నిమజ్జనం ఇక ఈజీ | New Technology Using This Ganesh Nimarjan In Tank Bund Hyderabad | Sakshi
Sakshi News home page

నిమజ్జనం ఇక ఈజీ

Published Mon, Jun 25 2018 10:27 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

New Technology Using This Ganesh Nimarjan In Tank Bund Hyderabad - Sakshi

అందుబాటులోకి తెచ్చిన సరికొత్త హుక్కులు

సాక్షి, సిటీబ్యూరో: వినాయక చవితి నేపథ్యంలో విగ్రహాల నిమజ్జనాన్ని మరింత వేగవంతం చేసేందుకు పోలీసుశాఖ అధునాతన క్రేన్‌ హుక్కులను అందుబాటులోకి తెచ్చింది. నగరంలో ఏర్పాటు చేస్తున్న గణేష్‌ మండపాల సంఖ్య ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో విగ్రహాలను నిర్ణీత సమయంలో నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో కొంత వరకుక్రేన్ల సంఖ్య పెంచుకుంటూపోయారు. అయితే వీటి సంఖ్యను పెంచడం కంటే ఉన్న క్రేన్లతోనే వీలైనన్ని ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గతేడాది ట్యాంక్‌బండ్‌ వద్ద ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని క్రేన్లకు ప్రత్యేక డిజైన్‌తో కూడిన కొండీలను (హుక్స్‌) ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఈసారి మరింత అడ్వాన్డŠస్‌ హుక్స్‌ అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిని రెండురోజుల క్రితం ట్యాంక్‌బండ్‌ వద్ద పరీక్షించిన నగర పోలీసు ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీచక్ర ఇంజినీరింగ్‌ సంస్థ నిర్వాహకుడు టి.మురళీధర్‌ రూపొందించిన ఈ ‘క్విక్‌ రిలీజ్‌ డివైజ్‌’ (క్యూఆర్డీ) హుక్స్‌ ఈసారి ట్యాంక్‌బండ్‌ మీద ఉండే అన్ని క్రేన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనాకి వినియోగించే అవకాశం ఉంది.

తొలిసారిగా ఈ క్యూఆర్డీ హుక్స్‌ను గతేడాది వినియోగించారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఉన్న 36 క్రేన్లలో 20 క్రేన్లను వీటిని వాడారు. క్రేన్‌ కొండీ ఉండే ప్రాంతంలో ఈ హుక్స్‌ నాలుగింటిని ఏర్పాటు చేశారు. విగ్రహానికి కింది భాగంలో నలుమూలలా వీటిని ఫిక్స్‌ చేశారు. పైకి ఎత్తినప్పుడు విగ్రహం బరువుకు గట్టిగా పట్టి ఉండే ఈ హుక్స్‌... అది నీటిని తాకిక వెంటనే బరువు తగ్గడంతో వాటంతట అవే విడిపోతాయి. గరిష్టంగా 25 సెకన్లలో నిమజ్జనం పూర్తయింది. గతంలో విగ్రహాన్ని నీటిలోకి తీసుకువెళ్లిన తర్వాత క్రేన్‌పై ఉండే వ్యక్తులు కొండీలను డీలింక్‌ చేయాల్సి వచ్చేది.

దీనివల్ల కాలయాపనతో పాటు ప్రమాదాలు సైతం జరిగేవి. పాత కొండీలతో గంటకు ఒక క్రేన్‌ గరిష్టంగా 12 విగ్రహాలను నిమజ్జనం చేస్తే.. క్యూఆర్డీ హుక్స్‌ వినియోగించిన క్రేన్‌ ఇదే సమయంలో 25 నుంచి 30 విగ్రహాలను నిమజ్జనం చేసింది. ఈసారి వీటినిపై మరింత రీసెర్చ్‌ చేసిన మురళీధర్‌.. ‘అడ్వాన్డŠస్‌ వెర్షన్‌’ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పాత హుక్‌ 15 కేజీల వరకు బరువు ఉండి, నిర్వహణ కష్టంగా ఉండేది. దీంతో దీని బరువును గరిష్టంగా 5 కేజీలకు తగ్గించారు. ఇవి ఉన్న క్రేన్‌ ఓ విగ్రహాన్ని గరిష్టంగా 15 సెకన్లతో నిమజ్జనం చేస్తుంది. నాలుగు హుక్స్‌ పెట్టాల్సిన అవసరం లేదు. రెండింటితోనూ నిమజ్జనం పూర్తి చేయవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement