పాకిస్తాన్‌ బోర్డు కవ్వింపు చర్యలు.. చాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌ ప్రకటన | Champions Trophy 2025 Row: Pakistan Provokes India By PCB Announces Trophy Tour In PoK, See More Details Inside | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ బోర్డు కవ్వింపు చర్య.. చాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌ ప్రకటన

Published Fri, Nov 15 2024 2:49 PM | Last Updated on Fri, Nov 15 2024 3:42 PM

Champions Trophy 2025 Row: Pakistan Provokes India By PCB Announces By This

చాంపియన్స్‌ ట్రోఫీ-2025 నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ ఐసీసీ టోర్నీ ట్రోఫీ టూర్‌ను నిర్వహించే ప్రదేశాల పేర్లను పీసీబీ శుక్రవారం సోషల్‌ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.

నవంబరు 16న ఇస్లామాబాద్‌లో
‘‘ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ 2025.. ట్రోఫీ టూర్‌ నవంబరు 16న ఇస్లామాబాద్‌లో మొదలవుతుంది. అదే విధంగా.. స్కర్దు, ముర్రే, హంజా, మజఫర్‌బాద్‌లోనూ జరుగుతుంది. సర్ఫరాజ్‌ అహ్మద్‌ 2017లో ది ఓవల్‌ మైదానంలో ట్రోఫీని పట్టుకున్న దృశ్యాలను చూడండి. ఈ ట్రోఫీ టూర్‌ నవంబరు 16- 24 వరకు జరుగుతుంది’’ అని పీసీబీ ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. దీంతో సోషల్‌ మీడియాలో దుమారం రేగుతోంది.

ఇందులో ప్రస్తావించిన స్కర్దు, హంజా, మజఫర్‌బాద్‌.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రాంతాలు అని.. పాక్‌ బోర్డు కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందనే విమర్శలు వస్తున్నాయి. కాగా చాంపియన్స్‌ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే.

టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదు
ఈ మెగా టోర్నీకి టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, అఫ్గనిస్తాన్‌, పాకిస్తాన్‌ అర్హత సాధించాయి. అయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఐసీసీకి తేల్చిచెప్పింది.

టీమిండియా ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్‌ విధానాన్ని సూచించింది. ఐసీసీ కూడా ఇందుకు సానుకూలంగానే ఉందనే వార్తలు వినిపించాయి. అయితే, పాకిస్తాన్‌ బోర్డు మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది.

ఇప్పటికే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా వంటి జట్లు తమ దేశానికి వచ్చాయని.. టీమిండియా కూడా రావాలని పట్టుబడుతోంది. తమ ప్రభుత్వం కూడా ప్రతీ మ్యాచ్‌ను దేశంలోనే నిర్వహించాలని సూచించిందని..పంతానికి పోతోంది.

తటస్థ వేదికపై నిర్వహిస్తారా?
ఈ మేరకు ఇలా ఇరు బోర్డుల మధ్య చాంపియన్స్‌ ట్రోఫీ వేదిక విషయమై విభేదాలు తలెత్తిన వేళ.. పీసీబీ రెచ్చగొట్టే చర్యలకు దిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రోఫీ టూర్‌ను పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్వహిస్తామని చెప్పడమే ఇందుకు నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఐసీసీ అంతిమంగా తీసుకునే నిర్ణయంపైనే టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహిస్తారా? లేదంటే.. బీసీసీఐ ఈ టోర్నీని బహిష్కరిస్తుందా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ టీమిండియా గనుక ఈ ఈవెంట్లో ఆడకపోతే పాకిస్తాన్‌ బోర్డుతో పాటు ఐసీసీకి కూడా భారీగా ఆర్థిక నష్టం తప్పదు.

చదవండి: కోహ్లి మళ్లీ ఫెయిల్‌.. నితీశ్‌ రెడ్డి బౌలింగ్‌లో పంత్‌ క్లీన్‌బౌల్డ్‌! జైస్వాల్‌ కూడా..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement