మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ వార్షిక సదస్సులో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ముందుచూపున్న నాయకత్వంలో వినూత్న విధానాల ద్వారా రాష్ట్రం అభివృద్ధి దిశగా పురోగమిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణను స్టార్టప్ స్టేట్‌గా పేర్కొంటున్నామని, అత్యుత్తమ పరిపాలన ప్రమాణాలు, వినూత్న విధానాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచి ప్రజల ప్రాథమిక అవసరాలైన తాగునీరు, విద్యుత్ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చామని, అందుకే విద్యుత్ కొరత నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా వృద్ధిలోకి వచ్చామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా త్వరలోనే ఇంటింటికీ తాగునీరు అందించిన రాష్ట్రంగా మరో ఘనతను కైవసం చేసుకోబోతున్నామన్నారు. దీనికి తోడు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం సైతం అందించనున్నామని, దీంతో విద్య, వైద్యం, పరిపాలన రంగాల్లో విప్లవాత్మక మార్పులకు రాష్ట్రం వేదిక కాబోతున్నదన్నారు.
మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు శనివారం చెన్నైలో జరిగిన ఆ సంస్థ వార్షిక సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ‘‘లెర్నింగ్ టూ గ్రో’’అనే అంశంపై ప్రసంగించారు. గతమూడేళ్లుగా రాష్ట్రం సాధించిన అభివృద్ధి, ప్రభుత్వ పాలసీల విజయాలను మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్ర పారిశ్రామిక పాలసీ రూపకల్పన సమయంలో అత్యుత్తమ విధానాలను ఆదర్శంగా తీసుకున్నామని, వ్యక్తుల కేంద్రీకృత విధానానికి బదులు వ్యవస్థ కేంద్రీకృత విధానంగా టీఎస్ ఐపాస్‌ను రూపొందించామన్నారు. తమ ఆలోచనలు ఫలించి ఇప్పటివరకు 6 వేలకుపైగా పరిశ్రమలకు టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు జారీ చేశామని, అందులో సగానికి పైగా పరిశ్రమలు ఇప్పటికే ఉత్పత్తులను ప్రారంభించాయని వెల్లడించారు.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని, సరళీకృత వ్యాపార సంస్కరణల (ఈఓడీబీ) అమల్లో సైతం రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. యువత ఆశలు, ఆకాంక్షలకు ప్రభుత్వాలు ఆసరా అందిస్తే చాలని, ప్రపంచాన్ని జయించే శక్తి వారిలో ఉందన్నారు. అందుకే యువశక్తి ఆలోచనలకు ఊతం ఇచ్చేందుకు తాము టీ–హబ్, టీ–వర్క్స్ కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. మరింత వేగంగా దేశాభివృద్ధి జరగాలంటే ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల్లాగా ఆలోచించి తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని, ప్రైవేటు సంస్థలు ప్రభుత్వాల తరహాలో ఆలోచించి సమాజహితం కోసం పనిచేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పథకాల పట్ల ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment