జై షా- మొహ్సిన్ నక్వీ
చాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాట నెగ్గింది. బీసీసీఐ పట్టుబట్టినట్లుగానే హైబ్రిడ్ మోడల్‌తో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించింది.
ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీతో శనివారం స్వయంగా ప్రకటన వెలువరించేందుకు ఏర్పాట్లు చేసింది. పీసీబీ చీఫ్ శనివారం ఇందుకు సంబంధించి ప్రకటన చేస్తారని ఐసీసీ వర్గాలు తెలిపాయి.
టీమిండియా మ్యాచ్‌లన్నీ అక్కడే
మరోవైపు.. ఐసీసీ చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా బ్రిస్బేన్ నుంచి వర్చువల్ ఈ సమావేశంలో పాల్గొని అధికారికంగా ప్రకటన చేస్తారని తెలిసింది. వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో నిర్వహిస్తారు.
చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌లు అన్నీ ఇక హైబ్రిడ్ పద్ధతిలోనే
ఇదొక్క టోర్నీయే కాదు... ఇకపై అన్ని ఐసీసీ టోర్నీలకు చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్‌లు హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహిస్తారు. అంటే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు పాకిస్తాన్ ఇక్కడకు రాదు.
భారత్ మాదిరే పాక్ మ్యాచ్‌ల్ని కూడా తటస్థ వేదికపై నిర్వహిస్తారు. అదే విధంగా.. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే పురుషుల టీ20 ప్రపంచకప్ కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే జరుగుతుంది.
భద్రతా కారణాల దృష్ట్యా
కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే, డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఫలితంగా నేరుగా ఈ ఈవెంట్‌కు క్వాలిఫై అయింది.
అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. భారత విదేశాంగ శాఖ సైతం బోర్డు నిర్ణయాన్ని సమర్థించింది. ఈ నేపథ్యంలో అనేక చర్చల అనంతరం టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది.
వేదిక మొత్తాన్ని తరలిస్తామంటూ ఐసీసీ కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధం కావడంతో పట్టువీడి హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకొంది. అయితే, తాము కూడా ఐసీసీ ఈవెంట్ల కోసం ఇకపై భారత్‌లో పర్యటించబోమన్న షరతు విధించినట్లు తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది.
చదవండి: Vijay Merchant Trophy: సెంచరీతో చెలరేగిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం
Comments
Please login to add a commentAdd a comment