Pollution Industries
-
విషయం లేని నోటీసు చెల్లుబాటు కాదు
సాక్షి, హైదరాబాద్: కాలుష్య పరిశ్రమలకు విషయ ప్రస్తావన లేకుండా నోటీసు జారీ చేస్తే చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. నివాస ప్రాంతాల్లో పరిశ్రమల్ని ఏర్పాటు చేసి చట్టాన్ని ఉల్లంఘించారా, మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకించారా, కాలుష్యాన్ని వెదజల్లుతోందా, అక్రమ నిర్మాణంలో పరిశ్రమ ఉందా.. వంటి అంశాల్లేకుండా నోటీసు ఇస్తే చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. ఏ చట్ట ప్రకారం నోటీసు ఇస్తున్నారో స్పష్టత లేకపోతే ఎలాగని జీహెచ్ఎంసీని ప్రశ్నించింది. హైదరాబాద్‌లోని కాలుష్య పరిశ్రమలకు తిరిగి నోటీసు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. శాస్త్రిపురంలోని తన గోడౌన్‌ను మూసేయాలని జీహెచ్ఎంసీ మార్చి 5న ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ మహమ్మద్ తౌఫిక్ అహ్మద్ సవాల్ చేసిన వ్యాజ్యం విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. షోకాజ్ నోటీసుకు మూసివేత నోటీసుకు మధ్య చట్ట ప్రకారం ఉండాల్సిన సమయం కచ్చితంగా ఉండాలని తెలిపింది. ఏ అంశంపై నోటీసు ఇస్తున్నారో చాలా స్పష్టంగా ఉండకపోతే కోర్టుల్లో వీగిపోతాయని చెప్పింది. జీహెచ్ఎంసీ వివరణపై హైకోర్టు అసంతృప్తి పిటిషనర్‌కు చెందిన టైల్స్ పరిశ్రమ నుంచి కాలుష్యం వెలువడుతోందని నోటీసు ఇచ్చారని, ఇదేమిటని ప్రశ్నిస్తే టైల్స్ కాల్చడం వల్ల కాలుష్యం వెలువడుతోందని జీహెచ్ఎంసీ జవాబు చెప్పడంపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసుపై వివరణ ఇచ్చే గడువు వారం రోజులు ఉంటుందని, ఈలోగానే మూసేయాలని నోటీసు ఇవ్వడం సరికాదని పేర్కొంది. దీనిపై అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ స్పందిస్తూ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ నోటీసుల్లో జరిగిన పొరపాట్లను తెలుసుకున్నారనిచెప్పారు. దీంతో పిల్‌పై విచారణ ముగిసినట్లుగా ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సంగారెడ్డి జిల్లా హాత్‌నూరా మండలం గుండ్లమానూరులో కాలుష్యం వెలువరించే పరిశ్రమపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 25కి వాయిదా పడింది. -
కాలుష్య కాటు
జిల్లాలో ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్ (ఈసీ) లేకుండా పలు ఫ్యాక్టరీలు, మైన్స్, క్వారీల యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వీటిపై అడపాదడపా అధికారులు దాడులు చేస్తున్నా అధికార పార్టీ నాయకులు ఒత్తిడితో యథాప్రకారం నిర్వాహకులు కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. గాలిలో దూళికణాలు గతంలో 66 శాతం ఉండగా ప్రస్తుతం 71 శాతానికి చేరుకున్నట్లు సమాచారం. అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ 80 నుంచి 100 మైక్రోగ్రాముల లోపు ఉండాలి. అయితే 500 మైక్రో గ్రాముల కార్బన్ మోనాక్సైడ్ ఉన్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు. దీంతో జిల్లా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నెల్లూరు(సెంట్రల్): ఏదైనా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా మొదట చూసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రధానంగా ఏర్పాటు చేసే మైన్స్, ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకూడదు. ఏర్పాటు చేసే ఏ చిన్న, పెద్ద పరిశ్రమ అయినా సరే పర్యావరణకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండే విధంగా ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్ (ఈసీ) అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే జిల్లాలో పలు ఫ్యాక్టరీలకు ఈసీలు లేవనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా ఈసీ లేని మైన్స్, ఫ్యాక్టరీలతోపాటు వాహనాలు తిరుగుతున్నందున వచ్చే కాలుష్యంతో జిల్లాలో పర్యావరణం దెబ్బతింటోంది. 25 వేలకు పైగా ఆటోలు, వెయ్యికి పైగా బస్సులు, 15 వేల కార్లు, రెండు లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు తిరుగుతుంటాయి. వీటన్నింటి వల్ల వచ్చే కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఫ్యాక్టరీలదే అదే వరుస జిల్లాలో రైసు మిల్లులు, క్రషర్స్, పవర్ప్లాంటులు, వివిధ రకాల శబ్దకాలుష్య పరిశ్రమలు విచ్చలవిడిగా వెలశాయి. వీటిలో సగానికి పైగా ఈసీ లేదని తెలుస్తోంది. ఒక వేళ ఈ సీ ఉన్నా నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో వీటి నుంచి నిత్యం వెలువడే కాలుష్యంతో స్థానికంగా ఉన్న ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రధానంగా ఈ కాలుష్య ప్రభావం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ పంటలపై కూడా పడుతోంది. దీంతో దిగుబడి చాలా వరకు తగ్గుముఖం పడుతోంది. అంతే కాకాకుండా స్థానికంగా ఉన్న ప్రజలకు వివిధ అనారోగ్య సమస్యల వస్తున్నాయి. దీంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా నెల్లూరు చుట్టుపక్కల వెలసిన రైసు మిల్లులు, వివిధ ఫ్యాక్టరీలు, క్రషర్స్‌తో నెల్లూరు పట్టణంపై కూడా పర్యావరణ ప్రభావం పడుతోంది. అధికార పార్టీ అండతో చాలా వరకు పెద్దపెద్ద పరిశ్రమలు, మైన్స్ నిర్వహణ మొత్తం అధికార పార్టీ నేతల అనుచరులే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని ఒక మంత్రికి చెందిన మైన్స్ కూడా ఉన్నాయి. పలు ఫ్యాక్టరీలు, రైసుమిల్లుల విషయం చెప్పనక్కర్లేదు. అధికార పార్టీలో కీలకంగా ఉన్న ఒక వ్యక్తికి చెందిన రైసు మిల్లులు, ఆయన అసోసియేషన్‌కు కూడా అధ్యక్షుడిగా ఉండటంతో వాటికి అనుమతి లేకున్నా ఉన్నా అధికారులు తనిఖీ చేయలేని పరిస్థితి నెలకొంది. సంబంధిత శాఖ, కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ఏదో మొక్కబడిగా దాడులు చేసి వదిలేస్తున్నారు. అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడులు వస్తుండటంతో తనిఖీలు చేసిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈసీ లేకుండా నిర్వహించే మైన్స్, ఫ్యాక్టరీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. 100 మైన్స్‌కు అనుమతి లేని వైనం ప్రధానంగా జిల్లాలోని సైదాపురం, పొదలకూరు, రాపూరు, గూడూరురూరల్, పెళ్లకూరు మండలాల్లో 170 మైన్స్ ఉన్నాయి. వీటిలో 100 మైన్లకు ఈసీ లేకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఇవి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు న్యాయ స్థానం దృష్టికి కూడా పోవడంతో వీటి నిర్వహణపై కూడా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈసీ లేకుండా నిర్వహించిన యజమానుల నుంచి చట్టం ప్రకారం అపరాధ రుసుం వసూలు చేసి, అనంతరం సర్టిఫికెట్ తీసుకున్న తరువాత పనులు చేసుకోవాలని కూడా ఆదేశాలు జారి చేసినట్లు సమాచారం. దీంతో ఈసీ లేకుండా నిర్వహిస్తున్న మైన్స్ వివరాల సేకరణలో సంబంధిత శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెలలోనే ఈసీ లేని మైన్స్పై చర్యలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈసీ లేని వాటిపై చర్యలు తీసుకుంటాం జిల్లాలో ఎటువంటి మైన్ లేదా ఫ్యాక్టరీ అయినా స్థానికంగా ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూడాలి. ప్రజలకు పర్యావరణం వల్ల ఇబ్బంది కలిగే విధంగా నడుపుతున్న వాటిపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో పలు మైన్స్‌కు ఈసీ లేదు. కొన్ని యాజమాన్యాలు దరఖాస్తు చేసుకుని ఉన్నాయి. అదే విధంగా ఫ్యాక్టరీలు, రైసుమిల్లులు ఈసీ లేకుండా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. –ప్రమోద్‌కుమార్‌రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ -
నగరం ఆవలకు కాలుష్యకారక పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: కాలుష్యకారక పరిశ్రమలను నగరం అవతలకు తరలించేందుకు సనత్ నగర్, నాచారం, కాటేదాన్ ప్రాంతాల్లోని పరిశ్రమలతో చర్చించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను మంగళవారం ఆయన సమీక్షించారు. ఐటీ లాంటి నూతన రంగాల పరిశ్రమల అభివృద్ధికి ఆయా కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడాలని సూచించారు. జిల్లాలతో పాటు నగర శివార్లలో నిర్మిస్తున్న పారిశ్రామికవాడల పురోగతి వివరాలను కేటీఆర్ తెలుసుకున్నారు. దండు మల్కాపూర్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కు నిర్మాణం పూర్తయిందని, ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. బండ మైలారంలో సీడ్ పార్కు, బండ తిమ్మాపూర్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు, శివనగర్‌లో ఎల్ఈడీ పార్కు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
‘రెడ్’ అలర్ట్!
గ్రేటర్‌లోని చెరువులు, కుంటలు, నాలాలను కాలుష్యమయంచేస్తున్న బల్క్‌డ్రగ్, ఫార్మా పరిశ్రమల ఆగడాలను కట్టడి చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి నడుం బిగించింది. ఆయా పరిశ్రమలు విడుదల చేస్తున్న విష రసాయనాలతోజలవనరులు విషతుల్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ చుట్టూ ఉన్న పారిశ్రామిక వాడల్లోని సుమారు 500 ‘రెడ్ కేటగిరీ’ (అధిక కాలుష్యం వెలువడేవి) పరిశ్రమలపై దృష్టి సారించింది.ఈ పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలపై నిరంతరం ప్రత్యేక బృందాలు, సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని పీసీబీనిర్ణయించింది. సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ చుట్టూ ఉన్న పలు పారిశ్రామికవాడల నుంచి వెలువడుతోన్న వ్యర్థజలాలు నగర ప్రజలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ జలాల్లో భారలోహాలతో పాటు పలు విష రసాయనాలున్నాయి. ప్రధానంగా జీడిమెట్ల, దుండిగల్, పటాన్చెరు, పాశమైలారం, బొంతపల్లి, ఖాజీపల్లి, బొల్లారం, కాటేదాన్, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లోని బల్క్‌డ్రగ్, ఫార్మా పరిశ్రమలు ప్రమాదకర రసాయనాలను నాలాల్లోకి వదిలిపెడుతున్నాయి. ఆయా పరిశ్రమల నుంచి నేరుగా భూగర్భ పైపులైను వేసి మరీ రసాయనాలను వదిలిపెడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పరిశ్రమల రసాయనాలు కాగా నాలాల్లో కలిసేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పీసీబీ ప్రధాన కార్యాలయం, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖకు అనుసంధానించాలని పీసీబీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. గ్రేటర్ పరిధిలో కాలుష్యాన్ని కట్టడిచేసేందుకు ఇలాంటి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గతంలో మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో పీసీబీ ఈమేరకు కార్యాచరణ సిద్ధం చేసింది. కాగా క్షేత్రస్థాయిలో నిరంతరం ఆయా పరిశ్రమల నుంచి వెలువడుతోన్న ఘన, ద్రవ వ్యర్థాల మోతాదును పరిశీలించేందుకు పీసీబీ, టీఎస్ఐఐసీ, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలకు చెందిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని పీసీబీ నిర్ణయించింది. తొలుత జీడిమెట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. జీడిమెట్లలో పరిశ్రమల ఆగడాలు అక్రమంగా పరిశ్రమల నుంచి భూగర్భ పైపులైను ఏర్పాటు చేసి నాలాలోకి పారిశ్రామిక వ్యర్థజలాలను మళ్లిస్తున్న పరిశ్రమల గుట్టును పీసీబీ ప్రత్యేక బృందాలు ఇటీవల రట్టు చేసిన నేపథ్యంలో మహానగరం పరిధిలోని పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమల ఆగడాలు వెలుగుచూస్తున్నాయి. జీడిమెట్లలోని ఎస్వీఈవీ శ్రీ వెంకటేశ్వర కో ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఠాగూర్ కెమికల్స్, వెంకటేశ్వర కెమికల్స్ నుంచి అక్రమంగా రసాయన వ్యర్థాలను సమీపంలోని నాలాలోకి భూగర్భ పైపులైను ద్వారా చేరవేస్తున్నాయి. దీనిపై విశ్వసనీయ సమాచారం అందడంతో పీసీబీ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. జేసీబీ ద్వారా ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు జరపడంతో భూగర్భ పైపులైన్ బయటపడింది. ఈ పైపులైన్లు ఏయే కంపెనీల నుంచి నాలా వరకు వేశారన్న అంశాన్ని నిగ్గు తేల్చేందుకు తవ్వకాలు చేపట్టినట్టు పీసీబీ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా పైపులైను వేసి నాలాలోకి వ్యర్థాలను మళ్లించిన వెంకటేశ్వర ఇండస్ట్రీస్, ఠాగూర్ కెమికల్స్‌ను మూసివేయాలని పీసీబీ ఉత్తర్వులిచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రెండు పరిశ్రమల నుంచి పారిశ్రామిక రసాయన వ్యర్థజలాలను ఎలాంటి శుద్ధి ప్రక్రియ నిర్వహించకుండా భూగర్భ పైపులైను ద్వారా సమీప నాలాల్లోకి మళ్లించిన ఉదంతాన్ని పీసీబీ టాస్క్‌ఫోర్స్ బృందాలు బట్టబయలు చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పైపులైన్లు ఆయా కంపెనీల యాజమాన్యం ఏర్పాటు చేసినవేనని నిర్థారించిన తరవాతనే మూసివేతకు ఆదేశాలిచ్చినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. పరిశ్రమల ఆగడాల కారణంగా సుమారు 1500 కి.మీ. విస్తీర్ణంలో విస్తరించిన నాలాలు కాలుష్యంతో కంపు కొడుతుండడం పట్ల పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కుల ఆటకట్టించే మార్గమిదీ.. ♦ పారిశ్రామిక వాడల్లో పరిశ్రమను బట్టి రోజు, వారం, నెలవారీగా ఎంత మొత్తంలో ఉత్పత్తి జరుగుతోంది. ఆయా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థజలాలు ఎంత మొత్తంలో ఉన్నాయో పీసీబీ బృందాలు లెక్కగట్టాలి. ♦ ఆయా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల్లో ఎంత మొత్తం జలాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని వ్యర్థాల శుద్ధికేంద్రాలకు తరలిస్తున్నారో లెక్క తీయాలి. ♦ ఆయా పరిశ్రమలకు ఎంత ఉత్పత్తిని సాధించేందుకు అనుమతులు పొందాయి. ప్రస్తుతం ఎంత మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నాయనే అంశంపై పూర్తి వివరాలు సేకరించాలి. ♦ సమీప నాలాలు, చెరువులు, బహిరంగ ప్రదేశాలు, మూసీలోకి వ్యర్థాలను పారబోస్తున్న పరిశ్రమలపై పీసీబీ బృందాలతో పాటు, వంద మంది పోలీసుల సహకారంతో నిరంతరం నిఘా పెట్టాలి. ♦ జీడిమెట్ల, పాశమైలారం, చర్లపల్లి సహా నాలాల వద్ద సీసీటీవీ కెమెరాలతో నిరంతం నిఘా ఏర్పాటు చేయాలి. ♦ వ్యర్థాలను విచక్షణారహితంగా పారబోస్తున్న పరిశ్రమల లైసెన్సును రద్దు చేసి, మూసివేతకు పీసీబీ ఉత్తర్వులివ్వాలి. ♦ ఆయా పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఘన వ్యర్థాలను ఎలా శుద్ధి చేస్తున్నారన్న అంశంపైనా నిపుణుల కమిటీతో తనిఖీలు చేసి సమీక్షించాలి. -
కాలుష్యకారక పరిశ్రమలను మూసేయాలి
నెల్లూరు(పొగతోట): ప్రజల శ్రేయస్సు దృష్ట్యా గమేసా రెన్యువబుల్ పేరుతో నిర్మించిన కాలుష్యకారక పరిశ్రమలను మూసివేసేలా జిల్లా యంత్రాం గం చర్యలు తీసుకోవాలని కొడవలూరు జెడ్పీటీసీ సభ్యుడు కె.శ్రీధర్‌రెడ్డి, రైతు సంఘాల నాయకులు పి.శ్రీరాములు, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచర్లపాడులో కిసాన్ సెజ్ వారు నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యకారక పరిశ్రమలు నెలకొల్పుతున్నారని ఆరోపించారు. జిల్లా అధికారులు పరిశ్రమలను పరిశీలించి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వాటిని మూసివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్‌కు వినతి పత్రం సమర్పించారు. ప్రమాదాలకు గురికాకుండా చర్యలు చేపట్టాలి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరాకు జరుగుతున్న పనుల వలన ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, మూలం రమేష్ డిమాండ్ చేశారు. ఆ మేరకు సోమవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. వాహనాలపై చర్యలు తీసుకోవాలి చట్ట వ్యతిరేకంగా తిరుగుతున్న ప్రైవేట్ వాహనాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తోట వెంకటేశ్వరరావు, రీజినల్ కార్యదర్శి కె.లుక్సన్ డిమాండ్ చేశారు. ఆమేరకు సోమవారం నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.