పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి గట్టి షాకిచ్చినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ టూర్ మరింత వివాదాస్పదం కాకుండా చర్యలు చేపట్టినట్లు సమాచారం. అసలు విషయమేమిటంటే.. వన్డే ఫార్మాట్లో నిర్వహించే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఎనిమిది జట్లు
వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆతిథ్య పాకిస్తాన్ ఈ టోర్నీకి అర్హత సాధించాయి. అయితే, పాక్‌లో నిర్వహించే ఈ ఐసీసీ ఈవెంట్‌కు తమ జట్టును పంపడం కుదరదని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి తెలియజేసింది.
హైబ్రిడ్ విధానానికి ఒప్పుకోము అంటున్న పాక్
అదే విధంగా.. టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఐసీసీ ఇందుకు సానుకూలంగానే ఉన్నా.. పీసీబీ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. కావాలంటే ఆతిథ్యమైనా వదులుకుంటాంగానీ.. టీమిండియా కోసం హైబ్రిడ్ విధానానికి ఒప్పుకోమని చెబుతోంది.
అత్యుత్సాహం ప్రదర్శించిన పీసీబీ
అంతేకాదు.. తమ ప్రభుత్వానిది కూడా ఈ విషయంలో ఇదే వైఖరి అని ఐసీసీకి తేల్చిచెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో పీసీబీ భారత్‌ను కవ్వించేలా మరో చర్యకు దిగింది. చాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను పాక్ ఆక్రమిత కశ్మీర్‌గా ఉన్న ప్రాంతంలో చేస్తామని శుక్రవారం ప్రకటించింది.
ముకుతాడు వేసిన ఐసీసీ
స్కర్దు, హంజా, మజఫర్‌బాద్‌లలో ట్రోఫీ టూర్ చేస్తామని అధికారికంగా పీసీబీ వెల్లడించింది. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారగా.. ఐసీసీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో ట్రోఫీ టూర్‌ను రద్దు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాగా నవంబరు 16- 24 వరకు చాంపియన్స్ ట్రోఫీ-2025 టూర్ జరుగనుంది. ఇందులో భాగంగా ట్రోఫీని ముందుగా నిర్ణయించిన ప్రదేశాల్లో అభిమానుల సందర్శనకు ఉంచుతారు.
చదవండి: టచ్‌లోకి వచ్చిన విరాట్.. మరోసారి క్లీన్ బౌల్డ్ అయిన పంత్
Comments
Please login to add a commentAdd a comment