రూ. 16.86 కోట్లతో నిమజ్జన ఏర్పాట్లు | City Police Protection For Ganesh Nimajjanam Hyderabad | Sakshi
Sakshi News home page

రూ. 16.86 కోట్లతో నిమజ్జన ఏర్పాట్లు

Published Sat, Sep 1 2018 9:29 AM | Last Updated on Fri, Sep 7 2018 11:15 AM

City Police Protection For Ganesh Nimajjanam Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ నగరంలో ప్రతిష్టాత్మకమైన గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జనం సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ తెలిపారు. గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లపై శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కమిషనర్‌  మాట్లాడుతూ,  జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రూ. 16.86 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  సెప్టెంబర్‌ 23న జరిగే   నిమజ్జనానికి 35  ప్రాంతాల్లో 117 క్రేన్‌లను ఏర్పాటు చేస్తున్నామని, మరో 96 మొబైల్‌ క్రేన్‌లను అందుబాటులో ఉంచుతామన్నారు. గణేష్‌ నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గాల్లో రోడ్డు రీకార్పెటింగ్, మరమ్మతులు, గుంతల పూడ్చివేత పనులను  సెప్టెంబర్‌ 10లోగా పూర్తి చేసేందుకు రూ. 10.52 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 

ఆయా మార్గాల్లో 34,926 తాత్కాలిక  లైటింగ్‌  ఏర్పాట్లు  చేస్తున్నామని, పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేకంగా గణేష్‌ యాక్షన్‌ టీమ్‌లను సిద్ధం చేస్తున్నామన్నారు. ఆర్‌అండ్‌బి ఆధ్వర్యంలో 12 కిలోమీటర్ల మేర,  ప్రధానంగా హుస్సేన్‌సాగర్‌ చుట్టూ రెండంచెల బారికేడింగ్, నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  హుస్సేన్‌సాగర్‌ వద్ద ఎస్పీడీసీఎల్‌  ద్వారా 48 ట్రాన్స్‌ఫార్మర్లు,  సరూర్‌నగర్‌ చెరువు వద్ద ఐదు ట్రాన్స్‌ఫార్మర్లతో సహా అన్ని ప్రాంతాల్లో వెరసి  101 ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు.వీటితో పాటు మంచినీటి సరఫరా, మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీతో పాటు  వివిధ శాఖలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయని,  ఉత్సవాలు సాఫీగా జరిగేందుకు ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి సహకరించాలని గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులను కోరారు.

విస్తృత బందోబస్తు: సీపీ  
గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు  చేస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. గణేష్‌ ఉత్సవాల సమయంలోనే మొహర్రం  పండుగ కూడా ఉన్నందున వేడుకలు సాఫీగా జరిగేందుకు సహకరించాలని కోరారు. శోభాయాత్ర మార్గంలో మెట్రో రైలు స్టేషన్లు, ఎస్సార్‌డీపీ  పనులు జరుగుతున్నందున విగ్రహాల ఎత్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని సంబంధిత పోలీస్‌ స్టేషన్లకు అందజేయాలని, ప్రతి విగ్రహం వద్ద సీసీటీవీలు  ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో   అడిషనల్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్, ట్రాఫిక్‌ డీసీపీలు  చౌహాన్, బాబురావు,    జీహెచ్‌ఎంసీ  అడిషనల్‌ కమిషనర్లు శృతిఓజా, ముషారఫ్‌ అలీ, జోనల్‌ కమిషనర్లు రఘుప్రసాద్, రవికిరణ్, శంకరయ్య, శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్‌ ఇంజినీర్లు సురేష్, జియాఉద్దీన్,  వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

పూర్తి సహకారం: గణేష్‌ ఉత్సవ కమిటీ
గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనం ఇబ్బందులు లేకుండా జరిగేందుకు సహకరిస్తామని గణేష్‌ ఉత్సవ సమితి పేర్కొంది. ఉత్సవ సమితి అధ్యక్ష , కార్యదర్శులు వెంకట్‌రెడ్డి, భగవంతరావులతో పాటు మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, పలు నియోజకవర్గాలకు చెందిన ఉత్సవ కమిటీ సభ్యులు  సమావేశంలో పాల్గొన్నారు. నిమజ్జన సందర్భంగా క్రేన్‌ల వద్ద అదనపు సిబ్బందిని నియమించడంతో  పాటు నగరంలో నిమజ్జనం జరిగే వివిధ ప్రాంతాల్లోనూ  విస్తృత ఏర్పాట్లు చేయాలని, తగినన్ని మొబైల్‌ టాయ్‌లెట్లు, దారిపొడవునా విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ధూల్‌పేట వద్ద ఎంట్రీ,ఎగ్జిట్‌లకు ప్రత్యేక  ఏర్పాట్లు చేయాలని కోరారు. శోభాయాత్ర మా ర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్ల లోని టాయ్‌లెట్లను వినియోగించుకునేందుకు చ ర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement