ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వేదిక విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ వైఖరిని మార్చుకోవడం లేదు. ఆతిథ్యాన్ని అయినా వదులుకుంటాం కానీ హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీ నిర్వహించబోమని పట్టుదలకు పోతోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం కూడా పీసీబీకి మద్దతు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఒక్క మ్యాచ్ కూడా దేశం వెలుపల నిర్వహించేందుకు అంగీకరించవద్దని బోర్డుకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి పీసీబీ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఐసీసీ టోర్నీ అంశంలో మా ప్రభుత్వం మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రతి మ్యాచ్ మా దేశంలోనే నిర్వహించాలని చెప్పింది.
ఆతిథ్య హక్కులు మావే.. మ్యాచ్‌లన్నీ ఇక్కడే
ఏ జట్టుకు సంబంధించి అయినా.. ఒక్క మ్యాచ్ కూడా తటస్థ వేదికపై నిర్వహించేందుకు వీలులేదని.. ఇదే తమ వైఖరి అని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి.. బీసీసీఐ పాకిస్తాన్‌కు తమ జట్టును పంపలేమన్న విషయాన్ని మాత్రమే ఐసీసీ మాకు తెలియజేసింది.
చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను మేము దక్కించుకున్న మాట వాస్తవం. కాబట్టి పాకిస్తాన్ వెలుపల ఒక్క మ్యాచ్ నిర్వహించడానికి మేము ఒప్పుకోము’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు ఒప్పుకోవద్దని పాక్ ప్రభుత్వం పీసీబీకి చెప్పిందని తన యూట్యూబ్ చానెల్‌గా వెల్లడించాడు.
ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం
కాగా వచ్చే ఏడాది పాక్ ఆతిథ్యమిచ్చే చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీలో.. హైబ్రిడ్ మోడల్ అయితేనే ఆడతామని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంటే.. టీమిండియా ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహిస్తేనే ఆడతామని ఐసీసీకి స్పష్టమైన సమాచారమిచ్చింది.
అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. తమ ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని పీసీబీ పేర్కొన్నట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.
మరోవైపు.. బీసీసీఐ సైతం ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టి పాక్‌లో టోర్నీ ఆడలేమని కరాఖండిగా చెప్పేసింది. దీంతో ఈ టోర్నీపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఒకవేళ.. పాకిస్తాన్ గనుక ఆతిథ్య హక్కులు వదులుకుంటే ఈ మెగా టోర్నీ వేదికను... దక్షిణాఫ్రికాకు తరలించేందుకు ఐసీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తోంది.
పాకిస్తాన్‌లోనే అంధుల టీ20 ప్రపంచకప్
ఇదిలా ఉంటే.. అంధుల టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను కూడా ఈసారి పాకిస్తాన్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఈ టోర్నీ ఆడేందుకు అనుమతించాలని డిఫెండింగ్ చాంపియన్ భారత అంధుల క్రికెట్ జట్టు భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) కోసం కేంద్ర క్రీడా శాఖ, హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలకు దరఖాస్తు చేసుకుంది.
లాహోర్, ముల్తాన్ వేదికలపై ఈ నెల 22 నుంచి వచ్చే నెల 3 వరకు అంధుల ప్రపంచకప్ టోర్నీ జరుగుతుంది. 17 సభ్యులు గల భారత జట్టుకు క్రీడాశాఖ తమ ఆమోదం తెలుపుతూ ఎన్‌ఓసీని జారీ చేసింది.
అయితే హోం, విదేశీ వ్యవహారాల శాఖ నుంచి ఆమోదం రాకపోవడంతో జట్టు నిరీక్షిస్తోంది. భారత ప్రభుత్వం అనుమతించి, అంతా అనుకున్నట్లు జరిగితే వాఘా సరిహద్దు గుండా భారత అంధుల క్రికెట్ జట్టు ఈ నెల 21న పాకిస్తాన్‌కు బయల్దేరనుంది.
చదవండి: టీమిండియాతో సిరీస్.. 3-1తో సౌతాఫ్రికా గెలుపు: సిక్సర్ల వీరుడి కామెంట్స్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment