సాక్షి,సిటీబ్యూరో: వినాయక చవితి అంటే మహానగరానికి అతిపెద్ద వేడుక. గ్రేటర్‌లో అత్యంత వైభవంగా జరిగే నవరాత్రి ఉత్సవాలను ఈసారి పర్యావరణ హితంగా జరపుకోవాలంటోంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అందుకు తగ్గట్టే వచ్చేనెల రెండో వారంలో జరగనున్న చవితి ఉత్సవాలకు ‘మట్టి గణపతుల’ పంపిణీ చేసేందుకు పీసీబీ సమాయత్తమవుతోంది. మహానగరంలో కాలుష్య ఆనవాళ్లు లేకుండా చూసేందుకు ఈ సారి సుమారు 2 లక్షల మట్టి ప్రతిమల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో ఇళ్లలో పూజించుకునే చిన్న ప్రతిమలు 1.75 లక్షలు ఉన్నాయి. మిగతావి వివిధ పరిమాణాల్లో తయారు చేస్తున్నారు. ఈ బాధ్యతలను రెండు సంస్థలకు అప్పజెప్పినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. అయితే చిన్న ప్రతిమలను నగరంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఔట్‌లెట్లు ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి.
సింహభాగం పీఓపీ విగ్రహాలే..
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏటా గ్రేటర్ వ్యాప్తంగా సుమారు లక్షకు పైగా భారీ విగ్రహాలను ప్రతిష్టిస్తుంటారు. ఇందులో మట్టి విగ్రహాల సంఖ్య 25 వేలకు మించడం లేదు. మిగతావన్నీ వివిధ పరిమాణాల్లో ఉండే ‘ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్’ విగ్రహాలే. వీటిని నగరంలోని వివిధ చెరువులతో పాటు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. అయితే వీటివల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘పీఓపీ’తో పర్యావరణ హననం
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి హానికారక రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను నగరంలోని పలు జలాశయాల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఆ సమయంలో వాటిలోని ప్రమాదకర మూలకాలు జలాశయాల్లో చేరుతున్నాయి. ముఖ్యంగా రంగుల్లో ఉండే లెడ్ సల్ఫేట్, చైనాక్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టర్పీన్, ఆల్కహాల్ వంటివి కలుస్తున్నాయి. వాటితోపాటు కోబాల్ట్, మాంగనీస్, డయాక్సైడ్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జింక్ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా వంటి హానికారక మూలకాలు సైతం నీటిలో కలుస్తున్నాయి.
ఆ విగ్రహాలతో అనర్థాలు..
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేసినప్పుడు జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది.
⇔ జలాశయాల్లో పట్టిన చేపలను నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని తిన్న వాకి శరీరంలోకి హానికర మూలకాలు చేరుతున్నాయి. చేపల ద్వారా మానవ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి.
⇔ సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. జలాల్లో అరుదుగా పెరిగే వృక్ష జాతులు నాశనమవుతాయి.
⇔ ఆర్సినిక్, లెడ్, మెర్క్యురీ మూలకాలు భారతీయ ప్రమాణాల సంస్థ, వైద్య పరిశోధనా సంస్థలు సూచించిన పరిమితులను మించి ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
⇔ వీటితోపాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనం, సిలికాన్ వంటి మూలకాలు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి.
⇔ జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికర మూలకాలు అవక్షేపంగా ఏర్పడతాయి.
ప్రత్యామ్నాయం తప్పనిసరి
⇔ జల, వాతావరణ కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇందుకు మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే ప్రతిష్టించి, నిమజ్జనం చేయాలి. వీటి పరిమాణం సైతం చిన్నవిగానే ఉండాలి.
⇔ ఆయా జలాశయాల్లో నిమజ్జనం చేసే విగ్రహాల సంఖ్యను ఏటేటా తగ్గించాలి. ఎక్కడి విగ్రహాలను అక్కడే నిమజ్జనం చేసేందుకు కృషి చేయాలి.
⇔ నగరంలో మంచినీటి చెరువులు, బావుల్లో విగ్రహాల నిమజ్జనం చేయరాదు.
⇔ విగ్రహాలతో పాటు జలాశయాల్లోకి పూవులు, కొబ్బరి కాయలు, నూనె, వస్త్రాలు, పండ్లు, ధాన్యం, పాలిథిన్ కవర్లను పడవేయరాదు. నిమజ్జనం జరిగిన గంటలోపే వ్యర్థాలను తొలగించాలి.
⇔ పర్యావరణంలో త్వరగా కలిసిపోయే పదార్థాలనే విగ్రహాల తయారీలో వాడాలి.
⇔ పీఓపీ(ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్)తో చేసిన విగ్రహాలను ఎట్టి పరిస్థితిలో నిమజ్జనం చేయరాదు. ఇలాంటి విగ్రహాలను వచ్చే ఏడాది వినియోగించేలా ప్రోత్సహించాలి.
Comments
Please login to add a commentAdd a comment