
సాక్షి, హైదరాబాద్: కాలుష్యకారక పరిశ్రమలను నగరం అవతలకు తరలించేందుకు సనత్ నగర్, నాచారం, కాటేదాన్ ప్రాంతాల్లోని పరిశ్రమలతో చర్చించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను మంగళవారం ఆయన సమీక్షించారు. ఐటీ లాంటి నూతన రంగాల పరిశ్రమల అభివృద్ధికి ఆయా కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడాలని సూచించారు.
జిల్లాలతో పాటు నగర శివార్లలో నిర్మిస్తున్న పారిశ్రామికవాడల పురోగతి వివరాలను కేటీఆర్ తెలుసుకున్నారు. దండు మల్కాపూర్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కు నిర్మాణం పూర్తయిందని, ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. బండ మైలారంలో సీడ్ పార్కు, బండ తిమ్మాపూర్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు, శివనగర్‌లో ఎల్‌ఈడీ పార్కు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.