుండటం శుభపరిణామమని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ ఫార్మాసిటీ, ఏరోస్పేస్ పార్కులతో పాటు ఐటీ పరిశ్రమల విస్తరణ వేగంగా జరుగుతోందని... దీంతో ఎయిర్ ట్రాఫిక్ గణనీయంగా పెరగనుందని చెప్పారు. భవిష్యత్తులో శంషాబాద్ విమానాశ్రయం పది కోట్ల ప్రయాణికుల సామర్థ్యానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విమానయాన ఇంధనంపై రాష్ట్రంలో ఉన్న 16 శాతం వ్యాట్‌ను ఒక శాతానికి తగ్గిస్తామని ప్రకటించారు. రూ.4,650 కోట్లతో రెండేళ్లలో మెట్రో రైలును విమానాశ్రయానికి అనుసంధానిస్తా మన్నారు. వైమానిక నగరంగా శంషాబాద్ విమానాశ్రయ ప్రాంత అభివృద్ధి కోసం హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో డ్రైపోర్టు, లాజిస్టిక్ హబ్‌ను నిర్మిస్తామని చెప్పారు. తెలుగువాడైన జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంథి మల్లికార్జునరావు అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఆమోఘమని ప్రశంసించారు. సామాజిక బాధ్యతలో భాగంగా జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ చేపడుతున్న పనులను ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు..
బంగారు తెలంగాణ నిర్మాణంలో సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎయిర్‌పోర్టు సిటీ, కన్వెన్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు జీఎంఆర్ సంస్థల చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత గత నాలుగేళ్లలో శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణికుల వృద్ధి రేటు 21% పెరిగింద న్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రశం సించారు. ఇక కార్యక్రమంలో తొలుత జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా అందించే పలు శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎయిర్‌పోర్టుకు సంబంధించిన ‘డికేడ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’సార్మక స్టాంపు కవర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, తీగల కృష్ణారెడ్డి, కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్‌నయన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment