కాలుష్యకారక పరిశ్రమలను మూసేయాలి
నెల్లూరు(పొగతోట): ప్రజల శ్రేయస్సు దృష్ట్యా గమేసా రెన్యువబుల్ పేరుతో నిర్మించిన కాలుష్యకారక పరిశ్రమలను మూసివేసేలా జిల్లా యంత్రాం గం చర్యలు తీసుకోవాలని కొడవలూరు జెడ్పీటీసీ సభ్యుడు కె.శ్రీధర్‌రెడ్డి, రైతు సంఘాల నాయకులు పి.శ్రీరాములు, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచర్లపాడులో కిసాన్ సెజ్ వారు నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యకారక పరిశ్రమలు నెలకొల్పుతున్నారని ఆరోపించారు. జిల్లా అధికారులు పరిశ్రమలను పరిశీలించి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వాటిని మూసివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్‌కు వినతి పత్రం సమర్పించారు.
ప్రమాదాలకు గురికాకుండా చర్యలు చేపట్టాలి
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరాకు జరుగుతున్న పనుల వలన ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, మూలం రమేష్ డిమాండ్ చేశారు. ఆ మేరకు సోమవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
వాహనాలపై చర్యలు తీసుకోవాలి
చట్ట వ్యతిరేకంగా తిరుగుతున్న ప్రైవేట్ వాహనాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీఎస్‌ఆర్‌టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తోట వెంకటేశ్వరరావు, రీజినల్ కార్యదర్శి కె.లుక్సన్ డిమాండ్ చేశారు. ఆమేరకు సోమవారం నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.