చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఈ- మెయిల్ ద్వారా తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆదివారం ధ్రువీకరించింది.
పాక్ ప్రభుత్వానికి లేఖ
బీసీసీఐ నిర్ణయాన్ని తమకు తెలియజేస్తూ ఐసీసీ మెయిల్ పంపిందని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విషయం గురించి తాము పాక్ ప్రభుత్వానికి లేఖ పంపామని.. ప్రభుత్వ సూచనలు, సలహా మేరకు అంతిమ నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
అయితే, అంతకంటే ముందే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. టీమిండియా తమ దేశానికి తప్పక రావాలని.. ఐసీసీ టోర్నీ విషయంలో హైబ్రిడ్ విధానం కుదరదని పేర్కొన్నాడు.
ఈ పరిణామాల నేపథ్యంలో పాక్, భారత మాజీ క్రికెటర్లు ఈ అంశంపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. పీసీబీకి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఆదాయానికి భారీగా గండి
‘‘అవును.. ఇది ఐసీసీ ఈవెంటే! బ్రాడ్‌కాస్టర్లు అందుకే డబ్బు కూడా చెల్లించారు. అయితే, ఒకవేళ ఈ టోర్నీలో టీమిండియా పాల్గొనకపోతే.. మ్యాచ్ ప్రసారకర్తలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రారు.
ఆర్థికంగా ఒకరకమైన సంక్షోభం ఏర్పడుతుంది. ఒకవేళ టీమిండియా ఈ టోర్నీలో ఆడకపోతే ఆదాయానికి భారీగా గండిపడుతుంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్-2023 కోసం పాకిస్తాన్ జట్టు భారత్‌కు వచ్చేటపుడు పీసీబీ చీఫ్ మేము శత్రు ప్రదేశంలో అడుగుపెట్టబోతున్నామని అన్నారు.
టీమిండియా లేకపోతే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ లేనట్లే
ఒకవేళ పాకిస్తాన్ గనుక భవిష్యత్తులో టీమిండియాతో ఆడొద్దని అనుకుంటే.. అందుకు తగ్గట్లుగానే ప్రభావం ఉంటుంది. అదే విధంగా.. టీమిండియా పాకిస్తాన్‌తో ఆడకపోతే ఆ ప్రభావం మరింత తీవ్రస్థాయిలో ఉంటుంది. ఎందుకంటే.. ఇది ఆర్థికాంశాలతో ముడిపడి ఉంది.
పాకిస్తాన్ ఇప్పుడు డిమాండ్ చేసే స్థితిలో లేదన్నది చేదు నిజం. ఒకవేళ టీమిండియా లేకపోతే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండదు. పాకిస్తాన్‌తో సహా ప్రతీ జట్టు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
కాగా వచ్చే ఏడాది ఫిబ్రరి- మార్చి నెలలో జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో దిగనుండగా.. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన టీమిండియా, చాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్ బంగ్లాదేశ్, ఇంగ్లండ్ తదితర దేశాలు ఈ టోర్నీకి అర్హత సాధించాయి.
చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి?
Comments
Please login to add a commentAdd a comment