
భారత్, ఇంగ్లండ్ మధ్య కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఫ్లడ్ లైట్లు మొరాయించిన విషయం తెలిసిందే. ఛేదనలో భారత ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సందర్భంగా అకస్మాత్తుగా కొన్ని ఫ్లడ్ లైట్ ఆగిపోయాయి. ఊహించని ఈ పరిణామంతో ఇరు జట్ల ఆటగాళ్లు విస్మయానికి గురయ్యారు. ఫీల్డ్ అంపైర్లు ఆటగాళ్లను మైదానాన్ని వీడాల్సిందిగా కోరారు. ఫ్లడ్ లైట్లు ఆగిపోవడంతో కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగింది. మైదాన సిబ్బంది వెంటనే స్పందించడంతో ఫ్లడ్ లైట్లు మళ్లీ ఆన్ అయ్యాయి. తదనంతరం మ్యాచ్ యధావిధిగా కొనసాగింది.
కాగా, ఈ ఉదంతం జరగడానికి ఒక్క రోజు ముందు ఇదే ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. ట్రై సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 38వ ఓవర్ మూడో బంతిని కుష్దిల్ షా.. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా స్వీప్ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచింది.
ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ రవీంద్ర క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు. అయితే రచిన్ బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా అతని నుదిటిపై తాకింది. బంతి బలంగా తాకడంతో రచిన్‌కు తీవ్ర రక్తస్రావమైంది. ఫ్లడ్ లైట్ల వెలుతురు సరిగ్గా లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన రచిన్‌ను వెంటనే అస్పత్రికి తరలించారు.
ఫ్లడ్ లైట్ల కారణంగా రచిన్‌కు తీవ్రమైన గాయమైన నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు పాక్ క్రికెట్ బోర్డును ఏకి పారేశారు. చెత్త లైటింగ్ కారణంగా ఈ ఘోరం జరిగిందని దుయ్యబట్టారు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేది పెట్టుకుని ఇంత నాసిరకమైన ఏర్పాట్లు ఏంటని మండిపడ్డారు.
ఇలాంటి మైదానానికి ఓకే చెప్పినందుకు ముందుగా ఐసీసీని నిందించాలని అంన్నారు. తక్షణమే గడాఫీ స్టేడియానికి మరమ్మత్తులు చేయాలని సూచించారు. లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ వేదికను పాక్ నుంచి దుబాయ్‌కు మార్చాలని కోరారు.
భారత అభిమానుల ఘాటైన విమర్శల అనంతరం కటక్ ఉదంతాన్ని బూచిగా చూపెడుతూ పాక్ అభిమానులు బీసీసీఐపై విమర్శలు ఎక్కు పెట్టారు. బీసీసీఐకు ఫ్లడ్ లైట్లు అవసరమైతే పాక్ క్రికెట్ బోర్డు సరఫరా చేస్తుందని సెటైర్లు వేస్తున్నారు. మమ్మల్ని నిందించే ముందు మీ విషయాన్ని సరి చూసుకోండని హితవు పలుకుతున్నారు. రచిన్ ఉదంతంపై భారత అభిమానులు స్పందించినందుకు బీసీసీఐపై ఎదురుదాడికి దిగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment