చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. డబ్బు కోసం ఆతిథ్య హక్కులను అమ్ముకోబోమని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో.. తమకు అంతిమంగా దేశ ప్రయోజనాలే ముఖ్యమని నక్వీ పేర్కొన్నాడు.
కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది.
పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తి లేదు
అయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తి లేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి స్పష్టం చేసింది.
హైబ్రిడ్ విధానం కావాలి
ఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానం తెరమీదకు వచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. మిగతా జట్లన్నీ తమ దేశానికి వస్తున్నాయని.. రోహిత్ సేన కూడా రావాల్సిందేనని పట్టుబడుతోంది. అయితే, బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేదు.
ఈ క్రమంలో పీసీబీకి ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు చేకూరేలా ఐసీసీ ఆఫర్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. నవంబరు 29 నాటి సమావేశంలో ఇందుకు సంబంధించి తుదినిర్ణయం వెలువడనుందని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ గురువారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడాడు.
ఐసీసీ నిర్ణయం ఏమిటో?!
‘‘పాకిస్తాన్ క్రికెట్‌కు ఏది మంచో అదే చేస్తాం. ఐసీసీ చైర్మన్‌తో నేను సంప్రదింపులు జరుపుతున్నాను. ఒకవేళ టీమిండియా ఇక్కడికి రాకపోతే మేము కూడా ఇకపై భారత్‌లో ఆడబోమని కచ్చితంగా చెప్పేశాం. సమానత్వ భావన ముఖ్యం. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
అదైతే ఎప్పటికీ జరుగదు
ఏదేమైనా డబ్బు కోసం ఆతిథ్య హక్కులను మాత్రం అమ్ముకోమని నేను మీకు వాగ్దానం చేస్తున్నా. అదైతే ఎప్పటికీ జరుగదు. అయితే, అంతిమంగా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని నక్వీ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్‌లో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపుతప్పిన విషయం తెలిసిందే.
అదుపుతప్పిన శాంతి భద్రతలు
పాకిస్తాన్‌కు వరల్డ్‌కప్ ట్రోఫీ అందించిన మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలతో ఇస్లామాబాద్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్(పీటీఐ) పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది.
ఫలితంగా దేశంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఇలాంటి తరుణంలో పాక్‌లో మెగా టోర్నీ నిర్వహించడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశం ఉంది.
చదవండి: డేంజర్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంక
Comments
Please login to add a commentAdd a comment