జీడిమెట్లలో ఓ పరిశ్రమ భూగర్భంలో ఏర్పాటు చేసిన రసాయనాల డ్రైనేజీ
గ్రేటర్‌లోని చెరువులు, కుంటలు, నాలాలను కాలుష్యమయంచేస్తున్న బల్క్‌డ్రగ్, ఫార్మా పరిశ్రమల ఆగడాలను కట్టడి చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి నడుం బిగించింది. ఆయా పరిశ్రమలు విడుదల చేస్తున్న విష రసాయనాలతోజలవనరులు విషతుల్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ చుట్టూ ఉన్న పారిశ్రామిక వాడల్లోని సుమారు 500 ‘రెడ్ కేటగిరీ’ (అధిక కాలుష్యం వెలువడేవి) పరిశ్రమలపై దృష్టి సారించింది.ఈ పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలపై నిరంతరం ప్రత్యేక బృందాలు, సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని పీసీబీనిర్ణయించింది.
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ చుట్టూ ఉన్న పలు పారిశ్రామికవాడల నుంచి వెలువడుతోన్న వ్యర్థజలాలు నగర ప్రజలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ జలాల్లో భారలోహాలతో పాటు పలు విష రసాయనాలున్నాయి. ప్రధానంగా జీడిమెట్ల, దుండిగల్, పటాన్‌చెరు, పాశమైలారం, బొంతపల్లి, ఖాజీపల్లి, బొల్లారం, కాటేదాన్, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లోని బల్క్‌డ్రగ్, ఫార్మా పరిశ్రమలు ప్రమాదకర రసాయనాలను నాలాల్లోకి వదిలిపెడుతున్నాయి. ఆయా పరిశ్రమల నుంచి నేరుగా భూగర్భ పైపులైను వేసి మరీ రసాయనాలను వదిలిపెడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పరిశ్రమల రసాయనాలు కాగా నాలాల్లో కలిసేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పీసీబీ ప్రధాన కార్యాలయం, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖకు అనుసంధానించాలని పీసీబీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. గ్రేటర్ పరిధిలో కాలుష్యాన్ని కట్టడిచేసేందుకు ఇలాంటి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గతంలో మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో పీసీబీ ఈమేరకు కార్యాచరణ సిద్ధం చేసింది. కాగా క్షేత్రస్థాయిలో నిరంతరం ఆయా పరిశ్రమల నుంచి వెలువడుతోన్న ఘన, ద్రవ వ్యర్థాల మోతాదును పరిశీలించేందుకు పీసీబీ, టీఎస్‌ఐఐసీ, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలకు చెందిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని పీసీబీ నిర్ణయించింది. తొలుత జీడిమెట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
జీడిమెట్లలో పరిశ్రమల ఆగడాలు
అక్రమంగా పరిశ్రమల నుంచి భూగర్భ పైపులైను ఏర్పాటు చేసి నాలాలోకి పారిశ్రామిక వ్యర్థజలాలను మళ్లిస్తున్న పరిశ్రమల గుట్టును పీసీబీ ప్రత్యేక బృందాలు ఇటీవల రట్టు చేసిన నేపథ్యంలో మహానగరం పరిధిలోని పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమల ఆగడాలు వెలుగుచూస్తున్నాయి. జీడిమెట్లలోని ఎస్‌వీఈవీ శ్రీ వెంకటేశ్వర కో ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఠాగూర్ కెమికల్స్, వెంకటేశ్వర కెమికల్స్ నుంచి అక్రమంగా రసాయన వ్యర్థాలను సమీపంలోని నాలాలోకి భూగర్భ పైపులైను ద్వారా చేరవేస్తున్నాయి. దీనిపై విశ్వసనీయ సమాచారం అందడంతో పీసీబీ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. జేసీబీ ద్వారా ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు జరపడంతో భూగర్భ పైపులైన్ బయటపడింది. ఈ పైపులైన్లు ఏయే కంపెనీల నుంచి నాలా వరకు వేశారన్న అంశాన్ని నిగ్గు తేల్చేందుకు తవ్వకాలు చేపట్టినట్టు పీసీబీ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా పైపులైను వేసి నాలాలోకి వ్యర్థాలను మళ్లించిన వెంకటేశ్వర ఇండస్ట్రీస్, ఠాగూర్ కెమికల్స్‌ను మూసివేయాలని పీసీబీ ఉత్తర్వులిచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రెండు పరిశ్రమల నుంచి పారిశ్రామిక రసాయన వ్యర్థజలాలను ఎలాంటి శుద్ధి ప్రక్రియ నిర్వహించకుండా భూగర్భ పైపులైను ద్వారా సమీప నాలాల్లోకి మళ్లించిన ఉదంతాన్ని పీసీబీ టాస్క్‌ఫోర్స్ బృందాలు బట్టబయలు చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పైపులైన్లు ఆయా కంపెనీల యాజమాన్యం ఏర్పాటు చేసినవేనని నిర్థారించిన తరవాతనే మూసివేతకు ఆదేశాలిచ్చినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. పరిశ్రమల ఆగడాల కారణంగా సుమారు 1500 కి.మీ. విస్తీర్ణంలో విస్తరించిన నాలాలు కాలుష్యంతో కంపు కొడుతుండడం పట్ల పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమార్కుల ఆటకట్టించే మార్గమిదీ..
♦ పారిశ్రామిక వాడల్లో పరిశ్రమను బట్టి రోజు, వారం, నెలవారీగా ఎంత మొత్తంలో ఉత్పత్తి జరుగుతోంది. ఆయా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థజలాలు ఎంత మొత్తంలో ఉన్నాయో పీసీబీ బృందాలు లెక్కగట్టాలి.
♦ ఆయా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల్లో ఎంత మొత్తం జలాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని వ్యర్థాల శుద్ధికేంద్రాలకు తరలిస్తున్నారో లెక్క తీయాలి.
♦ ఆయా పరిశ్రమలకు ఎంత ఉత్పత్తిని సాధించేందుకు అనుమతులు పొందాయి. ప్రస్తుతం ఎంత మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నాయనే అంశంపై పూర్తి వివరాలు సేకరించాలి.
♦ సమీప నాలాలు, చెరువులు, బహిరంగ ప్రదేశాలు, మూసీలోకి వ్యర్థాలను పారబోస్తున్న పరిశ్రమలపై పీసీబీ బృందాలతో పాటు, వంద మంది పోలీసుల సహకారంతో నిరంతరం నిఘా పెట్టాలి.
♦ జీడిమెట్ల, పాశమైలారం, చర్లపల్లి సహా నాలాల వద్ద సీసీటీవీ కెమెరాలతో నిరంతం నిఘా ఏర్పాటు చేయాలి.
♦ వ్యర్థాలను విచక్షణారహితంగా పారబోస్తున్న పరిశ్రమల లైసెన్సును రద్దు చేసి, మూసివేతకు పీసీబీ ఉత్తర్వులివ్వాలి.
♦ ఆయా పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఘన వ్యర్థాలను ఎలా శుద్ధి చేస్తున్నారన్న అంశంపైనా నిపుణుల కమిటీతో తనిఖీలు చేసి సమీక్షించాలి.
Comments
Please login to add a commentAdd a comment